కోవిడ్ 19 కరోనా వైరస్ విజృంభిస్తున్న నేటి కాలంలో రోగనిరోధక శక్తికి ఇదివరలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేరళలోని సాధారణ పౌరులతో పాటు సామాన్య వ్యవసాయదారులు కూడా రోగనిరోధక శక్తి సాధనకు సురక్షితమైన ఆహారాన్ని ఇంటి పెరటి తోటల్లోనే సాగుచేసేందుకు రకరకాలుగా చొరవ తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసేవాటిని, పోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను తమ రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకుంటున్నారు.
ఇరవై ముప్పయ్ సంవత్సరాలుగా కేరళ రాష్ట్రంలో పట్టణ జీవన శైలితో వినియోగదారుల ఆలోచనల్లో మార్పులు శరవేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక పది పదిహైనేళ్లుగా మా సంస్థ థానాల్, ఇంకా మరి కొన్ని సంస్థలు సేంద్రీయ కూరగాయల ఉత్పత్తికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఫలితంగా పట్టణ వాసులలోనూ, ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చే వారిలోనూ కనీసం కొన్ని రకాల కూరగాయలనైనా తమ పెరటి స్థలాల్లోనే కాకుండా తాము నివసిస్తున్న ఇండ్ల పై కప్పల మీద పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో కొందరు తమ మిగులు ఉత్పత్తిని ఇరుగు పొరుగు వారికి, వారాంతప మార్కెట్లకు సరఫరా చేయగలుగుతున్నారు.
కోవిడ్ 19 – మారిన పోకడ
కోవిడ్ 19 కరోనా వైరస్ విజృంభణ, పర్యవసానంగా ఎక్కడపడితే అక్కడ విధించిన లాక్ డౌన్ పరిస్థితులు అనివార్యమైన కొన్ని మార్పులకు దారితీసాయి. లాక్ డౌన్ వంటి అనిశ్చిత పరిస్థితులను తట్టుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆహారం విషయంలో స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. అంటే రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినంత స్థానికంగా ఉత్పత్తి జరగాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కూరగాయలు, ఆహారంలో భాగమైన దుంపల సాగు విరివిగా సాగాలని కోరారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. వాసుకి కూడా ఆహారోత్పత్తి విషయంలో స్థానిక రైతులను, యువ కార్యకర్తలను విస్తృతంగా ప్రోత్సహించారు. గత మూడు నెలల కాలంలో సమగ్ర ఆహార భద్రత ప్రాజెక్టు ప్రేరణతో ఇంటి పెరళ్లలోనూ, నిరుపయోగంగా వదిలేసిన మెట్ట భూముల్లోనూ సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ప్రతి కుటుంబం కూడా కమ అవసరాలకు సరిపడా కూరగాయలను తామే స్వయంగా పండించుకోగలగాలి. అలాగే తమ అవసరాలకు తగినంతగా పశుసంపద పెంచుకోవాలి. ఈ ప్రయత్నంలో స్థానిక మీడియా సంస్థలు చురుగ్గా పాల్గొని ప్రజలను ప్రోత్సహించాయి. కూరగాయల పెంపకం, తోటల పెంపకం వంటి కార్యకలాపాలకు వ్యవసాయ శాఖ నుంచి విత్తన సరఫరా పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని రైతు సంఘాలు మరో అడుగు ముందుకేసి, అవసరమైన విత్తనాలను సరఫరా చేసాయి. వీటిని మామూలు వ్యవసాయ కార్యకలాపాలుగా పరిగణించకూడదు. కాని, అంత శ్రద్ధతోనూ, అవసరమైన ఎరువులు (గో పేడ ఆధారిత పొడి రూపంలోనివి), క్రిమిసంహారకాలు (ఔషధ మొక్కలు, వేప నూనె, కాంతారి చిల్లీ, వెల్లుల్లి, సోపు మిశ్రిత కషాయం రూపంలో) విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలను ఇరుగు పొరుగుతో కలిసి పంచుకున్నారు. ఇది లాక్ డౌన్ సమయంలోనే కాకుండా ఆ తరువాతి రోజులలో కూడా కొనసాగడం విశేషం. ఇప్పుడు ప్రజలు తమ పెరళ్లలో చైనీస్ బంగాళా దుంపలు, చేమ దుంపలు (కోలోకాసియా), కర్ర పెండలం (టపైకా), కంద దుంపలు (ఎలిఫెంట్ ఫుట్ యామ్) వంటివి పెరళ్లలోనే పండిస్తున్నారు.
చౌడు భూముల్లో ఆహార పదార్థాల ఉత్పత్తి
థానాల్ సంస్థ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో రైతుల ప్రయోజనాల కోసం వారితో కలిసి కృషి సాగిస్తోంది. ఇందు కోసం ప్రాజెక్టు ఫర్ ఫుడ్ స్కేప్ (ఆహార ఉత్పత్తి భూములు) రూపకల్పన కోసం గత ఏప్రిల్ లో చేపట్టింది. నిరుపయోగంగా వదిలేసిన భూములను ఆహార పదార్థాల ఉత్పత్తికి అనువుగా మార్చివేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం అవసరమైన నిధులను ప్రజల నుంచే సేకరించడం రైతుల చేతికి పంట వచ్చిన తరువాత తిరిగి వారికే ఆహార పదార్థాల రూపంలో తిరిగి అందించడం దీని ప్రత్యేకత.
ఈ లక్ష్యం సాధించేందుకు రైతులకు, ఆసక్తి గల యువతకు అవసరమైన ముడి సరుకులు అంటే విత్తనాలు, బయో మాన్యువర్స్, చీడపీడల నివారణకు అవసరమైన శిక్షణ ఇవ్వడం, అందుకు పర్యావరణ అనుకూల సేద్య పద్ధతులనే అనుసరించేలా ప్రోత్సహించడం ప్రధానమైన అంశాలు. ఇప్పటి వరకు అంటే ఈ రెండు నెలల కాలంలో 800 మంది రైతులకు ఈ రకంగా అవసరమైన ముడి సరుకులు అందించడం సాధ్యమైంది. సేంద్రీయ సేద్య విధానాలపై శిక్షణ ఇవ్వగలిగారు. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని అట్టప్పడి (పాలక్కాడ్ జిల్లా), నారనమూజి (పట్టణంతిట్ట జిల్లా) గ్రామాలలోని గిరిజన తెగ వారిని కూడా భాగస్వాములుగా ప్రయోజనం పొందారు. ఈ జిల్లాల్లో గత 20-30 సంవత్సరాల కాలంలో ఆహార ఉత్పత్తి దారుణంగా క్షీణించిపోయింది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.
అట్టప్పడి పరిసరాలలోని 19 గ్రామాలలో 2019 నుంచి ఇది అమలవుతోంది. పర్యావరణ అనుకూల సేద్యం ద్వారా పోషక సమృద్ధి సాధన అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టి అమలుచేస్తున్నారు. దీనిని అమలుచేయడంలోో రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ శాఖ నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. ఈ ప్రాంతంలో పంచ కృషి పేరుతో సంప్రదాయకంగా అమలులో ఉన్న వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడం దీని లక్ష్యం. ఈ ప్రయత్నానికి రైతులలోని వయో వృద్ధులైన స్త్రీ పురుషులందరూ తమ మద్దతు తెలిపారు. ఉత్సాహం చూపించారు. ఈ పంచ కృషి విధానంలో చిరుధాన్యాలను పండించడం ప్రధానమైన అంశం. సరైన జీవనోపాధి లేని విద్యావంతులైన యువతకు ఇందులో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. వారిలో కొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. పంచ కృషి సేద్య విధానంతో పాటు పర్యావరణ అనుకూల సేద్య విధానాలపై కూడా వారు అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపించారు. దేశీయ విత్తనాలను, వృద్ధుల అనుభవాల ఆధారంగా సంప్రదాయక సేద్య విధానాలను సంరక్షించే లక్ష్యంతో వారు వెద్దె వల్లె (విత్తన ధాన్యాగారం) పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. తోటి రైతులకు తోడ్పడడమే దీని ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక ప్రకృతి సహజ సేద్య విధానాల గురించి అంతర్గత చర్చలలో వారు తెలుసుకున్నారు. ఈ విధానంపై వారంతా ఆసక్తి చూపించారు. దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. అయితే అనుకోకుండా ముంచుకొచ్చిన కోవిడ్ 19 పరిణామాలు పెద్ద అడ్డంకిగా నిలిచాయి. మొదటి సారి లాక్ డౌన్ సమయంలో కీలకమైన సభ్యులతో విస్తృతంగా చర్చలు సాగించాం. లాక్ డౌన్ తొలగింపు తరువాత, ప్రాజెక్టు ఫుడ్ స్కేప్ (ఆహార ఉత్పత్తి భూములు) ప్రాజెక్టు చేపట్టాం. దేశీయ సేద్య విధానాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రాముఖ్యాన్ని గుర్తించిన చాలా మంది రైతులు తమ మద్దతు తెలిపారు. అయితే ఆర్థిక వనరులు సమస్యగా మారింది. ప్రారంభంలో ఎకరాకు కనీసం రూ. 5000 / అవసరమని వారు అంచనా వేశారు. థానాల్ సంస్థ చొరవ తీసుకుని అవసరమైన నిధులు సేకరించింది. హితులు, వినియోగదారులు తమ వంతు చేయూత అందించారు. వారు అందించిన ఆర్థిక సహాయాన్ని ధాన్యరూపంలో కానీ, పప్పు ధాన్యాల రూపంలో కానీ, కూరగాయల రూపంలో గానీ తిరిగి చెల్లించేందుకు అవగాహన కుదిరింది. అయితే చాలా మంది తమకు బదులు తీర్చవలసిన అవసరం లేదని సహృదయం చాటుకున్నారు.
థానాల్ స్ఫూర్తితో సేంద్రీయ కూరల పెంపకం
మొట్టమొదట 2001లో తిండివనం జిల్లా (తమిళనాడు) లోని రెండు గ్రామాలలోని రైతులతో కలిసి మేము పనిచేయడం ప్రారంభించాం. సేంద్రీయ పద్ధతులలో సేద్యం చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా కేరళలోని కోవలం ప్రాంతంలో ఉన్న మహిళా రైతుల సాయంతో చేపట్టాం. అప్పట్లో కేరళలో క్రిమిసంహారకాల వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండేది. ముఖ్యంగా ఎండోసల్ఫాన్ పరిణామాలపై థానాల్ సంస్థ అక్కడి రైతులకు పూర్తి అవగాహన కల్పించింది. ఈ సమయంలోనే రసాయనిక క్రిమి సంహారకాల అవసరం లేకుండానే సేద్యం చేయవచ్చని నిర్ధారణ అయింది. ఆహారోత్పత్తి, స్వయంసమృద్ధి అంశాలపై శాస్త్రవేత్తలలో విస్తృతంగా అధ్యయనాలు జరిగేవి. కేరళలో రైతులంతా చిన్న కమతాల యజమానులే. అందువల్ల ఈ లక్ష్యాలు సాధించేందుకు చిన్న కమతాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించడం కష్టంగా ఉండేది. అయినా అలాంటి చిన్న చిన్న కమతాలలో ఏ మేరకు దిగుబడులు సాధించవచ్చనేది అధ్యయనాలలో కీలకమైన అంశంగా ఉండేది. కూరగాయల సాగు వల్ల సమృద్ధిగా దిగుబడి సాధించవచ్చునని గుర్తించడం జరిగింది. కేరళ రాష్ట్రంలో వాతావరణపరంగా సానుకూలతలు ఎక్కువే. అంతేకాక, భూసారం కూడా మెరుగ్గా ఉంటుంది. అందువల్ల పండ్లు, కూరగాయల సాగుకు ఇది అన్ని విధాలా అనుకూలమేనని నిర్ధారణ అయింది. అధ్యయనాలను ఆధారం చేసుకుని చిన్న కమతాలున్న మహిళా రైతులతో మూడు స్వయసంసహాయక బృందాల ఏర్పాటయ్యాయి. ఏడాది కాలంలోనే వారు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఫలితాలు గమనించిన తరువాత అక్కడి పంచాయతీ అధికారులు థానాల్ నిర్వాహకులను ఆహ్వానించారు. ముఖ్యంగా సేంద్రీయ పద్ధతులలో కూరగాయలను, అరటి తోటలను పెంచడంపై వారు థానాల్ మార్గదర్శకం కోరారు. ఆ తరువాత మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లడం సాధ్యమైంది.
థానాల్ బృందం సహాయంతో రైతులు భూమిని దుక్కిదున్ని పదును చేసి సిద్ధం చేశారు. కొంత భూమిని వారు కౌలుకు కూడా తీసుకున్నారు. సేంద్రీయ పద్ధతిలో సేద్యం మొదలుపెట్టారు. ఇతర రైతులకు కూడా వారు తమ వంతు చేయూత అందించారు. ఇందులో భాగంగా రైతులకు పూర్తి అవగాహన ఇచ్చేందుకు ఆన్ లైన్ లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల్లో చీడ పీడల నివారణ, జీవసంబంధ (బయో) ఎరువుల తయారీపై అవగాహన కల్పించేందుకు ఆరు సెషన్ల నిడివితో శిక్షణ ఇచ్చారు. అదే విధంగా ఇతర సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఆన్ లైన్ శిక్షణ తరగతుల నిర్వహణలో కూడా థానాల్ తోడ్పడింది. ఈ తరగతుల్లో ప్రకృతి సహజసిద్ధంగా సేద్యం చేయడంపై అవగాహన కల్పించడం సాధ్యమైంది.
పత్తనంతిట్ట జిల్లాలోని గిరిజనులు ఉపాధి కోసం వేరు చోట్లకూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ 19 కారణంగా ఎక్కడా వారికి ఉపాధి లభించలేదు. ఈ స్థితిలో 480 మంది సేద్యం మొదలుపెట్టారు. 13 రకాలైన కూరగాయల పెంపకం చేపట్టారు. సేంద్రీయ పద్ధతులనే అనుసరించారు. వారికి ముందుగానే ఆయా అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు. అయితే ఆ సమయంలోనే భారీ వర్షాలు కురవడంతో చాలా మంది సేద్యంలో కొనసాగలేకపోయారు. అయితే ఇప్పుడు వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సామాజిక వంటశాలలు
స్థానికంగానే ఆహారం తగినంతగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో చాలా పంచాయతీలు సామాజిక వంటశాలలను ఏర్పాటు చేసి ఆకలి కేకలు వినిపించకుండా అడ్డుకోగలిగారు. త్రివేండ్రం డిల్లా కరక్కుళం పంచాయతీలో ఇలాంటి సామాజిక వంటశాల మొట్టమొదట ఏర్పాటైంది. ఇది నగరానికి చేరువగానే ఉన్నా చాలా మంది చిన్న, మధ్యకారు రైతు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ కృషిలో పంచాయతీ నుంచి పూర్తి మద్దతు లభించింది.
దాదాపు 130 మంది రైతులకు, వారిలో మహిళలే అధికం, సేద్య పరికరాల కిట్ ఒక దానిని అందించాం. వాటిలో వేరు వేరు రకాల కూరగాయల విత్తనాలు ఉన్నాయి. ఇంకా బయో ఇన్ పుట్స్ కూడా తగినంతగా ఉన్నాయి. ముందుగా రెండు సార్లు వారికి శిక్షణ ఇచ్చారు. వాటి ఫలితంగా సేంద్రీయ సేద్యంలో భాగంగా కూరగాయల పెంపకానికి అనువుగా భూసారం పెంపొందించే ప్రక్రియలను వారు అవగాహన చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ప్రయాణాలపై ఉన్న ఆంక్షల కారణంగా, కొంతకాలం పాటు అప్పటికే నమోదు చేసుకున్న రైతులతో ముఖాముఖీ సంప్రదించే అవకాశం లేకపోయింది. అయినా సరే, వారు తమకు తాముగా ముందుకొచ్చి సేద్యం పనులు మొదలుపెట్టారు. ఆ సమయంలో రైతులకు సహాయపడేందుకు వీలుగా మొబైల్ ఆధారిత సేంద్రీయ సేద్య సలహా సంప్రదింపుల విధానాన్ని ప్రారంభించగలిగారు.
ఒక సవాలుగా – మా పెరట్లో తోటల పెంపకం
కోవిడ్ ప్రభావం వల్ల చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వారితో నేరుగా చర్చించే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. మా కార్యకర్తలు వారికి అవసరమైన సూచనలు, అవసరమైన పత్రాలు అందించడం కష్టమైంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో వారిలో సేంద్రీయ సేద్యం విషయంలో వారికి చేయూత అందలేదు. ఆ సమయంలోనే ఈ సరికొత్త పంథా – మా పెరట్లో తోటల పెంపకం – కార్యక్రమాన్ని వాట్సప్ బంృద రూపంలో ప్రారంభించడం జరిగింది. సేద్యానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా రైతుల సమస్యలు, చీడపీడల నివారణ విధానాలు, భూసారాన్ని కాపాడే విధానాలు, పరిమిత పొలంలో ప్రయోజనాలు పొందే మార్గాలు మొదలైనవి రైతులకు చేరువ చేయగలిగారు. ఇది వారికి చాలా ఆసక్తి కలిగించింది. ప్రతి ఒక్కరూ కూడా తమ విజయ గాథలను ఈ వాట్సప్ గ్రూపులోని ఇతర సభ్యులతో పంచుకోగలిగారు. ఇక్కడ రెండు ఉదాహరణలు గమనిద్దాం.
“కూరగాయల పెంపకం కోసం థానాల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను 12 ఏండ్ల కిందట భాగస్వామి అయ్యాను. గత ఏడాది నా మకాం మరో చోటికి మార్చిన తరువాత ఇంటి మిద్దెపై ముందుగా కూరల పెంపకం మొదలుపెట్టాను. థానాల్ సంస్థ నుంచి అందిన విత్తనాలను మా ఇరుగుపొరుగు వారితో కలిసి పంచుకున్నాను. వారిని కూడా ప్రోత్సహించాను. నా వరకు బెండకాయలు, మిరపకాయలు, వంకాయలు, బీరకాయలను సాగుచేశాను. ఇప్పుడు కూడా మేము విత్తనాలను, మొక్కలను పంచుకుంటున్నాము. పంట ఫలాన్ని కూడా కలిసి ఉపయోగించుకుంటున్నాము. మా మధ్య చక్కటి అనుబంధం ఏర్పడింది. కొంతవరకు ఇదివరకే వ్యవసాయ అనుభవం ఉన్నందున థానాల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ సహకారంతో జీవసంబంధిత క్రిమి సంహారకాలను, ఎరువులను తయారుచేయడంలో కూడా నైపుణ్యం సంపాదించుకున్నాను. ఆయన మంచి సలహాసూచనలు అందించేవారు. ఇప్పుడు మా పరిసరాలలో ఇతరులను కూడా భాగస్థులను చేసేందుకు థానాల్ మొబైల్ ఆధారిత సేద్య సలహా కేంద్రం సహాయంతో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. ముందుగా కోవిడ్ ప్రభావం అదుపులోకి రావాల్సి ఉంది. దాని కోసమే ఎదురుచూస్తున్నాం. అప్పుడే మేము పూర్తిగా స్వయంసమృద్ధి సాధించగలుగుతాము. ” అంటున్నారు కోవలం సమీపంలోని వెల్లార్ గ్రామానికి చెందిన ప్రమీల.
ఈ సందర్భంలో స్థానిక సేంద్రీయ మార్కెట్ మేనేజర్ దీపక్ ఈ విధంగా తమ అభిప్రాయాలు తెలియచేశారు. “మేము ఏడు మంది సభ్యులం ఒక బృందంగా ఏర్పడ్డాం. మాలాగే సేంద్రీయ సేద్యం చేస్తున్న తోటి రైతు దగ్గర నుండి ఒకటిన్నర ఎకరా భూమిని కౌలుకు తీసుకున్నాము. ‘వేనాడు సేంద్రీయ క్షేత్రాలు’ పేరుతో వ్యవసాయం పనులు ప్రారంభించాం. అరటి, అల్లం, పసుపు, తీపు బంగాళా దుంప, పెండలం (యామ్), చేమ దుంపలు (టారో) మాత్రమే కాకుండా టమేటా, మిర్చి, వంకాయ, కాకర కాయ, పొట్ల కాయ (ఐవీ గార్డు), గుమ్మడి కాయ, అనప కాయ వంటివి సాగు చేస్తున్నాం. ఇన్ పుట్స్ కోసం పెట్టుబడి అవసరం లేకుండా చేస్తున్న సాగు కారణంగా మేము స్వయంసమృద్ధికి చేరువ అయ్యాం. అంటే పొలం పనులను మేమే చేసుకుంటున్నాం. మొక్కల పెంపకం చేపడుతున్నాం. ఈ మొక్కలను పెరట్లో విత్తనాలు నాటి పెంచుకుంటున్నాం. బయో ఎరువులను, క్రిమిసంహారకాలనే తయారుచేసుకుంటున్నాము. మట్టి పాదులు చేయడంతో పాటు పొలంలోనే ఉన్న చెరువులో చేపల పెంపకం చేయగలుగుతున్నాం. దగ్గరలోని కాలువల నీటిని వినియోగించుకుంటూ పెండలం, చేమ, అరటి సాగు చేస్తున్నాం. వీటి మధ్యలోనే వంకాయ మొక్కలు, పసుపు, అల్లం, దోస కాయ మొక్కలను పెంచుతున్నాం. ఈ అంతర్ పంటల సాగు వల్ల క్రిమి నాశనం అదనపు ప్రయోజనంగా ఉంటుంది. ప్రస్తుతం సేంద్రీయ మార్కెట్లలో సమృద్ధిగా లేని అరటి పండ్లను, ఇతర కూరగాయలను పండించి స్వయంసమృద్ధి సాధించాలని ఆలోచిస్తున్నాం. మొక్కల పెంపకానికి అనుకూలమైన మట్టిని ఇతరులకు సరఫరా చేసి అంతో ఇంతో ఆదాయం కూడా సంపాదిస్తున్నాం. మేమంతా కూడా కనీసం ప్రతి రోజూ మూడు గంటల సేపు పొలం పనుల్లో పాల్గొనాలనే నియమం పెట్టుకున్నాం. ఇలా చేయడం వల్ల మా శారీరిక సామర్థ్యం కూడా మెరుగుపడుతోంది. ప్రకృతితో మమేకమై చేస్తున్న శ్రమ మాకు అదనంగా ఆరోగ్యం అందిస్తోంది. రోజంతా ఉత్సాహంగా ఉంటోంది. ”
కేరళలో ఇవాళ ఇది సర్వత్రా కనిపిస్తున్న మార్పు. రోగనిరోధక శక్తి ప్రాధాన్యం ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. పోషకాలతో కూడిన ఆహారం, పండ్లు, కూరగాయలపై వారిలో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఇక్కడి భౌగోళిక వాతావరణం కూడా ఇందుకు అనుకూలమైనదే కావడంతో కూరగాయల పెంపకం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ దాదాపు లక్ష ఎకరాల చౌడు భూములను గుర్తించింది. వాటిలో ఆహార పదార్థాలను సాగుచేయాలని సంకల్పించింది. ఇవాళ్టి రోజున చాలా మంది విద్యావంతులు, యువకులు ఈ “మా పెరటి తోటల పెంపకం” కార్యక్రమంపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అది మా బాధ్యత అని నుందుకు వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ పరిణామం.
ఉషా ఎస్. థానాల్, ఓడీ-3 జవహర్ నగర్, కౌడియార్ పి.ఓ తిరువనంతపురం - 695 003 కేరళ E-mail: ushathanal@gmail.com



