మహిళా రైతులచే వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని పెంపొందించడం

వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం అనేది  పర్యావరణ వ్యవస్థ యొక్క సహజ వనరుల స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి రూపొందించబడిన సమగ్ర విధానం, ఈ సమగ్ర విధానంలో పంటలు మరియు పశువుల ఉత్పత్తి వ్యవస్థలు కలిసేఉంటాయి. వాతావరణ వైవిధ్యాన్ని ఎదుర్కొంటూ ఉత్పాదకత మరియు వ్యవసాయ ఆదాయాలను నిర్వహించడం మరియు మెరుగుపరచడం అంతిమ లక్ష్యం. భారతదేశంలోని వాటర్‌షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ (WOTR) వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం (CRA) పద్ధతులను అవలంబించమని మహిళలను ప్రోత్సహిస్తుంది.

ఈ బహుముఖ భావన రైతులను, ముఖ్యంగా మహిళలను వాతావరణ వైవిధ్యానికి మరింత అలవాటుపడేలా  చేయడానికి అనేక వ్యూహాలు మరియు సాంకేతికతలను కలిగి ఉంటుంది. వీటిలో ఇవి ఉన్నాయి:

  1. ప్రాంతానికి అనువైన పంట రకాలను ప్రోత్సహించడం.
  2. సమర్థవంతమైన నీటి నిర్వహణ.
  3. వివిధ రకాల నేలలో తేమ సంరక్షణ పద్ధతులను అవలంబించడం.
  4. సమగ్ర పోషకాల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (IPM) ను పాటించడం.
  5. పంట నిర్వహణ పద్ధతుల గురించి సమాచారాన్ని ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకోవడానికి “ఫార్మ్ ప్రిసైజ్” యాప్‌ను ప్రోత్సహించడం.

గృహ ఆహార భద్రతను మెరుగుపరచడానికి మరియు వారి పొలాల వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి, సామర్థ్యం పెంపుదల మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళల భాగస్వామ్యం నిరూపించబడింది. సమగ్ర పోషకాల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం, పెంపుడు జంతువుల యాజమాన్యం,బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, పంటల ప్రణాళిక మరియు పెరటితోటల పెంపకం వంటి అనేక అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యకలాపాలన్నింటినీ ఎలా ప్రారంభించాలో అవగాహన తరగతులు నిర్వహించబడ్డాయి. బహిరంగ సందర్శనలు వారికి నమూనా పొలాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి మరియు రైతులతో సంభాషించడానికి అవకాశాన్ని కల్పించాయి.

వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన మహిళలు చేపట్టిన కార్యకలాపాల శ్రేణి ఈ క్రింద ఇవ్వబడింది.

మహిళా ప్రమోటర్లు మహిళా రైతుల బృందంతో కలిసి వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంపై రైతు క్షేత్ర పాఠశాలను నిర్వహిస్తున్నారు. రైతు క్షేత్ర పాఠశాలలు (FFS) అనేది రైతులు ఆరోగ్యకరమైన పంటను ప్రోత్సహించడంలో సహాయపడే వేదిక. పంట పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం, వ్యవసాయ పద్ధతులను సముచితంగా ఉపయోగించడం మరియు రైతుల మధ్య మంచి వ్యవసాయ పద్ధతుల గురించి జ్ఞానం మరియు ఆలోచనలను మార్పిడి చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు.

సేంద్రీయ ఫార్ములేషన్స్ తయారీ వలన పంట దిగుబడిని మెరుగుపరచడానికి, ఇన్‌పుట్ ఖర్చును తగ్గించడానికి దోహదపడుతుంది.నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరచడానికి, పంట పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు కొంతవరకు తెగుళ్ల బారిన పడకుండా ఉండటానికి మహిళా రైతులు కలిసి జీవామృతం, అమృతపాణి మరియు దశపర్ణి మందసాలను తయారు చేశారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన కొంతమంది మహిళలు అమృతపాణి మరియు దశపర్ణి మందసాలను తయారు చేసి గ్రామ స్థాయిలో విక్రయించారు.

మంజుబాయి గుర్జార్, బిసాలి, చిపా బరౌద్ (రాజస్థాన్) రాత్రి సమావేశంలో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం గురించి గ్రామస్తులలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ చిత్రం ఆమె ఎక్కువగా పురుష రైతుల బృందం ముందు నమ్మకంగా నిలబడి, తన సందేశాన్ని హామీతో అందిస్తున్నట్లు చూపిస్తుంది.

కొంతమంది మహిళా రైతులు మంచి వ్యాపారులుగా మారారు మరియు ఇతరులను వ్యాపారాలు చేపట్టడానికి ప్రేరేపిస్తున్నారు. అహ్మద్ నగర్ ప్రాంతంలోని కర్జాత్‌లో, మహిళా రైతులు పొరుగు ప్రాంతం నుండి వచ్చిన మహిళా రైతులతో ఉల్లిపాయ ప్రాసెసింగ్ యూనిట్‌పై తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు.

పోషక నిర్వహణ కింద బయో ఇన్‌పుట్‌ల వాడకం గురించి మహిళా రైతులకు నేర్పుతారు. వసుంధర సేవిక FFS సెషన్‌లో పంటలకు కావలసిన పోషక అవసరాలకు సేంద్రీయ ఆధారిత ఉత్పత్తుల తయారీని మరియు వాటి ఉపయోగాలను ప్రదర్శిస్తుంది. సేంద్రీయ ఎరువులను మరియు సస్యరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే స్థానిక బయోమాస్‌ను గుర్తించడం మహిళలు నేర్చుకుంటారు. దాని ఉపయోగం మరియు వాడే విధానం  కూడా సమూహ సభ్యులతో చర్చించారు.

మహిళలు వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులను నేర్చుకోవడమే కాకుండా, ర్యాలీలు మరియు ప్రచారాల ద్వారా ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రతికూలవాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ పద్ధతులను స్వీకరించడం మరియు ప్రోత్సహించడం కోసం మహిళా రైతులు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కనిపించారు.

వ్యవసాయ పర్యావరణ శాస్త్ర సూత్రాలు - స్థిరమైన మరియు స్థితిస్థాపక వ్యవసాయ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి పెట్టడం, బహుళ అంతస్తుల వ్యవసాయం యొక్క పద్ధతులు మరియు ప్రయోజనాలకు దగ్గరగా ఉంటాయి. బహుళ అంతస్తుల వ్యవసాయం జీవవైవిధ్యాన్ని పెంచుతుంది, వాతావరణ వైవిధ్యానికి అనుగుణంగా ఉంటుంది, వనరుల వినియోగాన్ని సమపాళ్లలో అందిస్తుంది మరియు వ్యవసాయ వ్యవస్థలలో స్థితిస్థాపకతను పెంచుతుంది. ఇది వివిధ రకాల పంటలను అందించడం మరియు ఏడాది పొడవునా తాజా ఉత్పత్తులను నిరంతరం సరఫరా చేయడం ద్వారా ఆహార భద్రతకు దోహదం చేస్తుంది, వివిధ రకాల ఆహార పాదార్ధాలు మరియు పోషకాలు తీసుకోవడాన్ని  మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కరువు మరియు మహమ్మారి వంటి సంక్షోభాల సమయంలో ఆహారం మరియు పోషకాహార భద్రతను నిర్ధారించడం ద్వారా రైతుల అనుకూల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైతులు మరింత స్వావలంబన, మెరుగైన సన్నద్ధత మరియు స్థితిస్థాపకంగా మారడానికి ఇది సహాయపడుతుంది.

మధ్యప్రదేశ్‌లో పశువైద్యుల కొరత సమస్యను పరిష్కరించడానికి WOTR అనే సంస్థ 45 మంది మహిళలను పశుశాఖీలుగా ఎంపిక చేసింది. ప్రభుత్వ పశువైద్యులు పశుశాఖీలకు టీకా నిర్వహణ మరియు ఔషధ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న ప్రాథమిక శిక్షణను అందించారు. పశుశాఖీలు గ్రామంలో సమర్థవంతంగా నావిగేట్ చేయడానికి, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండటానికి మరియు నైపుణ్యం కలిగిన శిక్షకులుగా పనిచేయడానికి సన్నద్ధమయ్యారు. పశుశాఖీలు పశువుల సర్వేలను నిర్వహిస్తారు, అవసరమైన టీకాలు వేస్తారు, సమగ్ర పశువులు మరియు ఔషధ రికార్డులను నిర్వహిస్తారు మరియు నామమాత్రపు రుసుముతో సమాజానికి తమ సేవలను విస్తరిస్తారు. జూలై 2023 నుండి ఆగస్టు వరకు, ఈ పశుశాఖీలు దాదాపు 13,000 పశువుల పెంపుడు జంతువులకు విజయవంతంగా టీకాలు వేశారు.

పాఠశాల విద్యార్థులను చిన్న వయస్సులోనే పాల్గొనేలా చేయడం ద్వారా పర్యావరణ ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆకులు తినే గొంగళి పురుగులను నియంత్రించడానికి సోయాబీన్ పంటలో 'సమగ్ర సస్యరక్షణ నిర్వహణ' కార్యకలాపాల భాగంగా బాలికలు పక్షి కొమ్మలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ పంటలను తెగుళ్ల దాడి నుండి నియంత్రించడానికి ఇది పర్యావరణ అనుకూల మార్గం. ఇది రైతులకు ఆర్థిక నష్టాలను నివారిస్తుంది.

శ్రీ వరి సాగు విధానం:

మరొక ప్రాజెక్టు ప్రాంతంలో, మహిళా రైతులు శ్రీ వరి సాగు విధానం (SRI) ను అభ్యసించడానికి ముందుకు వచ్చారు. దీనికి సాంప్రదాయ వరి సాగు విధానం కంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చు . అలాగే విలువైన నీటి వనరుల వినియోగం బాగా తగ్గుతుంది, తద్వారా మెరుగైన వనరుల నిర్వహణ జరుగుతుంది.

ఔరంగాబాద్‌లోని గంగాపూర్‌లోని ప్రాజెక్టు ప్రాంతాలలో ఒకదానిలో, మహిళా రైతులకు సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి పసుపు రంగు జిగట ఉచ్చులను ఉపయోగించడం నేర్చుకున్నారు.

జార్ఖండ్‌లో, వర్షాభావ పరిస్థితుల కారణంగా మహిళా రైతులు మిల్లెట్ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయకంగా, వారు వరి పంటను సాగు చేస్తున్నారు. మిల్లెట్‌లకు మారడం వలన  అవి వాతావరణ హెచ్చు తగ్గులను తట్టుకోగలవు, ఎందుకంటే వరితో పోలిస్తే మిల్లెట్‌లు పెరగడానికి చాలా తక్కువ నీరు అవసరం. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని 2023 ను ఎంపికచేసి,చిరుధాన్యాలపై మరింత అవగాహనకొరకు అనేక కార్యక్రమాలు  జరుపుకోవడానికి ఇది ప్రశంసనీయమైన చొరవ.

Prithviraj Gaikwad
Sr. Agri. Officer
Watershed Organisation Trust
(WOTR), Pune

Harshal Khade, Arun Bhagat and
Preetilata Gaikwad
Watershed Organisation Trust
(WOTR), Pune

Source: LEISA India, September 2023 English Edition

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....