పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం ద్వారా తుంకూరు ప్రాంతంలోని కూరగాయలను పండించే రైతులు అనేక రకాల ప్రయోజనాలు పొంగుతున్నారు. కూరగాయల సాగులో వారు స్థిరత్వాన్ని సాధించారు. అందుకు వారు అనుసరించిన ప్రధానమైన విధానంలో పంటల సాగులో వైవిధ్యం పాటించడం, తమ తమ పొలాల్లో చెట్లను కూడా విరివిగా పెంచడం గమనించవలసిన అంశాలు.
తుంకూరు జిల్లాలోని తుంకూరు, కొరటగెరె తాలూకా పరిధిలో ఉన్న ఉరిదిగెరె, కోలాల హొబ్లి గ్రామాలకు చెందిన రైతులు చాలా కాలంగా కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాలలోని రైతులలో దాదాపు 76 శాతం మందికి ఎకరా రెండెకరాల కమతాలు మాత్రమే ఉన్నాయి. సామాన్య స్థాయిలోని వీరంతా కూరగాయలనే పండిస్తుంటారు.
వారిలో చాలా మంది కూరగాయల సాగును వాణిజ్య పంటల తరహాలో చేపడుతుంటారు. టొమాటో, బీన్స్, వంకాయ, బెండ, బంగాళా దుంపలు, మిర్చి, కాలీ ఫ్లవర్ ఇంకా ఇతర ఆకు కూరలను సాగు చేస్తారు. మార్కెట్ అవసరాల కోసం సాగు చేపడుతున్న కారణంగా వారు అధిక మోతాదుల్లోనే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలను ఉపయోగిస్తుంటారు. సహజంగా ఇది వారి ఉత్పత్తి ఖర్చులను ఇబ్బడిముబ్బడి చేసేది. చాలా కాలం పాటు వారికి సేంద్రీయ సేద్యం గురించిన ఎలాంటి అవగాహన లేదు. వనరులను, ముఖ్యంగా భూసారం, నీటి వనరులను, పొదుపుగా వాడుకోవాలనే సూత్రం కూడా వారికి తెలియదు. ఉత్తమ సేద్య పద్ధతుల గురించి వారికి సరైన సమయంలో సరైన సలహా సూచనలు ఇచ్చే వారు ఎవ్వరూ లేరు. కనీసం రైతులు తమ అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు, ఒకరి నుంచి మరొకరు అనుభవ పాఠాలు నేర్చుకునేందుకు సరైన వేదికలు కూడా లేవు.
అయితే ఆ ప్రాంతంలోకి 2011లో ఆవిష్కార్ అనే అభివృద్ధి సహాయక సంస్థ అడుగు పెట్టింది. ఈ సంస్థ ప్రధానంగా మహిళల్లో సాధికారికత సాధించేందుకు, గ్రామస్థాయి వ్యవస్థల నిర్మాణం, వ్యవసాయంలో అభివృద్ధి సాధక కార్యకలాపాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆవిష్కార్ ప్రేరణతో తుంకూరు, కొరటగెరె తాలూకాలలో 157 స్వయంసహాయక బృందాలు, 20 వరకు రైతు సంఘాలు ఏర్పడ్డాయి.
అమెరికాకు చెందిన సేవ్ ఇండియన్ ఫార్మర్స్ అన్న అంతర్జాతీయ సంస్థతో 2017లో ఆవిష్కార్ చేతులు కలిపింది. సంయుక్తంగా ఈ సంస్థలు ఎస్ఐఎఫ్-సేంద్రీయ సేద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు కృషిచేసింది. వీరి ప్రోత్సాహంతోనే ఈ ప్రాంత రైతులు సేంద్రీయ వ్యవసాయం పాటించడం మొదలుపెట్టారు. 2017-18 సంవత్సరంలో 15 మంది రైతులకు, 2018-19 సంవత్సరంలో 17 మంది రైతులకు ఈ సంస్థల మద్దతు లభించింది. పర్యవసానంగా వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ఒక్కో గ్రామం నుంచి సేంద్రీయ సేద్యంపై ఆసక్తి ఉన్న ఇద్దరు ముగ్గురు రైతులను ఎంపిక చేసారు. ఇందుకోసం ప్రత్యేకంగా రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని, సేంద్రీయ సేద్యం విధానాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా దొడ్డబల్లాపురా ప్రాంతంలో ఉన్న శ్రీ నారాయణ రెడ్డి పొలాన్ని, హుంసూరు (మైసూరు జిల్లాలో)ని శ్రీ కోడి పాపన్న పొలాన్ని సందర్శించేందుకు రైతులను తీసుకెళ్లారు.
వర్మీ కంపోస్టు ఉపయోగించిన కారణంగా రైతుల వ్యవసాయ క్షేత్రాలు వానపాములకు సంపదగా మారాయి.
వివిధ రకాలైన సేంద్రీయ సేద్య ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పించేందుకు అసంఖ్యాకంగా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో వర్మీ కంపోస్టు తయారీ, వాడకం, చెట్లను ఆధారం చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటిపై రైతులను చైతన్యపరిచారు. ప్రారంభంలో 10 లేక 15 గుంటల పొలం భూమిలో సేంద్రీయ సాగును ప్రోత్సహించారు. ఆ కొద్దిపాటి జాగాలో టొమాటో, బీన్స్, వంకాయ, ఆకు కూరల సాగును ప్రోత్సహించారు. శుద్ధిచేసిన కంపోస్టును, జీవామృత, వర్మీ వాష్, వేప కేకు, ఆర్కా మౌక్రోబికల్ కన్సార్టియం గా వ్యవహరించే ఏఎంసీ పద్ధతి పాటించడం, ట్రిఖోడెర్మా, వేప సోపు, వేప నూనె, దశపర్ణి వంటి వాటి వినియోగాన్ని ప్రోత్సహించారు. జీవామృత, దశపర్ణి, శుద్ధిచేసిన కంపోస్టు తయారీ విధానాలు నేర్పించారు.
అదే సమయంలో సేంద్రీయ సేద్యానికి సంబంధించి నూతనంగా ఆవిష్కరించినసేంద్రీయ సేద్య విధానాలు వివరించారు. ఇందుకు గ్రామస్థాయిలో ప్రతీ నెలా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవి కాక హిరేకళ్లి లోని కృషి విజ్ఞాన్ కేంద్రానికి చెందిన నిపుణులు, ఇతర తోటల పెంపకం నిపుణులు ఈ సమావేశాలకు హాజరై రైతులకు సరైన అవగాహన కల్పించారు. అవసరమైన సాంకేతిక సహాయం అందించారు.
వర్మీ కంపోస్టు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు మద్దతు ఇచ్చారు. అందుకు అవసరమైన డ్రమ్స్ సరఫరా చేశారు. ఇంకా మొక్కల వ్యర్థాలతో క్రిమిసంహారకాలను, సోలార్ ట్రాప్స్ తయారీ, వాడకంలో శిక్షణ ఇచ్చారు. అవసరమైన శిక్షణతో పాటు వాటి ఉపయోగంపై ప్రదర్శనలు నిర్వహించారు. రైతులకు ఒక్కో ఎకరాకు 40 – 50 రకాల పండ్ల మొక్కలను, 70 – 80 రకాల అడవుల్లో పెరిగే మొక్కలను పంచిపెట్టారు. వీటితో పాటు పశువుల మేతగా ఉపయోగపడే సెస్బానియా, హెమతా రకాల పెంపకాన్ని ప్రోత్సహించారు. వీటిని పొలం గట్లపై పెంచాలని సూచించారు. పండ్ల చెట్లు, అడవి మొక్కలను కూడా గట్లపైనే పెంచాలని సూచించారు. కొన్నిటిని పొలం భూమిలో కూడా పెంచవచ్చునని సూచించారు. బహుళ పంటల సాగు, పంటల రొటేషన్ పద్ధతులను కూడా పాటించేట్లు ప్రోత్సహించారు.
సాధించిన ఫలితాలు
ఒక్కో రైతు ఒక్క ఎకరా భూమిలో ఈ పద్ధతి అనుసరించి కూరగాయలు సాగు చేశారు.
వంకాయ, కాకర కాయ, బీరకాయ, టొమాటో, బీన్స్ మొక్కలు పెంచారు.
శుద్ధిచేసిన కంపోస్టు,ద్రవరూప ఎరువు (జీవామృత) పచ్చని ఆకుల చెత్త, వర్మీ కంపోస్టు వాడిన తరువాత వారికి భూసారం ప్రాముఖ్యత అర్థమైంది. స్వయంగా విత్తనోత్పత్తి ప్రారంభించారు. వర్మీ కంపోస్టు తయారుచేసుకున్నారు. జీవామృత, కుళ్లిన చెత్త, చెదారం వంటివి వాడడం ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను సాధించారు.
అయిదుగురు రైతులు వర్మీ కంపోస్టు తయారీ బాధ్యత చేపట్టారు.
ఇప్పుడు అక్కడి రైతుల పంట పొలాలు వానపాములతో సుసంపన్నంగా మారిపోయాయి. దీనికి వర్మీ కంపోస్టు వాడకమే కారణం.
హార్స్ గ్రామ్ (ఉలవలు) గింజలు, కౌపీ (అలసందలు) గింజలు, వేప కేకు, జీవామృత పచ్చని ఆకులు అలములు వంటివి ఉపయోగించడం మొదలెట్టారు. ఫలితంగా భూసారం మెరుగయింది. మట్టిలో సేంద్రీయ కర్బన పోషకాల మోతాదు పెరిగింది.
ఇప్పుడు ఆ రైతులు ఎంతో ధీమాగా తమ పొలాల్లో భూసారం మెరుగైందని అంటున్నారు. శ్రీ వెంకటేశ్ (అలుమర్దపాళయ గ్రామం) తెలిపిన ప్రకారం ఆయన పొలంలో మట్టి మృదువుగా మారింది. నీిటి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచుకోగలుగుతోంది.
వారికి మిశ్రమ పంటల ప్రయోజనం అర్థమయింది. ఇంతకుముందు వరకు వాళ్లంతా ఏక పంట సాగుమీదనే దృష్టి పెట్టేవారు. పంటల మార్పిడి వాడుకలోకి వచ్చింది. పర్యావరణ అనుకూల విధానాలు ఐపిఎం, ఐఎన్ఎం వంటివి అనుసరిస్తున్నారు. వీటిని అనుసరించిన కారణంగా వారికి ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. వర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల కారణంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోయింది. అందువల్ల పొలంలోని మట్టి నుంచి వాతావరణంలోకి వెదజల్లే నత్రజని మోతాదు అదుపులోకి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఇది ఒక కారణం. ఇది అదుపులోకి రావడం మంచి విషయం.
ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ విధానానికి ఉన్న సుస్థిరత చెడకుండా మరింత మెరుగుపరచడం సాధ్యమైంది. అందుకు చెట్ల ఆధారిత సేద్యం అనుసరించడమే. అడవుల్లో మాత్రమే పెరిగే చెట్లను, పండ్ల చెట్ల పెంపకం పశువుల మేతకు ఉపయోగపడే వాటిని పెంచడం ద్వారా వారి పొలాల్లో వైవిధ్యం చోటు చేసుకుంది. రానున్న రోజులలో వారి వ్యవసాయ క్షేత్రాలను ఇతరులకు ప్రోత్సాహకంగా సందర్శనకు అనువుగా తయారయ్యాయి.
చిక్క నాగయ్య అనే రైతు తుంకూరు జిల్లాలోని దుర్గాడహళ్లి గ్రామానికి చెందినవాడు. ఆయనకు రెండు ఎకరాల పొలం ఉంది. ఆయన ఇతర పంటలతో పాటు కూరగాయలు కూడా పండిస్తాడు. వర్షాధార పొలం అయినందున కరువు కాలంలో సరైన దిగుబడి లభించేది కాదు. పొలంలో ఉన్న బోరు బావిలో భూగర్భ జలాల మట్టం దిగజారినప్పుడల్లా అవసరమైన స్థాయిలో నీరు అందించేది కాదు. ఇటీవలి సంవత్సరాలలో ఈ సమస్య చాలా సార్లు ఎదురయింది.ఆవిష్కార్ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి చిక్క నాగయ్య కూడా హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహణలో ఎస్ఐఎఫ్ సేంద్రీయ ఫార్మింగ్ ప్రాజెక్టు కూడా పాలు పంచుకుంది. నాగయ్య ఆకు కూరలుస బీన్స్, టొమాటో, మిర్చి, ఇతర చిన్న చిన్న తీగ మొక్కలను కుటుంబ అవసరాల కోసం సరిపడా సాగుచేసేవాడు. క్రమంగా మార్కెట్ అవసరాలకు వీలుగా సేంద్రీయ పద్ధతుల్లో బీన్స్, టొమాటో, వంకాయ సాగు ప్రారంభించాడు. తుంకూరులో ప్రతీ ఆదివారం జరిగే సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ లో ఆయన తాను పండించిన కూరగాయలను విక్రయించుకునేవాడు. ఈ రకంగా ఏటా ఆయనకు రూ. 25000 నుంచి రూ. 30000 వరకు ఆదాయం లభిస్తోంది. “ప్రతి వారం వెయ్యి రూపాయల లాభం వస్తోంది.” అని చాలా సంతోషంగా చెప్పాడు.ఆయన తన పొలంలో 60 నిమ్మ చెట్లను, 30 మునగ చెట్లను, 50 మెలియదుబియా చెట్లను పెంచుతున్నాడు. అవన్నీ ఇప్పుడు ఏపుగా పెరిగి ఆశావహంగా నిలుస్తున్నాయి. తాజాగా మరో 50 నిమ్మ చెట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిని 15 అడుగులు ఎడం ఉండేలా నాటాడు. సెస్బానియా చెట్ల ద్వారా ఆయనకు ఇప్పుడు పుష్కలంగా పశువుల మేత లభిస్తోంది. అందుబాటులో ఉన్న పశువుల మేత ప్రోత్సాహంతో రెండు గొర్రెలను కూడా కొనుగోలు చేశాడు. ఇంతవరకు ఇతరుల పొలాల్లో కూలీ పనికి వెడుతున్న ఆయన భార్య సొంత క్షేత్రంలోనే పూర్తి సమయం వినియోగిస్తున్నారు.
పృధ్వీ ఆర్గానిక్ ఫోరమ్ పేరుతో ఈ రైతులంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. నెలకోసారి సమావేశమై సేంద్రీయ సేద్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి వారు చర్చించుకుంటారు. కృషి విజ్ఞాన్ కేంద్ర శాస్త్రవేత్తలు, ఇకా ప్రగతిశీల సేంద్రీయ విధానం అనుసరిస్తున్న రైతులు, వ్్యవసాయ శాఖ అధికారులు ఈ సమావేశాల్లో పాలు పంచుకుంటారు. వారు రైతులకు అవసరమైన సలహా సూచనలు అందిస్తారు. త్వరలో ఈ ఫోరమ్ ను సేంద్రీయ ఉత్పత్తిదారుల కంపెనీగా రూపొందించే దిశగా కృషి జరుగుతోంది. ప్రస్తుతం రిజిస్టర్ చేసే క్రియ సాగుతోంది. అది పూర్తయితే మార్కెట్ అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ప్రస్తుతం తుంకూరులోని ఆర్గానిక్ విక్రయ కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. ఆదివారం రోజు తుంకూరులో సేంద్రీయ వ్యవసాయ దారుల కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటుకు వస్తూ ఉంటుంది. తుంకూరులో ప్రత్యేకంగా ఒక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆలోచనలున్నాయి.
సేంద్రీయ సేద్యం చేపట్టిన కొంత మంది రైతులకు నష్టం కలిగింది. అయితే రైతుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. అందుకోసం ముఖాముఖి సంప్రదింపుల పద్ధతిని నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రోత్సహించేందుకు, మార్గదర్శకం చూపేందుకు వ్యవసాయ రంగంలోని సంస్థలు కృషి చేస్తున్నాయి. వాతావరణ సవాళ్లను తట్టుకునే స్థితికి చేరిన ఇక్కడి పొలాలు వచ్చే 4-5 ఏండ్ల కాలంలో సస్యవంతంగా మారి ఆహార భద్రతకు, పశువుల మేతకు భరోసాగా మారనున్నాయి.
ఏ. ఆనందకుమార్
ప్రాజెక్టు డైరెక్టర్
ఆవిష్కార్, తుంకూరు
కర్నాటక
E-mail: avishkar2004@gmail.com



