విత్తన సంరక్షకులు- మహిళల నేతృత్వంలోని వ్యవసాయ సంస్థ

మహారాష్ట్రలోని మహిళా వ్యవస్థాపకులు తమకు స్థిరమైన భరోసా శిక్షణ ఇవ్వడం ద్వారా నాణ్యమైన వస్తువులు మరియు సేవలను అందించగలరనే విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. వారు ఇంటివద్ద లేదా పొలాలలో పడే శ్రమ మరియు వారి సహకారం గుర్తింపబడని స్థాయి నుండి, వారు ఇప్పుడు గుర్తింపబడిన మరియు సమాజంచే ఆమోదింపబడిన విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఉద్భవించారు.

భారతదేశంలోని 40 కోట్ల మంది గ్రామీణ మహిళలు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటివారు. వారి గృహాలను నిర్వహించడంతో పాటు, వారు వ్యవసాయం మరియు పశువుల నిర్వహణలో కూడా పాల్గొంటారు. వ్యవసాయంలో వేగవంతమైన స్త్రీకరణతో, వారి పాత్ర మరింత కీలకంగా మారింది.

భారతదేశంలోని 63 మిలియన్ల సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలలో (MSMEలు) 20% వాటా మహిళా యాజమాన్యంలో మరియు వీరు 22 నుండి 27 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా, పట్టణ ప్రాంతాల (18.42%) కంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళల యాజమాన్యంలోని సంస్థలలో (22.24%) అధిక వాటాను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, ఈ మహిళా నేతృత్వంలోని సంస్థలకు గుర్తింపు లేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా ఉంది.

మహిళా పారిశ్రామికవేత్తలు తక్కువ సంపాదనతో కూడిన వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో కేంద్రీకృతమై ఉండటం మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు అరుదుగా గుర్తించబడటానికి ఒక కారణం. ఇవి రోజువారీ కార్యకలాపాలు మరియు ఆదాయాన్ని సృష్టించే మార్గాలు కావు అనేది సాధారణ అభిప్రాయం. ఆరవ ఆర్థిక జనాభా లెక్కల ప్రకారం, మహిళల యాజమాన్యంలోని అన్ని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలలో 34.3% వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగం పశువుల పెంపకం (92.2%), తరువాత అటవీ (4.5%), పంటలు పండించని వ్యవసాయం (1.9%) మరియు మత్స్య సంపద (1.4%). 99% కంటే ఎక్కువ మహిళా సంస్థలు సూక్ష్మ రంగంలో ఉన్నాయి. మహిళల నేతృత్వంలోని సంస్థ మరియు సంస్థ పరిమాణం మధ్య విలోమ సంబంధం ఉందని గమనించబడింది. సంస్థ పరిమాణం పెరిగేకొద్దీ, మహిళల నేతృత్వంలోని సంస్థల నిష్పత్తి తగ్గుతుంది. వ్యక్తిగత, సామాజిక మరియు పర్యావరణ వ్యవస్థ అనే అంశాల కలయిక మహిళా వ్యాపారవేత్తలకు పరిమిత విజయానికి కారణమని చెప్పవచ్చు. వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో మహిళల యాజమాన్యంలోని MSMEలు ఎదుర్కొంటున్న సవాళ్లను తరచుగా చర్చించారు. అదనంగా, పర్యావరణ సంబంధ అడ్డంకులు ఉన్నాయి, వాటిలో కొన్ని బాక్స్ 1 లో ఇవ్వబడినట్లుగా గుర్తించబడ్డాయి.

 

బాక్స్ 1: మహిళా వ్యాపారవేత్తలకులకు పర్యావరణ వ్యవస్థ ఆటంకాలు

  1. వ్యవస్థాపకత ప్రమోషన్ అనగా వివిధ వ్యాపార అవకాశాల గురించి అవగాహన మరియు జ్ఞానాన్ని సృష్టించడం
  2. సులభంగా మరియు సరసమైన ఆర్థిక సహాయం
  3. సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ మరియు నైపుణ్యం
  4. వర్ధమాన వ్యవస్థాపకులకు మరియు సహ వ్యాపార అనుబందీకులకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఇంక్యుబేట్ చేయడానికి పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వం మరియు నెట్‌వర్కింగ్
  5. దేశీయ మరియు విదేశీ మార్కెట్లతో మార్కెట్ సంబంధాలు
  6. మెరుగైన సామర్థ్యం మరియు ఉత్పాదకత కోసం వ్యాపార, చట్టపరమైన డిజిటల్ మరియు ఇతర ఉన్నత మద్దతు సేవలను పొందడం.

 

 

మహిళలు నేతృత్వంలోని కార్యక్రమాలు 

వ్యవసాయం మరియు మహిళా అభివృద్ధి వంటి ప్రాథమిక అభివృద్ధి సమస్యలపై దృష్టి సారించే లాభాపేక్షలేని సంస్థ BAIF డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, దాని కార్యాచరణ రంగాలలో 4000 కంటే ఎక్కువ మహిళా స్వయం సహాయక బృందాల (SHGs) ఏర్పాటుకు దోహదపడింది. ఈ మహిళలకు స్వయం సమృద్ధిని మరియు మెరుగైన ఉత్పాదకతను నిర్ధారించడం కోసం వారి ఆర్థిక మరియు డిజిటల్ అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో నర్సరీలు, పుట్టగొడుగుల పెంపకం, కోళ్ల పెంపకం మరియు కుట్టు యూనిట్లు వంటి వారి స్వంత సంస్థలను స్థాపించడానికి అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించబడింది. విత్తన సంరక్షకులుగా మహిళల విజయగాథ ఇక్కడ ప్రదర్శించబడింది.

విత్తన సంరక్షకులు

కల్సుబాయి పరిసార్ బియానే సంవర్ధన్ సామాజిక సంస్థ (కల్సుబాయి సీడ్ సేవర్స్ గ్రూప్) 2015లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోల్ బ్లాక్‌లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయబడింది.

భారతదేశంలో జీవ వనరులతో కూడిన వ్యవసాయ వాతావరణ మండలంగా ఉన్న అకోల్ ఇటీవలి కాలంలో వ్యవసాయం వేగంగా వాణిజ్యీకరణకు గురైంది. దీని ఫలితంగా పంట సాగులో వైవిధ్యం తగ్గి, జన్యుపరమైన ఆధారం తగ్గి, ఉత్పాదకత తగ్గింది, చీదపీడలు మరియు వ్యాధులు పెరిగాయి. అంతేకాకుండా ఏక పంటల ప్రాబల్యం పెరగడం వల్ల నేల ఆరోగ్యం క్షీణించడం, సాగు ఖర్చు పెరగడం మరియు స్థానిక గిరిజన వర్గాలలో  పోషకాహార సమతుల్యతపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడటం జరిగింది. ఇది ఆరోగ్యం క్షీణించడమే  కాకుండా, నిర్వహణ మరియు పరిరక్షణ యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి.

అకోల్ ప్రజలకు వర్షాధార వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. శీతాకాలం మరియు పొడి వేసవి కాలంలో, స్థానిక ప్రజలు, ఎక్కువగా మహాదేవ్ కోలి మరియు ఠాకర్ తెగలకు చెందినవారు వ్యవసాయ కార్మికులుగా లేదా పొరుగు పట్టణ ప్రాంతాలలో తాత్కాలిక ఉపాధిని కోరుకున్నారు. దీని అర్థం ఆ కుటుంబానికి ఏడాది పొడవునా ఆదాయం లేదా ఆహార భద్రత లేదు.

ప్రారంభంలో ప్రాథమిక డేటాను ఫోకస్ గ్రూప్ చర్చలు, క్షేత్ర సందర్శనలు మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా సేకరించారు. అకోల్ బ్లాక్‌లోని వివిధ ప్రాంతాలలో పంట భూముల మ్యాపింగ్ మరియు సేకరణ చేపట్టబడింది. విత్తన సంరక్షణకారులను, అవగాహన ఉన్న వ్యక్తులను గుర్తించి, శుద్ధి మరియు శాస్త్రీయ అధ్యయనాల కోసం 10 ఇన్-సిటు పరిరక్షణ కేంద్రాలను స్థాపించారు. స్థానిక దేశీయ కూరగాయలు మరియు దుంపలను డాక్యుమెంట్ చేసి, బీజ పదార్ధాన్ని  సేకరించి గ్రామం/క్లస్టర్ స్థాయి విత్తన బ్యాంకులలో జమ చేశారు. పంట ఎంపిక సంవత్సరం పొడవునా లభ్యత మరియు పోషకాహార లభ్యత ఆధారంగా జరిగింది. ఎంచుకున్న విలువైన పంట జాతుల విత్తన ఉత్పత్తిని సమాజ స్థాయిలో నిర్వహించారు.

2017లో ట్రస్ట్‌గా నమోదు చేయబడిన ఈ 11 మంది సభ్యుల విత్తన సంరక్షణ కమిటీలో స్థానిక వర్గాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులను చేర్చారు. ఇది ఏర్పడినప్పటి నుండి, ఈ గిరిజన మహిళల నేతృత్వంలోని చొరవ పంట సాగు వైవిధ్యం, విత్తనాలు మరియు అటవీ రకాలు , తినదగిన మొక్కలపై దృష్టి సారించడం ద్వారా వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణ మరియు నిర్వహణ కోసం ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది. మల్చింగ్ వాడకం, విత్తనాల ఎంపిక మరియు సరైన నిల్వతో పాటు సేంద్రీయ ఇన్‌పుట్ ఉత్పత్తిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వబడింది. విత్తన పరీక్ష మరియు భౌతిక స్వచ్ఛతను విత్తన బ్యాంకు స్థాయిలో నిర్వహిస్తారు.

విత్తనాల ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్‌ను కల్సుబాయి పరిసార్ బియానే సంవర్ధన్ సంస్థ ద్వారా చేపట్టారు. ఈ కమిటీ నాణ్యమైన విత్తన ఉత్పత్తి, విత్తన మార్పిడి నిర్వహణ మరియు మార్కెట్ లింకేజీల ఏర్పాటును నిర్ధారిస్తుంది. అదనంగా, వారు స్థానికులకు  శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై క్షేత్ర శిక్షణను, అవగాహన సందర్శనల కార్యక్రమాలను నిర్వహిస్తారు. సభ్యులకు విత్తన ప్రవేశ రిజిస్టర్ నిర్వహణ మరియు రికార్డు నిర్వహణ, విత్తనాల సేకరణ మరియు అమ్మకం మరియు ధాన్యం ఉత్పత్తిలో శిక్షణ ఇవ్వబడింది మరియు ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో నమ్మకంగా ఉన్నారు. మహిళా సంరక్షకులు పద్మశ్రీ రహీబాయి పోపెరే మరియు నేషనల్ జీనోమ్ సేవియర్ ఫార్మర్ అవార్డు గ్రహీత మమతా భంగారే తమ విజ్ఞాన జాగృతి కార్యక్రమాల ద్వారా దేశీయ విత్తనాలు మరియు అడవి కూరగాయలను పరిరక్షించడానికి దారితీసారు అంతేకాకుండా సైన్స్ మరియు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా క్షేత్రస్థాయి నుండి ప్రపంచ స్థాయి మరియు పరిశోధనల కోసం ధృష్టిని సాధించారు.

ఈ బృందం మూడు విత్తన బ్యాంకులను స్థాపించి, వరి, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలు సహా 40 పంటలకు చెందిన 118 రకాలను సంరక్షించింది. ఈ బృందం 21,600 కి పైగా కిచెన్ గార్డెన్ కిట్లు మరియు దాదాపు 39 మెట్రిక్ టన్నుల నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు అమ్మకంలో కూడా పాల్గొంది. వారి విజయం వారి పరిసరాలకే పరిమితం కాలేదు. వారు వినూత్న మార్కెటింగ్ పద్ధతులను విజయవంతంగా అవలంబించారు, ఫలితంగా టెర్రస్ గార్డెన్ విత్తనాల అమ్మకం జరిగింది. తద్వారా గ్రామీణ-పట్టణ సంబంధాన్ని పెంపొందించారు. వారి ప్రయత్నాలు ఇప్పటివరకు రూ. 46 లక్షల విలువైన వ్యాపారాన్ని సృష్టించాయి.

పోషన్ సఖి అని పిలువబడే మహిళా రిసోర్స్ ద్వారా సమాజంలో సామర్థ్య పెంపుపై కూడా పెద్ద ప్రాధాన్యత ఉంది. ఈ పోషన్ సఖిలు మరియు సీడ్ సేవర్ కమిటీ సరఫరా చేసిన మంచి నాణ్యత గల న్యూట్రి గార్డెన్ కిట్‌ల కృషి కారణంగా, ఈ ప్రాంతంలో పోషకాహార తోటలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ న్యూట్రి-గార్డెన్ కిట్‌లలో 12-15 పంటల విత్తనాలు మరియు మొక్కలు ఉంటాయి మరియు ఇవి పెరిగిన ఆహార వైవిధ్యాన్ని మరియు దాదాపు 10 నెలల పాటు ఆహార లభ్యతను నిర్ధారించగలవు. మహిళా SHG సభ్యులలో విత్తన పొదుపును కూడా ప్రోత్సహించారు, తద్వారా తదుపరి చక్రంలో ఉత్పత్తిని నిర్ధారిస్తారు. ప్రారంభ రోజుల్లో, ఈ చొరవకు మహారాష్ట్ర ప్రభుత్వంలోని రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ (RGSTC) మద్దతు లభించింది. తరువాత దీని పెరుగుదల మహారాష్ట్ర ప్రభుత్వంలోని గిరిజన అభివృద్ధి శాఖలోని శబరి ఆదివాసీ విట్ట వా వికాస్ సంస్థ మర్యాదిత్ సహాయంతో జరిగింది.

ముగింపు

అందువల్ల వ్యవసాయ రంగంలో మహిళల నేతృత్వంలోని కొత్త మరియు హరిత సంస్థలను ప్రోత్సహించడానికి తగినంత అవకాశం ఉంది. అవి సముచిత ఉత్పత్తులు లేదా సేవా ఆధారిత సంస్థలు లేదా రెండింటి కలయిక కావచ్చు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఇటువంటి వస్తువులు మరియు సేవలకు గణనీయమైన డిమాండ్ ఉన్నందున, గ్రామీణ-పట్టణ సంబంధాన్ని ఉపయోగించుకోవాలి. కొంత హ్యాండ్‌హోల్డింగ్ మరియు శిక్షణతో, మహిళా వ్యవస్థాపకులు నాణ్యమైన వస్తువులు మరియు సేవలను అందించడానికి విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఇళ్లకే పరిమితులు లేదా పొలాలకే పరిమితం చేయబడిన  వారి సహకారం నుండి, వారు ఇప్పుడు ఎక్కువ సామాజిక ఆమోదంతో కనిపించే, విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఉద్భవించారు.

ఈ వ్యవసాయ ఆధారిత సంస్థలు మహిళలకు గౌరవప్రదమైన జీవనోపాధిని అందించాయి మరియు ఏడాది పొడవునా ఆదాయాన్ని అందించాయి. అధిక ఆదాయం, సంపద మొత్తం కుటుంబానికి గొప్ప ద్వితీయ ప్రయోజనాలను పొందడానికి భరోసా కల్పించింది. ఈ సంస్థలు వివిధ గిరిజన భౌగోళిక ప్రాంతాలలో వ్యాప్తి చేయడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు తద్వారా మహిళలకు ఎక్కువ లాభదాయకతను కల్పిస్తాయి. భారతదేశంలో వ్యవసాయం చేసే మహిళలలు పెద్ద స్థాయిలో ఉన్నారు , మహిళల నేతృత్వంలోని ఇటువంటి వ్యవసాయ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారిగా ఉద్భవించగలవు.

References
https://msme.gov.in/sites/default/files/All%20India%20
Report%20of%20Sixth%20Economic%20Census.pdf
https://www.niti.gov.in/sites/default/files/2023-03/
Decoding-Government-Support-to-Women-
Entrepreneurs-in-India.pdf

Rajashree Joshi
Programme Director
BAIF Development Research Foundation, Pune.
E-mail: rajeshreejoshi@baif.org.in

Santarpana Choudhury
Associate Programme Manager
BAIF Development Research Foundation, Pune.
E-mail: santarpana.choudhury@baif.org.in

Source: LEISA India, English Edition, March 2023

Recent Posts

గ్రామీణ ప్రజలలో నూతన ఆవిష్కరణలను అవగతంచేసుకొనే  సామర్థ్యాన్ని పెంపొందించడం

గ్రామీణ ప్రజలలో నూతన ఆవిష్కరణలను అవగతంచేసుకొనే సామర్థ్యాన్ని పెంపొందించడం

గ్రామీణ వ్యవసాయదారులకు  స్థిరమైన యాంత్రీకరణ కేవలం యంత్రాల గురించి కాదు - ఇది స్థానిక సామర్థ్యం, ​​సంస్థ మరియు...

భారతదేశంలో గుమ్మడికాయల సాగుకు కొత్త కేంద్రం మైన ఒడిస్సా రాష్ట్రం

భారతదేశంలో గుమ్మడికాయల సాగుకు కొత్త కేంద్రం మైన ఒడిస్సా రాష్ట్రం

తూర్పు ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న, అధికంగా గిరిజనులు నివసించే కరంజియా బ్లాక్‌లో కను చూపు దూరం వరకు...