ఫ్యామిలీ కిచెన్ గార్డెన్స్ లేదా కుటుంబ వంటింటి అవసరాల కోసం కూరగాయల పెంపకం అనేది ఒక ఉద్యమంలా కర్నాటకలో విస్తరిస్తోంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. కాగా, ఆయా కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చడంలో కూడా ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
రోజువారీ ఆహారం, అందులో ఉపయోగించే రకరకాల దినుసుల నాణ్యత గురించిన అవగాహన, చైతన్యం ఇటీవలి కాలంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కూరగాయల వాడకంలో నాణ్యతకు, పారిశుధ్యానికి, పోషక విలువలకే వినియోగదారుల నుంచి ఎక్కువ ప్రాముఖ్యం కానవస్తోంది. తాజా కూరలనే వారు ఇష్టపడుతున్నారు. ఇది కాక, గ్రామీణ ప్రాంతాలలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇంకా ఉద్యమకారులు స్వయంగా కూరగాయల సాగును చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా కూరగాయల పెంపకానికి ఇండ్లలో లభించే కొద్దిపాటి జాగాను, లేదా మిద్దెలపై భాగాన్ని ఉపయోగించుకుంటున్నారు. వీళ్లందరి ఆలోచనా కూడా ఒక్కటే. రసాయనాల, క్రిమిసంహారకాల కాలుష్యం లేని కూరలు పండించుకోవడం, ఆహారంలో భాగంగా ఉపయోగించుకోవడం, అంతో ఇంతో మిగిలితే అదనపు రాబడి సంపాదించుకోవడం. కాలుష్యం కాటులేని కూరలు సమకూర్చుకోవడమే అందరి ఏకైక లక్ష్యం.
కర్నాటక రాష్ట్రంలోని కనకపురా ప్రాంతంలో స్వచ్చంద సంస్థ గ్రీన్ ఫౌండేషన్ ఈ దిశగా రైతులతో కలిసి కృషి చేస్తోంది. ఈ సంస్థ సాయంతో ఒకటి రెండు హెక్టార్ల భూమి ఉన్న చిన్నకారు రైతులు ఏక పంట సాగును చేపడుతున్నారు. వర్షాధారిత సాగు చేపట్టి ఏటా సగటున రూ. 30,000/ ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఇతర సమయాలలో సమీప గ్రామాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా జీవితాలు నడిపిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగానూ లేదా సాధారణ కూలీలుగానూ జీవనపోరాటం సాగిస్తున్నారు.
గ్రీన్ ఫౌండేషన్ అక్కడి రైతన్నల కుటుంబాల ఆరోగ్య సంరక్షణకు కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా స్థానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సహాయంతోక్లినికల్ సర్వీస్ క్యాంపులను, హెల్త్ చెక్ అప్ శిబిరాలను నిర్వహిస్తోంది. పోషకలోపం వల్ల వారు రోగాల బారిన పడుతున్నారని గుర్తించింది. ఈ రైతు కుటుంబాలు ప్రతీ నెలా కనీసం రూ. 400/ తమ కుటుంబాల అవసరాల కోసం కేవలం కూరగాయల కోసమే ఖర్చుచేయవలసి వస్తోందని గమనించింది. వ్యవసాయం నిలకడ కల ఆదాయం అందించలేకపోతోందని, సేద్యం ద్వారా వచ్చే కొద్ది పాటి ఆదాయం కుటుంబాల పోషణకు సరిపోవడం లేదని కూడా గమనించింది. ఫలితంగా వారు కూరగాయల కోసం అంతగా సొమ్ము వినియోగించుకోలేకపోతున్నారనే విషయం కూడా తెలుసుకుంది. వీటి కారణంగానే వారి కుటుంబాలు పోషక విలువలున్న ఆహారానికి దూరమైపోయారని కూడా గమనించింది.
రైతుల దుస్థితిని అర్థం చేసుకున్న గ్రీన్ ఫౌండేషన్ ఆ ప్రాంత రైతులను కుటుంబ కూరగాయల సాగు చేపట్టేందుకు వీలుగా చైతన్యవంతులనుగా చేసింది. ఈ తోటలలో పండే కూరగాయలను ఇంటి అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రోత్సహించింది. అంతేకాకుండా ఈ రకంగా పండించిన కూరగాయలలో కుటుంబ అవసరాలకు సరిపోగా మిగిలిన వాటిని విక్రయించి అదనపు రాబడి పొందే అవకాశాలున్న విషయాన్ని వారికి సవివరంగా తెలియచేసింది.
సామర్థ్యం పెంపు చర్యలు
ఇండ్ల పెరళ్లలోనూ, లేదా తమకున్న కొద్దిపాటి జాగాలోనూ కూరగాయల సాగుపై ఆసక్తి గల రైతు కుటుంబాలను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించింది. వారికి ఇలా కూరగాయల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి అలాంటి కుటుంబాలలోని ఆడ వారిలో ఉత్సాహం కలిగించారు. ఇలా కూరగాయల సాగు వల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పోషకాహారం లభించడమే అదనపు రాబడి కూడా సాధ్యమని వివరించారు. కూరగాయల సాగులోను, విత్తన సంపద కాపాడడంలో మహిళా రైతులు ఎప్పుడూ మొదటి స్థానంలోనే నిలుస్తున్నారు. సేంద్రీయ పద్ధతులలో సాగు పై వారికి సరైన శిక్షణ ఇచ్చారు. స్థానిక విత్తనాల ప్రాథాన్యం తెలియచేసి వాటి వాడకాన్నే ప్రోత్సహించారు. ఇలా స్థానికంగా లభించే వంగడాలనే వినియోగించినట్లయిచే వ్యాధి, చీడ పీడలు ఎదుర్కొడం సులభమవుతుందని వివరించారు.
ఫౌండేషన్ సిబ్బంది వారి భూవసతిని అధ్యయనం చేసి ఏయే రకాలను సాగుచేయవచ్చో సూచించారు. అందుకు అనువైన సాగు పద్ధతులు – ఎత్తుచేసిన నేలలపై సాగు చేసే పద్ధతి (రైజ్ డ్ బెడ్), పెర్మాకల్చర్ (స్వయం సమృద్ధ వ్యవసాయ పర్యావరణ అభివృద్ధి), చెక్ బేసిన్ విధానాలు – వారికి తెలియజేశారు. రైతులు ఎంపిక చేసుకునేందుకు వీలుగా 22 రకాలకూరగాయల వంగడాలను వారికి ప్రతిపాదించారు. ఆయా రైతుల అవసరాలకు అనువైన వాటిని గురించి కూడా తెలియజేశారు. అందుబాటులో ఉన్న స్థలం కొలతలు, మట్టి స్వభావం, చీడపీడల అవకాశం, వారి ఆసక్తి ఆధారంగా సలహాలు అందించారు. కొంత మంది సుమారు పది రకాలు ఎంపిక చేసుకుని సాగు చేపట్టారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలోనూ ఇక్కడి మహిళలు ఈ కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగిస్తున్నారు. మిర్చి, కొత్తిమీర, ఆకు కూరలు, క్యారెట్, బీన్స్, ముల్లంగి, దోస కాయ, బీర కాయ, పొట్ల కాయ, కాకర కాయ వంటి కూరగాయలను వారు పండిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మునగ కాడలు, కరివేపాకు సాగు విషయంలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. రక్తహీనత, మధుమేహం, అధిక రక్త పోటు వంటి సమస్యలతో వారిలో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వాటికి చికిత్సలో ఉపయోగించేందుకే మునగ, కరివేపాకు సాగును చేపట్టాలని నిర్బంధించాల్సి వస్తోంది.
తైముడమ్మ కుటుంబంలో నలుగురు సభ్యులున్నారు. మరసరహల్లి గ్రామంలో కొద్దిపాటి జాగా ఉన్న తైముడమ్మ చాలాకాలం అంటే గార్డెన్ తోట సాగు చేపట్టే వరకు దానిని వృధాగానే వదిలివేసింది. శిక్షణ తరువాత, ఇవాళ్టి రోజున ఆమె తన కున్న 2.2. సెట్ల భూమిలో చేపట్టిన కిచెన్ గార్డెన్ లో 15 రకాల కూరగాయలను పండించగలుగుతోంది. అందుకు పెర్మాకల్చర్ విధానం అనుసరించింది. జనధ్యాన సంస్థ ఆమెకు అవసరమైన బయో ఇన్ పుట్లు – పంచగవ్య, వర్మీవాష్, అగ్నిఅస్త్ర్ర, పొంగామియా పౌడరు వంటివి – అందించింది. తన కిచెన్ గార్డెన్ లో ఆమె 9 కిలోల స్థానిక వంకాయలను, 8 కిలోలో పొట్ల కాయలను, 6 కిలోల బీర కాయలను, 13 కిలోల గుమ్మడి కాయలను, 25 కిలోల ఓక్రా, 40 కిలోల టమోటా, 12 కిలోల మిర్చి పండించగలిగింది. మిగులు ఉత్పత్తులను పొరుగువారికీ బంధువులకు పంచిపెట్టింది. విత్తనాల ఉత్పత్తిలో కూడా తైముడమ్మ మిగులు సాధించడంలో కూడా శిక్షణ పొందింది.
సాగు విధానాలతో పాటు బయో ఇన్ పుట్ల తయారీ విషయంలో కూడా వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా సేంద్రీయేతర ఇన్ పుట్లపై అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా వారికి భరోసా కల్పించింది. వారు స్వయంగా తయారుచేయగలిగిన బయో ఇన్ పుట్లలో ముఖ్యమైనవి – పెరటి ఎరువులు (ఎఫ్ వై ఎం), ద్రవ జీవామృతం, పూచిమరందు, పంచగవ్య, మిర్చి-వెల్లుల్లి కషాయం, నిమ్మ కషాయం, ఘన జీవామృతం వగైరా. స్థానిక రైతులకు ఈ బయో ఇన్ పుట్లను సరఫరా చేయడంలో తోడ్పడేందుకే జనధ్యాన వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ రూపుదిద్దుకుంది. స్థానికంగా అందరితో కలిసి అందరి ప్రయోజనాల కోసం కృషి చేసే ఉత్సాహంన ఉన్న కొంత మంది రైతుల సహకారంతో ఇది ఏర్పాటైంది. ఇది కూడా వారికి అవసరమైన బయో ఇన్ పుట్లను అందజేస్తోంది. అంతేకాకుండా సేంద్రీయ సేద్యం ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధాన ప్రక్రియ చేపట్టడంలో ఇది వారికి అండగా నిలుస్తోంది.
ఆసక్తి ఉన్న రైతులకు వారి అవసరాలకన్నా అధికంగా విత్తనాలను సిద్ధంచేసి జనధాన్య సంస్థకు సరఫరాచేసేందుకు అవసరమైన శిక్షణను కూడా ఇప్పించింది. అంటే తదుపరి సాగుకాలానికి అవసరమైన విత్తనాలను కూడా ఈ రకంగా నిల్వచేయడం సాధ్యమవుతోంది. ఈ విధంగా రైతుకు అదనపు ఆదాయం లభిస్తోంది.
ఇలా కిచెన్ గార్డెన్ సాగు విషయంలో గ్రీన్ ఫౌండేషన్ కనకపురా తాలూకా (రామ్ నగర్ జిల్లా)లోని వివిధ గ్రామాలకు చెందిన 160 రైతు కుటుంబాలకు మద్దతుగా నిలుస్తోంది.
ప్రయోజనాలు
ఇంటి ఆవరణలో అందుబాటులో ఉన్న కొద్ది స్థలంలో కిచెన్ గార్డెన్ చేపట్టడం వల్ల కూరగాయల కోసం అదనంగా ఖర్చు చేయవలసిన అవసరం ఆయా కుటుంబాలకు తొలగిపోతుంది. కుటుంబంలోని అందరికీ పోషక విలువలతో కూడిన ఆహారం లభ్యమవుతుంది. మిర్చి, కొత్తిమీర, ఆకు కూరలు, క్యారెట్, బీన్స్, ముల్లంగి, టమోటా, ఉసిరి, ఓక్రా, దోస కాయ, బీర కాయ, పొట్ల కాయ, కాకర కాయ వంటివి పండించడం సాధ్యమవుతుంది.
అందుబాటులో ఉన్న జాగా ఆధారంగా ఒక్కో కుటుంబం పండించే కూరగాయల పరిమాణంలో తేడా ఉంటోంది. అయితే సగటున ఏడాది కాలంలో 100 కిలోల నుంచి 200 కిలోల వరకు పండించగలుగుతున్నారు. ప్రధానంగా కుటుంబ అవసరాల కోసమే అయినా ఎంతో కొంత మిగులు ఉంటోంది. అలా మిగిలిన వాటిని ఇరుగుపొరుగుతో, బంధువులతో కలిసి పంచుకుంటున్నారు. అదనపు సరుకును మార్కెట్ కు చేరుస్తున్నారు. ఈ విషయంలో జనధ్యాన సహకరిస్తోంది. ఇంతకు ముందు కూరగాయల కోసం ప్రతినెలా ఖర్చుచేస్తున్న రూ. 400/ ఆదా చేయగలుగుతున్నారు.
పోషక సమృద్ధమైన ఆహారంతో పాటు అదనపు సంపాదనకు కూడా కిచెన్ గార్డెన్ తోడ్పడుతోంది. చిరు ధాన్యాలు, పండ్ల తోటలతో పోలిస్తే కూరగాయల సాగుకు ఎక్కువ వ్యవధి అవసరం ఉండదు. ఇన్ పుట్లు హెచ్చు మోతాదులో అవసరం ఉండదు. ఈ కారణంగా తక్కువ స్థాయిలో బాహ్య ఇన్ పుట్ల అవసరం లేని వ్యవసాయ విధానాన్ని (లో ఎక్స్ టెర్నల్ ఇన్ పుట్ సస్టయినబుల్ అగ్రికల్చర్) కిచెన్ గార్డెన్ సాగులో ఉపయోగిస్తున్నారు. ఖర్చుతో కూడిన సేంద్రీయేతర ఇన్ పుట్లతో పోలిస్తే తక్కువ ఖర్చు అయ్యే బయో ఇన్ పుట్ల వాడకం పెరిగింది. వీటికి తోడు సంప్రదాయక సేద్య పరిజ్ఞానం వారికి ఎంతగానో ఉపయోగకరంగా మారింది.
ఇప్పుడు పెద్ద సంఖ్యలో జనసామాన్యం ఇలా పెరటి తోటల పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా తమ కుటుంబాలకు పోషక విలువలున్న ఆహారం సమకూర్చాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 380 కుటుంబాలు ఈ విషయంలో గ్రామ పంచాయతీలకు దరఖాస్తులు సమర్పించి ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి విత్తనాలతో పాటు రూ. 2750/ ఆర్థిక సాయం అందుతుంది.
గ్రీన్ ఫౌండేషన్ #25, ఏసీఈఎస్ లే అవుట్, 1వ మెయిన్ రోడ్డు, అశ్వత్థ నగర్ ఆర్ఎంవి 2వ స్టేజి, బెంగళూరు - 560094 E-mail: contact@greenfoundation.in



