‘మీకు కావలసిన ఆహారాన్ని మీరే పండించుకోండి’ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఆధునిక దృక్కోణం. ఈ ఆలోచన పట్టణాలలోనూ, నగరాలలోనూ విస్తరిస్తోంది. పట్టణీకరణ ప్రభావం వల్ల చెత్త పేరుకుపోవడం ఫలితంగా కాలుష్యం ప్రబలడం సర్వసాధారణ నగర జీవితంగా మారిపోయింది. ఏ చిన్న పట్టణం చూసినా ఏ వీధి చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలు, మురికి నీటి కాల్వలు కనిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడుగా పెరిగిపోతున్న పేదరికం వల్ల ఇంధనం, తాగు నీరు పెను సమస్యలు మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో అవకాశం ఉంటే ఇంటి పెరటి స్థలాలలోనూ, లేదా మిద్దె మేడలపైనా వంట ఇంటి అవసరాలను తీర్చే చిన్న చిన్న తోటల పెంపకం కొంతవరకు సమస్యలకు పరిష్కారంగా నిలుస్తోంది. దీనిని మరో విధంగా నగర జీవితంలో అత్యవసరమైన ఒక మౌలిక వసతిగా ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పుకోవాలి. ప్రజల జీవన శైలిలో కూడా మార్పు అవసరం. పెరటి తోటల పెంపకానికి అవసరమైన కంపోస్టు తయారు చేసుకునే సామర్థ్యాన్ని పౌరులు పెంపొందించుకోవాలి. పెరళ్లలోనే కూరగాయల సాగు చేపట్టాలి. ఆ విధంగా ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కొండల్లా పేరుకుపోయే దురవస్థను తప్పించవచ్చు.
ఇలా పెరటి తోటల పెంపకం చాలా ఉపయోగాలు అందజేస్తుంది. సురక్షితమైన, పోషక సమృద్ధమైన, తాజా ఆహారం అందుతుంది. వ్యర్థ పదార్థాలు సద్వినియోగం అవుతాయి. పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. పౌరులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కర్బన కాలుష్యం అదుపులోకి వస్తుంది.
పెరటి తోట పెంపకం – నా అనుభవం
తిరుచ్చి పట్టణంలో నేను 2000వ సంవత్సరం నుంచి నివసిస్తున్నాను. ప్రారంభంలో నగరం మధ్యన ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. అక్కడ పెరడు అనేది కానీ, మొక్కల పెంపకానికి ఏ మాత్రం అవకాశం లేదు. అయితే ఇంటిపై కప్పు (బాల్కనీ)లో కొన్ని రకాలైన ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచేవాళ్లం. అందుకు ఖాళీ సీసాలను ఇంకా ఇతర సాధనాలు ఉపయోగించేవాళ్లం. అయితే ఏడాది క్రితం శివారులో సొంతంగా కట్టుకున్న సొంత ఇంటికి మారాం. అక్కడ 800 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించి, సుమారు 1600 చదరపు అడుగుల స్థలాన్ని మొక్కల పెంపకానికి వీలుగా వదిలిపెట్టాం.
విద్యాపరంగా మొక్కల శాస్త్రం చదివిన కారణంగా కొంత, తిరుచ్చిలోనే ఉండే స్వచ్ఛంద సంస్థ కుదుంబం అనే సంస్థతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తోటల పెంపకంపై ఆసక్తి పెరిగింది. కుదుంబం సంస్థతో నాకు 1995 నుంచి అనుబంధం ఉంది. ఇది తమిళనాడు చురుగ్గా పనిచేస్తుండేది. అందువల్ల సుస్థిర వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన ఏర్పడింది. ఇంటి చుట్టూ ప్రహారీ సిద్ధం చేసి, పెరటి తోటల పెంపకం చేపట్టాం.
మా కుటుంబంలో మొత్తం నలుగురు ఉంటాం. భార్య పేరు గజ, కుమార్తె శృతి, కుమారుడు హరీశ్ … సరే నేను. ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాలుపంచుకునేవాళ్లం. మేం అనుసరించిన విధానం చాలా సాధారణమైనది. చిన్న స్థాయిలోనే మేము ఆహారంలో ఏవి తీసుకుంటామో వాటినే పండించేందుకు నిర్ణయించాం. ముందుగా మా కుటుంబానికి వంటింటి ఉపయోగానికి ఎంత అవసరం అనే విషయాన్ని పరిశీలించాం. అలాగే వంటింటికి కాకుండా ఇతరత్రా ఎలాంటి అవసరాలు ఉంటాయనే అంశం గురించి నిర్ధారించుకున్నాం. మొక్కల పెంపకానికి సాధ్యమైనంత తక్కువ మొత్తం ఖర్చు అయేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మా వనరులకు తగినట్లుగా మూడు ‘ఆర్’ నిబంధనల సూత్రీకరణను అనుసరించాం. అంటే రెఫ్యూజ్ (నిరాకరించడం), రీసైకిల్ (పునర్వినియోగించడం), రీ యూజ్ (మళ్లీ మళ్లీ ఉపయోగించడం) అనేవే మేము పాటించిన మూడు మూల సూత్రాలు. మొత్తానికి 8 నెలల క్రితం పెరటి తోట ఒక రూపంలోకి వచ్చింది.
వంటింటి అవసరాలకు మొక్కలు
వంటింటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని – కొడి పసలై (బచ్చలి ఆకు – బసిల్లా ఆల్బా), బొమ్మనంగన్ని (పొన్నగంటి కూర – ఆల్టర్నెంతెర సెసిలిస్), కుతుపసలై (బచ్చలి – బసిలా రుబ్రా), పులిచకీరల్ (గోంగూర లేక పిండి కూర – హిబిస్కస్ కానోబినస్), వెదియ కీరై (మెంతి కూర – ఫెనుగ్రీక్), మురుంగకీరై (ములగ కాడలు లేక ములగాకు – డ్రమ్ స్టిక్ లీవ్స్) మొదలైన మొక్కల పెంపకం చేపట్టాం. ఈ ఆకుకూరలను ఉదయం అల్పాహరంలో లేదా ప్రధాన భోజనంలో భాగంగా ఉపయోగిస్తాం. సాధారణంగా రాత్రి వేళ ఆహారంలో ఆకు కూరలను ఉపయోగించేదిలేదు. కొత్తిమీర లేక కరివేపాకు వంటి వాటిని కూడా పెంచుతూ వచ్చాం. కూరగాయలలో టమేటా, బెండకాయ, వంకాయ, ఉస్తికాయ (solanam torvam), చిక్కుడు కాయ, ములగ కాడ, కాకర కాయ, బీరకాయ, ఆనప కాయ వంటివి కూడా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే వాటి పెంపకం చేపట్టాం.
ఔషధ మొక్కలు
ఔషధ లక్షణాలు ఉండే కృష్ణ తులసి, అలోవెరా, వాసకం (జస్టికా అధతోడ – justicia adhatoda), గరిక అనే గడ్డి (అరుగంపుల్ – cynodon dactylon), తిరునేత్రు పచ్చిలై, పిరాండై, తమల పాకులు (బీటల్ వైన్), నిమ్మ గడ్డి (లెమన్ గ్రాస్), రనకల్లి, కీలనెల్లి, నాయికడుగు, కర్రీ లీఫ్, ఇన్సులిన్ ప్లాంట్, మరుతని, కుప్పయ్మెని (కుప్పింటాకు – achalypa indica) మొదలైన వాటిని కూడా పెంచగలిగాము. దీనిని మా ఔషధ శాలగా వ్యవహరిస్తాం. సాధారణమైన ఆరోగ్య సమస్యలకు ఇవి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా జలుబు, దగ్గు, ముక్కు కారడం, జ్వరం, ఒళ్లు నొప్పులు, తల నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు ఇవి సరైన పరిహారాలు. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోను, రక్తపోటు, చక్కెర స్థాయి నియంత్రణలోను ఉపయోగిస్తాం. వీటిని ముడి ఆకుల రూపంలో కానీ, కషాయం రూపంలో కానీ, సూపు రూపంలో కానీ, సాంబారు లేదా చట్నీలో ఉపయోగించవచ్చు.
పూజలు, వగైరా అవసరాలకు
మా ఇంటి తోటలో పూజలు, పునస్కారాలలో ఉపయోగపడే మొక్కలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి – జాస్మిన్ (మల్లె పూవు), మందార (hibiscus), అంతిమంతరై, పిచ్చిపూవు, కాగితం పూవు, అరలిప్పూవు. మల్లె పూవులు మా ఇంటి ఇల్లాలికి, మా అమ్మాయికి ఇష్టం. మిగిలినవి పూజల సమయంలో వినియోగిస్తాం. ప్రతి ఉదయాన పూవులను సేకరించి, పాత వాటిని తొలగించి తాజా పూవులను అలంకరిస్తాం. మందార ఆకులు రక్తశుద్ధికి తోడ్పడతాయి. అందువల్ల పూజలో వాడిన మందార ఆకులను మరుసటిరోజు తీసి మందార ఆకులను మేము ప్రసాదంగా తీసుకుంటాము.
ఇక చెట్ల రూపంలో
మేము కొన్ని చెట్లను కూడా పెంచడం ప్రారంభించాం. వాటి వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మామిడి, బొప్పాయి, జీడి మామిడి, జాక్ ఫ్రూట్, జామ, కొడుక్కపులి, ఆరటి, నిమ్మ (ఆమ్ల), గూస్ బెర్రీ చెట్లు ఉన్నాయి. ఇంకా వెదురు రూపంలో వీలువైన టేకు, సేమమ్మరం, కాజురీనా, వేప, పూవరుసు వంటివి పెరుగుతున్నాయి. పండ్ల చెట్లు రెండేళ్లలో ఫలాలను ఇస్తాయి. ఇక కలప అవసరాలకు ఉపయోగపడే చెట్లు దీర్ఘకాలంలో మా కుంటుంబానికి అక్రకు వస్తాయి.
చిన్న చిన్న అంశాలు – చెప్పుకోదగ్గ ఫలితాలు
మా పెరటి తోటలో పక్షులు తాగడం కోసం మంచి నీటి సదుపాయం ఏర్పాటుచేశాం. అవి వచ్చి నీళ్లు తాగుతున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా వాటి కారణంగా తోటలోని మొక్కలకు చీడ పురుగుల బెడదను అవి నివారిస్తున్నాయి. ఆ పురుగులను ఆ పక్షులు తినివేస్తాయి. అయితే మేము చీడ పురుగులను నాశనం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే మనుషులే కాదు. అన్ని జీవాలు బతకాలి కదా. నెమళ్లు, మైనా పక్షులు, చిట్టుకురివి వంటి పక్షులు నిత్యం మా తోటకు వచ్చే అతిధులు అని చెప్పాలి. చిట్టుకురివి పక్షలు పిల్లలను పెట్టడానికి వీలుగా తోటలో పక్షి గూళ్లను కూడా ఏర్పాటుచేశాం. తోటలో ఎక్కడ మట్టి తవ్వినా అందులో పెద్ద సంఖ్యలో వానపాములు కనిపిస్తాయి. ఇది భూసారం సురక్షితం అని చెప్పకనే చెపుతుంది.
మా ఇంటి పెరటి తోటల కారణంగా మాకు ఎల్లవేళలా తాజా గాలి పరిశుభ్రమైనది వీస్తూ ఉంటుంది. ఉదయం వేళ కనీసం గంట సేపు తోటలో విహిస్తూ, తాజా గాలిని ఆస్వాదిస్తాం. అది మాకు మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. రోజంతా హుషారుగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యంతో ఉంటున్నాం. ప్రకృతికి చేరువగా ఉండడమే మా ఆనందమయ జీవిత రహస్యం అని చెప్పాలి. ప్రతీ రోజు ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం కూడా. మాకు లభిస్తున్న వాటిని రీసైక్లింగ్ చేసే అవకాశాలు కావల్సినన్ని ఉన్నాయి. కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, పువ్వులు మా వంట గదిని సుసంపన్నం చేస్తుంంటాయి. అలాగే కిచెన్ లో పేరుకున్న వ్యర్థాలు మళ్లీ ఎరువుల రూపంలో లేదా కంపోస్టు రూపంలో తోటకు చేరతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు అవసరమైన విత్తనాలను మేమే నిల్వ చేసుకుంటున్నాము. మా నిల్వల్లో కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కలు, ఆకు కూరలు, పూల విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి.
మా జీవితం గురించి చెప్పాలంటే – అది పర్యావరణంతో ముడిపడి పునరుత్పత్తి లక్షణాలతో విలసిల్లతున్నది. మేము నిత్యం అనుసరించే మూడు సూత్రాలు – రెఫ్యూజ్, రీసైకిల్, రీయూజ్. ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ టబ్ లు, సీసాలలోనే మొక్కల పెంపకం సాగుతుంది. మాకు అవసరమైన సామగ్రి అంతా కూడా వ్యర్థాల నుంచి తయారుచేసుకున్నవే. మా తోటకు మరింత సమగ్రమైన రూపం తీసుకువచ్చేందుకు చికెన్, ఫిష్, గొర్రెలను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నాం.
మేము పండించిన తోట ఉత్పాదనలను ఇరుగుపొరుగు వారితో, బంధవులతో, పాలు సరఫరా చేసే వారితో, చివరికి పారిశుధ్య పనివారితో కూడా కలిసి పంచుకుంటాము. అందరికీ ఉచితంగానే అందిస్తున్నాము. అందువల్ల మా అనుబంధాలు మరింత పటిష్టంగా నిలిచి ఉంటున్నాయి. ఇప్పుడు వారిలో కొందరు తాము కూడా స్వయంగా తోట పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు.
కోవిడ్ 19 కారణంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ సమయంలో తోట పనులకు మేము మరింత సమయం ఉపయోగించుకోగలిగాము. ఫలితంగా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకు కూరలు సమృద్ధిగా లభించాయి. పక్షుల కిలకలారావాలు మా ఇంట్లో అలారమ్ సాధనాల అవసరం లేకుండా చేస్తున్నాయి. ఇది మా పెరటి తోటలో మా ప్రశాంత జీవితం.
సురేశ్ కన్నా
కుదుంబం
నె. 113/118, సుందరరాజ్ నగర్, సుబ్రహ్మణ్య పురం
తిరుచ్చి - 620 020. తమిళనాడు, ఇండియా
E-mail: sureshkanna_kudumbam@yahoo.in



