పెద్ద చేపల పెంపకంపై ఝార్ఖండ్ రైతుల ఆసక్తి

చేపల పెంపకం (పిసీ కల్చర్) రైతుల పాలిట వరదాయినిగా మారుతోంది. మట్టిని నమ్ముకుని సాగు చేసే రైతన్నల జీవితాలలో కొత్త అధ్యాయానికి ఇది తోడ్పడుతోంది. దీనికి ప్రభుత్వపరంగా సహాయం అందుతున్న కారణంగా ఇది మరో జీవనోపాధిగా నిలుస్తోంది. 
ధనమనియా దేవీ తన జీవిత కాలంలో ఎన్నడూ తన ఆహారంలో మేలు రకం చేప రుచి చూసింది లేదు. “మా చిన్నతనంలో వర్షాకాలంలో నదుల నీటిలో కొట్టుకువచ్చే కొన్ని సాదా రకాలైన చేపల రుచి మాత్రమే మాకు తెలుసు. అది కూడా చాలా కొద్ది సార్లు మాత్రమే” అంటున్నది ఆమె. ఝార్ఖండ్ రాష్ట్రంలోని పలమావు జిల్లా సిల్దాగ్ ప్రాంతంలో నివసించే 65 ఏండ్ల ధనమనియా దేవి అనుభవం. అలాంటి మహిళ కుటుంబం గత ఏడాది వాణిజ్య ప్రాధాన్యత ఉన్న చేపల పెంపకాన్ని ఉపాధిగా చేపట్టిన తరువాత నుంచి ఈ కొత్త రుచులు ఆమె ఆహారంలో భాగమైపోయాయి. వాటి రుచి ఆమెకు ఎన్నో తియ్యని అనుభూతులను మిగిల్చాయి. ఈ చేపల విత్తులను కొనుగోలు చేసేందుకు స్థానికంగా ఉన్న స్వయంసహాయక బృందం ఆర్థిక సహాయం అందించింది.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని స్వయంసహాయక బృందాలు ఇటీవల కాలంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయి. స్థానిక పేద ప్రజల జీవితాలను పేదరికం కోరల నుంచి బయటపడెసేందుకు ఇది ఒక మార్గంగా అవి గుర్తించాయి. సిల్దాగ్ గ్రామంలోవర్షపాతం చాలా చక్కువ. అందువల్ల సేద్యం ఆశాజనకంగా ఉండడం లేదు. ఇక అక్కడ నివసించే క్రూర మృగాలు పంటలపై పడి వాటిని ఏటా నాశనం చేసేస్తుంటాయి. ఈ పరిస్థతిలో వ్యవసాయం ఏ మాత్రం లాభదాయకంగా లేదు.
పొరుగున ఉన్న బీహార్ లోని ప్రజల సంప్రదాయక ఉపాధుల్లో చేపల పెంపకం చాలా కీలకమైనది. ఝార్ఖండ్ లోని వాయువ్య ప్రాంతాలలో అంత ప్రాముఖ్యం చేపల పెంపకానికి తరతరాలుగా లేదు. వర్షాకాలంలో నదీ జలాల్లో కానీ, పల్లపు ప్రాంతాలకు ప్రవహించే వరద నీటి (అహారాలు) ప్రవాహంలో కానీ కొట్టుకువచ్చే కొన్ని సాధారణ చేపలు మాత్రమే ఎప్పుడైనా వారి ఆహారంలో చోటు సంపాదించుకుంటాయి.  చాలా చోట్ల ఈ రకంగా లభించే చేపలను పట్టుకునేందుకు ఫిషింగ్ లాన్స్, టైర్ ట్యూబులు లేదా తలుపు చెక్కల వంటి వాటిని ఆధారంగా చేసుకుని నీటిలో తేలియాడుతూ  చేపలను పట్టుకోవడమే నిత్యం అక్కడ కనిపిస్తుంది. చేపలను పట్టడానికి వలలను ఉపయోగించడం లేదా బోట్లను వాడడం వంటి వాటిని సంపన్నులకు మాత్రమే అనే అభిప్రాయం అక్కడ కనిపిస్తుంది.
ఇక అక్కడి భౌగోళిక స్థితిగతులు కూడా సవ్యంగా ఉండవు. వర్షపాతం అంతంత మాత్రమే. ఇసుక నేలలు కావడంతో నీరు నిలిచి ఉండే అవకాశం లేదు. నేలపై పడిన నీరు ఎక్కువ భాగం కొద్ది సమయంలోనే నేలలోనికే ఇంకిపోతూ ఉంటుంది. “ఈ కారణాల వల్ల చేపలు పట్టే అవకాశం ఏడాదిలో ఆరు నెలలే లభిస్తూ ఉంటుంది. అయినా కూడా అక్కడి ప్రజలు చేపలు పట్టడానికి ముందుకు వస్తున్నారు.  కారణం ఏడాది పొడవునా కష్టపడినా అందేది ఒకే పంట. చేపల పెంపకం ప్రత్యామ్నాయంగా మారింది.” అంటూ వివరించారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న ఆశ్రిత టిర్కీ ఆఫ్ వికాసం సహయోగ్ కేంద్ర (వి ఎస్ కే)అన్న ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధి. ఈ సంస్థ ప్రోద్బలంతోనే ఇప్పుడు అక్కడ చేపల పెంపకం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంలో మెచ్చుకోవల్సిన మరో అంశం ఏమిటంటే కొద్ది మంది నిరుపేద రైతులను వ్యక్తులుగా మాత్రమే కాకుండా వారిని సంఘటిత పరచి పెద్ద పెద్ద చెరువుల్లో భాగస్వామ్య పద్ధతిలో చేపల పెంపకం విస్తరిస్తోంది.
ఈ మార్పు వెనకాల రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ ప్రమేయం పుష్కలంగా ఉంది. శిక్షణ ఇవ్వడమే కాకుండా సబ్సిడీలనిచ్చి చేపల వలలను అందిస్తోంది. చేపలను విత్తులను సరఫరా చేస్తోంది. అదే విధంగా చేపలకు అవసరమైన ఆహారం కూడా సమకూరుస్తోంది. అంతేకాదు చేపల పెంపకందారులకు నెలవారీ మొబైల్ ఫోన్ రీఛార్జింగ్ సదుపాయం కూడా కల్పిస్తోంది. జీవిత బీమా సదుపాయం అందిస్తోంది. కొంతమందికి సొంత మోటారు సైకిళ్లు కొనుగోలు చేసేందుకు సాయం చేస్తోంది. రాష్ట్ర రాజధాని రాంచీకి చేరువలో ఉన్న శిక్షణ కేంద్రం అత్యుత్తమమైనదిగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందింది. “స్పందన అద్భుతంగా ఉంది. 250 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఏడాది కాలంలో 291 మంది శిక్షణ పొందారు.” అని తెలిపారు రాష్ట్ర మత్స్య శాఖ విస్తరణాధికారి రాన్ విజయ్.
ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది
నిలకడ లేని వర్షాల కారణంగా సాగు సాధ్యం కాదు. అలాంటి పరిస్థితులలో చేపల పెంపకం ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. ఫలితంగా ఇతర ప్రాంతాలకు వలసలు పోవల్సిన అవసరం క్రమంగా తగ్గిపోతున్నది. రాజ్ దేవ్
బైతా రిషియప్ప గ్రామానికి చెందిన వాడు. 12 సంవత్సరాల వయసులో వారణాసికి వలస పోయాడు. రిక్షా తొక్కడం దగ్గర నుంచి రైల్వే లైన్లను శుభ్రం చేయడం వరకు అనేక పనులు చేసి జీవించేవాడు. మధ్యలో రవాణా వాహనాన్ని నడిపే లైసెన్స్ సంపాదించిన తరువాత ముంబయికి చేరుకున్నాడు. జీవనపోరాటం సాగించేవాడు. ఇరవై ఏండ్ల తరువాత, 2011లో ఆయన స్వగ్రాం చేరుకున్నాడు. అప్పటికి ఆయన క్షయ కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. ఈ కారణంగానే వెనక్కి వచ్చేశాడు. అయితే ఆయనకున్న ఎకరా పొలం ఆశించిన ఫలసాయం అందించేది కాదు. రెడీమేడ్ ఆభరణాలను, ఇతర సౌందర్య సాధనాలను అమ్ముకుంటూ జీవనం ప్రారంభించాడు. అందుకోసం సైకిల్ మీద ఊళ్లు తిరిగేవాడు. ఇప్పటివరకు నగర జీవితానికి అలవాటు పడిన బైతా ప్రత్యామ్నాయ ఉపాధుల కోసం వెతక్కున్నాడు. ఆ దశలో చేపల పెంపకం గురించి తెలుసుకున్నాడు. రంగంలోకి దిగాడు. నిజానికి ఈ రంగంలో ఆయనకు అంతగా పూర్వ అనుభవం లేదు.
రాంచీ కేంద్రంలో ప్రభుత్వ అధికారులు ఇచ్చిన శిక్షణ ఆయనను నీలి ప్రపంచం (చేపల పెంపకం) వైపు నడిపించింది. “శిక్షణ సమయంలో కొంత మంది తమ అనుభవాలు చెబుతూ తాము ఎలా అదనపు ఆదాయం సాధించినదీ వివరించారు.  అందుకోసం వారు తమ వ్యవసాయ పొలాలను చేపల చెరువులుగా మార్చివేసినట్లు తెలిసింది.” ఆని ఇప్పుడు బైతా వివరిస్తున్నారు. అదృష్టవశాత్తూ వానలు పడినప్పుడు వరద నీటితో నిండిపోయే అయిదు ఎకరాల భూవసతి కూడా ఆయన కుటుంబానికి ఉన్నది. “దానిని చేపల పెంపకానికి అనువుగా మార్చివేసిన తరువాత మొదటి ఏడాది రూ. 70,000 మేరకు లాభాలు వచ్చాయి. అందుకోసం 7 క్వింటాళ్ల చేపలను ఆయన విక్రయించగలిగాడు.  తన కుటుంబంలోని పెద్దనాన్న, మేనమామ వంటి వారికి వారి వాటా ఇచ్చేసిన తరువాత ఆయన వాటాకు వచ్చిన లాభం ఇది. ఇది కాక ఒక క్వింటాల్ వరకు చేపలను కుటుంబం అవసరాలకే వినియోగించడం జరిగింది.” అని ఆయన గర్వంగా చెబుతున్నారు.
2015 నాటికి ఆయనకు వచ్చిన లాభాల మొత్తం లక్ష రూపాయలకు చేరింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సొంతంగా ఒక చెరువును సిద్ధం చేసుకుంటున్నాడు. “తనలాంటి వారు ఇప్పుడు కోళ్ల పారమ్ లకేసి వెళ్లడం లేదు. వాళ్లంతా చేపల పెంపకం వైపే ఆసక్తి చూపిస్తున్నారు. స్థానిక ప్రజల ఆసక్తి కూడా కోళ్ల వైపు కాకుండా చేపల వైపు మారిపోయింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే పెద్ద చేపలపై వారికి మోజు తగ్గిపోతోంది. అంటే స్థానికంగా పెంచే చెపలకు మార్కెట్ అనుకూలంగా మారింది. ఇప్పుడు మేము చేయవలసినది కేవలం అవసరానికి తగిన మేరకు చేపలను సరఫరా చేయడమే. ”అంటున్నారు బైతా. 2014-15 నాటికి ఝార్ఖండ్ లో చేపల ఉత్పత్తి కేవలం 80,000 మెట్రిక్ టన్నులుండేది. అయితే గిరాకీ మాత్రం 1.40 లక్షల టన్నుల వరకు ఉండేది.
బైతా చూపించిన శ్రద్ధా, సాధించిన ఫలితాలు గమనించిన తరువాత మత్స్య శాఖ అధికారులు ఆయనకు మోపెడ్ కొనుగోలుకు సబ్సిడీ మంజూరు చేశారు. ఇప్పడు ఆయన ఆ మోపెడ్ పై వెళ్లి చేరువలో ఉన్న ఛత్తర్ పూర్ మార్కెట్ లో మాత్రమే కాకుండా సమీప గ్రామాలలో కూడా తన సరుకు విక్రయిస్తున్నాడు. ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులయ్యారు. “ఇదివరలో నా అయిదుగు పిల్లల్లో ఎవరో ఒకరు నిత్యం అనారోగ్యంతో బాధపడేవారు. జ్వరం, జలుబు, మలేరియా ఇలా ఏదో ఒకటి పీడించేది. ఇప్పడు మా రోజు వారీ ఆహారంలో చేపలు చేరిన తరువాత వారి రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ” అని ఆయన అంటున్నారు.
చిన్న కమతాల్లో నర్సరీలు
లతేహర్ జిల్లా మనికా బ్లాక్ పల్హేయా పంచాయతీ పరిధిలో రైతులకు ఏ సమస్య వచ్చినా, పరిష్కారం కోసం సత్యేంద్ర కుమార్ సింగ్ నే ఆశ్రయిస్తారు. 33 ఏండ్ల వయసులో ఉన్న సత్యేంద్ర ఒక నర్సరీ నిర్వహిస్తున్నారు. ఆ నర్సరీలో పెంచుతున్న చేప పిల్లలను (21 రోజుల వయసు) స్థానికంగా ఉండే ఇతర రైతులకు సరఫరా చేస్తుంటాడు.
ఆయన నిర్వహిస్తున్న చేపల చెరువులు నిజానికి చాలా చిన్నవి. హెక్టార్ విస్తీర్ణంలో (రెండు చెరువులు – ఒక్కోక్కటి 70 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు) గట్టిగా 0.5 మీటర్ నుంచి 1.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్నవి. మూడు రోజుల వయసున్న స్పాన్ అందులో పెంచుతారు. వాటిని (60 రోజుల వ.సు వరకు) ఫ్రై లేదా ఫింగర్ లింగ్ స్థాయి వరకు పెంచడం జరుగుతుంది. వీటిని రైతులు కొనుగోలు చేసి పూర్తిగా పరిణితి చెందే వరకు పెంచుతారు.
సత్యేంద్ర సింగ్ చేపల పెంపకంపై తనకు ఆసక్తి ఎలా ఏర్పడిందో ఇలా వివరించారు. “నాకున్నది కేవలం 0.16 ఎకరా భూమి మాత్రమే. పంట కాలంలో మూడు క్వింటాళ్ల వరి మాత్రమే పండేది. చేతికి వచ్చే సొమ్ము రూ. 3000 మాత్రమే. నీటి కొరత కారణంగా రబీలో సాగు సాధ్యమయ్యేది కాదు. ఏవో చిన్న చిన్న పనులతో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది. ఖర్చులకు సరిపోయేది కాదు. నాలాంటి చిన్న కమతం ఉన్న రైతు చేపల పెంపకం చేపట్టవచ్చునా అని సందేహం ఉండేది. ” అయితే రాష్ట్ర మత్స్య శాఖ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో నాకు ఆశ రేకెత్తింది. అయితే చెరువులను ఏర్పాటు చేసేందుకు రూ. 40,000 అవసరం. అదృష్టవశాత్తూ, సత్యేంద్ర భార్య కమలా దేవి స్థానిక మహిలా స్వయంసహాయక బృందంలో సభ్యురాలు. అందువల్ల వారు కేవలం 2 శాతం వడ్డీపై 37,000 రుణసాయం లభించింది.
ఆ సొమ్ముతో చెరువులు సిద్ధమయ్యాయి. క్రిమికీటకాల బెడద తప్పించుకునేందుకు సున్నం ఉపయోగించారు. తొలి చినుకుల తరువాత జిల్లా మత్స్య శాఖ అధికారులను ఆశ్రయించగా, రూ. 3460 ఖర్చుతో 25 లభల స్పాన్ తెచ్చుకున్నాడు.
ఆ సమయంలో తన పొరుగున ఉన్న మరో 24 మంది చేపల పెంపకందారులతో కలిసి సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాడు. ముఖ్యంగా కొత్తగా తీసుకువచ్చిన చేపల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధుల నుంచి కాపాడుకోవడం, నీటిలో ఉండే ఖార ప్రభావం తగ్గించే సహజసిద్దమైన పరిహారాల వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు.
21 రోజులు గడిచేసరికి, స్పాన్ లు ఫ్రైలుగా మారినాయి. వాటిని వెయ్యి ఫ్రైలను రూ. 300 చొప్పున అమ్మవేయగలిగాడు. మొత్తం మీద 2.38 లక్షల ఫ్రై మార్కెట్ కు తరలించారు. ఫలితంగా వారు రూ. 74,400 ఆదాయం అందుకున్నారు. కేవలం నెలన్నర రోజులలో వారి చిన్న కమతం సమకూర్చిన ఆదాయం అది. మిగిలిన స్పాన్ లను మరొ 24 మంది రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మరో చెరువులలోకి మళ్లించారు. ఇలా సమష్టిగా చేపట్టిన చేపల పెంపకం ద్వారా పెరిగిన చేపలలో ఒక్కో రైతు వాటాకు 2 క్వింటాళ్ల వరకు చేపలు వచ్చాయి. సత్యేంద్ర తన వాటా 2 క్వింటాళ్లను కూడా మార్కెట్ కు చేరవేశాడు.
స్థానికంగా చేపలపెంపకం చేపట్టే వారికో ప్రయోజనకరమైన అంశం ఉంది. అది ఏమిటంటే వారు పెద్ద మొత్తాలు ఖర్చు చేసి, పశ్చిమ బెంగాల్ వ్యాపారుల నుంచి ఫ్రై సేకరించవలసిన అవసరం లేదు. నిజానికి ఇలా పశ్చిమ బెంగాల్ నుంచి ఫ్రై చేపలను రవాణా చేసే సమయంలో ఎక్కువ సంఖ్యలో అవి చనిపోతుంటాయి. “అవసరమైన నర్సరీలు స్థానికంగానే అందుబాటులో ఉన్నాయి. పెద్ద వాహనాలలో ఆక్సిజన్ పంపు ఉపయోగించి రవాణా చేయడం సులభతరం. ప్రత్యేకంగా అదనపు సౌకర్యాలున్న కంటైనర్ల అవసరం లేదు.” అంటున్నారు వి ఎస్ కె చేపల నిపుణుడు విద్యా భూషణ్ దత్తా.
చేపల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతో సత్యేంద్ర దంపతులు రుణం పూర్తిగా తీర్చివేశారు. జిల్లా స్థాయి అధికారుల సహకారంతో కొన్ని ప్రోత్సాహకాలు సంపాదించుకున్నారు. సొంతంగా సేపల వల కొనుక్కున్నారు. బీమా సదుపాయం సమకూర్చుకున్నారు. మొబైల్ ఫోన్ రీఛార్జింగ్ సదుపాయం అందుకున్నారు. వారిలో కనిపించిన పారిశ్రామిక ఉత్సాహానికి గుర్తింపుగా ఈ ప్రోత్సాహకాలు లభించాయి. అయితే ఒక సమస్య ఎదురైంది. అది రాష్ట్రంలో నాణ్యమైన హేచరీలు లేవు. హేచరీలలో కృత్రిమ పద్ధతుల్లో చేప గుడ్లను పొదగడం సాధ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్ నుంచి స్పాన్ దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఈ క్రమంలో చాలా వరకు చనిపోతున్నాయి. చనిపోయిన వాటికి కూడా రైతులు ధర చెల్లించక తప్పడం లేదు. అందువల్ల రైతులకు అందే చేపలు కేవలం 25 శాతం మాత్రమే సజీవంగా ఉంటున్నాయి. “ఏడాది మొత్తం నీటి వసతి లేకపోవడమే ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం. పైగా హైచరీలలో నిరంతరం 24 గంటల పాటు పర్యవేక్షణ తప్పనిసరి. అంతేకాకుండా చేపల గుడ్లు పెట్టడానికి అనువైన బ్రూడర్ చేపలు కూడా అవసరం. అలాంటి వాటిని ఇంకా స్థానికులు పెంచడం ప్రారంభించలేదు. ” అని తెలిపారు రాన్ విజయ్.
ప్రయోజనకరమైన ఉపాధి
ఝార్ఖండ్ రాష్ట్రంలో కేవలం మహిళలు, చిన్న కమతాల రైతులు మాత్రమే కాదు. కొంత మంది దివ్యాంగులు కూడా చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. దివ్యాంగులు అంటే సమాజంలో చిన్నచూపు ఉంది. గ్రామాల్లో ఇటువంటి ఆలోచనలు మరీ తీవ్రంగా ఉంటాయి. నిత్యం ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాలనుకుంటారు. అయితే అది పూర్తి నిజం కాదు. ఎందుకంటే 24 ఏండ్ల మిధున్ కుమార్ పాశ్వాన్ పోలియో కారణంగా ఎడమ చేయి పనిచేయదు. అయినా సరే ఆయన పదేండ్ల వయసు నుంచే పేపలు పట్టడంలో నైపుణ్యం సంపాదించుకున్నాడు.
మిధున్ కుటుంబానికి రెండు ఎకరాల అహారా భూవసతి ఉంది. ఉమ్మడి కుటుంబం అయినా వారంతా రిషియప్ప గ్రామంలోనే తమ పొలంలోనే బ్రూడర్ చేపల పెంపకం చేస్తున్నారు. ఈ ఉపాధి ద్వారా వారి ఆదాయం రూ. 10,000 నుంచి 15,000 మాత్రమే. అలాంటి స్థితిలో 2014లో ఆయన రాష్ట్ర మత్స్యశాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాంతో ఆయన జీవనగమనమే మారిపోయింది. “ఈ కార్యక్రమంలో నేర్చుకున్న మెళకువలతో ఆయన కుటుంబం మొదటి ఏడాదే రూ. 50,000 సంపాదించగిలిగింది. ఆ తరువాత మరె చెరువు సిద్ధం చేశాం. దీనికి మత్స్య శాఖ నుంచి ఆర్థిక వెసులబాటు తోడ్పడింది. ఇప్పుడు మాకు ఏటా రూ. లక్ష ఆదాయం వస్తోంది. ” అంటున్నారు మిధున్. సేద్యం చేయడం లేదా కూలీ పనులు చేయడం కన్నా ఇది తనకు మరింత అనుకూలంగా ఉన్నదని ఆయన తెలిపారు. “సరైన సమయంలో సరైన పని చేయడమే ఇందులోని కీలకమైన కిటుకు. చెరవులను సిద్ధం చేయడం, చేపలకు సరైన ఆహారం అందించడం, వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా ప్రధానం. ఇక చివరిగా వాటిని సేకరించడం మరో ఎత్తు. మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఈ ఉపాధిలో శారీరిక శ్రమ అంత అవసరం ఉండదు. ” అని ఆయన వివరించారు. కుటుంబం సంపాదించిన మొత్తం ఆదాయంలో కార్యభారం మోస్తున్న మిధున్ కు సగం వాటా లభిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఆయన నలుగురు సోదరులు సరిసమానంగా తీసుకుంటున్నారు. మిధున్ తన గ్రామంలోని మధ్యమ స్థాయి విద్యార్థులకు గణిత శాస్త్రం ఉపాధ్యాయుడిగా కూడా వ్యవహరించనున్నారు.
ఇప్పుడు ఆయన అంగవైకల్యం గురించి ఆయన గ్రామంలో ఎవరూ మాట్టాడడం లేదు. “గతంలో అందరూ చిన్నచూపు చూసినవాళ్లే. ఇప్పుడు వ్యాపారంలోనూ, విద్యాబోధనలోనూ నేను రాణింస్తుండడం అందరు గౌరవంగా చూస్తున్నారు. సానుభూతితో కాదు. ” అంటున్నారాయన.
నా ఇల్లే చిన్నారుల పాఠశాల
సీతారాం సింగ్ ఉమ్మడి కుటుంబంలోని వాడు. ఆ కుటుంబంలో ఏకంగా 40 మంది ఉన్నారు. వారికి ఉన్న జీవనాధారం కేవలం 20 ఎకరాల భూమి మాత్రమే. సాగుచేసిన పంట మొత్తం కుటుంబ అవసరాలకే సరిపోదు. మార్కెట్ కు తరలించే పంట దిగుబడి విలువ గట్టిగా రూ. 50,000 ఉంటుంది. అది కుటుంబంలోని విద్య, వైద్యం, ఇతర అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. చిన్నారులందరూ చదువులను అటక ఎక్కించినవారే. మాధ్యమిక స్థాయితో వారి చదువులు నిలిచిపోయాయి. అది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అయిదుగురు పిల్లలు సమీపంలోని జిల్లా కేంద్రం లతేహర్ లో ఉండి చదువుకుంటున్నారు. “ఇద్దరు కాలేజీ చదువులోనూ, ముగ్గురు పాఠశాలల్లోనూ చదువుతున్నారు. ఇటీవలి కాలంలోనే మూడు పెళ్లిళ్లను కూడా విజయవంతంగా పూర్తిచేశాం.” అంటున్నారు సీతారాం ఈ రోజన. ఇదంతా చేపల పెంపకం చేపట్టిన తరువాత వచ్చిన మార్పు.
రాష్ట మత్స్య శాఖ 2013లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీతారాం కూడా పాలు పంచుకున్నాడు. ఆ తరువాత స్వయంగా తన అహర్ భూమిలో బ్రీడర్ చేపల పెంపకం చేపట్టాడు. “చేపల ద్వారా లక్షన్నర రూపాయల వరకు ఆదాయం వస్తోంది. గత ఏడాదిలో సమీప గ్రామాలలోని అయిదు పెండ్లి కార్యక్రమాలకు చేపలు సరఫరాచేశాం. లతేహరం మార్కెట్లోని వ్యాపారులు ఇప్పటికే ఈ ఏడాది దిగుబడి మొత్తానికి ఆర్డర్లు బుక్ చేసేసుకున్నారు.” అని ఆయన తెలిపారు.
మరో మూడు చేపల చెరువుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అవసరమైన నీటిని భూగర్భ వనరుల నుంచి ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంట పొలంలోనుంచి సాగే కాల్వల నీటిలో కూడా స్పాన్ పెంచే అవకాశం ఉంది. అందుకు పొలానికి రెండు వైపులా వలలను ఏర్పాటు చేసారు. “సహజంగా అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం. గత సంవత్సరాల అనుభవం ఆధారంగా ఈ విస్తరణ కార్యక్రమం చేపడుతున్నాం. వరి ధాన్యం సాగుచేసే సధారణ రైతు కుటుంబం ఇవాళ చేపల పెంపకం చేపట్టి విజయం సాధిస్తున్నాం.” అని సీతారాం సగర్వంగా చెప్పారు.
ఈ రైతులంతా కూడా తమ ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు గట్టి ఆటుపోట్లనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా తమ చేపలను ఎగుమతి చేయగలుగుతున్నారు.
ఈ వ్యాసం ఇంతకుముందే https://www.indiawaterportal.org/articles/small-farmers-eyebig-fish-jharkhand  అంతర్జాల వేదికపై ప్రచురితమైంది.

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....