ఇటీవల కాలంలో ఆహారోత్పత్తిపై పట్టు కోల్పోయిన కేరళ మహిళలు ఇప్పుడు తిరిగి తమ వ్యవసాయ క్షేత్రాలలోనికి అడుగుపెడుతున్నారు. ఈ సారి వారు తమ సాగు విధానంలో సాదాసీదా సేంద్రీయ విధానాలను, స్థానికంగా అందుబాటులో ఉన్న పద్ధతులను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. పర్యావరణహితమైన ఈ విధానాలను అవలంబించడంలో ఆసక్తి వారిలో బాగా పెరిగింది. ఆ స్ఫూర్తితోనే వారంతా రైతు సంఘాలుగా సమైక్యమవుతున్నారు. రైతు సంస్థల సహకారం తీసుకుంటున్నారు. వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.
వైవిధ్యంతో కూడిన వ్యవసాయ సంస్కృతి ఇటీవల కాలంలో కేరళలో కనుమరుగైపోతోంది. పెరటి నేలల్లో సాగు అంతరించిపోతోంది. అందుకు ప్రధానమైన కారణం – కొబ్బరి, రబ్బరు, కోకో, కాఫీ తోటల పెంపకం ఎక్కువయిపోయింది. ఈ మార్పు ప్రభావం ప్రధానంగా మహిళలకు ఆహోరోత్పత్తిలో ఏ కొంచెం ప్రాముఖ్యం లేకుండా పోయింది. అంతేకాక, కుటుంబ ఆరోగ్య సంరక్షణలో వారికి ప్రమేయం అనేది లేకుండా పోయింది. సహజసిద్ధమైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులు దూరమైపోయాయి. సొంతంగా భూములు ఉన్నా కూడా మహిళలు తమకు, కుటుంబానికి అవసరమైన ఆహార పదార్ధాల కోసం మార్కెట్ పై ఆధారపడవలసిన దుస్థితి ఎదురైంది. పర్యవసానంగా మొత్తం కేరళ రాష్ట్రం, సామాన్య కుటుంబాలు ఆహార భద్రతను కోల్పోయాయి. ముఖ్యంగా వారికి లభించే ఆహారం నాణ్యత, వైవిధ్యం ఇప్పుడు వారికి అందడం లేదు.
త్రివేండ్రం జిల్లాలోని విజింజం, వెంగనూరు పంచాయతీల పరిధిలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతున్న ప్రధాన పరిశ్రమ. అంతేకాక, అక్కడి ప్రజానీకానికి వ్యవసాయం ప్రధాన జోవనోపాధి మార్గం. చేపల పెంపకం కూడా వారికి అదనపు ఆదాయం సమకూరుస్తాయి. ఈ రెండు పంచాయతీల పరిధిలోని సంప్రదాయక సేద్యపు పనుల్లో పురుషుల పాత్రే ఎక్కువ. వారు రసాయనిక ముడి సరుకులపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కాయగూరలు, అరటి తోటలు, టపైకా (tapioca) సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వారికి రసాయనాల దుష్ర్పభావం గురించి కానీ, భూసారాన్ని కాపాడాలనే విషయంపై కానీ, వ్యవసాయం సుదీర్ఘ కాలం సుస్థిరంగా చల్లగా సాగాలనే అంశంపై కానీ వారికి ఏ మాత్రం దృష్టి లేదు. అది 2002. ఆ సంవత్సరం థానాల్ అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణపరమైన సమస్యల కోణంలో సాగు పనులను చూడడం మొదలుపెట్టింది. అదే సమయంలో తోటి మానవుల ఆరోగ్యం, జీవనోపాధుల గురించి కూడా ఈ సంస్థ శ్రద్ధ తీసుకుంది. ఈ సంస్థ తిరువనంతపురం కేంద్రంగా పనిచేయడం ప్రారంభించింది. ముందుగా ఈ రెండు పంచాయతీలలో వ్యవసాయం వృత్తిగా స్వీకరించిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ తన కృషి ప్రారంభించింది.
వైనాడ్ జిల్లాలోని తిరునెల్లి పంచాయతీలో చేపట్టిన అధ్యయనం ప్రకారం వ్యవసా క్షేత్రాలలో ఆహారంగా ఉపయోగపడే దాదాపు 100 రకాల మొక్కలు సహజసిద్ధంగా, మనం ప్రత్యేకంగా సాగుచేయవలసిన అవసరం లేనివాటి గురించిన అవగాహన మహిళా రైతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సేంద్రీయ విధానాలతో వరి సాగు చేసే పొలం భూముల్లో ఈ తరహా మొక్కలు పెరుగుతాయనేది మహిళలకు మాత్రమే తెలిసిన పరమ రహస్యం. .....
కోవలం పరిసరాలలో ఈ స్వచ్ఛంద సంస్థ స్థానిక మహిళలను, మహిళా సంఘాలను సంప్రదించింది. వారి జీవన విధానాలను, వారి జీవోనోపాధులను అధ్యయనం చేసింది. పంచాయతీలు మహిళలను స్వయం సహాయక సంఘాలుగా అయితే సమైక్యం చేయగలిగింది. కానీ, వారికి వస్తు ఉత్పాదనలోకానీ, ఆర్థికపరమైన వ్యవహారాలలో కానీ తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని గుర్తించింది. రోజు కూలీలుగా ఆదాయం సంపాదించడం తప్ప సుస్థిరమైన లాభదాయకమైన జీవనోపాధుల గురించిన ఆలోచనే వారిలో కనిపించలేదు. పంచాయతీ వర్గాలతో చర్చించిన తర్వాత , థానాల్ సంస్థ వారి కోసం అనేక శిక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. కొబ్బరి చెక్కలతోను, పారవేసిన వస్త్రాలతోను, పేపరును, జనుప నారను ఉపయోగించడం ద్వారాను రకరకాలైన ఉత్పాదనలు తయారుచేయడంలో వారికి శిక్షణ ఇప్పించింది. అయితే రెండు సంఘాల సభ్యులు వ్యవసాయం మీద ఆసక్తి చూపించారు. ముఖ్యంగా కాయగూరల పెంపకంపై వారు ఆసక్తి చూపించారు. సమస్య ఏమిటంటే ఈ మహిళా సంఘాలలోని చాలా మందికి సొంతంగా అంగుళం భూమి లేదు.
ఈ మహిళలకు చేయూత అందించాలనే ఆలోచన వచ్చింది. దాంతో కొంత మంది భూస్వాములతో గ్రామ పెద్దలు సంప్రదించారు. వారి భూములను మహిళా సంఘాలకు కౌలుకు ఇచ్చేందుకు ఒప్పించారు. అందుకు అవసరమైన ఒప్పందాలు కుదిర్చారు. ఆ రకంగా సేకరించిన భూముల్లో కాయగూరల పెంపకానికి మహిళలను ప్రోత్సహించారు. నిజానికి ఈ రకంగా సేకరించిన భూములు కొబ్బరి తోటలు మాత్రమే. వాటిలో ఏక పంట సాగు చేయడమే అలవాటు. అందువల్ల మధ్యలో చాలా స్థలం ఉపయోగకరఁగా కనిపించింది. అక్కడి మట్టి అంతగా సారవంతమైనది కాదు. నీటి వనరులు చాలా తక్కువ. పచ్చటి ఎరువు కానీ, సేంద్రీయ ఎరువులు కానీ అంతగా లభించవు.
ముందుగా మహిళలకు జీవవైవిధ్యం గురించి, సేంద్రీయ ఎరువుల ప్రయోజనాల గురించి, భూ సారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం గురించి, పంటలను సాగు చేసే పద్ధతుల గురించి అవగాహన కల్పించేందుకు దృష్టి పెట్టారు. ఫలితంగా ఏడాది కాలంలో కొబ్బరి తోటలుగా ఉన్న భూములు వివిధ రకాలైన కాయగూరలతో, అరటి తోటలతో, దుంపల మొక్కలతో నిండుగా కళకళలాడసాగాయి. మహిళలు ఆ తోటలను ఎంత జాగ్రత్తగా సంరక్షించారంటే, కొబ్బరి ఫలసాయం కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఈ మార్పు భూస్వాములకు కూడా పూర్తి సంతృప్తిని మిగిల్చింది. ఇది శుభారంభం. ఇతర ప్రాంతాల భూ యజమానులు కూడా స్వయంగా వచ్చి పొలంలో కనిపించిన మార్పు చూసి అభినందిస్తూ వచ్చారు.
ఆరంభంలో ఆ మహిళలు తమ కృషి పలితాన్ని ఇరుగుపొరుగు వారితో కలిసి పంచుకునేవారు. ఉత్పత్తి పెరిగే కొద్దీ, స్థానిక మార్కెట్ కు సరఫరా చేస్తూ వచ్చారు. అయితే స్థానిక మార్కెట్ వారికి నిరుత్సాహాన్నే మిగిల్చింది. అందువల్ల వారంతా తమ ఉత్పత్తులకు విడిగా మార్కెట్ అవసరమని గుర్తించారు. వినియోగదారులు స్వయంగా తమ ఉత్పత్తులను చూసి మెచ్చుకుని, కొనుగోలు చేయాలని వారు ఆశించారు. ఫలితంగా తిరువనంతపురంలో సేంద్రీయ బజార్ ఏర్పాటైంది.
వెంగనూరు పంచాయతీకి చెందిన శశికళకు చిన్నతనం నుంచి వ్యవసాయం మీద మక్కువ చాలా ఎక్కువ. పెళ్లి అయిన తర్వాత భర్తకు వ్యవసాయం పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. వారి వ్యవసాయం పూర్తిగా సంప్రదాయం ప్రకారం సాగేది. అందువల్ల ఎరువుల వాడకం తప్పనిసరిగా ఉండేది. ఆ సమయంలో శశికళ సేంద్రీయ ఎరువుల గురించిన విషయాలు తెలుసుకుంటూ వాటిపై ఆసక్తి పెంచుకుంటూ వచ్చింది. థానాల్, గాంధీ స్మారక నిధి వంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే శిక్షణ కార్యక్రమాలకు హాజరై బాగా అవగాహన పెంచుకుంది. ముందుగా ఇంటి పెరట్లోనూ, అటూఇటూ ఉన్న స్థలంలోనూ అలంకరణకు ఉపయోగపడే మొక్కల పెంపకం మొదలుపెట్టింది. వాటి పెంపకంలో పూర్తిగా సేంద్రీయ విధానాలనే అనుసరించింది. అవసరమైన సహాయాన్ని కృషి భవనం నుంచి సబ్సిడీ రూపంలో అందుకుంటూ వచ్చింది. తాను సాధించిన ఉత్తమ ఫలితాలను శశికళ తన ఇరుగుపొరుగు వారికి కూడా వివరించి వారిక స్ఫూర్తినిచ్చింది. పదేళ్ల క్రితం అంటే 2005-06లో శశికళను కిలిసిన ఆమె స్నేహితురాలు వంగ విత్తనాలు సమకూర్చింది. వాటితో సేంద్రీయ విధానంలో ఆమె సాగు చేసిన వంగ తోట అద్భుత పలితాలనిచ్చింది. ఇలా సేంద్రీయ పద్ధతుల్లో పెంచిన వంకాయల రుచి అమోఘమని గుర్తించింది. దాంతో సేంద్రీయ వ్యవసాయమే తన పరమావధిగా నిర్ణయించుకుంది. సంప్రదాయక వంగడాల సేకరణ ప్రారంభించింది. ఎక్కడెక్కడి స్నేహితులు ఈ విషయంలో ఆమెకు సహకరించారు. ఆమె పూర్తికాలాన్ని తోటల్లోనే గడిపేది. అందుకు ఆసమయంలో కుటుంబలోని సభ్యుల నుంచి కూడా పూర్తి సహకారం అందింది. ఇప్పుడు త్రివేండ్రం లోని సేంద్రీయ బజారుకు ప్రధాన సరపరాదారుల్లో శశికళ ముఖ్యమైన స్థానం సంపాదించింది. అంతేకాదు, వెంగనూరు పంచాయతీ, గాంధీ స్మారక నిధి కూడా ప్రకృతి సహజ సాగు విధానాలు అనుసరిస్తున్న వారిలో ఆమెను ఉత్తమ రైతునారిగా సత్కరించాయి. తాను సేంద్రీయ వ్యవసాయాన్ని కేవలం ఆదాయం కోసమే చేపట్టలేదని శశికళ అంటుంది. తన కుటుంబానికి సురక్షితమైన, ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని అందించాలనేది తన ప్రధానమైన ఆశయం అని చెబుతుంది ఆమె. సేంద్రీయ సాగు పద్ధతిలో కేవలం 30 సెంట్ల భూమిలోను, తన ఇంటి మిద్దెపైనా ఆమె కాయగూరల పెంపకం చేపడుతోంది. దాదాపు అన్ని రకాలైన కాయగూరలు ఆమె పెరటి తోటలో కనిపిస్తాయి. బెండ, వంగ, టమోటా, పచ్చి మిర్చి, దొండ, కొలోకేసియా, బీన్స్, మునగ, కరివేపాకు, బొప్పాయి, క్యాబేజీ, కాలీఫ్లవర్, అల్లం, పసుపు, ఆకు కూరలు ఆమె తోటల పంటలు. నీటి వాడకంలో చాలా పొదుపు పాటిస్తుంది. మొక్కల పెంపకానికి బావి నీటిని ఉపయోగిస్తుంది. నేలలో తేమ నిలిచేందుకు అవసరమైన చెత్త, వ్యర్థ పదార్థాలను ఉపయోగిస్తుంది. ఈ చెత్త వాడకం కారణంగా తన మడుల్లో లాభదాయకమైన క్రిమికీటకాలు, పురుగు పుట్రా సమృద్ధిగా పెరుగుతున్నాయని శశికళ చెప్పారు. ఈ కరాణంగా ప్రత్యేకంగా ఎలాంటి సేంద్రీయ క్రిమి సంహారకాలను వాడాల్సిన అవసరం రావట్లేదట. మొత్తం మీద 30 సెంట్ల మడిలో పచ్చని బంగారం నిత్యం మెరుస్తూ ఉంటుందని ఆమె ధీమాగా చెప్పగలుగుతున్నారు. సేంద్రీయ సాగు విధానం ప్రారంభించే సమయంలో నెలకు కేవలం వెయ్యి రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ రకంగా సేంద్రీయ పద్ధతిలో సాగుచేసిన కాయగూరల అమ్మకం ద్వారా నెలకు నాలుగు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతోంది. అది కూడా ఇంటి అవసరాలు అన్నీ తీరిన తర్వాత. తన అనుభవాలను, ఆరోగ్యవంతమైన ఆహారం పొందగలుగుతున్న తీరును ఆమె ఇరుగుపొరుగు వారికి, స్నేహితులకు, బంధువులకు అందరికీ తెలియజేస్తోంది. మరెందరికో శిక్షణ ఇస్తోంది. ఆమె అభిప్రాయం ప్రకారం – మనం మొక్కలను ప్రేమతో, జాగ్రత్తగా చూసుకుంటే అవి మనలను ఎన్నడూ మోసం చేయవు. ఆమొక్కలు మరింత సంతోషంగా మనకు మంచి ఫలసాయాన్ని అందిస్తాయి. |
ఆదర్శప్రాయమైన మార్గం
కేరళలోని మహిళలు అనుసరిస్తున్న సేంద్రీయ సాగు విధానం, ఆహారోత్పత్తి అన్ని ప్రాంతాల వారూ తప్పక అనుసరించవలసిన ఉత్తమ మార్గం. వారిలో చాలా మంది బయటి నుంచి ముడి సరుకును ఉపయోగించడం లేదు. వారంతా స్థానికంగా లభించే సేంద్రీయ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఇది వారికి ఎన్నో విధాలుగా లాభదాయకమవుతున్నది. కల్తీ లేని ఆహారం లభిస్తోంది. సాగు చేయడంలో బయటి సాయం అవసరం లేకుండా పోయింది. స్వయంగా సాగు విజ్ఞానం సమకూర్చుకుంటున్నారు. అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారు తమ నిత్య దైనిందన కార్యకలాపాలను పక్కన పెట్టవలసిన అవసరం లేదు. మొత్తం మీద మహిళలు ఇప్పుడు సగర్వంగా తలెత్తుకు తిరగ్గలుగుతున్నారు. కొందరు మరి కొందరికి శిక్షణ ఇచ్చే బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.
విభన్నమైన పంటల సాగులో సేంద్రీయ విధానం ప్రయోగాత్మకంగా చేపట్టడం మంచి ఫలితాలను అందించింది. బయటి ముడి సరుకుల అవసరం లేకుండా సేద్యం చేయడంలో ఉత్తమ మార్గాలను ఈ రెండు పంచాయతీలు ఆచరణలో స్పష్టంగా అందరికీ చూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మరెన్నో పంచాయతీలు, వ్యవసాయ విభాగాలు ఇటువంటి ప్రాజెక్టులకు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా భూమి లేని నిరుపేద, చిన్న, మధ్య తరగతి రైతన్నలకు చేయూతనిస్తున్నాయి. పర్యావరణహితమైన ఈ సాగు విధానాలపై రైతు సంఘాలు, సంస్థలు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాయి. పోషకాహారం సంపాదించుకుంటూ వ్యవసాయ రంగంలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించే విధానాలపై వారంతా చూపు సారించారు.
ఉషా. ఎస్
థానాల్
ఓడీ 3 – జవహర్ నగర్,
కౌదియార్ పోస్ట్, తిరువనంతపురం
కేరళ – 695 003
E-mail: ushathanal@gmail.comఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౫



