వనరుల రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ప్రయోజనాలు, అత్యుత్తమమైన విధానం

 ఒక పద్ధతి ప్రకారం రీసైక్లింగ్ చర్యలను చేపట్టడం, సేంద్రీయ వ్యర్థాలకు అదనపు విలువలను జోడించడం ద్వారా సేద్య రంగాన్ని మరింత ఉత్పాదవంతంగా, స్వయం సమృద్ధంగా మార్చివేయవచ్చు. అందుబాటులో ఉన్న వనరులను రీసైక్లింగ్ చేసినట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పర్యావరణను రైతులు సురక్షితంగా కాపాడగలుగుతారు. వాతావరణ అనుకూలత సాధించే విషయంలో వనరుల రీసైక్లింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న, సన్నతరహా రైతులకు చాలా ఉపయోగకరం.
సేద్య రంగంలో వనరులను తిరిగి ఉపయోగించుకోవడం వ్యవసాయదారులు చాలా ఏండ్లుగా అనుసరిస్తున్న విధానమే. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణ మహిళా రైతులే ఈ విధంగా వనరుల పునర్వినియోగంలో సామర్థ్యం నిరూపించుకుంటున్నారు. వారు కొత్త ఆవిష్కరణలకు కూడా కారణమవుతున్నారు. పొలంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను, పాడి పశువుల పెంట ను పెడకలుగా చేసి ఏదో రూపంలో వంట చెరకుగా ఉపయోగించుకుంటారు. లేదా కుటుంబానికి ఆరోగ్య వంతమైన ఆహారం అందించే కృషిలో భాగంగా ఈ వ్యర్థాలను పెరటి మొక్కల పెంపకంలో ఎరువులుగా లేదా ఇంట్లో పెంచుకునే కుక్కలు, ఇతర పశువులకు ఆహారంగా ఉపయోగించుకుంటారు. కొందరు కొబ్బరి చెట్లకు ఎరువుగా ఉపయోగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సేద్యం ద్వారా వచ్చే పంట దిగుబడులపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నప్పుడు ఏ రూపంలో అయినా సరే వ్యర్థమనేది వారి దృష్టిలో ఉండదు. ప్రతీ దానినీ ఏదో రూపంలో పునర్వినియోగించుకునేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇది తరతరాలుగా మహిళా రైతు కుటుంబాలలో సర్వసాధారణమే.
చిన్న కుటుంబాలలో అందుబాటులో ఉన్న వనరులనుంచి గరిష్ట ప్రయోజనాలు పొందడమే ప్రధాన ఉద్దేశం. అందులో భాగాంగానే కుటుంబ అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ వనరులను ఉపయోగపడేలా చూసుకుంటారు. అదే సమయంలో అదనపు ఆదాయం వచ్చే ఏ మార్గాన్నీ వదిలిపెట్టరు. ఈ రకంగా వనరుల పునర్వినియోగం వల్ల పర్యావరణకు మంచి జరుగుతుంది. మరెన్నో ప్రయోజనాలకు దారి చూపిస్తుంది. వనరుల పునర్వినియోగం వల్ల సేద్య ఖర్చులు తగ్గుముఖం పడతాయి. బయట మార్కెట్ నుంచి కొని తెచ్చుకోవలసిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. చివరిగా వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేలా సేద్యం చేయడానికి అవకాశాలు పెరుగుతాయి.
తొలి అడుగులు
చిన్న చిన్న కమతాలున్న రైతులు తప్పనిసరిగా కొన్ని పశువులను / కోళ్ల ఫారమ్ లను కూడా నిర్వహిస్తుంటారు. ఇవి వారి వ్యవసాయ ఆధారిత జీవితాలకి చేయూతగా నిలుస్తుంటాయి. ఇది గమనించిన ఐసీఏఆర్ – సీపీసీఆర్ఐ సంయుక్తంగా రైతులకు అనుకూలమైన విధానాన్ని ఫస్టు FIRST (Farm, Innovation,
Resources, Science and Technology) అనే పేరుతో ఒక కార్యక్రమం చేపట్టాయి. ఈ విధానంలో వ్యవసాయ క్షేత్రం, నూతన ఆవిష్కరణలు, వనరులు, శాస్త్ర సాంకేతిక పరిజ్జ్ఞానం అన్న అయిదు అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కేరళలోని అలప్పుజా జిల్లా పతియోర్ పంచాయతీలో 2016 నుంచి అమలు చేస్తున్నారు. ఇందులో దాదాపు వెయ్యి రైతు కుటుంబాలు భాగం పంచుకుంటున్నాయి. వారి సగటు కమతం కేవలం 0.32 హెక్టార్లు మాత్రమే. ఇక పశు పెంపకం లేదా కోళ్ల ఫారమ్ లు పెట్టుబడి స్థోమత,  నిర్వహణ సామర్థ్యం ఆధారంగా ఒకటి నుంచి 30 వరకు చేపడుతున్నారు.
 అరటి పండ్ల నాణ్యతను పెంచడానికి వీలుగా బియ్యపు గండి నీటిని ఉపయోగిస్తారు. అంచేకాదు, ఆ నీటినే వినియోగించి కూరగాయల మొక్కలకు సోకే చీడపీడల నివారణిగా కూడా ఉపయోగిస్తారు.
ఈ కార్యక్రమంలో రైతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా గ్రామాలలో రైతులకు ఉన్న ఆసక్తిని అంచనా వేసేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైసల్ – Participatory Rural Appraisal (PRA) – చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా అందుబాటులో ఉన్న సామాజిక ఆస్తులు, అక్కడి ప్రజలకు అనుకూలమైన వేళపాళలు, వారికి ఎదురవుతున్న సమస్యలు, వాటికి గల కారణాలు, వ్యవసాయంలో భాగంగా అనుసరించే విధానాలు, అక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తేలిన ముఖ్యమైన అంశం – పశుపోషకాలు తాము పెంచుతున్న పశువుల వ్యర్థాలను, లేక తమ కొద్ది పొలంలో పేరుకుపోయే చెత్త చెదారాన్ని ఎలా వదిలించుకోవడమనేది పెద్ద సమస్యగా గమనించారు. కుట్టినట్టు బుగ్లవు గ్రామానికి చెందిన శ్రీ గోపాల కృష్ణ పిళ్లై సమస్య ఏమిటో ఆయన మాటల్లోనే. “నా దగ్గర 30 ఆవులున్నాయి. వాటి మలమూత్రాలు కారణంగా గోశాల ను శుభ్రంగా ఉంచడం అనేది పెద్ద సమస్యగా తయారైంది. వాటి వస్స అక్కడ పశువుల ఆరోగ్యమే కాకుండా చుట్టూ ఉన్న కుటుంబాలకు కూడా హాని కలుగుతోంది. ఇబ్బందికరంగా మారింది. పైగా ఈ పశువుల నుంచి 200 లీటర్లకు పైగా పాలు సమీపంలోని మార్కెట్ కు తరలిస్తున్నాం. ఈ పాలపై వ్యర్థాల వాసన ప్రభావం పడుతోంది. వాటి నాణ్యత ప్రశ్నార్ధకంగా మారింది. వినియోగదారులకు నచ్చడం లేదు.” ఇక పొరుగున ఉన్న కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ వర్గాల నుంచి కాలుష్య శుద్ధి గురించిన ధృవీకరణల కోసం ఒత్తిడి వస్తోంది.
ఇలా చిన్న రైతులు పశు పోషణలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐసీఏఆర్ – సీపీసీఆర్ఐ ఈ ఫస్టు కార్యక్రమాన్నిఐసీఏఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ఇది అన్ని విధాలా అచరణీయంగా మారింది. అనేక రకాలుగా ప్రయోజనం కలిగించే విధంగా ఈ వ్యర్థాలను పునర్వినియోగించే మార్గాలను సూచించింది.
1. పశువుల మలమూత్రాలు ఏ మేరకు ఘనీకృతం, ఏ మేరకు ద్రవ రూపం అనే విషయాలపై ముందు పరిశీలించారు. అలాగే రోజుకి ఎంత మేరకు ఈ తరహా వ్యర్థాలు పోగవుతున్నదీ లెక్క కట్టారు.ఆవుల నుంచి మూత్ర రూపంలో పేరుకుంటున్న ద్రవం గురించిన అంచనాలు తయారుచేశారు.
2. రైతుల భాగస్వామ్యంతో చేపట్టే పనులను గుర్తించారు. ముందుగా వర్మీ కంపోస్టు తయారీకి ఆవు మలమూత్రాదుల వాడకాన్ని ప్రోత్సహించారు. అందులో కొబ్బరి చెట్ల వ్యర్థాలను ఇంకా ఇతర వ్యవసాయ వ్యర్థాలను కూడా జతచేసేలా ప్రోత్సహించారు.
3. ఆవు మూత్రం మార్కెట్ లో వినియోగ వస్తువుగా మార్చేందుకు వీలుగా దాని రంగు, వాసన మార్చివేసే ప్రక్రియ ప్రోత్సహించారు.
4. పశు శాల శుద్ధి చేసే సమయంలో వెలువడే నీటిని, పశు మూత్రాన్ని పశువుల మేత, కూరగాయల పెంపకంలో ఎరువుగా ఉపయోగించాలని చెప్పారు.
5. వంట గ్యాస్ తయారీకి వీలుగా బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
రీసైక్లింగ్ పద్ధతులు
శ్రీ గోపాలకృష్ణ  పిళ్లై ఒక ఎకరా ఆసామీ. ఇంటికి పక్కనే ఉన్న ఈ ఎకరాలో 30 ఆవులు, దూడలు ఉంటాయి. వాటితో పాటు కూరగాయలను సాగు చేస్తాడు. దాదాపు 200 బస్తాల కూరగాయలు పండుతాయి. ఇవికాక పశు మేత కూడా పెంచుతాడు. ఆయన పశు క్షేత్రం అంతా సేంద్రీయ మాన్యూవర్ / మూత్రధారలతో నిండిపోయి ఉంటాయి. వాటిని ఉపయోగించి వర్మీ కంపోస్టు తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 5 – 6 టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇంకా చేపల పెంపకానికి అనువైన చెరువు, బయోగ్యాస్ తయారీ యూనిట్, హైడ్రోపోనిక్స్ మేత తయారీ యూనిట్, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఇవి కాక అంతర పంటలుగా ఆయన దుంపలు, సుగంధ ద్రవ్యాలు కూడా ఆయన సాగుచేస్తారు.
కొబ్బరి సాగు, ఇతర పామ్ చెట్ల పెంపకం, చేపట్టిన పంటలు, లేదా సేద్య కార్యక్రమాలలో భాగంగా అంతర లేక మిశ్రమ పంటల ద్వారా దాదాపు 80 నుంచి 100 కిలోల వరకు సేంద్రీయ వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఐసీఏఆర్ – సీఆర్పీసీఆర్ఐ సాంకేతికత సాయంతో కొబ్బరి చెట్ల వ్యర్థాలనుపయోగించి వర్మీ కంపోస్టు తయారీని కూడా ఆయన చేపట్టాడు. తరిగిన కొబ్బరి కాయలు, దుంపలు, పశు మేత, సుగంధ ద్రవ్యాలు, అరటి చెట్లు, కూరగాయలు వంటి అంతర పంటల సాగు వల్ల పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుంటూ ఉంటాయి.
ఆయన భార్య శ్రీమతి ఉష వర్మీ కంపోస్టు తయారీకి వీలుగా పశువుల వ్యర్థాలను, పొలంలో పేరుకునే చెత్త చెదారాన్ని చేరవేసే విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఇంటి ఆవరణలోనే పెరుగుతున్న మామిడి, జాక్ చెట్ల ఆకులు, అలములు కూడా ఈ యూనిట్ కు చేరతాయి. కూరగాయల పెంపకానికి వీలుగా పశు మలమూత్రాలను ఎరువుగా ఉపయోగించే కృషిలో కూడా ఆమె చురుగ్గా పాలు పంచుకుంటుంది. “వర్మీ కంపోస్టు యూనిట్ వచ్చిన తరువాత పేరుకుపోతున్న వ్యర్థాల భారం దాదాపు 60 నుంచి 70 శాతం మేరకు తగ్గిపోయింది. ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతోంది. ఇంటి ఆవరణలోనే మా కుటుంబం, సేద్య వనరులు సహజీవనం సాగించడం మరింత ప్రయోజనకరంగా మారింది.” అంటారు శ్రీమతి ఉష.
కుటుంబ అవసరాలకోసం వినియోగించిన చేపల వ్యర్థాలు, వంటింటి చెత్త, బూడిద వంటివి కొబ్బరి లేదా పామ్ చెట్ల సాగుకు పోషకాలుగా ఉపయోగపడుతున్నాయి. సగటున వారానికి 10 నుంచి 12 కిలో వరకు పోగవుతూ ఉంటుంది. వారాంతంలో ఈ రకంగా పేరుకునే బూడిద చెత్తను కొబ్బరి చెట్ల పాదుల్లో వేస్తుంటారు. ఈ రకంగా చేయడం వల్ల కొన్ని రకాలైన చీడపీడలను నియంత్రించడం సాధ్యమవుతోంది. ముఖ్యంగా కొబ్బరి మొక్కల ఎదుగుదల సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటోంది.
ఇదే విధంగా వరి గండి నీరు కూడా అరటి మొక్కల పాదులకు పోషకంగా అందిస్తారు. ఇలా చేయడం వల్ల అరటి పండ్లు, లేదా కూరగాయల పెరుగుదల నాణ్యమైనవిగా ఉంటాయి. వాస్తవానికి కలుపు మొక్కలను ఇలా సద్వినియోగం చేసుకోవడంలో మహిళా రైతులే ముందుకు వస్తున్నారు. అరటి లేదా జాక్ చెట్ల ఆకులు, అలములను మేకలకు, ఆవులకు, కోళ్లకు రోజువారీ ఆహరంగా అందిస్తారు. పెరటి ఆవరణల్లో కోళ్ల పెంపకం వల్ల ఆహార వ్యర్థాలను, చేపల వ్యర్థాలను, వరి సాగు వ్యర్థాలను పునర్వినియోగించడంలో కీలకంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా రీసైకిల్ చేసిన వ్యర్థాల సాయంతోనే కుటుంబ ఆవరణలోనే అవసరమైనన్ని ఆహార వినియోగ కూరగాయలను, కోడి గుడ్లను అందిస్తుంటాయి.
ఈ ఉపయోగాలన్నిటి గురించి గోపాలకృష్ణ పిళ్లై అభిప్రాయం ఇలా ఉంది. “పశువుల వ్యర్థాలను దూర ప్రాంతాలకు రవాణా చేయడం అంతగా లాభసాటి కాదు. లేబర్ చార్జీల భారం ఎక్కువ. పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు వదిలించుకోవడం చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ. వర్మీ కంపోస్టు తయారీ చేపట్టిన తరువాత, ఆవు మలమూత్రాలకు అదనపు విలువను సమకూర్చుకోగలుగుతున్నాను. రీసైక్లింగ్ పద్ధతి అనుసరించి పొలంలో ఉపయోగానికి అనువుగా మాత్రమే కాకుండా మిగులును కూడా సొమ్ము చేసుకోగలుగుతున్నాను.” షేడ్ ఇచ్చిన ఆవు పెడకు ఓ మోస్తరు రైతులు / నగరాలలో పార్ట్ టైమ్ సేద్య కార్యకలాపాలు చేపట్టే వారి నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రకంగా కిలో ఆవు పేడకు రూ. 12 ఆదాయం వస్తుంది. ఏటా 5 నుంచి 6 టన్నుల వర్మీ కంపోస్టు అమ్మకం ఆయనకు సాధ్యమవుతోంది.
గోపాలకృష్ణ తన పశువుల శాల నుంచి ప్రతి రోజూ 200 నుంచి 300 లీటర్ల పాలను సరఫరా చేయగలుగుతున్నాడు. నాణ్యమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన తాజా కూరగాయలను అందిస్తున్నాడు. వీటి పెంపకంలో ఆవుల మలమూత్రాలను, బయోగ్యాస్ యూనిట్ లో వెలువడే వ్యర్థాలనే ఉపయోగిస్తాడు.
శ్రీ గోపాల కృష్ణ రైతు అవతారం ఎత్తిన తరువాత ప్రతిరోజూ కనీసం వంద మంది సందర్శకులతో ముచ్చటిస్తుంటాడు. ఆయన అనుసరిస్తున్న సమ్మిళిత సేద్య విధానం, రీసైక్లింగ్ పద్ధతులు, వయ్ర్థాలను విలువైన వర్మీ కంపోస్టుగా వినియోగం, ఆకు పచ్చని పశు దాణా, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల సాగు చుట్టూ ఉన్న రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇంటి అవసరాలకు అవసరమైన కూరగాయాలను తాజాగా ఎప్పటికప్పుడు తెచ్చుకునే సదుపాయం ఉండడం మహిళలకు చాలా ఆనందదాయకంగా ఉంటోంది. ఈ రకంగా పండించిన కూరగాయలను నిల్వ చేయడం కూడా చాలా తేలిక. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఈ విధంగా గృహ అవసరాలలో పేరుకుపోయే వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. అలా చేసినట్లయితే తాజా ఆకు కూరలు, లేదా కూరగాయలను ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ వ్యర్థాలను ద్రవ రూపంలో లేదా ఘన రూపంలో, లేదా వర్మీ కంపోస్టు రూపంలో మొక్కల పెంపకంలో ఉపయోగించుకోవచ్చు.
ఉత్తమ సేద్రీయ సాగు విధానాలు పాటిస్తున్నందుకు శ్రీ గోపాలకృష్ణ పిళ్లైకి పంచాయతీ ఉత్తమ రైతు అవార్డు దక్కింది. ఆయన వ్యవసాయ క్షేత్రం చూస్తే అత్యంత సామర్థ్యంతో వనరులను రీసైక్లింగ్ చేసి స్వయంపోషక సేద్య విధానానికి నిదర్శనంగా కనిపిస్తుంది.
ఉత్తమ విధానం – అందరికీ అనుకూలం
ఈ పంచాయతీ పరిధిలో 15 మంది రైతులు ఈ రీసైక్లింగ్ విధానం అనుసరిస్తున్నారు. సేద్యంలో పేరుకుపోయే వ్యర్థాలను రీసైకిల్ చేయడంతో పాటు అదనపు విలువలను సమకూర్చే యూనిట్ల ఏర్పాటు చేయడం ఈ సమీకృత వ్యవసాయ విధానం ప్రధానమైన లక్షణం. ఈ 15 మంది రైతులలో 7 గురు మహిళలే కావడం విశేషం. వ్యవసాయ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలోనూ, అదనపు ఆదాయం సంపాదించుకోవడంలోనూ ఈ రైతులందరూ పూర్తి విజయం సాధించగలరన్న నమ్మకాన్ని పతియూరు పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీ వి. ప్రభాకరన్ వ్యక్తంచేస్తున్నారు. ఇంకా  “సమర్థవంతంగా, శాస్త్రీయ పద్ధతిలో వికేంద్రీకృత స్థాయిలో రీసైక్లింగ్ పనులు చేపట్టినట్లయితే ఒక పంచాయతీ పరిధిలో సురక్షితమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని గ్రామీణ ప్రజానీకానికి అందించగలుగుతుంది. ఈ విషయంలో మహిళలే చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కలుపు మొక్కలు, ఇతర సేద్య వ్యర్థాలను మరింత ఉపయోగకరంగా రీసైక్లింగ్ చేసేందుకు ప్రోత్సహిస్తున్నాం. ఈ వ్యర్థాల సేకరణ కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆలంబనగా చేసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో పేరుకుపోయే వ్యర్థాలను వృధాగా కాల్చి కాలుష్యాన్ని పెంచడం కన్నా వాటి రూపు మార్చి పొలం మట్టిలోకే చేర్చడం అత్యుత్తమం. ” అన్నారాయన.
క్రమపద్ధతిలో రీసైక్లింగ్ చేయడం, సేంద్రీయ వ్యవసాయ వ్యర్థాలకు అదనపు విలువలు చేకూర్చడం వల్ల వ్యవసాయం మరింత గిట్టుబాటుగా మారుతుంది. స్వయంసమృద్ధం అవుతుంది. మట్టికి అన్ని విధాలా పోషక విలువలను అందించవచ్చు. వర్మీ కంపోస్ట్ మట్టిలో ప్రకృతి సహజంగా ఉండే అతి సూక్ష్మ జీవజాలాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. కంపోస్టు తయారీ పంటలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ క్రమంలో వ్యర్థాలకు చెడు వాసనలు పోయి సువాసనలు అలదుకుంటాయి. బయో గ్యాస్ ఉత్పత్తి కారణంగా వంట ఇంటి నుంచి పర్యావరణానికి హానిచేసే గ్రీన్ హౌస్ కలుషిత వాయువులు వెలువడకుండా కాపాడుకోవచ్చు. మరెన్నో విధాలుగా ఉపయోగకరమైన పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుంది. మొత్తం మీద ఈ విధానాలు అదనపు ఆదాయం అందించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా తట్టుకునేందుకు కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు కమతాలున్న రైతులకు ఇది వరప్రదాయిని అని చెప్పాలి.
అనితా కుమారి .పి.
ప్రిన్సిపాల్ సైంటిస్టు (వ్యవసాయ విస్తరణ)
E-mail: anithacpcri@gmail.com
ఇందుజా .ఎస్.
సైంటిస్టు (మైక్రోబయాలజీ)
ఐసీఏఆర్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్
కృష్ణపురం పోస్టు ఆఫీసు, కాయంకులం, కేరళ

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....