కోవిడ్ 19 కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం విలవిలాడిపోతోంది. అన్ని దేశాలలోను సమస్యల సుడిగుండాలు జన జీవితాలను ఛిన్నాభిన్నం చేసి వేస్తున్నాయి. ఆ వైరస్ పరోక్ష ప్రభావం నుంచి బయటపడేందుకు రకరకాలుగా పోరాటాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా జీవనోపాధులను కోల్పోయిన పేద బతుకులు, నిరుద్యోగంతో విసిగి వేసారిపోతున్న యువత, అన్ని వర్గాలలోనూ ఆకలి కేకలు, ఆరోగ్యపరమైన సమస్యలు చుట్టుముట్టి చికాకు పెడుతున్న రోజులివి.
లాక్ డౌన్ నిబంధనలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. రైతులకు సహకరించేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. కానీ, ఆహార పదార్థాల సరఫరా చెయిన్ లో ఏర్పడిన అడ్డంకులు దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. చిన్న, మధ్య స్థాయి రైతులపైనే ఎక్కువ భారం పడింది. స్వల్పకాలం నిల్వ ఉండే పంట దిగుబడిని కోత కోయడంలోనూ, వాటిని మార్కెట్ కు చేర్చి తగిన లాభాలు పొందడంలోనూ వారు చాలా సమస్యలనే ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా సరకు రవాణాకు కీలకమైన కూలీల సమస్య, రవాణా వాహనాల సమస్యలతో పాటు మార్కెట్ లు పని గంటలు తగ్గిపోవడం వల్ల ఎక్కువ నష్టపోవలసి వచ్చింది.
కోవిడ్ భయం పెరిగిపోయిన సమయంలో మరికోన్ని అంశాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. వాటిలో ముఖ్యమైనది – వాతావరణ మార్పులు అత్యంత ప్రభావం చూపించాయి. నీటి కొరత, భూసార క్షీణత తీవ్ర సమస్యలుగా మారాయి. ఇవి ఆహార పదార్థాల సరఫరా చెయిన్ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేశాయి. పర్యావరణపరంగా ఎదురవుతున్న ఈ సమస్యలకు పంటల సాగులో వైవిధ్యం కొంత వరకు పరిష్కారమే అని చెప్పాలి. ముఖ్యంగా కేలరీల పరంగా సుసంపన్నమైన ధాన్యాలకు (కేలరీ-రిచ్) బదులుగా పోషక సమ-ద్ధమైన (న్యూట్రిషన్-రిచ్) ఆహార పదార్థాలను పండించే అంశానికి అధిక ప్రాధాన్యత కనిపిస్తోంది. సుస్థిరమైన రవాణా వ్యవస్థ మాత్రమే ఆహార పదార్థాల సరఫరా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ప్రేరణ కాగలదు.
లాక్ డౌన్ సమయంలో పరిశుభ్రమైన ఆహారం అది కూడా పోషక విలువలు సమృద్ధిగా ఉన్నది ఎలా సంపాదించడం అనేదే పెద్ద సమస్యగా కనిపించేది. మన జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా సమీకృత ఆహారానికి బదులుగా బర్గర్లు, పిజ్జాలు దాని స్థానం ఆక్రమించాయి. ఇదివరలో మనం ఇంటి వెనక పెరట్లో పండించిన కూరగాయలనే ఎక్కువగా ఆహారంలో తీసుకునేవాళ్లం. కేరళలో ఇప్పటికీ చాలా ఇండ్లలో ఇలా పెరటి తోటలు పెంచడం కనిపిస్తుంది. కాకపోతే ఇటీవలి కాలంలో లోకల్ అనేది వ్యాపార సూత్రంగా మారిపోయింది. లోకల్ పేరుతో సూపర్ మార్కెట్లలో అన్ని వస్తువులు లభ్యమవుతున్నాయి.
దేశమంతటా కూడా పోషక విలువలతో కూడిన తోటల పెంపకం, స్థానిక కూరగాయల పెంపకం వంటి అంశాలకు ఉద్యమంలా చాలా కార్యక్రమాలే జరుగుతున్నాయి. దీనిని ఆచరణలో పెట్టినట్లయితే ప్రజల ఆరోగ్యం, అందుకు అవసరమైన పోషక విలులవలతో కూడిన ఆహారం, సామాజిక ఆరోగ్య పరిస్థితి, సంస్కృతి, పర్యావరణం అందుతాయి.
ఉదాహరణకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించింది. బాడి ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో సముచిత స్థానం కల్పించింది. నార్వా గారూ-ఎ గురువాబాడి కార్యక్రమం సిద్ధంచేసింది. ఈ కార్యక్రమం కింద పనులు చురుగ్గా సాగుతున్నాయి కూడా. అవసరమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఇండ్ల వెనుక ఉండే పెరళ్లలో తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఆహార భద్రత, పోషక ఆహారం సమకూర్చే కృషిలో భాగంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ప్రత్యేకించి నేటి అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రధాన్ ( PRADAN) అనే సంస్థ తరఫున ఆర్పణ్ భట్టాచార్జీ, అజయ్ గుప్తా (అగ్రికల్చర్ వరల్డ్ మేగజైన్ లో జూన్ 2020) న వెలుగులోకి తెచ్చిన నివేదికలో సోమీ బాఘెల్ అనే రైతు ఆదర్శవంతమైన అనుభవాన్ని గురించిన ప్రస్తావన ఉంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర బస్తర్ ప్రాంతానికి చెందిన ఒక సన్నకారు రైతు. నాబార్డ్ అందించే అనేక కార్యక్రమాల సహాయంతో జిల్లా ఉద్యాన శాఖ, జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రదాన్ సంస్థ మద్దతుతో ఆ మహిళా రైతు అద్భుత ఫలితాలు సాధించారు. బాడి ప్రాంత అభివృద్ధికి ఇవన్నీ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాలలో అవసరమైన సేద్య శిక్షణతో పాటు సాంకేతిక అంశాలను ఆమె అవగాహన చేసుకున్నారు. వాటి సాయంతో ఆమె గౌరవప్రదమైన ఆదాయం పొందుతున్నారు.
ఇక్కడ అందించిన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాల సాయంతో సోమీ తన ఇంటి ఆవరణలోనే పెరటి తోటల ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారం పండించుకుంటున్నారు. ఇతర గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇదే విధంగా తమ ఇండ్ల ఆవరణల్లోనే మొక్క జొన్న, చిరుధాన్యాలు, పోషక విలువలున్న కూరగాయలు పండించుకుంటూ ఉంటాయి. సోమి కూడా అదే పద్ధతి అనుసరించింది. వారి పెరటి తోటల్లో అనాస, మునగ, ఇంకా పొట్ల కాయ, అనప కాయ, ఆకు కూరలు పెంచుకుంటున్నారు. ఇవి ఆహారంలో భాగంగా నిత్యం కుటుంబాలకు పోషకాహారం అందించడమే కాక అవసరమైనప్పుడు అంతో ఇంతో ఆదాయం కూడా తెచ్చిపెడతాయి. ఈ ప్రాంతంలో గిరిజన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిలో చాలా మంది మహిళలే. పల్లె ప్రాంతాలలోని కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో పెరటి తోటల ప్రయోజనాలపై జరిగిన పరిశోధనలు నిరూపించాయి. కోవిడ్ అనంతర కాలంలో ఇలాంటి కార్యక్రమాలపై మహిళా రైతులు చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది.
లొకాలిషియస్ అనే ఉద్యమం ప్రధానంగా లోకల్ ఆహార పదార్థాల ప్రాధాన్యతను ప్రచారం చేసేందుకు ప్రారంభమైంది. దీనిని పాండిచ్చేరిలో ఆరోవిల్లీ ప్రాంతంలో కృష్ణ మెకంజీ అనే ఆయన తన సోలిట్యూడ్ కేఫ్ కేంద్రంగా ప్రారంభించారని చెప్పాలి. స్థానికంగా వాడుకలో ఉన్న ఆహార పదార్థాలను పండించడం తేలిక. అందించడం తేలిక.కొద్ది పాటి శ్రద్ధ చూపిస్తే చాలు, కొద్ది పాటి నీటిని చల్లితే చాలు. చకచకా పెరుగుతాయి. పుష్కలంగా పోషకాలు అందిస్తాయి. ఆర్థికంగా ఏ మాత్రం భారం కానందున ప్రతి ఒక్కరికి సాధ్యమే అవుతాయి. సామాజిక తోటల పెంపకంలో భాగంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క రోజు తోటల పెంపకంపై దృష్టి పెట్టి శ్రమపడితే చాలు ఆకు కూరలు, దుంపకూరలు, ఇతర రకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆహారాన్ని పోషక సమృద్ధం చేసి ఆరోగ్యప్రదాతలుగా నిలుస్తాయి. అందుకు మన జీవన శైలిలో మార్పులు వస్తే భూమాత చల్లగా చూస్తుంది. భూసారం మెరుగుపడుతుంది కూడా. కోవిడ్ ప్రభావం చూసిన చాలా సమాజాలు సమష్టిగా కూరగాయల పెంపకంలో పాలు పంచుకుంటున్నాయి.
గుజరాత్ లో ఉత్తాన్ అనే సంస్థ తమ పరిసరాలలోని వివిధ సమాజాలలోని కుటుంబాలతో సత్సంబంధాలు పెట్టుకుని వారికి అవసరమైన కూరగాయలను అందిస్తోంది. కోవిడ్ సమయంలో పల్లె ప్రాంతాలలోని కుటుంబాలకు తగినంతగా కూరగాయలు లేదా నాణ్యమైన విత్తనాలు సరఫరా కావడం లేదని ఈ సంస్థ గుర్తించింది. అసలే చేతిలో నగదు కొరత సమస్య కారణంగా చాలా కుటుంబాలు కూరగాయల సాగుపై దృష్టి పెట్టలేదు. వాటి వినియోగం కూడా నిర్లక్ష్యం చేశాయి. దీని ప్రభావం మహిళలపైనా, చిన్నారులపైనా ఎక్కువగా పడింది. ఇంటి మగవారికే కూరగాయలతో కూడిన ఆహారం అందేది. స్వయంగా భూమి లేని కుటుంబాలు పెరటి తోటల పెంపకం కూడా సాధ్యంకాక ప్రయత్నించనేలేదు.
ఈ పరిస్థితిని గమనించి 53 గ్రామాలలోని 2514 కుటుంబాలకు పెరటి తోటల సాగుకు అనువైన కిట్స్ సరఫరా చేశారు. తీర ప్రాంతంలోని 864 కుటుంబాలకు, గిరిజన ప్రాంతాలలోని 1650 కుటుంబాలకు ఆరు రకాలైన కూరల సాగు విత్తనాలను అందజేశారు. అవసరమైన బయో ఫెర్టిలైజర్స్ సమకూర్చే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకున్నాయి. వారికి సుస్థిర వ్యవసాయంపై మహిళలకు శిక్షణ నిచ్చే శిక్షకులు అండగా నిలిచారు. వారికి అందించిన కిట్ సాయంతో అందుబాటులో లేదా పెరడులో ఉండే 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచడానికి సరిపోతాయి. స్థానిక అవసరాలపై అధ్యయనం చేసిన తరువాత బెండ, క్లస్టర్ బీన్స్, నల్ల మచ్చ చిక్కుడు, బీర కాయ, కాకర కాయ, పొట్ల కాయ విత్తనాలను ఉత్తాన్ కార్యకర్తలు అందులో అందించారు. వారికి గ్రామస్థాయి వలంటీర్లు సహకరించారు. ముఖ్యంగా మాస్కులు, గ్లౌవ్స్, భౌతిక దూరం పాటింపు వంటి విషయాలలో రైతులను చైతన్యపరిచారు. పంచాయతీ అధ్యక్షలు లేదా పెద్దల మద్దతు కూడగట్టారు. ఉత్తమ విధానాలలో భాగంగా వాటి గురించిన ప్రచారాలను కరపత్రాలు, వీడియోల రూపంలో రైతులకు చేరువ చేశారు. జీవ సంబంధ క్రిమి సంహారకాల వాడకం, వాటి తయారీపై సుస్థిర సేద్య విధానాల శిక్షణలో భాగంగా మహిళా రైతులకు అవగాహన కల్పించారు.
ప్రజలను చైతన్యపరిచే కృషి ప్రభావంతో తోటి కుటుంబాలకు సహకరించాలనే సదాశయంతో 2514 కుటుంబాలు ముందుకు వచ్చాయి. వారు 7500 కుటుంబాలకు అండగా నిలిచేందుకు సంసిద్ధత చూపాయి. ముఖ్యంగా భూమి లేని వారు, సొంతంగా నీరు, భూ వసతి లేనందున సేద్యం చేసుకోలేని కుటుంబాలకు వారి సాయం లభించింది. ఈ రకంగా రోజుకు 750 గ్రాముల మేరకు పోషక విలువలున్న ఆహారాన్ని 7500 కుటుంబాలకు రెండున్నర నెలల పాటు అంటే గత ఏడాది జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు అందించగలిగారు. వారు అందించిన రోజుకు 700 గ్రాముల పోషకాలు ఆరుగురు సభ్యులున్న కుటుంబ అవసరాలను తీర్చగలదు.
ఇలాంటి ఉద్యమ రూపాలు అన్ని చోట్లా విస్తరించడం చాలా అవసరం. పోషక విలువలున్న తోటల పెంపకం మాత్రమే దీనికి పరిష్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మహిళలు. చిన్నారులకు అవసరమైనంత పోషకాహారం అందించడం చాలా అవసరం. అందుకు స్థానికంగా కూరలు పెంపకమే సరైన మార్గం. అందుకు సహకరించే రైతుల తోడ్పాటు కూడా కీలకం. వారు తమ వ్యవసాయంలో పద్ధతుల్లో మార్పు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. సమాజంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం కృషి, సేద్యం చేస్తే గౌరవప్రదమైన ఆదాయం కూడా ఖచ్చితంగా లభిస్తుందని గుర్తించాలి.
లక్ష్మీ ఉన్నిథాన్ ఎడిటర్, అగ్రికల్చర్ వరల్ఢ్ పీఆర్&కమ్యూనికేషన్ విభాగం అధిపతి కృషి జాగరణ్, డిఎస్ఆర్అగ్రిమీడియా ప్రైవేటు లిమిటెడ్ 60/9, 3వ అంతస్థు, యూసఫ్ మార్కెట్ గ్రీన్ పార్కు మెట్రో స్టేషన్ సమీపంలో, న్యూఢిల్లీ - 110016 E-mail: dr.lakshmi@krishijagran.com



