చిరు ధాన్యాల ఉత్పత్తి ఒక పరస్పర అభ్యాస అనుభవం

చిన్న మద్దతు గణనీయమైన మార్పులను తీసుకురాగలదు. RAWE ప్రోగ్రామ్ విద్యార్థులుగా ఇది మా అనుభవం. మిల్లెట్ రైతులతో రావే ప్రోగ్రామ్ ద్వారా అనుసంధానమై పని చేస్తున్నప్పుడు, ఆ సమయంలో మేము చాలా నేర్చుకున్నాము.

మా బి.ఎస్సీ. వ్యవసాయ పాఠ్యాంశాల్లో భాగంగా, 7వ సెమిస్టర్ విద్యార్థులను గ్రామీణ వ్యవసాయ పని అనుభవం (RAWE) కార్యక్రమం నిమిత్తమై ఒక గ్రామాన్ని మాకు కేటాయించారు. ఈ కార్యక్రమంలో, విద్యార్థులుగా పంట కాలం అంతా గ్రామంలో నివసిస్తూ, హోస్ట్ రైతుతో కలిసి పని చేసి నేర్చుకుంటాము. జూలై నుండి నవంబర్ 2022 వరకు, మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలోని బార్బాస్‌పూర్ అనే చిన్న గ్రామంలో 22 మంది విద్యార్థులను ఉంచారు.

బార్బాస్పూర్ గ్రామంలో దాదాపు 450 మంది రైతులు ఉన్నారు మరియు వారికి వ్యవసాయం జీవనోపాధికి ప్రధాన వనరు. బార్బాస్పూర్ ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర కొండల జోన్ కిందకు వస్తుంది, ఇక్కడ కొండలు మరియు ఎత్తుపల్లాల స్థలాకృతి ఉంటుంది. ప్రధాన నేలలు ఎరుపు మరియు పసుపు, తరువాత ఇసుక నేలలు ఉంటాయి. వరి, మొక్కజొన్న, కంది ప్రధాన ఖరీఫ్ పంటలు, గోధుమ, శనగ మరియు కాయధాన్యాలు రబీ సీజన్‌లో పండిస్తారు. అయితే, గ్రామంలోని దాదాపు సగం మంది రైతులు వర్షపాతం అనిశ్చితి కారణంగా ఖరీఫ్ సమయంలో తమ భూములను బీడుగా వదిలివేస్తారు. ఎత్తైన భూములు లేదా వాలుగా ఉన్న భూములు ఉన్న రైతులు వరి నాట్లు వేయడానికి నీటిని నిలుపుకోవడం కష్టంగా భావిస్తారు. అందువల్ల, రైతులు రబీ సీజన్‌లో మాత్రమే పంటలను పండించడానికి ఇష్టపడతారు.

శ్రీ ప్యారేలాల్ నా ఆతిథ్య రైతు , చాలా సంవత్సరాలుగా వరి పండిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల నుండి అతను తన 2 ఎకరాల భూమిలో అరికెలను పండించడం ప్రారంభించాడు, ఎందుకంటే పంటకు నీటిపారుదల మరియు ఎరువులు వంటి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని అతను భావించాడు. మొత్తం గ్రామంలో కోడో మిల్లెట్‌(అరికెలు)ను పండించిన మూడు కుటుంబాలలో అతని కుటుంబం ఒకటి. చాలా మంది రైతులు, అందుబాటులో ఉన్న మార్కెట్ల గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో కోడో మిల్లెట్‌లను పండించడంపై నమ్మకంగా లేరు. ప్యారేలాల్‌కు కూడా ఈ భయం ఉంది. "మా పంటను మరియు ఉత్పత్తుల అమ్మకాన్ని నిర్వహించడానికి మేము సాంకేతికంగా తగినంతగా లేము, కాబట్టి మా సొంత  పొలం నుండి తినడానికి ఏదైనా పొందడానికి అరికెలను పంటగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాము" అని ప్యారేలాల్ ఉటంకించారు.

చిన్న మార్పులు, పెద్ద లాభాలు

మేము విద్యార్థులుగా మరియు ఆసక్తిగల అభ్యాసకులుగా,  ఒక అవకాశాన్ని మరియు పరిష్కారం కోసం ఆలోచించాము. ఖరీఫ్‌లో, వర్షాభావం వలన నీరు అవసరం లేని ఎత్తుపల్లాల భూములలో వరిపంటకు బదులుగా కోడో మిల్లెట్ మంచి ఎంపిక మరియు ప్రత్యామ్నాయం అని మేము గ్రహించాము. ప్యారేలాల్ మరియు ఇతర ఆసక్తిగల రైతులను సమీపంలోని KVK ఉమారియాతో అనుసంధానించాలని మేము నిర్ణయించుకున్నాము. KVK నుండి సాంకేతిక మార్గదర్శకత్వంతో, రైతులు మంచి పంట నిర్వహణ పద్ధతులను అవలంబించారని మేము నిర్ధారించుకున్నాము. ఉదాహరణకు, అడవి జంతువులు పంటలను తొక్కడం వల్ల కలిగే పంట నష్టాన్ని ప్యారేలాల్ ఎదుర్కొంటున్నాడు. అంతకుముందు, అతను రాత్రంతా పొలానికి  కాపలాగా ఉండేవాడు, ఇది చాలా శ్రమతో కూడుకున్నది. KVK మార్గదర్శకత్వంతో, అతను జంతువుల వికర్షకం మందు నీల్గోలో ముంచిన తాడుతో పొలాలకు కంచె వేశాడు. జీవామృతం తయారీపై KVK రైతులకు శిక్షణ ఇచ్చింది. తదుపరి పంట కాలంలో విత్తేటప్పుడు నేలలో రైజోబియం మరియు భాస్వరం కరిగే బాక్టీరియా కల్చర్‌లను చేర్చాలని రైతులకు సూచించారు. ఈ చిన్న మార్పులు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడిలో 30% పెరుగుదలకు దారితీశాయి మరియు ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

రైతులు చిరుధాన్యాలు పండించడానికి ప్రోత్సహించబడేలా ఉత్పత్తులను అమ్మడానికి మరిన్ని మార్కెట్ అవకాశాలను  చూడాలని మేము కోరుకున్నాము.ఈ ప్రాంతంలో పనిచేస్తున్న NGO అయిన ASHA ఫౌండేషన్ కార్యనిర్వాహకులతో రైతుల సమావేశం ఏర్పాటు చేసాము. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి ఫౌండేషన్ అంగీకరించింది మరియు ధర సరిపోతుందని రైతులు భావిస్తే నాసిక్‌లోని కొనుగోలుదారులతో అనుసంధానం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుండి తమ స్టాక్‌ను రవాణా చేసే జబల్‌పూర్‌లోని చిరుధాన్యాల విక్రేతలతో కూడా మేము మాట్లాడాము. నాణ్యతను కాపాడుతున్నందున, ధాన్యాన్ని సేకరించడానికి సమీప జిల్లాల నుండి రైతులను కనుగొనడం పట్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను పోల్చిన తర్వాత, ప్యారేలాల్ తన ఉత్పత్తులను పొరుగు జిల్లాలోని మిల్లెట్  ప్రాసెసింగ్ యూనిట్ కొనుగోలుదారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే ఈ సంవత్సరం వారికి వారి నుండి మంచి ధర లభించింది.

యాదృచ్చికంగా, అదే సమయంలో, పక్కనే ఉన్న దిండోరి జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దిండోరి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, వారు మంచి ధరలకు టన్నుల కొద్ది మిల్లెట్లను నిల్వ చేస్తున్నారు. చివరికి ఇదంతా పంట ద్వారా లభించే ధరలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, గిట్టుబాటు ధర లబించే అవకాశం ఉంది. ఒక సంభాషణ సందర్భంగా ప్యారేలాల్ మాట్లాడుతూ, "సమీపంలో ప్రాసెసింగ్ మిల్లు తెరవడం మన అదృష్టం, ఎక్కువ ఇబ్బందులు లేకుండా, వరి పంట కంటే కోడో మిల్లెట్లు పండించడం మంచి ఎంపికగా కనిపిస్తుంది" అని అన్నారు. మరియు ఒక మహిళా రైతు ఝల్కి బాయి మాట్లాడుతూ "ఇవ్వబడుతున్న ధరలు మరియు మిల్లింగ్ సౌలభ్యం వచ్చే సీజన్‌లో మరింత మెరుగైన రాబడి కోసం నాకు ఆశను ఇస్తున్నాయి" అని అన్నారు. దిండోరిలో త్వరలో ప్రారంభించనున్న మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ మిల్లెట్ల సాగు విస్తీర్ణాన్ని విస్తరించడానికి ఉత్ప్రేరకంగా దోహదపడుతుంది. రైతులు తమ ఉత్పత్తులను మిల్లింగ్ కోసం పంపే అవకాశం ఉంటుంది, తరువాత దానిని తమకు నచ్చిన కొనుగోలుదారులకు విక్రయించవచ్చు లేదా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు.

పరస్పర అభ్యాసం

మిల్లెట్లు పండించడానికి తక్కువ నీరు అవసరం, రైతులు తమ బీడు భూములను మిల్లెట్ల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చని తెలుసుకున్నారు. మిల్లెట్లు అద్భుతమైన నిల్వ నాణ్యతను కలిగి ఉన్నాయి అందువల్ల తక్కువ ధరలకు అమ్మకాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని కూడా వారు అర్థం చేసుకున్నారు. చిరుధాన్యాన్ని నిల్వ చేయడం మరియు సరైన సమయంలో అమ్మడం యొక్క ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకున్నారు. అలాగే, విద్యార్థులతో క్రమం తప్పకుండా సంభాషించడం ద్వారా, మిల్లెట్ల కోసం డిమాండ్ పెరుగుతుందని మరియు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మెరుగైన మార్కెట్ అవకాశాలకు దారితీస్తుందని రైతులు తెలుసుకున్నారు. మెరుగైన అవగాహనతో, 2023 ఖరీఫ్ సమయంలో గ్రామంలో ఎక్కువ మంది రైతులు కోడో మిల్లెట్ల ఉత్పత్తిని చేపట్టాలని మేము ఆశిస్తున్నాము. మిల్లెట్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో, మిల్లెట్ల సమృద్ధిగా ఉండే ఆహారాలు కలిగిన కుటుంబాలకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా లబిస్తుంది.

RAWE కార్యక్రమం విద్యార్థులకు ఒక గొప్ప అభ్యాస అవకాశం. స్థానిక నేలలు, వాతావరణం మరియు మారుతున్న వర్షపాత నమూనాల ఆధారంగా పంట ఎంపికలను ఎలా చేయాలో, వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో మేము నేర్చుకున్నాము. విలువ జోడింపు మరియు రైతుల ఆర్థిక స్థితిలో తీసుకురాగల మార్పును కూడా విద్యార్థులు అభ్యసించారు.

Surabhi
Student,
Jawaharlal Nehru Krishi Vishva Vidhyalaya,
Jabalpur, M.P. 482004
E-mail: surabhisingh3909@gmail.com

 

Source: LEISA India, March 2023 English Edition

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....