నగరాల్లో సేద్య కార్యకలాపాలకు ప్రోత్సాహం

పరిశ్రమ రూపంలో సాగుతున్న వ్యవసాయ కార్యకలాపాల ప్రభావంతో భూసారం దిగజారిపోతున్న వాస్తవాన్ని గుర్తించి ఆహార పదదార్థాల ఉత్పాదన, వినియోగం వంటి అంశాలపై నగరాలలోనే కేంద్రీకృతమై ఉండే మేధావులు తమ ఆలోచనల్లో మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితి భూసార క్షీణతతో పాటు వాతావరణ అనిశ్చితి ఆహార భద్రత సాధనకు పెను సమస్యలుగా నిలుస్తున్నాయి. సామాజిక వ్యవస్థల రూపంలో పట్టణ ప్రాంతాల్లో సేద్య రంగానికి అవకాశాలు కల్పించడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా భూమి, భూమిని దున్ని పంట పండించే రైతన్న, పర్యావరణ ప్రభావాల విషయంలో సహానుభూతి, లోతైన అవగాహన, సన్నిహిత అనుబంధాలు మెరుగుపడతాయి.

ప్రపంచం మొత్తం మీద ఉన్న జనాభాలో సగానికి సగం పట్టణాల్లోనే నివసిస్తున్నారు. గత శతాబ్దంలో పర్యావరణం కలుషితం కావడానికి ఇదే అతి పెద్ద కారణం. ఆహార భద్రత లేకపోవడం, వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం (గ్లోబల్ వార్మింగ్), వాయు కాలుష్యం పెరిగిపోవడం, పరిమిత నీటి వనరులను అతిగా ఉపయోగించుకోవడం, అడవుల నరికివేత కారణంగా తరిగి పోతున్న వృక్ష సంపద, ఇంకా మరెన్నో సమస్యలకు పట్టణాలలో కేంద్రీకృతమవుతున్న వలస ప్రజలు కారణమవుతున్నారు.

సమష్టి కృషికి నిదర్శనం – పట్టణ సేద్యం

ఆహార భద్రత సమకూర్చడం, ఉత్పత్తి విధానం పట్టణీకరణతో నేరుగా ముడిపడి ఉంటాయి. పర్యావరణపరమైన సమస్యలు కూడా వాటితో ముడిపడి ఉంటాయి. అయిచే వాటి మధ్య ఏర్పడిన చిక్కు ముడులు అంత సులభంగా అర్థంకావు. పట్టణవాసులు సహజంగానే వ్యవసాయం జరిగే పల్లె సీమలకు దూరంగా ఉంటారు. వారికి అక్కడి పరిస్థితులు ఏ మాత్రం అనుభవంలోకి వచ్చి ఉండవు. నగర జీవులకు అవసరమైన ఆహారం పండిన చోటు నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి వారి దగ్గరికి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఆహార పదార్థాలు అనేక చేతులు మారుతూ ఉంటుంది. ఫలితంగా వాటి ఖరీదు పెరిగిపోతూనే ఉంటుంది. అంతేకాదు, ఈ ఆహార పదార్థాల రవాణా క్రమంలో వాతావరణంపై కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ రకమైన ఆహార సేకరణ విధానం వినియోగదారులనే కాకుండా పంట పండించిన రైతుల దోపిడీకి కూడా ప్రాతిపదిక అవుతోంది.

ఇటీవలి సంవత్సరాలలో సమాజంలో ఒక విచిత్రమైన మార్పు కొట్టవచ్చినట్లుగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద జీతాలకు పనిచేస్తున్న అనేక మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టి వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ మార్పునకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానమైన అంశాలు సురక్షితమైన ఆహారం విలువ, అదుపు తప్పుతున్న పర్యావరణ దుష్ప్రభావాలను అడ్డుకోవడం కోసమే ఇలా సేద్యంపై ఆసక్తి పెరుగుతోంది. ఇది పర్యావరణాన్ని సురక్షితంగా మార్చే సేద్య విధానాలను గుర్తించే దిశగా సాగుతోంది.  ఇప్పటివరకు సంప్రదాయక సేద్య విధానాలనే అనుసరిస్తున్న వ్యవసాయంలో మార్పుల కోసం ముందుకొస్తున్న పట్టణ ప్రాంత వ్యవసాయ క్షేత్రాల నిర్వాహకుల గురించి వివరించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

డ్రీమ్ గ్రోవ్ (డీజీ – కలల తోట) – సామాజిక స్ఫూర్తితో సాగుతున్న వ్యవసాయ క్షేత్రం

డ్రీమ్ గ్రోవ్ అన్న పేరుతో కొంత మంది ఔత్సాహికులు కలిసి ముంబయిలోని పబ్లిక్ పార్కులోని 800 చదరపు అడుగుల స్థలంలో కలల తోట పెంపకం చేపట్టారు. ఈ పార్కు అంతవరకు నిర్లక్ష్యానికి గురయి శిథిలావస్థలో ఉంటుండేది. ఈ పార్కు పరిస్థితిని చూసిన స్థానిక మహిళ మేరీ పాల్ దీనిని అందమైన తోటగా రూపొందించాలని ఆలోచన చేశారు. చిన్నారులకు, పెద్దలకు కూడా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇది 2018 నాటి మాట. ఆలోచనను ఆచరణలోకి తెచ్చేందుకు ఇరుగుపొరుగు వారితో కలిసి ఒక గ్రూపును ఏర్పాటుచేసారు. వారిలో ఇద్దరు ప్రమీల మార్టిస్, దీప్తి ఝంగియాని (బాక్సు చూడండి) తోటల పెంపకంలో పూర్వ అనుభవం ఉన్నవారు. అప్పటికే వారిద్దరు అర్బన్ లీవ్స్ పేరిట ఉన్న ఔత్సాహిక సేద్య బృందంలో స్వచ్ఛంద కార్యకర్తలుగా పనిచేసినవారు.

మార్టిస్ ముందుగా చొరవ తీసుకుని నేల రాలిన ఆకులు అలములు, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలను, వంటింటి వ్యర్థాలను, కొబ్బరి పీచువంటి చెత్తను పరిసరాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వాటిని కంపోస్టుగా తయారుచేశారు. పార్కు ఆవరణలోనే ఆవు పేడ, మూత్రం కలిపి కంపోస్టు తయారీ ప్రారంభించారు. (ఈ రకంగా తయారుచేసిన కంపోస్టును అమృత మట్టి అని వ్యవహరిస్తారు.) పోషకాలతో సమృద్ధమైన ఈ రకంగా సిద్ధంచేసిన  సేంద్రీయ కంపోస్టును ఉపయోగించి సేంద్రీయ పద్ధతులలో పండ్లు, కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. తొలి నాళ్లలో ఈ ఆలోచనకు బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వర్గాలు అంతగా ఆసక్తి చూపించలేదు. కాని స్థానికులనుంచి వచ్చిన స్పందన, వచ్చిన ఫలితాలను గమనించిన తరువాత పార్కు నిర్వహణ భారం తీసుకునేందుకు బిఎంసి ముందుకువచ్చింది. ఇప్పుడు పార్క్ బాధ్యతలను అదే నిర్వహిస్తోంది. మరిన్ని ఇటువంటి సామాజిక ఆధారిత ఆహార పదార్థాల తోటల పెంపకానికి సిద్ధమవుతోంది.

బాక్సు -1 వలంటీర్ల వివరాలు 

ప్రమీలా మార్టిస్ ఆర్థిక రంగంలో డిగ్రీ స్థాయి విద్యావంతురాలు. చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి ఆమె స్వచ్ఛందంగా 2013లో ఈ తోటల పెంపకం గ్రూపు (అర్బన్ లీవ్స్) లో సభ్యత్వం తీసుకున్నారు. అర్బన్ లీవ్స్ సంస్థ నిర్వహించిన తోటల పెంపకం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దీప్తి ఝంగియాని పత్రికా రంగంలో విద్యావంతురాలు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఆమె తన ఇంటిలోనే కంపోస్టు తయారీ చేస్తూ వచ్చేది. ఆ తరువాత ఆమె కూడా అర్బన్ లీవ్స్ బృందంలో చేరారు.

గడచిన రెండు సంవత్సరాల కాలంలో 50 రకాల మొక్కల పెంపకం చేపట్టినట్లు ఝంగియాని తెలియచేశారు. వాటిలో పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు ఉన్నాయి. సీజన్ లకు తగినట్లుగా అనాస పండ్లు, అరటి పండ్లు, చిలగడ దుంప (యామ్), ముల్లంగి (రేడిష్), టమేటా, కాకర కాయలు, మిరపకాయలు, ఓక్రాలు కూడా పండిస్తున్నారు. ప్రత్యేకంగా ఆమె వెల్లడించిన ముఖ్య విషయం ఏమిటంటే పరిసరాలలోని వ్యక్తులు తమకు తాముగా ముందుకు వచ్చారు. శ్రమదానం చేసి కంపోస్టు తయారీ, నేల దున్నడం, మొక్కల సంరక్షణ వంటి విషయాలలో స్వయంగా పాల్గొని సహకరించారు అని తెలిపింది. ఈ విధంగా కలిసికట్టుగా అవసరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసుకోగలిగినట్లు ఆమె తెలిపారు. ఏడెండ్ల నుంచి 80 ఏండ్ల వరకు ఉన్న అన్ని వయసుల వారు చేయూత ఇచ్చిన కారణంగా సమష్టి కృషి, సమన్వయం, సంప్రదింపులు సజావుగా సాగడానికి సాధ్యమైందని వివరించారు. వారాంతపు రోజులలో సగటున 20 మంది సభ్యులు విత్తనాలు నాటడంలోను, మొక్కలు నాటడంలోనూ, పంట కోత సమయంలోనూ, నీరు పెట్టడం వంటి పనుల్లో పాలు పంచుకునేవారు. ఆమె మాటల్లోనే … “…. వ్యక్తి తనకు తానుగా ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు సాధించే ప్రాముఖ్యం అతా ఇంతా కాదు. మేము కేవలం మొక్కలను పెంచడం లేదు. ఆ క్రమంలో మానవులుగా సంఘజీవులుగా మేమంతా ఎదుగుతున్నాం.”

ప్రస్తుతం ఈ గ్రూపు కార్యకలాపాలను మరింత విస్తరించి సమీపంలో ఉన్న వారాంతపు రైతు మార్కెట్ తో సంధానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. వారి నుంచి సేంద్రీయ విత్తనాలను సమకూర్చుకోవడం అత్యంత ముఖ్యమైన అవసరం. కాగా మార్కెట్ మూసివేసిన తరువాత అక్కడ పేరుకుపోయే చెత్త, వ్యర్థాలను కూడా సేకరించి కంపోస్టు తయారీలో ఉపయోగించుకోవాలనేది వారి ఆలోచన. ఆహార పదార్థాల గొలుసుకట్టు ప్రాధాన్యతపై వారిలో పెరుగుతున్న ఆసక్తి గమనించిన ప్రమీల గ్రోవర్స్ టు బాంద్రా హోమ్స్ పేరుతో ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారుల ఇండ్లకు సరఫరా ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఈ ఆలోచన ఇటీవలి లాక్ డౌన్ సమయంలో జోరుగా ఆచరణ రూపం దాల్చింది. రైతుల లేదా రైతు సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులను సేకరించి, సరఫరా చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మిత్రులు, కుటుంబాల పరంగా తెలిసిన రైతులందరినీ చేర్చేందుకు వీలుగా విస్తరణ బాట పట్టింది.

లాక్ డౌన్ వేళ … మరిన్ని శక్తిసామర్థ్యాల సాధన

ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సేంద్రీయ సేద్యం చేస్తున్న రైతులనుంచి బియ్యం, ఇతర ధాన్యాల సేకరణను ప్రమీల నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా వాట్సప్ వేదిక సాయంతో (గ్రోయర్ టు బాంద్రా హోమ్స్ – రైతు చేను నుంచి నగర నివాసి వరకు) రైతులు తమ ఉత్పాదనల విశేషాంశాలను వెల్లడించే అవకాశం కల్పించారు. రైతులు స్వయంగా తమ ఉత్పాదనలపై అందచేసిన వివరాల కారణంగా ఉత్పత్తిదారులపై వినియోగదారులకు, వారి మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం పటిష్టంగా తయారయ్యాయని ఆమె వివరించారు. ఉదాహరణగా – ఈ వేదిక ద్వారా తన ఉత్పాదనను విక్రయించుకోగలిగిన సుశీల్ బోర్కర్ అనుభవం ప్రస్తావించారు. సహజంగా వ్యాపారం చేసుకుంటున్న సుశీల్ తనకు సేద్య రంగంపై అమితమైన ఆదరణ అభిమానాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇప్పటికి 30 ఏండ్లుగా ఆయన వారాంతపు రోజులలో వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి సహజమైన

కమ్యూనిటీ పరంగా సాధించిన అనుభవాలపై పట్టణ వినియోగదారుల్లో సరైన చైతన్యవంతులను చేయడం వల్ల మాత్రమే సుస్థిర వ్యవసాయానికి, అలా ఉత్పత్తి చేసిన ఉత్పాదనలకు అవసరమైన సహాయం అందించడం సాధ్యమవుతుంది. వారికి అవసరమైన సహకారం అందించడం సాధ్యమవుతుంది.

వాతావరణంలో గడపాలనే ఆయన కోరికే ఇందుకు ప్రధానమైన ప్రేరణ. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకు ఈ విషయంలో పూర్తి అభిలాష ఏర్పడింది. ఆయన సేద్యం పనులలో రసాయనిక ఎరువులను కానీ, క్రిమిసంహారకాలను కానీ ఉపయోగించడానికి ఇష్టపడరు. తన పొలంలో పర్యావరణ అనుకూల వ్యవసాయం చేయడమే ఆయనకు ఎక్కువ ఇష్టం. ఆయన తన ఉత్పత్తుల గురించి వాట్సప్ గ్రూపులో ఈ విధంగా వివరణ ఇచ్చారు.

“ఈ వారాతంలో మా సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఉత్పత్తులను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామని తెలియజేయడం చాలా సంతోషం కలిగిస్తోంది. పద్మశ్రీ సుభాశ్ పాలేకర్ ప్రభోదించిన ప్రకృతి సహజ సూత్రాలకు (ఎస్ పీ ఎన్ ఎఫ్) కట్టుబడి పండించిన ఉత్పత్తులు ఇవి. సేద్యంలో భాగంగా గోబర్ గ్యాస్ ఆధారిత ఘనామృత, జీవామృతం వంటివి మాత్రమే ఉపయోగిస్తాం. వాటి తయారీకి వీలుగా 18 దేశీయ పశుసంపద (ఆవులు, ఆంబోతులు, యుక్త వయసులో ఉన్నవి) ను ఉపయోగిస్తున్నాం. ఆవుల నుంచి పాలను పిండుకోం. మా ఉత్పాదనలన్నీ వంద శాతం ఎస్ పి ఎన్ ఎఫ్ సూత్రాల ప్రకారమే (సహజ సేంద్రీయ విధానంలో) తయారు చేస్తుంటాం.

మేం పండించే మామిడి పండ్లలో మూడు రకాలుంటాయి: హాపూస్ రకం (మా తోటలో 80 శాతం ఈ రకానికి చెందినవే.) రత్నా (10 శాతం) రకం, కేశర్ రకం (10 శాతం). మామిడి కాయల సేకరణ చివరి క్షణంలోనే జరుగుతుంది. అంటే కాయ చెట్ట మీద ఉన్న సమయంలో పూర్తిగా పండిపోయేందుకు అవకాశం ఉంటుంది. వాటిని మరింత మాగబెట్టేందుకు వరి పొట్టు ఉపయోగిస్తాం. అందువల్ల మేం నిఖార్సయిన పండ్లనే అంటే పూర్తిగా మాగిన / పాక్షికంగ మాగిన వాటినే మీకు చేరవేస్తాం. కనీసం 8 డజన్లు ఆర్డరివ్వాల్సి ఉంటుంది మామిడి పండు సైజును +1 / – 1 గా పరిగణించండి. ”

పండించిన వాళ్లే కాకుండా వినియోగదారులు కూడా ఈ వేదిక ద్వారా కొనుగోలు చేసిన, వినియోగించిన ఉత్పత్తులపై తమ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తంచేయవచ్చు. వారి అభిప్రాయాలు ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తుంది. వినియోగదారులలోనూ, రైతులలోనూ కూడా సరైన అవగాహన పెంచడానికి తోడ్పడతాయి. సీజన్ ఆధారంగా పండించే విధానం వల్ల కూడా ఏ మాసంలో ఏ పంట అందుబాటులోకి వస్తుందో కూడా గుర్తించగలుగుతున్నామని దీప్తి తెలిపారు.

స్థానిక ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యం

ఈ గ్రూపులోని సభ్యులు రైతుల నుంచి ఏక మొత్తంలో కొనుగోలు చేయడం, సేకరించిన సరుకును తమ పరిధిలో పంచిపెట్టుకోవడం కోసం అదనంగా మరో బాధ్యతను కూడా చేపట్టారు. ఇలా చేయడం వల్ల, తన పొలం దగ్గర నుంచి నగరాలకు పదేపదే ప్రయాణించవలసిన భారం రైతుకు తప్పిపోతుంది. ఉత్పత్తిపై ఆసక్తి లేకుండా కేవలం ఫలితం అందుకునే సాధారణ వినియోగదారులకు భిన్నంగా వినియోగదారులు కొంత మేరకు దానిపై యాజమాన్యపు బాధ్యతను కూడా తీసుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంది. రైతుల పట్ల వినియోగదారులలో సహానుభూతి పెంపొందింది. ఉదాహరణగా కొన్ని పండ్లు, ఉల్లిపాయల కొనుగోలు విషయంలో రైతులతో ఈ గ్రూపు అనుసంధానం అయింది. సేకరించిన ఉత్పత్తిని తమ గ్రూపు సభ్యులందరూ తమలో తాము పంపిణీ చేసుకున్నారు.

దీని అర్థం పంపిణీ కార్యక్రమం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా సాగుతున్నదని అనుకోరాదు. కొన్ని సమయాలలో సరఫరా సమస్యలు, ఉత్పత్తుల నాణ్యత ప్రాతిపదికగా పంపిణీ కష్టతరం కావచ్చు. అయినా, ప్రమీల చురుగ్గా ముదుండి నడిపిస్తున్నారు. ఉత్పత్తిదారులను లేదా సేకరణకర్తలను సమన్వయం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకు ముఖ్య కారణం – పంపిణీ గొలుసు పనితీరు, వినియోగదారుల ఆలోచనా సరళి ఆమెకు పూర్తిగా అవగాహనకు వచ్చి ఉండడమే. తన ఆలోచనలను ఇతరులకు కూడా తెలియజేయడం ద్వారా వారిలో కూడా సరైన అవగాహన పెంపొందించడం వల్ల వారంతా కూడా ఉత్పత్తి క్రమంలో ఆసక్తి చూపించగలుగుతున్నారని ఆమె తెలిపారు.

ఫీడ్ బ్యాక్, సాధికారిత పరస్పర ఆధారితాలు

రైతులతో నిత్యం అనుసందానమై ఉండడం, వారి నుంచి వారి ఫీడ్ బ్యాక్ సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా, గ్రూపు సభ్యులలో సాధికారత ఏర్పడి, సమష్టి కృషితో తమ అవసరాలను వారు తీర్చుకోగలుగుతున్నారు.

“మా గ్రూపు సభ్యులలో ఉల్లి కొనుగోలు చేసిన వారంతా అమిత్ కు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన ఉల్లి సాగు చేసే రైతు అవి తో అనుసంధానంతో ఉండి, ఉల్లి సేకరణ, పంపిణీ కార్యక్రమాలను సజావుగా సాగేందుకు తోడ్పడుతున్నారు. వీరంతా అంటే అమిత్, అవి ఇంకా మరో రైతు కలిసి వేసవిలో 6 టన్నుల ఉల్లి పంటను తక్కువ ధరలకు వ్యాపారులకు విక్రయించేందుకు నిరాకరించారు. వారు తమంతట తాము సరుకును ముంబయి మార్కెట్ కు చేరవేయాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా గతవారంలో 1500 కిలోల ఉల్లిని మార్కెట్ కు చేర్చగలిగారు. అందులో మా వంతు కేవలం 100 కిలోలు  మాత్రమే అయినా సరుకు నాణ్యమైనది లభించింది. పూర్తి సంతృప్తి లభించింది.”

కొబ్బరి, పచ్చళ్లు వంటి స్వల్ప పరిమాణం ఉన్న సరుకు విక్రయంలో కూడా మా గ్రూపు మద్దతు అందించింది. ఆ రకంగా అత్యద్భుతమైన సరఫరా చెయిన్ ఏర్పాటు చేయగలిగింది.

స్థానికుల ప్రేరణతో రైతు ఉత్పత్తులకు చేయూత

ఈ విధంగా పట్టణ ప్రాంతాలలోని పట్టణ సేద్య స్ఫూర్తి అటు రైతులకు కొండత అండగా నిలుస్తోంది. ధర విషయంలో లేదా నాణ్యత విషయంలో పట్టు విడుపుల ధోరణి చూపిస్తున్నారు. అందుకు స్థానికంగా రైతులు ఎదుర్కొనే వాతావరణపరమైన ఒడిదుడుకుల విషయంలో అవగాహన పెరగడమే. ఎప్పటికప్పుడు అందుతున్న ఫీడ్ బ్యాక్, ముఖాముఖీ సంప్రదింపులు భాగస్వామ్యం సజావుగా సాగేందుకు తోడ్పడుతోంది. అంటే భాగస్వాములైన రైతులు, వినియోగదారులు కూడా ఏదో తమ పని తాము చేసేసామన్నట్లుగా కాకుండా, పరస్పర అవగాహనతో వ్యవహరించడం సాధ్యమవుతోంది. ఇలా ఉభయుల మధ్య సరైన అనుబంధం, పరస్పర విశ్వాసం అందరికీ సంతృప్తినిస్తోంది. వినియోగదారులకు నాణ్యత, రైతులకు సరసమైన ధర.

కమ్యూనిటీ పరంగా చేపట్టిన ఈ సమష్టి కృషి కారణంగా పట్టణాలలోని వినియోగదారులలో పెరిగిన చైతన్యం  రైతుకు అవసరమైన గిరాకీని సిద్ధం చేస్తోంది. వారి వ్యవసాయం సుస్థిరంగా సాగేందుకు అనుకూలిస్తోంది. ఉత్పత్తిదారులు, మార్కెట్ వ్యవస్థలు, స్వచ్ఛందం సంస్థలు చురుకుగా ఉంటూ భాగస్వామ్యం పటిష్టం చేసి, సరఫరా చెయిన్ మెరుగుపరచేందుకు, ఆర్థిక లావాదేవీల సజావు నిర్వహణకు తోడ్పడుతున్నాయి. వస్తు మార్పిడి పద్ధతి, స్వచ్ఛంద శ్రమదానం, వనరుల సమీకరణ రూపంలో లాభదాయకంగా మారుతున్నాయి. మౌలిక వసతుల కల్పన, వనరుల సేకరణ విధుల వల్ల తోటల నిర్వహణ భారం కూడా భాగస్వామ్య పక్షాల మధ్య సఖ్యతకు దోహదం చేస్తోంది. అయితే ఇది మరింత విస్తరించి పట్టణం మొత్తానికి ఉపయోగకరంగా, సిటీ ప్లానింగ్ లో భాగంగా మారితే మరించ ప్రయోజనకరమవుతుంది. పట్టణాలలో వ్యవసాయ క్షేత్రాలు విస్తరించినట్లయితే, స్థానిక రైతులలోను, వినియోగదారులలోనూ చైతన్యం పెరగడమే కాక, సరఫరా వ్యవస్థ పటిష్టమవుతుంది. ఈ రకంగా పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అర్బన్ గార్డెన్స్ ప్రయోగం అందరికీ లాభదాయకమవుతుంది.

References
Dutta, D., & Chandrasekharan, S. (2018). Doing to being: farming actions in a community coalesce into proenvironment motivations and values. Environmental Education Research,24(8), 1192-1210.
Parnell, S., Elmqvist, T., McPhearson, T., Nagendra, H.,& Sörlin, S. (2018). Introduction: Situating knowledge and action for an urban planet. The urban planet: knowledge towards sustainable cities, 1-16.


డెబోరా దత్త      
సీనియర్ రీసెర్చి ఫెలో
లివింగ్ ఫార్మ్ ఇన్ కమ్స్ ప్రాజెక్టు
ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజిమెంట్ ఆనంద్ - 388001
E-mail: deborah@irma.ac.in;
debbiebornfree@gmail.com

Recent Posts

బీడు భూముల నుండి సంపద దిశగా  వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

బీడు భూముల నుండి సంపద దిశగా వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

సాలిక్స్ (విల్లో) తోటలను, పప్పుజాతి అంతరపంటలను మరియు అధిక విలువగల ఉద్యానవన పంటలతో అనుసంధానించే వ్యవసాయ అటవీ ఆధారిత...