పర్యావరణ అనుకూల సేద్యం- పునరుజ్జీవానికి సాధనంగా సాంకేతికత

డిజిటల్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మన చుట్టూ సహజసిద్ధమైన వేదికలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కృషి జనని పేరుతో తమిళనాడు రాష్ట్రంలోని వ్యవసాయదారులకు ప్రత్యామ్నాయ వేదికను అందిస్తోంది. ఇది వికేంద్రీకరణ, పునరుజ్జీవనం సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. జనని గ్రో మొబైల్ యాప్ చిన్న, సన్నకారు రైతులకు బాగా ఉపయోగకరం. ఈ యాప్ సాయంతో మార్కెట్ అవకాశాలను పునరుజ్జీవింపచేసుకునేందుకు, సేంద్రీయ మార్కెట్లలో తమ ఉత్పాదనలకు అదనపు విలువలను అందించేందుకు ఉపయోగపడుతుంది. 

తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలోని కరైపాళ్యం గ్రామంలో అయిదేళ్ల క్రితం వ్యవసాయం ద్వారా లభార్జనకు తోడ్పడే కృషి జనని పేరుతో ఒక సామాజిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. కృషి జనని ప్రధాన ఆశయం – పునరుజ్జీవన యోగ్యమైన పర్యావరణాన్నిఏర్పాటు చేయడం, దాని ద్వారా ఇటు రైతులకు, వినియోగదారులకు, పెద్ద సంస్థలకు మాత్రమే కాకుండా ఈ మొత్తం భూగోళానికి మేలు చేకూర్చడం.

తొలి సంవత్సరాలలో దీనిని ప్రయోగాత్మకంగా ఒక నమూనా రూపంలో అమలులోకి తీసుకువచ్చాం. వ్యవసాయ క్షేత్రం ఆధారంగానే సాధ్యమైనన్ని విషయాలను అవగాహన చేసుకోవడం, రైతులలో వాటిపై విశ్వాసం పెంపొందించడం, వారికి ఉపయోగకరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పదును పరచి, వారికి అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాం. ఈ దశలో రెండు జిల్లాల్లోని రైతుల మధ్య సాన్నిహిత్యాన్ని వృద్ధి చేసేందుకు కేటాయించాం. రైతులు అనుసరిస్తున్న సేద్య విధానాలలో ఉత్తమ పద్ధతులను గుర్తించడం, వాటిని సమన్వయపరచి, వారి అవసరాలకు అనుకూలంగా వాటిని సరిదిద్దడం ముఖ్యమైన అంశంగా పరిగణించాం. కృషి జనని టోకుగా వ్యవసాయదారులకు అవసరమైన ముడి సరుకును కొనుగోలు చేశాం. అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ రకంగా రైతులకు కొంత సొమ్ము ఆదా చేసేందుకు ప్రయత్నించాం. ఈ ప్రయోగ దశలో చాలా కష్టనష్టాలనే ఎదుర్కోవలసి వచ్చింది. కొన్ని విజయాలు కూడా సాధించాం. మరెన్నో అంశాలపై మాకు అవగాహన వచ్చింది. అంటే మోమూ కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఇది ప్రయోగ దశ కావడం వల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభాలను నివారించేందుకు వీలుగా వ్యవసాయ – పర్యావరణను పునురుత్తేజితం చేసే సాంకేతిక రూపు రేఖలు సిద్ధం చేశాం.

ఈ దశలో మా తదుపరి అడుగుల గురించిన ఆలోచనలకు అవసరమైన అంశాలను గుర్తించాం. మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతటా సాంకేతికత ఆధారిత మార్గ నిర్దేశం చేయాలనుకున్నాం. దీనికి కేంద్రం జనని పేరుతో ఏర్పాటు చేసిన మార్కెట్ వ్యవస్థ. ఇది లాభదాయకమే కాకుండా పునరుజ్జీవమయ్యే లక్షణం ఉన్నది. ఇది ప్రధానంగా సాంకేతికతకు సంబంధించిన వేదిక. చిన్న, సన్నకారు రైతులకు ఉత్తమ సేద్య పద్ధతులను పరిచయం చేసేందుకు ఉద్దేశించినది. వారి సేద్య విధానాలలో మార్పులను ప్రోత్సహించేది. అదే సమయంలో ఉత్పత్తిదారులకు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు భరోసా ఇచ్చేది. ఒక వైపు కృషి జనని గ్రో యాప్ చిన్న రైతులకు పునరుత్పాదక సేద్య పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తూనే. వారి ఉత్పత్తులకు సేంద్రీయ వస్తు మార్కెట్లను చేరువ చేయడం కాగా, మరో పక్క జనని మార్కెట్ పోర్టల్ ద్వారా రిటైల్ వ్యాపారులను, ముఖ్యంగా ఉత్పత్తిదారులను, ఈ కృషిలో మొదటి సారి అడుగు పెడుతున్న సంస్థలకు మధ్య వారధిగా నిలపడం. అలాంటి వాటిని గుర్తించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లు సమకూర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాం. ఇందుకు వీలుగా జనని మార్కెట్ పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది రైతుల నుంచి సేంద్రీయ ఉత్పత్తులను సేకరించి అందించడం అంతిమ లక్ష్యం.

కొత్తగా ఆవిర్భవించిన ఏ సంస్థకైనా తప్పని విధంగానే మోము కూడా చాలా నెమమదిగా రైతులకు ఉపయోగకరమైన సాంకేతికతను సిద్ధంచేస్తూ, మా లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేశాం. ఒక్కో సారి ఒక్కో సాంకేతిక సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టాం. వాటికి అవసరమైన డేటా బ్యాంకు మొత్తం సిద్ధం చేసుకున్నాం. ఆహార పదార్థాలకు సంబంధించిన అన్ని వర్గాలకు అంటే రైతులు, సేంద్రీయ రిటైల్ వ్యాపారులు, పెద్ద సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు అనువైన, అవసరమైన సమాచారాన్ని సేకరించి భద్రపరిచాం. ఇక దానిని అవసరమైన వారికి చేరవేయవలసిన సమయం వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థలు అంటే భారీ సమాచారాన్ని లేదా సాధారణ సమాచార సందేశాలను చేరవేసే సేవలు, ఇంకా ఇతర మొబైల్ యాప్ సేవలను ఉపయోగించుకున్నాం. తమిళ భాషలో సిద్ధం చేసిన యాప్ ను అగ్రస్థానంలో ముందుంచాం. (ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్ ఆధారితం). దానితో పాటు ఇంగ్లీషు ఆధారిత వెబ్ పోర్టల్ ను ఉత్పత్తిదారులకు, రిటైలర్లకు అనుకూలంగా తీర్చిదిద్దడం జరిగింది. (ఇది తుది దశలో ఉంది.)

ఇలా సమగ్రంగా వ్యవస్థలు సిద్ధం చేసుకున్న తరువాత మా దృష్టికి వచ్చిన ముఖ్యమైన విషయం ఏమిటంటే  అవసరమైన సాంకేతిక పరమైన వేదికను సిద్ధం చేయడం తేలికే. సాంకేతికత అనేది అనేక రకాలుగా ఉపయోగించుకునేందుకు ఒక సాధనం మాత్రమే. ఇవి సామాజిక సంక్షేమానికి ఉపయోగపడవచ్చు. లేదా ఇప్పటికే సమాజంలో ఉన్న లోటుపాట్లను మరింత అద్వాన్నస్థితికి చేర్చే ప్రమాదం కూడా ఉందని గుర్తించాం. ఇటు మంచి అటు చెడు కూడా దానితో పాటే ఎదురవుతాయని తెలుసుకున్నాం. అంటే సామాజిక పరంగా, సంస్కృతి పరంగా, ఆర్థిక పరంగా అనేక సవాళ్లు ఉంటాయని, వాటి గురించి కూడా ఆలోచించాలని అవగాహన చేసుకున్నాం. సాంకేతికత సేవ చేసేది గా లేదా తీవ్ర నష్టదాయకంగా మారే అవకాశాలను విస్మరించకూడదు. ఈ సమయంలో తుది రూపం ఇచ్చే ముందు మాకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించేందుకు మేము చేసిన ప్రయత్నాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అంశాలు సాంకేతికత ఆధారిత సామాజిక వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చే ఇతరులకు సహాయపడుతుందని విశ్వసిస్తున్నాను.

సాంకేతికత మాత్రమే కాదు మరెన్నో అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి

విస్తృతమైన పరిశీలన, సమగ్రమైన ఆలోచనల తరువాత రుపుదిద్దుకునే సాంకేతిక వేదిక రూపకల్పనలో అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం. మా విషయంలో కూడా, కొన్ని మౌలిక ప్రశ్నలను గుర్తించిన తరువాత సాంకేతికతతో సంబంధం లోని ఇతర అంశాల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగం విషయంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వేలాది రైతు కుటుంబాలు దారితప్పే ప్రమాదం ఉంటుంది. వారికి ఉపయోగకరం కాని పరికరాలను వినియోగించి తప్పుడు ఫలితాలు పొందవలసి రావచ్చు. ఈ ప్రమాదం దృష్టిలో ఉంచుకుని మాకు మేము వేసుకున్న ప్రశ్నల స్వరూపస్వభావాలు దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

సాంకేతికత యాజమాన్యపు హక్కుదారులు – వ్యవస్థ స్వరూపం

సాంకేతికత, అనుబంధ అంతర్గత కీలక అంశాలపై యాజమాన్యపు హక్కులు ఎవరికి ఉండాలి? ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యమైనా డేటా విషయంలోనూ, పరస్పర సంబంధాల విషయంలోనూ … అనేది చాలా కీలకమైన అంశం. ఏ సామాజిక వ్యవస్థ కోసం ఇది రూపొందిస్తున్నాం. ఏ స్థాయిలో ఉన్న ఎటువంటి లోటుపాట్లను సరిదిద్దే బాధ్యత తీసుకుంటున్నాం? ఈ యాజమాన్యపు హక్కులు లేదా వ్యవస్థ విషయంలో రైతులకు ఏ మాత్రమైనా అదుపు ఆజ్ఞలు ఉంటాయా ?

సత్ఫలితాలు – దుష్ఫలితాలు

ఈ సాంకేతిక వేదిక కారణంగా ఎదురయ్యే కష్టనష్టాలు ఎవరిని ఎక్కువగా బాధిస్తాయి? ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి ? ఇలా లాభనష్టాల ప్రభావం అందరిపై సమానంగానే ఉంటుందా? అలా కాకుండా కొందరికే ఉపయోగకరంగా ఉంటుందా? అన్న అంశాలను గురించి కూడా ముందుగానే ఆలోచించుకున్నాం.

ఆర్థిక అంశాలు – ప్రయోజనాలు విభజన

మేము రూపొందిస్తున్న వేదిక ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయి? ఇది వేదిక ప్రయోజనాల కల్పనలో ప్రతి ఒక్క భాగస్వామికి అందుతున్నదా ?  అలాగే ఇప్పుడున్న వ్యవస్థను మరింత శక్తివంతం చేయగలుగుతుందా ?

అనూహ్యమైన పరిణామాలు – దారి తప్పిన లోపాలు ఉన్నాయా ?

సాంకేతిక అంశాలకు సంబంధించిన వేదిక తయారీ సమయంలో తాము సాధించదలచిన లక్ష్యం గురించిన స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకున్నారు. అందుకోసం హడావిడి పడే సమయంలో అనకోకుండా మరేవైనా పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయా అని మళ్లీ మళ్లీ పునరాలోచనలు చేశారు. ఎక్కడైనా పరిశీలించినవి కాకుండా మరేవైనా కోణాలున్నాయా వాటిని గమనించలేకపోయామా అని మళ్లీ మళ్లీ పునరాలోచనలు చేశాం. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం ఎలా? ఎప్పటికప్పుడు అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా, నేర్చుకున్న గుణపాఠాల సాయంతో మార్పులు ఎలా చేయాలి?  భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం ఎలా అని ఆలోచించుకున్నాం.

ఇలా రకారకాల ప్రశ్నలు మాకు మేము వేసుకునే సమయంలో మాకు రెండు వేర్వేరు మార్గాలు కనిపించాయి. లాభదాయకమైన వ్యాపార ప్రోత్సాహకంగా సాంకేతికతను అభివృద్ధి చేయాలి లేక పర్యావరణ అనుకూల సేద్యం పునరుజ్జీవనానికి అనుకూలంగా సాంకేతికను సిద్ధంచేయాలా అనేవి ఆ రెండు మార్గాలు.

లాభదాయక వ్యాపారంగా

ఈ మార్గంలో మార్కెట్ అవకాశాలు అందించే జనని రూపుదిద్దుకుంది. ఇది విజయం సాధించేందుకు భాగస్థులందరినీ కలుపుకుని ఒక పటిష్టమైన వ్యవస్థగా అది పనిచేయాలి. విజయం అంటే ఇప్పటికే ఉన్న ఇతర వేదికలలో – ఆర్థికంగా పురోభివృద్ధికి తోడ్పడాలి. లాభాలు సంపాదించి పెట్టాలి. కంపెనీ విలువ పెరగాలి. అమెజాన్, ఫేస్ బుక్, ఉబెర్ వంటివి ఈ మార్గంలో మాకు ఆదర్శంగా కనిపించాయి.

ఈ తరహా వాణిజ్య నమూనాలో వెలికి  తీయడం (ఎక్స్ ట్రాక్షన్) ప్రాథమిక సూత్రం అని చెప్పాలి. సాంకేతిక అంశాలను సిద్ధం చేసాం. తరువాత వాటిని అందుబాటులోకి అందించాం. మళ్లీ మార్పుచేర్పులు చేశాం. కొత్త మార్పులతో అందించాం. ఇందుకు కొన్నేళ్లు పట్టింది. ఈ సాంకేతికతకు సంబంధించిన అన్ని అంశాలను వాటికి సంబంధించిన సాంకేతిక సాఫ్ట్ వేర్ తో సహా అందుబాటులో ఉంచాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు అవసరం. తొలి దశలో జనని యాప్ తయారీలో మా ప్రయత్నం నానా మార్గాల ద్వారా సేకరించిన అంశాలను క్రోడీకరించి సిద్ధం చేసిన సంకర రూపం కాగా, ఫేస్ బుక్ వేదిక ఆధారంగా అందుబాటులోకి వచ్చింది. క్రమంగా “వాటితో పాటు మరి కొన్ని” సూత్ర ప్రాతిపదికపై మెరుగుపరచడం జరిగింది. అయితే అది కూడా మాకు సంతృప్తి కలిగించలేదు.

ఒక విధంగా చెప్పాలంటే, అవి అనేక వేదికల సమాహారం. వాటిలో అనేక మార్కెట్లు ఉంటాయి. సర్వీసు అందించే సంస్థలుంటాయి. వాటిని ఆ సర్వీసు ప్రొవైడర్ సంస్థలే అందజేస్తాయి. తమ కస్టమర్ల అవసరాలకు తగిన వారిని సూచించడంలో – అంటే తక్కువ ఖర్చు అయ్యే అమెజాన్ వేదికలు లేదా సదుపాయంగా ఉండే ఉబెర్ వేదికలు, లేదా వాడకంలో సౌలభ్యం ఉండే ఫేస్ బుక్ వంటివి – తమ ద్వారా మాత్రమే ప్రయోజనాలు అందించే మార్గంలో పనిచేస్తాయి. అంతే కానీ నేరుగా కస్టమర్ కు, అతనికి అవసరమైన సేవలు అందించే సంస్థలతో నేరుగా ఎలాంటి సంబంధాలు ఉండకుండా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ సమాహార వ్యవస్థలో నష్టాలన్నీ వినియోగదారు పాలు కాగా లాభాలన్నీ పై స్థాయిలో సేవలందించే సంస్థల జేబుల్లోకి వెళ్లిపోతుంటాయి. చాలా సంస్థలు ఈ విషయంలో పోటీ పడుతుంటాయి. ఉదాహరణకు ఉబెర్ కారు డ్రైవర్లను చూడండి. సకాలంలో వాటిదాలు చెల్లించలేకపోతే వారి పరిస్థితి ఎలా మారిపోతుందో గమనించాలి. లేదా అమెజాన్ కు సమాచారం అందించే సమాచార విక్రేతల పరిస్థితి ఆలోచించాలి. పోటీలో నిలబడగలిగే అంశాలకే అది ప్రాధాన్యం ఇస్తుంది. అంటే రివార్డులు, ఆర్థిక ప్రయోజనాలు, అదనపు విలువల ప్రయోజనాలు పై స్థాయికి ఎగబాకుతాయి తప్ప దిగువన ఉన్న వారికి చేరవు. స్థానికులకు ఎలాంటి లబ్ధి ఉండదు. భాగస్వామ్య పక్షాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరికి ఆ వేదికను రూపొందించిన యజమానులకు కూడా ఏమీ మిగలదు.

ఈ నమూనాలోని వేదికల వల్ల ఎదురవుతున్న అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి కళ్ల ముదు కనిపిస్తున్నా వాటిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. లేదా వాటిని సరిచేసే సామర్థ్యం లేక మౌనంగా ఉండిపోతున్నాయి. ఈ సమయంలో ఫేస్ బుక్ పై తప్పుడు వార్తల వ్యాప్తి గురించిన ఆరోపణలు గమనించాలి. సమాచార వ్యాప్తిలో ఇది అద్భుత ప్రగతి సాధించింది. ఆ క్రమంలో లక్షలాది డాలర్ల వాణిజ్య ప్రకటనల రూపంలో లబ్ధి పొందింది. అయితే అనుకోకుండా ఎదురైన పరిస్థితి ఏమిటంటే దురుద్దేశాలున్న వారి ప్రభావం అందులో పెరిగిపోయింది. ఫలితంగా రాజకీయంగా, సామాజికంగా సంక్షోభాలు ఎదురయ్యాయి. కొన్ని స్వప్రయోజనాలతో వ్యాపింపజేసిన తప్పుడు సమాచారం కారణంగా ప్రపంచమంతటా దీనిపై అసంతృప్తి రగిలిపోయింది. మొదట్లో వచ్చిన వాణిజ్య ప్రకటనల రూపంలో లాభాలను ఇప్పుడు కాపాడుకునేందుకు ఫేస్ బుక్ నానా తంటాలు పడుతోంది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోంది.

సాంకేతిక పరంగా లేదా ఆర్థిక పరంగా ఈ మార్గం లాభసాటిగానే ఉంటుంది. అయితే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తే ఇది ఉపయోగకరమైనది కాదని తెలుస్తుంది. వెలికితీత లేదా ఎక్స్ ట్రాక్షన్ నమూనా ఏ రంగంలో అయినా పారిశ్రామికీకరణ దుష్ప్రభావాలతో అధికార కేంద్రీకరణ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. వీటి వల్ల ఎదురయ్యే నష్టాలను ఏ విధంగానూ సరిచేయడం సాధ్యం కాదు. అందువల్లనే జనని యాప్ తయారీ సమయంలో అట్టడుగు స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పై స్థాయి వరకు లాభదాయకంగా రూపొందించేందుకు కృషి చేయాల్సి వచ్చింది.

పునరుజ్జీవన సాధ్యమైన అగ్రో ఎకాలజీ లక్ష్యంగా

తమిళనాడులోని వ్యవసాయ రంగం ఇప్పటికే లోతుగా ఇంకా లోతుగా బోరు బావులు తవ్వుతూ వెలికితీత సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటోంది. నిస్సారంగా మారిపోయిన భూముల నుంచి ఇంకా ఇంకా అధిక దిగుబడుల కోసం ప్రయాస పడుతోంది. అందుకు పర్యావరణ స్థితిగతులు చేయి దాటిపోవడమే ప్రధాన కారణం. వాతావరణ అనిశ్చితి తరచుగా ఎదురవుతున్న సమస్య. దాని తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితులలో పర్యావరణ అనుకూల సేద్యం సవ్యంగా సాగేందుకు తక్కువ ఖర్చుతో, కొద్దిపాటి సాంకేతిక సంక్లష్టతలతో దీర్ఘకాలిక పరిష్కారాలు చూపించేందురు అనువైన ప్రత్యామ్నాయమే ఇది. పునరుజ్జీవన సాధ్యతే లక్ష్యంగా పర్యావరణ సేద్యాన్ని (రీజనరేటివ్ అగ్రో ఎకాలజీ) ప్రోత్సహించడమే అందుకు అన్ని నగరాలలోనూ రైతు వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారం.

రీజెనరేటివ్ అగ్రో ఎకాలజీ అనేది ఎక్స్ ట్రాక్టివ్ వ్యాపార విధానానికి ప్రత్యామ్నాయం అనుకుంటే మరి సాంకేతిక పరంగా ప్రత్యామ్నాయం ఏమిటి ? అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎక్స్ ట్రాక్టివ్ వ్యాపార సూత్రాలతోనే రూపొందిన సాంకేతికత తన లక్షణాలను మార్చుకుని రైతులకు ఉపయోగకరమైన రీడనరేటివ్ అగ్రో ఎకాలజీ అభివృద్ధికి సహకారం అందిస్తుందా? మరిన్ని ప్రయోజనాలు కల్పించే సాంకేతికపరమైన వేదికలో మార్కెట్ అవకాశాలు కూడా కలిసి ఉండి రీజనరేషన్ ప్రక్రియ అంతర్భాగంగా ఉండేలా సిద్ధం చేయడం సాధ్యమేనా? జనని మార్కెట్ వేదిక రూపకల్పన సమయంలో ఈ ప్రశ్నలన్నీ ఎదురయ్యాయి. అయితే వాటిలో కొన్నింటికి మాకు ఇంకా సరైన సమాధానాలు దొరకలేదనే చెప్పాలి. మరి కొన్నింటిని వ్యవసాయ భూములలో ప్రయోగించాల్సి ఉంది. ఆ తరవాతే మా ఆలోచనల్లోని లోపాలు తెలుస్తాయి. జనని మార్కెట్ వేదికలో ఈ దిశగా మా ప్రయత్నాలు సాగుతున్న తీరు తెన్నులు ఎలా సాగుతున్నాయి? అంటే …

యాజమాన్యపు హక్కులు – వ్యవస్థ స్వరూపం

జనని మార్కెట్ వేదిక అధారంగా రైతులకు తమకు అవసరమైన, అమూల్యమైన సమాచారాన్ని భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతు సంఘాల మధ్య అనుబంధాలు సజావుగా సాగేందుకు ఇది తోడ్పడుతుంది. రైతులకు కీలకమైన సమాచారం భద్రపరిచే అంశంపై ఇటీవలే దృష్టి పెట్టాము. అయితే రైతుల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ సంబంధాలపై ఆధారపడి మాత్రమే ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సరైన ఇచ్చిపుచ్చుకునే సదుపాయం ఉండే వ్యవస్థ స్థిరపడుతుంది. ఒక రకంగా జనని వేదిక అనేక నెట్ వర్క్ లకు మధ్య నెట్ వర్క్ గా ఉపయోగపడుతుంది. అంటే ఒక నెట్ వర్క్ విజయం మిగిలిన వాటి విజయానికి సహకరిస్తుంది. ఇలా ఉపయోగపడేందుకు అవసరమైన సాంకేతికత నమూనా అనేక సవాళ్లతో కూడిన వ్యవహారం అని చెప్పక తప్పదు. దీనిని రైతులకు చేరువ చేయాలంటే మౌలికంగా కొన్ని సామర్థ్యాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. ముఖ్యంగా డేటా, ఫైల్స్ ను నిల్వచేయడం, వాటిని సరైన సమయానికి అందించేందుకు వీలుగా కమ్యూనికేషన్ వ్యవస్థ, చెల్లింపుల వ్యవహారాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోనే ఉంచాలి. అందులో భాగంగా రైతులందరికీ భాగస్వామ్యంతో పాటు యాజమాన్య హక్కు కూడా ఉండాలి. అప్పుడే అది యజమానులకు, వినియోగదారుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

సత్ఫలితాలు – దుష్ఫలితాలు

వ్యవసాయదారులు ఇప్పటికే సేద్యం చేసే పనుల్లో నిలకడ లేని సవాళ్ల మధ్య భరోసా లేని ఫలితాల కోసం పోరాడుతున్నారు. అలాంటి పేద రైతులు ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ముందుకు వచ్చి మరో సమస్యను తలకెత్తుకునేందుకు సిద్ధంగా లేరు. అందువల్ల అలాంటి సాహసానికి సిద్ధపడి ముందుకు వచ్చే పెట్టుబడిదారులను గుర్తించడమే పెద్ద సవాలు.

ఆర్థిక అంశాలు – ప్రయోజనాలు విభజన

సాంకేతికపరమైన వేదిక నిర్మాణం ఆర్థిక ప్రయోజనాలు, ఇతరత్రా ఉపయోగాలు ప్రతి ఒక్కరికీ చేరేందుకు అనువుగా ఉండాలి. ఇది చాలా క్లిష్టమైన అంశం. వివిధ ప్రాసెస్ ల రూపు రేఖలు, వాటి ప్రయోజనాల ప్రవాహం అట్టడుగు వర్గాల      వరకు చేరేలా తయారయ్యాయి. జనని ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా గుర్తించింది. ఉదాహరణకు సేంద్రీయ ఉత్పాదనగా  నిర్ధారించేందుకు పీజీఎస్ ఇండియా సంస్థను అనుసంధానం చేసాం. ఇది స్థానికంగా రూపుదిద్దుకున్న పరిజ్ఞానానికి, పర్యవేక్షణకు కేంద్రంగా వ్యవహరిస్తుంది. రైతులు తమ అనుభవాలను నేరుగా ఇందులోకి నమోదు చేసుకోవచ్చు. ఆ తరువాత దానిని అవసరమైన వారు తెలుసుకుని ఆచరణలోకి పెట్టుకోవచ్చు. దీనికి ఈ సర్టిఫికేషన్ సంస్థ దృవీకరణలు ఆధారంగా కొనుగోలుదారులు, విక్రేతలు, రైతులు కూడా అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

అనూహ్యమైన పరిణామాలు – దారి తప్పిన లోపాలు ఉన్నాయా ?

ఇందుకోసం జనని మార్కెట్ ప్లేస్ వేదిక ప్రత్యేకమైన సాంకేతిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది. సాఫ్ట్ వేర్ రూపకల్పన, వాటి వాడుకకు తేలికైన విధానాలు అనుసరించింది. గత అనుభవాలను ప్రాతిపదికగా చేసుకుని కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. అందుకు అవసరమైన సలహాసూచనలను స్వీకరించేందుకు క్రమపద్ధతిలో ప్రయత్నించింది. లోటుపాట్లు గుర్తించి సరిదిద్దేందుకు కృషిచేసింది. అందుకు తగినట్లు సాఫ్ట్ వేర్ లో మార్పుచేర్పులు చేసింది. ఇదే విధానాన్ని క్షేత్ర స్థాయి అవసరాలకు విస్తరించింది. ఆ రకంగా క్షేత్ర స్థాయి లో కూడా గుణపాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే సాంకేతికత పొలాల్లో అనుసరించడం, ఆ క్రమంలో లోపాలు గుర్తించడం సాధ్యమవుతుంది.

ప్రస్తుతం మన ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యవస్థలన్నీ పారిశ్రామికీకరణ ప్రభావంలోనేే పనిచేస్తున్నాయి. అన్ని కార్యకలాపాలు కేంద్రీకృత స్థాయిలోనే జరుగుతుంటాయి. అయితే ఆహారం ఎక్కడో ఉత్పత్తి అవుతుంది. ప్రాసెస్ చేయడం కోసం దానిని మైళ్ల దూరం తరలించవలసి ఉంటుంది. అక్కడి నుంచి మార్కెట్ కు చేరేందుకు మరెన్నో మైళ్ల దూరం తరలించాల్సి ఉంటుంది. వినియోగదారులను చేరడానికి అనేక మైళ్ల దూరం సరఫరా కావలసి ఉంటుంది. కోవిడ్ 19 ప్రభావిత అంశాలు  బలహీనమైన ఈ ప్రక్రియకు పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.

ప్రత్యామ్నాయంగా వికేంద్రీకరణ దిశగా పునరుత్పాదనకు అనువుగా ఈ ప్రక్రియలు రూపాంతరం చెందడం అవసరం. జనని మార్కెట్ ప్లేస్ వేదిక ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రస్తుత సమాజం ఇలాంటి పునరుజ్జీవన ప్రక్రియల కోసమే ఎదురుచూస్తోంది. ఆహార సరఫరా వ్యవస్థ విభిన్న రూపాలలో శక్తివంతం కావాలి. ఇదే నేటి తక్షణ ఆవశ్యకత.

ఉషా దేవి వెంకటాచలం
ఫౌండర్ మరియు సీఈఓ
కృషి జనని పిబిసి
E-mail: team@krishijanani.org

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....