సౌర శక్తి ఆధారిత డ్రైయింగ్ ద్వారా అదనపు విలువ సాధన

మహిళా రైతుల సమిష్టి సామర్థ్యాన్ని గుర్తించేందుకు చేతికి అందివచ్చిన పంట ఫలానికి సౌరశక్తి సాయంతో డ్రైయింగ్ చేసే ప్రక్రియను జోడిస్తున్నారా లేదా అనే అంశం కీలకమవుతున్నది. ఇలా సౌర శక్తి సాయంతో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువలను సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇలా సౌరశక్తి ఆధారంగా డ్రైయింగ్ చేసే సదుపాయాలను వికేంద్రీకరించి మహిళా రైతులకు అందుబాటులోకి తీసుకురావడం  అవసరం. అలా చేయడం వల్లనే మార్కెట్ లో డిమాండ్ కు అవసరమైన తీరులో ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చవచ్చు. తద్వారా వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించడం సాధ్యమవుతుంది.  
 
పండ్లు, కూరగాయల వంటి వాటిని పండించడంలో మన దేశం అగ్రస్థానంలోనే ఉంది. ఈ విధంగా ఆహారయోగ్యమైన పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానం ఆక్రమించింది. అయినప్పటికీ దేశంలో పోషకాహార లోపం పెద్ద సమస్యగా నిలుస్తోంది. కారణం మార్కెట్ అవసరాలకు సరిపడేలా ఏడాది మొత్తం పండ్లు, కూరగాయలు దొరకడం లేదు. వేర్వేరు అంచనాలను బట్టి, తాజాగా మాత్రమే గిరాకీ ఉండే పండ్లు, కూరగాయలను పండిస్తున్న రైతులు దాదాపు 20 -  30 శాతం వరకు పంట సమృద్ధిగా చేతికి వచ్చినా, భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ రకంగా ఏటా తక్కువలో తక్కువగా రూ. 50,000 కోట్లు నష్టపోతున్నారని అంచనా. ధరల్లో విపరీతమైన మార్పులు, అవసరమైనప్పుడు లభించకపోవడం అన్న రెండు సమస్యలు ప్రధానంగా స్టోరేజి సదుపాయాలు తగినన్ని లేకపోవడం వల్లనే ఎదురవుతున్నాయి. స్టోరేజి చేయాలంటే వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయాలి. అంటే దిగుబడి చేతికి వచ్చిన క్షణం నుంచి వాటి నిల్వ కోసం ఉత్తమ పద్ధతులు అనుసరించాలి.
 
స్వల్పకాలం నిల్వ ఉండే పండ్లు, కూరగాయల వంటి వాటిని ఉత్పత్తి చేసే రైతులు నిత్యం అస్థిరమైన ధరలకే అమ్మివేసుకోవలసి ఉంటుంది.చాలా సార్లు ఉత్పత్తి ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. ఎందుకంటే ఉత్పత్తి చేసే రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రాసెసింగ్ / అదనపు విలువల కూర్పు వంటి బాధ్యతలు చేపట్టరు. వాటిని వాణిజ్య స్థాయిలో పనిచేసే సంస్థలకు వదిలేస్తుంటారు. ఇలాంటి సంస్థలకు రవాణా వ్యవస్థ, అవసరమైన వనరులు, కావల్సిన హంగులు పుష్కలంగా ఉంటాయి. వాటన్నిటినీ రైతులు సమకూర్చుకోలేరు. ఈ కారణంగా స్వల్పకాలిక మన్నిక గల ఉత్పత్తులకు చాలా తక్కువ ధరలకే రైతు అమ్మేసుకోవాల్సి వస్తుంది. అదనపు విలువలు సమకూర్చిన వాణిజ్య సంస్థ భారీ లాబాలు ఎగరేసుకుపోతూ ఉంటుంది.
 
వ్యవసాయ రంగం ద్వారా స్థిరమైన ఆదాయం లభించాలంటే రైతులు తమ ఉత్పత్తులకు అదనపు విలువలను సమకూర్చుకునే విధానాలు అవగాహన చేసుకుని పాటించేలా చేయడం చాలా అవసరం. పంట దిగుబడులకు అదనపు విలువను సాధించే విషయంలో సౌర శక్తితో డ్రైయింగ్ చేయడం అలవర్చుకోవాలి. అంటే పంట చేతికి వచ్చిన తరువాత ఫలసాయాన్ని మార్కెట్ అవసరాలకు తగినట్లుగా అదనపు విలువలను జోడించగలగాలి. ఈ సదుపాయాన్ని రైతులకు తమ తమ ఆవాసాలకు చేరువగా వికేంద్రీకరణ పద్ధతిలో అందుబాటులో ఉండాలి. స్వల్ప వ్యవధిలో కుళ్లిపోయే అవకాశం ఉన్న ఆహార పదార్థాలలో ఉన్న నీటిని ఎండగట్టి ఎక్కువ కాలం మన్నేలా చేసేందుకు అవకాశాలు కల్పించాలి. అలా చేసినప్పుడే పండ్లు, కూరగాయల వంటివి రంగు చెడిపోకుండా, పోషకాలను కోల్పోకుండా ఆకర్షణీయంగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సమాజంలో జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది - అప్పటికప్పుడు వండేసుకునేందుకు వీలుగా ఉన్న వాటికే కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కారణంగా ఈ తరహా అదనపు విలువలున్న ఆహార పదార్ధాలకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ వాస్తవాన్ని పూణె సమీపంలోని ఉరులికాంచన్ ప్రాంతపు బెయిఫ్ (BAIF) కార్యాలయం రైతుల ప్రయోజనాల కోసమే సోలార్ శక్తితో పండ్లు, కూరగాయలను ఎండబెట్టే ప్రక్రియను ప్రచారంలోకి తెచ్చింది.
 
బెయిఫ్ చేపట్టిన కార్యక్రమం
 
ఉరులికాంచన్ పరిసరాలలోని చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏడాది పొడవునా నికరమైన ఆదాయం తెచ్చిపెట్టే జీవనోపాధులను చూపించేందుకు బెయిఫ్ కృషిచేస్తోంది. ఈ ప్రాంతంలోని జనాభాలో అయిదో వంతు మంది దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారే. వారిలో చాలా మందికి ఉన్న భూవసతి కేవలం 4 ఎకరాలు మాత్రమే. సమీపంలో సాగు నీటి వనరులు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతానికి సాగు నీరు అంతగా అభివృద్ధి చెందలేదు.
 
పూణె పట్టణానికి చేరువలోనే ఉన్నప్పటికీ ఉరులికాంచన్ ప్రాంతం పూర్తిగా పట్టణ రూపం సంతరించుకోలేదు. ఇక్కడి రైతులు చాలా మంది ఆకు కూరలు, టొమాటో, ఉల్లి, చెరకు సాగుచేస్తుంటారు. సీజన్ అవసరాలకు తగినట్లు పంటలలో  మార్పులు ఉంటాయి. సరఫరా ఉంటుంది. అయితే కొన్నిటికి గిరాకీ స్థిరంగా ఉంటుండగా, మరి కొన్నింటికి సరఫరాతో సంబంధం లేకుండా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఉత్పత్తులను సక్రమంగా నిల్వచేసే వసతులు చాలా కొద్దిగా ఉన్నాయి. ఉన్న కొద్ది వసతులను వినియోగించుకోవాలంటే పెద్ద మొత్తాలే ఖర్చుచేయవలసి ఉంటుంది. అందువల్ల రైతులు పండించిన పంటలకు ఉత్పత్తి ఖర్చులకు కూడా లభించడం లేదు. పైగా ఈ ప్రాంతం జాతీయ రహదారికి చేరువుగా ఉండడమే కాకుండా చాలా హోటళ్లు, లేదా రెస్టారెంట్లు, లేదా ఆహార విక్రయశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి కొన్ని ఉత్ప్తత్తులు ఏడాది పొడవునా అవసరం ఉంటుంది. ఈ గిరాకీ స్థిరత్వం కారణంగా రైతులకు లభించే ధరలో కూడా తేడాలుంటున్నాయి. నిత్యం గిరాకీ ఉన్న ఉత్పత్తులపై బడా సంస్థల కన్ను పడింది. వారు అతి తక్కువ ధరలకు రైతుల వద్ద కొనుగోలు చేసి నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకుని భారీ లాభాలు గడిస్తున్నాయి. ఈ వాస్తవాలను గమనించిన తరువాత బెయిఫ్ సంస్థ సౌర శక్తి సాయంతో పండలను, కూరగాయలను డ్రైయింగ్ చేసి మార్కెట్ కు చేర్చే విషయంలో రైతులకు చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఉరులికాంచన్ సమీపంలో సౌలార్ డ్రైయింగ్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది.
 
తొలి దశలో ఒక్కో రైతు లేదా భాగస్వామ్య బృందానికి ఒక డ్రైయింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. సాంకితిక అంశాలను వ్యాప్తి చేసే లక్ష్యంతో రకరకాలైన పద్ధతులను ప్రవేశపెట్టారు. రైతులకు నికరంగా ఏడాది పొడవునా ఆదాయం వచ్చే మార్గాలలో ఇలాంటి యూనిట్ ఏర్పాటు ఒకటి. అందులో సూర్యుడి నుంచి వెలువడే (అల్ట్రా వైలట్ రేస్ ) అతినీలలోహిత  కిరణాలను ఉపయోగించి పండ్లు, కూరగాయల వంటి సహజసిద్ధమైన రంగు, రూపు, సహజస్వభావాలు చెడకుండా ఎండబెట్టవచ్చు. వీటినే నేరుగా సూర్య కిరణాల కింద ఎండబెడితే ఈ రంగు, రూపు, సహజత్వం నిలిచి ఉండదు. చెడిపోతుంది. అందుకే ఈ పద్ధతిలో డ్రై చేసిన వాటి గురించి స్థానికంగా ఇలా చెప్పుకుంటారు. తాజాగా సదా … స్వాదిష్ హమేశా (నిత్యం తాజాగా ఉండడమే కాక రుచిగా కూడా)
 
 
ఈ విధానంలోని ముఖ్యమైన విషయం ఏమిటంటే - మహిళలు తమ ఇండ్లలోనే పనిచేస్తూ, కలిసికట్టుగా తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడం.
 
ఈ లక్ష్యం సాధించే దిశగా మహిళా బృందాలు ఏర్పడ్డాయి. ఇండ్లలోనే ఉంటూ తమ ఉత్పత్తులను డ్రైయింగ్ చేయడం, నాణ్యతాపరంగా వేరుచేయడం, ప్యాకేజీలు కట్టడం, మార్కెట్ కు సిద్ధం  చేయడం వంటి విధులు చేపట్టవలసి ఉంటుంది.  ఈ విధానం అనుసరిస్తే మహిళలు తమ ఇండ్లలోనే ఉంటూ కూడా కలిసికట్టుగా పనిచేసి తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ విధానం అనుసరించవలసిన క్రమం ఇలా ఉంటుంది.
 
1. స్థానికంగా లభించే బి / సి నాణ్యత ఉన్న చౌక కూరగాయలను, లేదా తమ సొంత ఉత్పత్తులను సేకరించి పెట్టుకోవడం.
 
2. వాటిని వండుకునేందుకు వీలుగా తరిగి ముక్కలుగా చేయడం, అవసరమైన వాటిని పొడి లేదా ముద్ద రూపంలోకి మార్చడం, సరైన రీతిలో ప్యాకింగ్ చేయడం వంటివి చేయాలి. అలా చేసే సమయంలో పూర్తిగా శుభ్రత పాటించాలి. తేమలేని వాతావరణంలో పూర్తిచేయాలి.
 
3. మార్కెట్ వర్గాలతో అనుసంధానం ఏర్పాటుచేసుకోవడం, అంటే సేకరణ సంస్థలు, స్థానిక మార్కెట్ వర్గాలు, ఆహార పదార్థాల విక్రేతలతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకోవడం అవసరం.
 
ఇలా సౌర శక్తితో డ్రైయింగ్ ప్రక్రియలో టొమేటో, అల్లం, ఉల్లి, అవసరమైన సందర్భాలలో వాటిని తియ్యటి రుచి కల్పించేందుకు స్టీవియా అనే సహజ తీపి పదార్థం చేర్చడం, ములగ కాడలు / ఆకులు, బచ్చలి, మెంతి కూర వంటి ఆకు కూరలు ఉపయోగించవచ్చు. నేరుగా తినివేయడానికి వీలుగా ఇన్ స్టంట్ ఆహార పదార్థాలు - ఎండబెట్టిన సపోటా (చిక్కు) చిప్స్, మహారాష్ట్ర్రలో వాడుకలో ఉండే రెడీమేడ్ పూరన్ చపాతీలు,  ఇన్ స్టంట్ పాలక్, మెంతి పరోటా, బీట్ రూట్ పౌడర్ వంటివి కూడా తయారుచేయవచ్చు. ఇలా డ్రైయింగ్ చేయడానికి అవసరమైన ముడి దినుసులను తాము స్వయంగా తయారుచేసుకోవచ్చు. లేదా స్థానికంగా ఉన్న ఇతర రైతుల నుంచి సేకరించవచ్చు. పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు వారు వచ్చి నాణ్యతను నిర్ధారించుకున్న తరువాత వారు చెప్పినట్లు ప్యాక్ చేయాలి. రిటైల్ ఆర్డర్లకైతే స్థానికంగా ఉండే సంకల్ప స్టోర్ లో అవి లభిస్తాయి. కుటుంబాల పరిధిలో సిద్ధంచేసి, బృందాల తరఫున సేకరించి మార్కెట్ కు చేర్చడం దీని ప్రధాన సూత్రం. ఈ సూత్రం ప్రకారం మహిళలు ఇండ్లలోనే ఉండి సమిష్టిగా ప్రయోజనాలు పొందవచ్చు. డిమాండ్ తగినట్లు సరుకు అందించవచ్చు.
 
ఇలా మహిళా రైతులు తమ ఇండ్లలోనే ఉండి సిద్ధం చేసిన ఉత్పాదనలను రెండు మాధ్యమాల ద్వారా మార్కెట్ కు చేర్చవచ్చు. సంకల్ప్ పేరుతో ఏర్పడి ఉన్న రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా అమ్ముకోవచ్చు. ఇంతకు ముందు బృందాలుగా ఏర్పడిన మహిళా సంఘాలు ఫెడరేషన్ లుగా రూపుదిద్దుకున్నాయి. వాటి ద్వారా వారు సొంతంగా వ్యాపార సంస్థ తరహాలో పనిచేస్తున్నారు. ఇవి 2013 నుంచి ఉరులికాంచన్ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాయి. ఈ ఫెడరేషన్ ద్వారా ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలను వారు వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ విక్రయ కేంద్రాల పేరే సంకల్ప్. ఇక మరో మాధ్యమం - టోకున అందే ఆర్డర్లకు సరఫరా చేయడం. ఈ ఫెడరేషన్ నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలన్నిటినీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. అవసరమైన చేయూత, శిక్షణ వంటి వాటిని బెయిఫ్ అందిస్తోంది. ప్రతిరోజూ డ్రైయింగ్ పని పూర్తి చేయడం, ఆ తరువాత డ్రైయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుకోవడం వాటిని సమకూర్చుకున్న వాళ్లే నిర్వహిస్తున్నారు. సోరాల్ డ్రైయింగ్ పరికరాలకున్న ప్రత్యేకత ఏమిటంటే వీటి నిర్వహణకు గాను ఏ కొంచం కూడా ఖర్చు చేయనక్కరలేదు. విద్యుత్ అనుసంధానం అంటూ ఏమీ ఉండదు. అందువల్ల వాటి నిర్వహణ చాలా తేలిక. సమస్య కూడా కాదు. చిన్న చిన్న మరమ్మతులు అవసరం కావచ్చు. ఒకొక్క సమయంలో పెను గాలులు వీచినప్పుడు అల్ట్రా వైలెట్ షీటు (యూవి షీటు) దెబ్బతినడం దృష్టికి వచ్చింది.
 
సోలార్ డ్రైయింగ్ యూనిట్ కు సంబంధించిన ముఖ్య అంశాలు
 
మార్కెట్ అవసరాలు, వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే 15 నుంచి 20 డ్రైయ్యర్లతో యూనిట్ ఏర్పాటు చేయాలి. ఒక్కో డ్రైయ్యర్ సామర్థ్యం 20 కిలోలు (అంటే 2m x 2m size) ఉండాలి. ఏడాది మొత్తంలో కనీసం 8 నుంచి 9 నెలల పాటు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి. స్థిరమైన మార్కెట్ అవకాశాలుంటే వాటికి తగినట్లుగా దిగువ తెలిపిన ఉత్పాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
 
1. టొమాటో. కాకరకాయ, బీర కాయ, దోస కాయ, గుమ్మడి కాయ వంటివి (డ్రైయింగ్ రేషియో 10 కిలోలను 1 కిలోగా చొప్పున ..వెట్ లోడింగ్ కెపాసిటీ - ఒక్కో బ్యాచ్ కి 15 కిలోలు)
 
2.  అల్లం, ఓక్రా, మిర్చి వంటివి (డ్రైయింగ్ రేషియో 6 కిలోలను 1 కిలోగా, వెట్ లోడింగ్ కెపాసిటీ - ఒక్కో బ్యాచ్ కు 10 కిలోలు)
 
3. బచ్చలి కూర, వేప ఆకులు, తులసీ ఆకులు, మునగ కాడలు వంటివి (డ్రైయింగ్ రేషియో 5 కిలోలను  కిలోగా - వెట్ లోడింగ్ కెపాసిటీ బ్యాచ్ కి 15 కిలోలు)
 
4. నానపెట్టిన మినప్పప్పు, మల్కీ గింజలు- (డ్రైయింగ్ రేషియో 1.5 కిలోలను 1 కిలోగా - వెట్ లోడింగ్ కెపాసిటీ బ్యాచ్ కి 15 కిలోలు)
 
విస్తరణ యత్నాలు
 
మన దేశంలో, ప్రత్యేకించి మహారాష్ట్రలో పూణె పరిసరాలలో ఉండే ఉష్ణ మండల వాతావరణం దీనిని అనుసరించేందుకు అన్ని విధాలా అనుకూలమైనది కూడా. సోలార్ డ్రైయర్ల సాయంతో ఇక్కడి వారు అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారుచేస్తున్నారు. మామూలుగా వ్యర్థ పదార్థాలుగా పారబోసే బీ లేదా సీ నాణ్యత కల కూరగాయలను సరైన పద్ధతిలో శుద్ధి చేసేందుకు ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం సోలార్ డ్రైయర్ ఏర్పాటుచేసుకున్న ప్రతి కుటుంబానికీ అదనంగా నెలకు రూ. 2500 నుంచి రూ. 3000 వరకు ఆదాయం లభిస్తోంది.
 
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల లభించే ఉపయోగాలు నిర్ధారణ కాగానే స్థానికంగా మరిన్ని యూనిట్లు ఏర్పాటుచేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 2018 – 19లో మరో 100 యూనిట్లు ఏర్పడ్డాయి. అందుకయ్యే ఖర్చులో 20 శాతం వరకు ఆసక్తి ఉన్న వారే సమకూర్చుకున్నారు. ఇతరత్రా కొంత సాయం అందుతున్నప్పటికీ నిర్వహణ ఖర్చులను మాత్రం గ్రూపు సభ్యులే స్వయంగా భరిస్తున్నారు.
 
ఇప్పుడు వారి ఉత్పత్తులు న్యూట్రిసోల్ బ్రాండ్ (ఈ పేరులోనే పోషక విలువలున్న అనే అర్థం స్ఫురిస్తున్నది) పేరుతో మార్కెట్ కు సరఫరా చేస్తున్నారు. పరిశుద్ధమైన వాతావరణంలో శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం, మార్కెట్ కు తరలించేడం వంటి విషయాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు పటిష్టమైన లింకేజీలను ఏర్పాటుచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది కాలంలో కనీసం 8 – 9 నెలల పాటు (గిరాకీ స్వల్పంగా ఉన్న సమయం మినహాయించి) దాదాపు 20 నుంచి 30 శాతం వరకు రిటర్న్స్ లభిస్తున్నాయి. చేపట్టిన ఉత్పత్తి తీరును బట్టి నిర్వహణ ప్రయోజనాలు ఏడాది నుంచి మూడేళ్ల వరకు లభిస్తున్నాయి.
 
ప్రకృతి సహజంగా లభించే సూర్య శక్తిని సద్వినియోగం చేసుకుంటూ ఆదాయం తెచ్చి పెట్టే ఈ విధానం ఆశాజనకంగా కనిపిస్తోంది. తక్కువ ఖర్చు అనేది మరో ప్రయోజనకరమైన అంశం. ఇది ధరలను నిర్ణయించడంలో చాలా ప్రభావం చూపిస్తోంది. అయితే కొన్ని సవాళ్లు, సమస్యలు తప్పవు. వర్షాకాలంలో వీటి నుంచి పూర్తి ప్రయోజనాలు లభించవు. నిజానికి ఆ సమయంలోనే కూరగాయలు అధికంగా అందుబాటులో ఉంటాయి. అలాగే మార్కెట్ ఇలాంటి ఎండబెట్టిన కూరగాయలకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ, మార్కెట్ శక్తులతో అనుసంధానం ఇంకా వృద్ధి చేయవలసి ఉన్నది. పైగా ఈ తరహా కార్యకలాపాలు మిగులును సరిగా ఉపయోగించుకోవడం (సర్ ప్లస్ యుటిలైేజేషన్) అన్న సూత్రంపై ఆధారపడింది. ఒకొక్కప్పుడు గిరాకీ ఎక్కువగా ఉండడం లేదా ఇతర కారణాల వల్ల గిరాకీ ప్రధానంగా తాజా కూరలు, పండ్లవైపే మొగ్గుతుంది. అలాంటప్పుడు సోలార్ డ్రైయింగ్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు లభ్యత సమస్య కావచ్చు. ఇప్పటికైతే ఆర్డర్ల ఆధారంగానే ఈ పరిశ్రమ ముందుకెడుతోంది.
 
ఇలా అనేక పరిమితులు ఉన్నా కూడా ఉష్ణ మండల ప్రాంతాలలో దీని ప్రయోజనం ఎక్కువే. ముడి సరుకు నికరంగా అందుబాటులో ఉంటే ఎంత అధిక డిమాండ్ కైనా సరఫరా చేయడం సాధ్యమే. ఈ రకమైన వికేంద్రీకృత ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తే మహిళల సాధికారికత మెరుగవుతుంది. వారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుటుంది. పర్యావరణానికి తోడ్పడుతుంది.
 
కృతజ్ఞతలు : ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వ అనుబంధ రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ సహకరిస్తోంది. విస్తరణ కార్యక్రమాలకు హెచ్ఎస్ బిసి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ (ఐ) ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తోంది. అమెరికాకు చెందిన ఎస్4ఎస్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన సోలార్ డ్రైయర్లు ఉపయోగపడుతున్నాయి.
 
 
రాకేశ్ కె. వారియర్
చీఫ్ ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్
E-mail: rakeshkwarrier@baif.org.in
 
మహేశ్ ఎన్ లాడే
సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్
E-mail: maheshlade@baif.org.in
 
బెయిఫ్ డెవలప్ మెంట్ రీసెర్చి ఫౌండేషన్
బెయిఫ్ భవన్, డాక్టర్ మణిభాయ్ దేశాయ్ నగర్
ఎన్ హెచ్ 4, వార్జే, పూణె - 411 058
 
 
 
 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....