డిజిటల్ మార్గం కొబ్బరి తోటల పెంపకంలో ఆచరణీయమైన ఆవిష్కరణ

చిన్న చిన్న తోటల పెంపకంలో వేర్వేరు ప్రాంతాలలోని రైతుల అనుభవాలను పోగుచేసి సమీకృత విధానం అందుబాటులోకి తీసుకువస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. చిన్న తోటల పెంపకం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి అనుభవాల సారాన్ని మరి కొన్ని ఇతర మార్గాల ద్వారా రైతులకు అందించడం అవసరం. ఈ బాధ్యతను ఐకార్ (ICAR) స్వీకరించింది. డిజిటల్ మాధ్యమాల సాయంతో ఈ విధానం రైతులకు అందించేందుకు ఐకార్ కృషిచేస్తోంది. 
 
సుమారుగా కోటి కుటుంబాలు తమ జీవనోపాధి మార్గంగా, పోషక విలువలున్న ఆహారో కోసం కొబ్బరి తోటల పెంపకం, కొబ్బరి ఉత్పత్తుల ఆధారిత సేద్యంపై ఆధారపడి జీవితాలను సాగిస్తున్నారు. చాలా మంది రైతులు తమకున్న కొద్దిపాటి కమతాలలోనే కొబ్బరి చెట్లు పెంచుకుంటున్నారు. వీటి పెంపకంలో చాలా వరకు కుటుంబ సభ్యుల శ్రమదానమే ఎక్కువగా ఉంటుంది. సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న కొద్ది మాత్రపు వనరులనే మళ్లీ వినియోగించుకునేందుకు అనుకూలమైన విధానాలనే వారు అనుసరిస్తున్నారు.
 
చాలా కుటుంబాలు తమకున్న కొద్దిస్థలంలోనే ఇల్లు కూడా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ చొబ్బరి చెట్ల పెంపకం చేపడుతుంటాయి. సాధారణంగా ఇలాంటి కొబ్బరి తోటల పెంపకంలో వారికి తరతరాల నుంచి లభించిన సంప్రదాయక విధానాలు, స్థానిక అలవాట్లు, స్వీయ అనుభవాల ద్వారా నేర్చిన పాఠాలే తోడ్పడుతుంటాయి. అయితే కొన్ని చోట్ల స్థానికంగా రూపు దిద్దుకునే కొత్త కొత్త పద్ధతులను పాటించేందుకు ఆసక్తి కనిపిస్తుంది. వారికి ఈ విషయంలో అవసరమైన సమాచారం, సలహా సూచనలు అందే మార్గాలు అనేక విధాలుగా ఉన్నాయి. అవన్నీ వారికి ఒకచోట అందడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విస్తరణ వ్యవస్థలు వారికి చేరడం లేదు.
 
సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం అలా సిద్ధం చేసిన సాంకేతిక విధానాన్ని చెట్ల పెంపకంలో పాటించేలా ప్రోత్సహించడం అంత సాదాసీదా విషయం కాదు. ఎప్పటికప్పుడు రైతుల నుంచి వాడుకంలో ఎదురవుతున్న సమస్యలను గురించి సమాచారం సేకరించాలి. సేకరించిన వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తూ ఉండాలి. అవసరమైన సందర్భాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలి. వాటిని సమీకృతం చేసి, రైతుల నైపుణ్యం పెంచేదిగా వారికి చేర్చాలి. ఈ కృషిలో డిజిటల్ సాంకేతికత ఒక మార్గంగా కనిపిస్తోంది. దీని సాయంతో పరస్పరం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా డిజిటల్ వేదిక సాయంతో రైతులతో జరుగుతున్న సంభాషణల జోరు (టెలి డెన్సిటీ) తమిళనాడు (115.62 శాతం), కేరళ (124.17 శాతం, కర్నాటక (109.57 శాతం), ఆంధ్రప్రదేశ్ (97.21 శాతం) రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. దీనిని గమనిస్తే మొబైల్ ఫోన్ ఆధారిత సమాచార వ్యాప్తికి ఉన్న అవకాశాలు గుర్తించవచ్చు.
 
తేలికైన ఈ – కల్ప యాప్ రూపకల్పన
 
డిజిటల్ నమూనాలో సమాచార వ్యాప్తి విధానంలో రైతులకు అవసరమైన సలహా సూచనలను చాలా తక్కువ సమయంలో సరైన సమయానికి అందించవచ్చు. ముఖ్యంగా చిన్న లేక సన్న కారు రైతులకు ఇలా మొబైల్ ఆధారిత సూచనల చేరవేత చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన సమాచారాన్ని సరైన సమయాంలో అందించవచ్చు. ఐకార్, సీపీసీఆర్ఐ సంయుక్తంగా ఇందుకోసం ఈ – కల్ప యాప్ ను తయారుచేశాయి. ఇది పూర్తిగా రైతులకు అనుకూలంగా ఉండడమే కాకుండా తేలికగా అనుసరించేలా ఉంది. ఈ యాప్ ద్వారా కొబ్బరి చెట్లు, కోకో చెట్లు, వక్క చెట్లు (అరెకా నట్) పెంపకంలో సలహాలు లభిస్తాయి.
 
నిజానికి ఈ రకంగా రైతులకు ఉపయోగకరమైన రీతిలో యాప్ ను తయారు చేయడం అనేది దీర్ఘకాలిక ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ముందుగా ఇలాంటి యాప్ తయారీ అవసరం గురించి, వాటికి రైతులు నుంచి వచ్చే స్పందన గురించి తెలుసుకునేందుకు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం జరిగింది. అలప్పూ జిల్లాలోని 750 మంది కొబ్బరి రైతులతో జరిపిన చర్చలను శాంపిల్స్ గా అధ్యయనం చేశారు. వారిలో 92 శాతం మంది దగ్గర అవసరమైన మొబైల్ ఫోన్ లు ఉన్నాయని గుర్తించారు. వారిలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే వాళ్లలో ఎవ్వరూ కూడా సమాచారం తెలుసుకునేందుకు తమ ఫోన్ ఉపయోగించడం లేదు. అలాంటి అవకాశం ఉందని కూడా చాలా మందికి తెలియదు.
 
మొత్తానికి 2016లో మొదటి దశ వెర్షన్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎక్కువ భాగం ఇంగ్లీషులోనే సూచనలు ఉన్నాయి. కేవలం 30 శాతం మలయాళం పదాలు లేదా సూచనలు అందులో చేర్చగలిగారు. ఆ తరువాత టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో చాలా మంది ఇటువంటి సమాచారం తమకు తేలికగా అర్థమయ్యే విధంగా మలయాళంలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కొంత మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, విస్తరణ అధికారులు కలిసికట్టుగా కృషిచేసి, సమాచారాన్ని విశ్లేషించడం, సమన్వయం చేయడం, నిర్దుష్టంగా సూచనలు అందేలా అనేక భాషలలో సరిచేయడం ద్వారా రైతులకు అనుకూలంగా ఉండే సలహా సూచనలతో యాప్ ను సిద్ధం చేశారు.
 
కొబ్బరి చెట్లు పెంపకం చేపట్టిన రైతులలో చాలా మంది చిన్న కమతాలున్నవారే. ముఖ్యంగా ఇండ్ల ఆవరణలోనే చెట్ల పెంపకం చేపట్టే రైతులు పరిమితమైన అవగాహన ఉన్నవారు. వారు అంతర పంటల సాగు గురించి, మిశ్రమ పంటల సాగు గురించి పశుపోషణ గురించి, చేపల పెంపకం గురించి చిన్న పాటి కౌంటర్ ల దగ్గర ఉన్న వారి సలహా సూచనలు పాటిస్తూ ఉంటారు. తమ తమ కుటుంబాల ఆర్థిక అవసరాలు, పోషకాహార అవసరాల కోసమే వారు పర్యావరణపరంగా అనుకూలమైన విధానాలు అనుసరిస్తుంటారు. పంటల సమాచారం పేరుతో 70 రకాల పంటలతో మిశ్రమ సాగు కు అవసరమైన గిరాకీ, ఆధారంగా వారు సాగు పనులు చేపడతారు. తరువాతి కాలంలో ఈ పంటల సమాచారంలో కొబ్బరి చెట్ల పెంపకం విషయాలు కూడా చేర్చడం జరిగింది. ఐకార్ - సీపీసిఆర్ఐ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం రైతులు ఎక్కువగా తమ పరిసరాలలోని ఇతర రైతుల అనుభవాలను తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.  రంగుల బొమ్మలతో కొద్దిపాటి వివరణలను తమ స్థానిక భాషలో తెలుసుకుంటూ, అనుసరించేందుకే వారు ఎక్కువ సుముఖంగా ఉన్నారు. సమాచారం సేకరించడం, అవసరమైన మార్పుచేర్పులు చేయడం, సరిదిద్దడం అన్నవి నిరంతరం కొనసాగించవలసిన ప్రక్రియలు. సాంకేతిక అంశాలను ఆచరణీయంగా ఉండేలా చూసుకోవాలి. విశ్వసనీయమైన సూచనలే అయి ఉండాలి. ఇదంతా ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి.
 
ఈ – కల్ప యాప్ ను ఆన్ లైన్ రూపంలో మాత్రమే లభిస్తున్నది. అయితే పూర్తిగా ఇంటర్ నెట్ పై ఆధారపడవలసిన అవసరం లేకుండా గ్రామ ప్రాంతాలలో ఉపయోగించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. దీనిని ఉపయోగించేందుకు అయ్యే ఖర్చును కూడా సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూశారు. అందుకోసం దీనిని ఆఫ్ లైన్ మోడ్ లో కూడా అందుబాటులో ఉంచారు. ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎక్కువ మంది ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా  (https://goo.gl/b3GTk0) ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ – కల్ప ప్రత్యేకతలు
 
ఈ – కల్ప యాపేకు సంబంధించిన ప్రత్యేకతలు ఇక్కడ గమనించవచ్చు.
 
ఎ. కొబ్బరి, వక్క, కోకో సాగుపై సాంకేతిక అంశాలు - మౌలిక సమాచారం
 
సాంకేతిక పరమైన అంశాలను నిపుణులైన శాస్త్రవేత్తల బృందం రూపొందిస్తుంది. వాటిని సాధ్యమైనంత వరకు అందరికీ అర్థమయ్యేటంత సరళంగా స్థానిక భాషలో అవసరమైన బొమ్మల సాయంతో సిద్ధం చేస్తారు. కొబ్బరి, వక్క, కోకో సాగు చేయడానికి అనువైన వివిధ రకాల గురించి, ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక అంశాలు, సస్య రక్షణ పద్ధతులు, సాగు విధానాలు, పంటకోత గురించిన సూచనలు, ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయి. వాటితో పాటు అవసరమైన యంత్ర పరికరాలు, ప్రాసెసింగ్ సమాచారం కూడా ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలలో లభిస్తాయి.
 
విభిన్న అంశాలపై పట్టు ఉన్న మరో బృందం ఈ సమాచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడల్లా, ముఖ్యంగా వాటిని ఉపయోగిస్తున్న రైతుల నుంచి లభించే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాటిని మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉంటుంది.
 
బి. కొబ్బరి సాగు విషయంలో వాడవలసిన ఇన్ పుట్ కొలతల క్యాలిక్యులేటర్ (సమాచారం)
 
కొబ్బరి చెట్ల పెంపకం కోసం కొన్ని దినుసులు (ఇన్ పుట్లు) ఉపయోగించకతప్పదు. అది వారి పొలం విస్తీర్ణత, అందులో పెంచుతున్న మొక్కల వయసు వంటివి ప్రధానమైనవి. ఈ క్యాలిక్యులేటర్ సహాయంతో ఏ మోతాదులో వాటిని వాడవచ్చునో సూచనలు అందుతాయి. అందుకు రైతు తాను పెంచుతున్న చెట్ల సంఖ్య, వాటి వయసు నమోదు చేస్తే చాలు ఒక్క క్లిక్ తో అవసరమైన సమాచారం లభిస్తుంది. (ఉదాహరణకు సేంద్రీయ ఎరువులు, డాల్ మైట్ / లైమ్, రసాయనిక ఎరువులు, కౌబీ గింజలను కుదుళ్ల పటిష్టతకు వాడాల్సి ఉంటుంది. వాటి మోతాదులు ఈ క్యాలిక్యులేటర్ సూచిస్తుంది. ఇలా ఒక్కో చెట్టు మోతాదుతో పాటు మొత్తం పొలంలో ఉన్న అన్ని చెట్లకు ఉపయోగించవలసిన మోతాదులను కూడా గమనించవచ్చు. ఎరువుల వాడకం సమయంలో గమనించవలసిన అంశాలను కూడా తెలియచేస్తుంది.
 
శ్రీమతి ఉషా గోపాలకృష్ణన్ కొట్టినట్టు నివాసి (కాయంకులం) తన అనుభవాలను ఈ విధంగా తెలిపారు. “ఈ క్యాలిక్యులేటర్ చాలా ఉపయోగకరమైనది. వాడడం కూడా చాలా తేలిక. చాలా సదుపాయంగా కనిపించింది. కొబ్బరి సాగు చేసే రైతులందరికీ ఇన్ పుట్ వాడకంలో కచ్ఛితమైన అంచనాలను దీని సాయంతో తెలుసుకోవచ్చు.”
 
సి. పంట సమాచారం
 
కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఇండ్ల వెనుక ఉండే కొద్దిపాటి ఆవరణల్లోనే ఇతర పంటలతో సమన్వయంతో చేపట్టడం సర్వసాధారణం. అందువల్ల ఈ తరహా సేద్యాన్ని వ్యవసాయ – అడవుల పెంపకం విధానంగా వ్యవహరిస్తారు. అందువల్ల చిన్న పాటి రైతులకు ఎప్పటికప్పుడు వివిధ పంటల విషయంలో అవసరమైన సమాచారం అందుతూ ఉండాలి. ఈ – కల్ప అటువంటి మౌలిక సమాచారం అందిజేస్తుంది. అవసరమైన కీలక సమాచారం కూడా ఇస్తుంది. సీజన్ ల వారీ పంటల సాగు, విత్తనాల రేట్లు, చెట్ల మధ్య ఉండాల్సిన దూరం, ఇంకా ఇతర పోషకాలపై సిఫార్సులను అందిస్తుంది. ఈ రకంగా 79 రకాల పంటలకు సంబంధించిన సమాచారం ఇందులో లభిస్తుంది. ఇది రైతులకు మాత్రమే కాకుండా ఇతర క్షేత్ర స్థాయి కార్యకర్తలకు, విస్తరణ అధికారులకు కూడా చాలా ఉపయోగకరం.
 
డి. సమస్యలు - పరిష్కారాలు అప్పటికప్పుడు
 
రైతులు తమ సమస్యలను వివరించిన కొన్ని క్షణాలలోనే నిపుణులైన శాస్త్రజ్ఞుల నుంచి పరిహారం సూచించేందుకు వీలైన ఇంటర్ ఆక్టివ్ ఫీచర్ ఇందులో ఉంది. తమ పొలంలో ఎదురయ్యే సమస్యలు గమనించిన వెంటనే ఈ ఫీచర్ ద్వారా తెలియజేస్తే అది ఒక సందేశం రూపంలో శాస్త్రవేత్తల బృందానికి చేరుతుంది. ఇదే విధంగా బొమ్మల రూపంలో లేదా వీడియో గా కూడా పంపవచ్చు. అందులోని అంశాలను పరిశీలించిన నిపుణులు పరిహారాన్ని కూడా వెంటనే తెలియజేస్తారు. నిపుణుల్లో ఐకార్ - సీపీసిఆర్ఐ కి చెందిన వారు ఉంటారు. రైతుల సందేశంతో పాటు వారి ఫోన్ నెంబర్ కూడా నమోదవుతుంది. అందువల్ల పరిష్కారాన్ని తిరికి ఆ ఫోన్ కే చేరుతుంది.
 
కొబ్బరి సాగుకు సంబంధించి ఈ – కల్ప తరహాలోనే యూ ట్యూబ్ లో కూడా ఐకార్ - సీపీసిఆర్ఐ నిపుణుల సలహా సూచనలు తెలుసుకునే సదుపాయం కూడా సిద్ధంగా ఉంది. ఇది కూడా అనేక భాషలలో లభిస్తుంది. ఇదే తరహా సదుపాయాన్ని వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా కూడా పొందవచ్చు.
 
విస్తృతి - వినియోగం - స్పందన తీరు
 
ప్రారంభంలో కేవలం వెయ్యి నుంచి 1600 మంది మాత్రమే ఈ యాప్ ను ఉపయోగించేందుకు ముందుకు వచ్చారు. ఇలా రెండేళ్లు సాగింది. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతున్నది. లాక్ డౌన్ సమయంలో దాదాపు 30 శాతం పెరుగుదల నమోదయింది. ఈ విషయంలో టెలిఫోన్ సాయంతో ఒక సర్వే జరిపారు. నాబార్డుతో పాటు ఐకార్- సీపీసిఆర్ఐ మద్దతు ఉన్న ఒడునాడు వ్యవసాయ ఉత్పత్తుల రైతు సంఘం ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రైతులు ఏ మేరకు డిజిటల్ సమాచారం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నరో తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ సర్వే పూర్తిగా నిరాశ మిగిల్చింది. ఏ ఒక్కరిలో పూర్తి ఉత్సాహం కనిపించలేదు. ముఖ్యంగా వయోవృద్ధులైన రైతులు, మహిళా రైతులు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత ఈ సంఘం ఆధ్వర్యంలో రైతులలో నైపుణ్యం పెంపొందించేందుకు కొన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది.  ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సప్, ఇంకా ఇతర మొబైల్ సాధనాలను, ఇంటర్ నెట్ తో అనుసంధానం అయ్యే మార్గాల ద్వారా వ్యవసాయానికి సంబంధించి లేదా వ్యవసాయదారుల నెట్ వర్క్ ను ఉపయోగించుకోవడంపై ఈ శిక్షణ కార్యక్రమాలలో రైతులకు మెళకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో రైతు ఒక్కరు మాత్రమే కాకుడంా ఆతని కుటుంబ సభ్యులందరికీ పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ డిజిటల్ సమాచారాన్ని తెలుసుకోవడంమే కాకుండా ఒకరికి మరొకరు వివరించేం అవకాశం కల్పించారు. యాప్ వాడకాన్ని మరింతగా విస్తరించే లక్ష్యంతో ఈ రైతు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలలోనూ, శిక్షణలోనూ, సమావేశాలలోనూ ప్రవేశపెట్టింది. ఫలితంగా ఇవాళ్టి రోజున 5000 మంది ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. వారిలో రైతులు, రైతుల ప్రశ్నలపై ఆసక్తి ఉన్న విస్తరణ అధికారులు తదితర భాగస్వామ్య పక్షాలకు చెందిన వారున్నారు.
 
రైతులకు ఆసక్తి కలిగించే అంశాలను గుర్తించేందుకు 2018లో ఒక అధ్యయనం జరిగింది. దాదాపు 93.20 శాతం మంది స్థానిక భాషలో సాగు సంబంధిత సమాచారం లేదా సాంకేతికత తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. సుమారు 84.4 శాతం మంది ఆఫ్ లైన్ మార్గం ఉపయోగించేందుకు, మరో 73 శాతం మంది నేరుగా శాస్త్రవేత్తలు లేదా నిపుణులతో సంప్రదించే సదుపాయానికి మద్దతు తెలిపారు. తక్షణ పరిష్కారాలు పొందే సదుపాయానికి 71.3 శాతం మంది, వేగవంతంగా సమాచారాన్ని తాజా చేసే విధానానికి 64.90 శాతం మద్దతిచ్చారు. మొత్తం మీద ఇన్ ఫ్ర్మేషన్ టెక్నాలజీ ఆధారిత పరికరాల వినియోగం విషయంలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే అంశానికి అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే స్త్ర, పురుషులలో వ్యత్యాసం గురించి ఇంకా లోతైన అధ్యయనం అవసరముంది.
 
వ్యవసాయ క్షేత్రం సందర్శిస్తూ అక్కడికక్కడ నుంచే వాస్తవ పరిస్థితులను కథనంగా అందించడం చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి, వక్క, కోకో వంటి పంటలకే కాకుండా ఇంకా ఇతర పంటల సమస్యలను కూడా అక్కడికి వెళ్లినప్పుడే తెలుసుకోగలము. సుమారు 80 నుంచి 85 శాతం కేసుల్లో అనేక కారణాలు వెలుగు చూశాయి. (ఉదాహరణకు ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, లేదా రైతులు గుర్తించలేని సమస్యలు (ఉదాహరణకు ఆకుల మూలాల వ్యాధి లేక రెడ్ పామ్ వీవిల్) వంటి సమస్యలు, ఇంకా నిర్ధారించేందుకు అవకాశం లేని (ఉదాహరణకు మైక్రో పోషకాల లోపం, భూసారానికి సంబంధించినవి) అంశాలు అక్కడికి వెళ్లితేనే గమనించడం సాధ్యమవుతుంది.
 
ఇంటర్ యాక్టివ్ యాప్ (రైతుల ప్రశ్నలకు తక్షణ పరిష్కారం అందించే వెసులుబాటు) రైతులకు మాత్రమే కాకుండా విస్తరణ అధికారులకు కూడా చాలా ఉపయోగకరం. ఈ క్రమంలో సమస్యల స్వరూపం, పరిష్కారం కూడా విశ్వసనీయమైనది అందుతుంది. 
 
ఈ యాప్ వల్ల రైతులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు ఇంటర్ యాక్టివ్ ఫీచర్ / ప్రక్రియ ద్వారా రైతులకు, విస్తరణాధికారులకు మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు దానికి విశ్వసనీయత కూడా లభిస్తుంది. పతియూర్ పంచాయతీకి (కేరళ) చెందిన శ్రీ జగదీశ్ కుమార్ కెటి సదన్, నివాసి కొబ్బరి సాగు చేస్తున్న యువకుడు.  ఆయన తన అభిప్రాయాలను ఈ విధంగా తెలియచేశారు. “సేద్యం అనేది కాలంతో పరుగులు తీయాల్సిన వ్యవహారం. అందుకు సరైన సమయానికి సరైన సలహా సూచనలు అందజేయగల ఈ – కల్ప యాప్ చాలా సదుపాయంగా ఉంటోంది. అవసరమైన సమాచారాన్ని స్థానిక భాషలలోనే అందిస్తోంది. సులభంగా తెలుసుకునే అవకాశాలున్న యాప్ సాయంతో అన్ని రకాల పంటల గురించి అంతర్ పంటలతో సహా ఉపయోగకరమైన సమాచారం అందిస్తుంది. కొబ్బరి చెట్లతో పాటు సాగు చేసేందుకు అవకాశాలున్న అన్ని పంటల సమాచారం తెలుసుకోవచ్చు. ముడి సరుకుల మోతాదుల గురించిన వివరాలు కూడా తెలుస్తాయి. ప్రతి రైతుకు ఆతని అవసరాలకు అనుకూలమైన సాంకేతిక సూచలు లభిస్తాయి. అందుకు అవసరమైన సందర్భాలలో బొమ్మల రూపంలో కూడా సలహా సూచనలు అందుతాయి.”
 
స్మార్ట్ ఫార్మ్స్ లో డిజిటల్ సేద్యం అవకాశాలు చాలా ఉన్నాయి. చిన్న కమతాలు స్మార్ట్ ఫార్మ్ లుగా రూపుదిద్దుకోవాలి. అవసరమైన ఆచరణీయ సమాచారాన్ని డిజిటల్ లేదా ఇతర అనుకూల వేదికల ద్వారా లభించేట్లు చూడడమే డిజిటల్ ఫార్మింగ్ ప్రత్యేకత. ఇది భవిష్యత్తులో అందరికీ అనుసరణీయం కాగలదు. ముఖ్యంగా వాతావరణపరమైన అస్పష్టతలు, మార్కెట్ పరమైన అసమానతలు ఎదురవుతున్న నేటి లేదా రేపటి అవసరాలకు ఇది చాలా అనువైనది. ఈ విషయం ఇటీవలి కాలంలో అనుభవపూర్వకంగా నిరూపణ అయింది. రైతులకు లేదా అవసరమైనవారికి అందుబాటులోనే ఉండే సదుపాయం ఇది. ఎంత మారుమూల ప్రదేశమైనా సరే ప్రస్తుతం దేశమంతటా వ్యాపించి ఉన్న కరోనా బెడద సమయంలో కూడా దీని ఉపయోగాలు అనేకం.
 
అయితే ఇది కూడా అనేక సవాళ్ల మధ్య ముందుకు సాగుతోంది. ఇంటర్ నెట్ లభ్యత నమ్మశక్యంగా లేదు. ఇది చాలా పెద్ద సమస్య. అలాగే రైతులతో ముఖాముఖీ సంప్రదించేందుకు, వారి సందేహాలకు పరిష్కారాలను కాలంతో పోటీపడి అందించడంలో ఎదురయ్యే స్వల్పవ్యవధి మరో పెద్ద సమస్యగా మారింది. అనేక భాషలలో అందించవలసి ఉన్నందున వాటిని సమన్వయపరచే ప్రక్రియ సమస్యాత్మకంగా మారింది. వీటికి సమాధానంగా వైఫై ఆధారిత కామన్ డిజిటల్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కొబ్బరి సాగు రంగంలో రైతుల ప్రయోజనాలు ముందుగా పెట్టుకుని అన్ని వర్గాల భాగస్వామ్య పక్షాలకు అనుకూలంగా సమాచార వ్యాప్తికి డిజిటల్ ఆధారిత వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 
అనితా కుమారి. పి
ప్రిన్సిపాల్ సైంటిస్టు (వ్యవసాయ విస్తరణ)
ఐకార్ సేంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీపిసీఆర్ఐ)
రీజనల్ స్టేషన్, కృష్ణపురం (పి.ఓ)
కాయంకులం - 690533

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....