మన ఈ భూగోళంపై మానవ మనుగడకు అనేక సమస్యలు, సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లతో సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితులలోనూ కొంత మంది ఆదర్శప్రాయమైన, సానుకూలమైన మన జీవితాలకు పరిష్కారాలను చూపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి కొందరి విజయ గాథలనే ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఆనంద్ ధ్వజ్ నేగి ‘కర్మభూమి’
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతం చల్లటి శీతల గాలులతో వణికించే ఎడారిలాంటి చలి ప్రదేశం. కనుచూపు దూరం అంతా ఎడారిలాగే కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని థాంగ్ కర్మ భూమి అని వ్యవహరిస్తారు. ఈ పదానికి సరైన అర్థం ఏమిటంటే తెల్లగా వికసించిన ప్రదేశం. ఎక్కడా గడ్డి పోచ కూడా కనిపించదు. ఎటు చూసినా తెల్లటి ఇసుక మేటలు, రాళ్లు రప్పలు. అలాంటి ఎడారి మధ్యలో ఒక వ్యక్తి ఆశావహ దృక్పథంతో కనిపిస్తారు. ఆయన నిజానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. ఆయన ఆర్థిక శాఖలో పెద్ద హోదాలో ఉన్నారు. ఈ ప్రాంతంలో అడవుల అభివృద్ధి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఈయనకు అప్పగించింది. ఆయన పేరే ఆనంద్ ధ్వజ్ నేగి. 1977 నుంచి ఈ ఎడారి ప్రాంతాన్ని భౌగోళికంగా మార్చివేసి సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ఇసుక దిబ్బల్లో రాళ్లు రప్పల మధ్య హరిత వనాలు పెంచడానికి తగిన సాంకేతిక అంశం ఏదీ లేదని నిపుణులు నిరుత్సాహపరుస్తూ వచ్చారు. అయితే 1999లో నేగి ఈ ఎడారిలో మొక్కల పెంపకం బాధ్యతను చేపట్టారు. అందుకోసం 2003లో తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామాచేశారు. ఆ రకంగా అప్పటి నుంచి ఆయన తన పూర్తి సమయాన్ని, శక్తినీ, సామర్థ్యాన్ని, ఆదాయాన్ని కూడా ఎడారిని పచ్చటి చెట్లతో కళకళలాడేలా మార్చివేసేందుకు నిరంతరం కృషి కొనసాగించారు.
నిర్విరామంగా ఆయన చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. 90 ఎకరాల ఇసుక భూములు హరిత వనాలుగా మార్చివేశారు. తన పొలాన్ని తడిపేందుకు ఆయన ఏకంగా చాలా పెద్ద కార్యభారాన్నే నెత్తినేసుకున్నారు. ఏకంగా హిమాలయ పర్వతాలకు చేరువగా ఉన్న ఈ భూములకు నీటిని తరలించేందుకు మంచు గడ్డలను (హిమపాతాలు) కరిగించే సాహసం చేశారు. ముందుగా సరిహద్దు వెంబడి లవంగాలు, చిక్కుడు రకాలు, ఆపిల్ చెట్లు, ఇంకా మరి కొన్ని ఇతర రకాలైన చెట్ల పెంపకం ప్రారంభించాడు. ఆ రకంగా కొంత ఎడారి ప్రాంతాన్ని ఒయాసిస్ (అంటే నీటి చెలమ అన్న భ్రాంతి కలిగించే ప్రదేశం) గా మార్చివేశారు. ఇప్పుడు ఆయనను అక్కడి వారంతా ఎడారి వైద్యుడు (డెసెర్ట్ హీలర్) అని సగౌరవంగా పిలుచుకుంటున్నారు. రాళ్లు, ఇసుక మయమైన ఎడారిలాంటి ఈ కొండ ప్రాంతంలో మొక్కలు పెంచడం అసాధ్యం అనుకున్న స్థానిక వ్యవసాయదారులకు ఆయన ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నేగి చేపట్టిన ఈ కృషిలో నిపుణులు ఆయనకు రసాయనాల వినియోగంపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా ఆయన వాటికి తల వంచలేదు. పశువుల వ్యర్థాల నుంచి వచ్చే సేంద్రీయ ఎరువులతో భూమిని సారవంతం చేయవచ్చనని ఆయన విశ్వసించాడు. నిరూపించాడు. భూసారం పెరగడానికి అవసరమైన పోషకాలను ఈ విధంగా పశువుల వ్యర్థాల నుంచి తయారుచేసిన కంపోస్టు ఎరువులు ఉత్తమమైనవని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నాడు. పాటించాడు. అద్భుత ఫలితం సాధించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. భూసారం క్షీణించిపోయి వృథాగా మిగిలిపోతున్న భూమిని సారవంతం చేసేందుకు ఉన్న అవకాశాలను ఆయన ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
వాస్తవం ఏమిటంటే మన భూగోళంపై ఎన్నో ఎన్నెన్నో ప్రాంతాలు ఎడిరులుగా మారిపోతున్నాయి. అందుకు ప్రధానమైన కారణం ఇష్టారీతిన అడవులను నరికివేసేయడమే. సామాజిక అభివృద్ధి పేరుతో పచ్చటి చెట్లను ఎక్కడికక్కడ నాశనం చేసివేస్తున్నారు. ప్రస్తుతం నిలకడ లేని వాతావరణం, విపరీతంగా దోచేస్తున్న సహజ వనరులు, ప్రకృతి వైపరీత్యాలు, ఆహార కొరత, నీటి కొరత, పేదరికం రోజురోజుకీ దిగజారిపోతున్న ప్రజారోగ్యం మానవాళిలని పట్టి పీడిస్తున్నాయి. మనకు ఆహారం అందించవలసిన వ్యవసాయ దారులు నిరాశానిస్పృహలలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ అధ్వాన్న స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా పల్లె జనం ఉపాధి కోసం, కడుపు నింపుకోవడం కోసం సమీపాలలో ఉన్న, దూరంగా ఎక్కడో ఉన్న ప్రాంతాలకు వలసలు పోతున్నారు. నగరాలు, పట్టణాలు ఇప్పటికే జనసముద్రాలుగా మారి ఉన్నాయి. గ్రామాలలోని వారంతా ఆకలి కోరల్లో నలిగిపోతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు అందిస్తున్న ధాన్యంపైనే ఆధారపడి రోజులు నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యలకు కారణాలు ఒకదానితో మరొకటి ముడివేసుకుని పీటముడులుగా తయారై పరిష్కారం సాధ్యం కాని స్థాయికి చేరిపోయాయి. దీనంతటికీ మానవ సమాజం విచ్చలవిడిగా పర్యావరణాన్ని, సహజ వనరులను దుర్వినియోగం చేస్తుండడమే.
బృందా – వివేక్ దంపతుల ప్రయోగం (అహ్మదాబాద్)
వివేక్ షా – బృందా దంపతులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వాసులు. ఒకసారి వాళ్లు శివారులు దాటి కారులో ముందుకెళ్లారు. నిజానికి ఆ ప్రాంతమంతా సంపన్న వర్గానికి చెందిన ఐటీ నిపుణులు నివసించే సిలికాన్ ప్రాంతం. దారిలో ఎక్కడ చూసినా స్ట్రా బెర్రీ చెట్లు వరుసగా రోడ్డుకు ఇరువైపలా కనిపించాయి. పచ్చటి చెట్లతో కళకళలాడుతున్నప్పటికీ, ఆ ప్రాంతం పచ్చటి చెట్లతో ఉన్న తోటల్లా కనిపించలేదు. అది ఒక సైనిక స్థావరమా అనిపించింది. కారణం చెట్లు అన్నీ వరుసలుగా క్రమపద్ధతిలో పెంచుతున్నారు. వాటిపై కొంతమంది క్రిమిసంహారకాలు స్ప్రే చేస్తూ కనిపించారు. వారంతా కూడా ముఖానికి పూర్తి రక్షణ కవచాలు ధరించి ఉన్నారు. అంటే స్ప్రే చేస్తున్న సమయంలో క్రిమిసంహారకాల విష వాయువులు వారి ప్రాణాలు తీసేయగలిగినంత ప్రభావం కలవన్నమాట. మరి అలాంటి విషపూరిత మందుల సాయంతో పండించిన పంటను ఆహారంగా తీసుకునే వినియోగదారులకు రక్షణ ఏమిటి ? అన్న ప్రశ్న వాళ్లలో తలెత్తింది. ఈ ఆలోచనే వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసింది. వినియోగదారులకు పూర్తి భరోసా ఇచ్చే ఆహారం పండించే వ్యవసాయ రంగం వైపు వారిని నడిపించింది. 2016లో అమెరికా విడిచి వచ్చేశారు. సంపన్న జీవితాన్ని వదిలేశారు. ఇండియా తిరిగి చేరుకున్నారు. సేద్య వనాలను (పెర్మాకల్చర్) చేపట్టారు. వారి దీక్ష కారణంగా మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే స్థానికులకు సురక్షితమైన ఆహారం అందించగలిగారు.
నిజం చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగానే పరిగణిస్తున్నారు. అంతేకాని ప్రకృతి సహజమైన, ఆరోగ్య దాయకమైన, సురక్షితమైన, పోషక సంపన్నమైన ఆహారం అందించే ప్రక్రియగా గుర్తించడం లేదు. గుడ్డిగా అధికోత్పత్తి కోసం పరుగులు తీయడమే. ఇదంతా హరిత విప్లవం పేరుతో సాగుతున్న పారిశ్రామికీకరించి వ్యవసాయ విధానం వల్ల ఎదురవుతున్న దుష్పలితమే. శాస్త్ర పరిజ్జ్ఞానం పెరుగుతున్న సమయంలో మూడు కీలకమైన రసాయన ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనక క్రిమి సంహారకాలు రైతులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ మూడు ఆవిష్కరణలు వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమ రూపంలో భారీ ఎత్తున చేపట్టడానికి పురికొల్పింది. దీనికి తోడుగా, వ్యవసాయ పరికరాలు యంత్ర రూపంలో అందుబాటులోకి వచ్చాయి. నీటి పారుదల వ్యవస్థ మెరుగుపడింది. ఆహార పదార్థాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ సౌకర్యాలు రైతులను ఆకట్టుకున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగవడంతో మార్కెటింగ్ వ్యవస్థలు విపరీతంగా విస్తరించాయి. ఒకప్పుడు పల్లె సీమలలో ఉపాధి మార్గంగా నిలిచిన వ్యవసాయ రంగంలోనూ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్వయంసమృద్ధికి ఊతమిస్తూ కుటుంబ పరిధులలోనే సాగిన వ్యవసాయం ఆధునిక యాంత్రిక, ఉత్పత్తి ప్రాధాన్యత కల పరిశ్రమ రూపం సంతరించుకుంది.
మోర్ని హిల్స్ దిగువన అద్భుతాలు
చండీఘడ్ నుంచి ఒక గంట దూరంలో మోర్నీ హిల్స్ ఉంటాయి. వాటి దిగువన ఆనందా ఫార్మ్స్ పేరుతో ఆహార పదార్థాలు పుష్కలంగా అందిస్తున్న పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా సాగు యోగ్యం కాని మట్టి దిబ్బలు. అలాంటి చోట పచ్చదనం తీసుకువచ్చేందుకు మనీషా, ఆమె భర్త ఆగమ్ నడుం బిగించారు. అందుకు పెర్మికల్చర్ సూత్రాలు అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అక్కడి మట్టి స్వరూపాన్ని మార్చేందుకు వారు కృషి ప్రారంభించారు. అందుకు పెద్ద ఎత్తున కుళ్లిపోయిన సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించారు. మెల్లిగా ఆ ప్రాంతం ఆహార పదార్థాలను అందించే అడవుల రూపంలో పంటలతో కళకళలాడుతోంది. అయితే వారు ఇంకా వాణిజ్య స్థాయికి చేరలేదు. ప్రస్తుతానికి వారి కుటుంబ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు. మిగులు ఏదైనా ఉంటే దానిని తమ పరిచయస్తులకు పంచిపెడుతున్నారు. ఇదివరలో వారు సివసించిన ముంబయి నగర నివాసానికి నేటి వారి జీవనశైలికి ఎక్కడా పొంతనలేదు. నేడు వారు ప్రకృతితో సహజీవనం సాగిస్తున్నారు. (మరిన్ని వివరాల కోసం …. పేజీలోని వ్యాసం చూడగలరు.)
సాధారణంగా ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే ఉంటుంది. పర్యావరణ కాలుష్యం దగ్గర నుంచి ఇప్పుడు – మన సమస్యలన్నిటికీ అడవుల విచక్షణారహిత నరికివేతే కారణమని అనుకున్నట్లయితే దానికి సరైన పరిష్కారం కూడా తిరిగి పెద్ద ఎత్తున అడవులను వృద్ధి చేయడమే. ఏ విధంగా అయితే గతంలో కుటుంబాలకు స్వయంసమృద్ధికి దోహదం చేసిన అడవుల ఆధారిత వ్యవసాయాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ప్రపంచమంతటా ఇందుకు కృషి చేయాలి. ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఇన్నేళ్లుగా విధ్వసం చేసిన ప్రకృతిని తిరిగి పునరుద్ధరించడం అనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. అది మెల్లిగా మాత్రమే సాధ్యం. మరెన్నో సంవత్సరాలు దృష్టి పెడితేనే అడవులను పూర్వపు స్థాయికి వృద్ధి చేయగలం. మళ్లీ మన జీవితాలు ప్రకృతి సిద్ధమైన అడవులతో కలిసి సహజీవనం చేయగలుగుతాయి. గతంలో మానవుల మనుగడ, జంతుజాలం ఉనికి, వృక్ష సంపద కలిసిమెలసి జీవించేవి. ఈ విషయంలో సంస్కృత పదం జీవనం అన్న దానిలో జీ అంటే మనుగడ, వన్ అంటే ప్రకృతి రూపమైన వనాలు అని గుర్తించాలి.
చెట్లను పెంచడం, చెట్ల మధ్యలో జీవించడం వల్ల ప్రకృతి మనకు అవసరమైన ప్రతీ దానినీ ఆహారమైనా, మరేదైనా తనకు తానుగా మనకు అందజేస్తుంది. అడవులతో మమేకం కావడం అనేది అనునిత్యం మన జీవన సూత్రం కావాలి. మనం ఇప్పుడు దానిని ఏ పేరుతో వ్యవహరించినా అది, సేద్య సహిత అరణ్యాలు (అగ్రో ఫారెస్ట్రీ, లేదా పెర్మాకల్చర్, లేదా ఆహార అడవులు, ప్రాథమిక సూత్రం మాత్రం అరణ్యాలతో సహజీవనం సాగిస్తూ పర్యావరణ అనుకూల జీవనమే మానవాళికి అన్ని విధాలా శ్రేయస్కరం. అంతేకాని, జీవవైవిధ్యానికి చోటు లేకుండా, సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థ, స్వయం పోషకమైన వనరులు లేకుండా – ఏక పంట సాగు ఏ రూపంలో కొనసాగించినా – మన సమస్యలకు సరైన పరిష్కారం లభించదు. ఆహార రొరత సమస్య పరిష్కారం కాదు. అందువల్ల వ్యవసాయంలో చెట్ల పెంపకం కూడా అత్యంత ప్రాధాన్యమైన అంశంగా పాటించాలి. ప్రకృతి వనరులను అవసరం మేరకే వినియోగించడం వల్ల మన మనుగడ సవ్యంగా సాఫీగా దీర్ఘకాలం కొనసాగుతుంది.
సొహాగ్ పూర్ విజయం
పర్యావరణ అనుకూల సేద్య రంగంలో చెట్ల పెంపకానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తక్కువగా చూపించలేము. భూమి లోపలి పొరలోనికి పోషకాలు విస్తరించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. సేంద్రీయ పోషకాలను భూమి పొరల అంతరాంతరాలలోనికి తీసుకకెళ్లగలవు. ఆ రకంగా భూమి కోత నుంచి రక్షణ కల్పిస్తాయి. వాయువేగానికి అడ్డుకట్ట వేస్తాయి. వర్షపు నీటి ప్రవాహంలో సుసంపన్నమైన పోషకాలు దిగువకు జారిపోకుండా రక్షిస్తాయి. మట్టిలో తేమను కాపడతాయి. పక్షులకు, జంతువులకు, క్రిమి కీటకాలకు ఆవాసాలుగా నిలిచి పంట మొక్కల వ్యాప్తికి తోడ్పడతాయి. అంతేకాదు వాతావరణంపై కూడా చెట్ల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. వృక్షసంపద ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. గాలిలో ఆక్సిజన్ మోతాదును కాపాడతాయి. ఆ రకంగా గాలిని శుభ్రంచేస్తాయి. వానలు కురవడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తాయి. భుగర్భ జల వనరులను కాపాడతాయి. నేలలోని తేమ గాలి వల్ల, సూర్యర్శమి వల్ల ఇగిరిపోకుండా అడ్డుకుంటాయి. వాటి ఆకులపై పడిన సూర్యరశ్మిని ఆధారం చేసుకుని ఆహారం ఉత్పత్తికి తోడ్పడతాయి.
అది 2016వ సంవత్సరం. ఐఐటీ – ఐఐఎం నిపుణుడు సందీప్ సక్సేనా అమెరికాలో పనిచేస్తున్నాడు. ఆయనకు అప్పట్లో ఒక గురుతర బాధ్యత అప్పగించబడింది. భారత దేశంలోని వ్యవసాయ ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయడం అది. ఆ విధి నిర్వహణలో దేశంలోని అన్ని మూలలనూ ఆయన పర్యటించి అధ్యయనం చేశాడు. అభివృద్ధి పేరుతో అడవులను ఇష్టం వచ్చినట్లు నాశనం చేయడాన్ని గమనించాడు. అదే విధంగా భూగర్భ జల వనరులు క్షీణించిపోతున్నాయని గమనించాడు. ఈ రెండు పరిణామాలు మన దేశంలో వ్యవసాయదారుల జీవితాలను అల్లకల్లోలం చేసి వేస్తున్నాయని గుర్తించాడు. రెండేళ్ల పాటు ఆయన అధ్యయనం సాగింది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి ఆహారాన్ని కూడా అందించే విధంగా అడవులను అభివృద్ధి చేయడం ఒక్కటే మార్గమని ఆయన నిర్థారణకు వచ్చాడు. అందుకు గాను మధ్యప్రదేశ్ లోని సోహాగ్ పూర్ ప్రాంతంలో ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మక సేద్యం చేపట్టాడు. ఈ ప్రయోగానికి వనదేవత పేరును స్ఫురించేలా అరణ్యని అని పేరు పెట్టుకున్నాడు. ముందుగా మర్రి చెట్లు (బనియన్), రావి చెట్లు (పీపల్), వేప చెట్లు (నీమ్) పెంచడం ప్రారంభించాడు. ఇవి ఎక్కువ ఎత్తు పెరగవు. వాటి చుట్టూ కాయలను లేదా పండ్లనిచ్చే మునగ (మోరింగా), మారేడు (బోయిల్), బొప్పాయి (పపయా), అరటి, నిమ్మ చెట్టు, ఇంకా వాటి చుట్టూ కాయధాన్యాలను (లెంటిల్స్), చిక్కుడు (లెగుమ్స్) రకాల సాగు చేపట్టాడు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఆ ప్రాంతం అంతా ఆహారాన్ని సమకూర్చే పచ్చటి వనంగా మారిపోయింది. వేసవి కాలంలో కూడా ఆకట్టుకునేలా తయారైంది. ఇవాళ్టి రోజున ఈ అరణ్యని వనంలో లభించే ఉత్పత్తులను ఈ-ప్లాట్ ఫార్మ్స్ ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. వాళ్లంతా ఈ ఉత్పత్తులనే అధికంగా ఆదరిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్య దళారులు ఎవరూ ఉండరు. రైతుకు సరమైన ధర లభిస్తుంది.
సొహాగ్ పూర్ చుట్టుపక్కల ఇప్పడు 176 రకాలైన చెట్లు పెరిగి ఉన్నాయి. అవి పరస్పరం ఆధారంగా జీవిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ఈ చెట్ల నుంచి నేలరాలిన ఆకులు, ఇతర చెత్త, చెదారం వంటి వ్యర్థాలతో సమృద్ధిగా ఉన్న జీవసంబంధ సంపదతో కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు రాళ్లూ రప్పలతో బీడు భూముల్లా ఉండేవి ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. క్రమంగా ఆయన మార్గదర్శకంలో ఇతర రైతులు కూడా ఆహారాన్ని కూడా అందించే వనాల పెంపకాన్ని చేపట్టారు. వారికి ఆయన తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నమూనా సేద్యం విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో సేంద్రీయ, అద్భుతమైన ప్రకృతి ప్రసాద ఉత్పత్తులు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో శుద్ధి చేయని చెంతపండు, తిప్పతీగ పేరు మోసిన పంట దిగుబడులు. ఇంకా ఎన్నో ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఓ మోస్తరుగా శుద్ధి చేసిన మామిడి పచ్చళ్లు, చేతితో శుద్ధి చేసిన ఆవ నూనెలు విస్తారంగా సోషల్ మీడియా మార్కెట్ లో లభిస్తున్నాయి. ఇక ఇప్పుడు సందీప్ అటు పరిశోధనలు చేస్తూనే నూతన సేద్య విధానాలను ఆవిష్కరిస్తున్నారు. తన అనుభవాలను పరిసర రైతులకు తెలియచేస్తున్నారు.
కుటుంబ సేద్యం భవిష్యత్తు
ఇలా ఆహారాన్ని కూడా అందించే అడవుల పెంపకంతో పాటు వ్యవసాయం చేయడం కుటుంబ పరంగా సుస్థిర వ్యవసాయ వనాలకు విస్తృతమైన అవకాశాలున్నాయి. వాటి ప్రయోజనం అమూల్యం. అయితే ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేమిటంటే వ్యవసాయదారులను అనేక విధాల ప్రయోజనం కలిగించే ఈ రకమైన సేద్య యోగ్యమైన విధంగా వనాలను వృద్ధి చేయవచ్చునన్న విషయంలో నచ్చజెప్పడం సమస్యగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేస్తున్న వ్యవసాయ ప్రోత్సాహాలలో రైతులకు ఉన్న కొద్ది పాటి జాగాలో అత్యధిక దిగుబడులు సాధించాలంటే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు తప్పనిసరి అని చెబుతున్నాం. రైతుల సామర్థ్యం పెంపు యత్నాలలో భాగంగా నిర్వహిస్తున్న పిచ్చాపాటీ సంభాషణల్లో ఒక రైతు కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. ఇప్పటికీ అనేక బహుళ జాతీయ సంస్థలు తమ విషపూరిత రసాయనిక ఎరువులను, క్రిమిసంహారకాలను, చివరికి విత్తనాలను కూడా ప్రచారం చేసుకునేందుకు అనుమతులున్నాయి. అవన్నీ కూడా అధిక దిగుబడులు రావాలంటే తమ ఎరువులు, క్రిమిసంహారకాలు, విత్తనాలనే వినియోగించాలని రైతులను ప్రేరేపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ శాఖలు కూడా సంకర జాతి విత్తనాలను, రసాయనాల వాడకాన్నే ప్రోత్సహిస్తున్నాయి. అవి ఉపయోగిస్తేనే మొక్కలకు పూర్తి భరోసా అని హామీలు గుప్పిస్తున్నాయి. అవి ఏ సమయంలోనూ ఈ రకమైన విషపూరిత ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం వల్ల భూ సామర్థ్యం క్షీణించిపోతాయని హెచ్చరించడం లేదు. ఇలాటి పరిస్థితులలో రైతులను ప్రత్యామ్నాయ సేద్య విధానాలను అనుసరించేలా నచ్చజెప్పడం కష్టసాధ్యంగా మారింది. అలాంటి అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రభుత్వాల ఆలోచనలో మార్పు వచ్చి, విధానాలలో తగిన మార్పులు చేసి, అగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. అవసరమైన సామర్థ్యం పెంపు చర్యలతో పాటు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను రైతులకు అందించాలి. రైతులకు తగిన అవగాహన కల్పించాలి. లేదా దారుణమైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందా ? అని ప్రశ్నించుకుంటే, మన స్పందన చాలా మందకొడిగా ఉందని, మార్పు చేసేందుకు సిద్ధంగా లేమని స్పష్టమవుతుంది. సరైన సమాధానాలు వచ్చినప్పుడే మానవాళికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదో ఒక రోజున తిరిగి అడవుల దిశగా వెళ్లడమే మనుగడకు మొదటి సోపానమని తెలుస్తుంది. వినాశనం నుంచి మనకు రక్షణ లభిస్తుంది. ఎంత త్వరగా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే అంత తొందరగా మంచి రోజులు వస్తాయి. మన భూగోళం మన తరువాతి తరాల చిన్నారులకు ఆరోగ్యదాయినిగా నిలుస్తుంది.
దీపంకర్ దాస్ గుప్తా
నందాలయ క్లినిక్
సర్వోదయ నగర్
పూరీ 2 – ఒడిశా – 752002
E-mail: drdipankar123@gmail.com



