జీవ వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుదాం

ప్రకృతి సహజమైన వ్యవస్థలో పోషకాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ దానిని శక్తివంతమైనదిగా తీర్చిదిద్దేందుకు చేపట్టే చర్యలు ఏవైనా సరే ఆ వ్యవస్థను భవిష్యత్ తరాల వారిని కూడా పుష్టివంతులనుగా నిలబెట్టేందుకు ఉపకరిస్తాయి. రసాయనాలు, క్రిమి సంహారకాల వాడకం అదుపు తప్పిపోవడంతో భూసారం క్షీణించిపోవడానికి కారణమవుతోంది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులు అంతరించిపోయేందుకు కారణమవుతోంది. ఈ పరిస్థితులలో మానవ జాతితో పాటు మా చుట్టూ ఉన్న జీవజాతులు యావత్తూ సురక్షితంగా మనుగడ కొనసాగించేందుకు ఆచరణాత్మకమైన సాగు పద్ధతులను అనుసరించడం చాలా అవసరం అని చాలాకాలంగా మాకు తెలిసిన విషయమే.

దక్షిణ భారత దేశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ వ్యాపించి ఉన్న పడమటి కనుమలు అతి పురాతనమైనవి. మా జీవన గమనానికి కేంద్రాలు. సముద్ర తీరానికి 30-50 కిలోమీటరుల లోపలి ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. ఎగువన గుజరాత్ నుంచి దిగువన కేరళ వరకూ ఆరు రాష్ట్రాలలో పడమటి కనుమలు విస్తరించి ఉంటాయి. వీటి పొడవు దాదాపు 1600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కనుమలకు మరో విశేషం ఉంది. వీటిలో ఉష్ణమండలంలో మాత్రమే కనిపించే వర్షాధారిత వృక్ష సంపద సమృద్ధిగా ఉంటుంది. ప్రపంచంలోనే విభిన్నమైన జీవవైవిధ్యానికి ప్రతీకగా ఇవి గుర్తింపు పొందాయి. దాదాపు విశ్వవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులుగా భావిస్తున్న 325 రకాల విశిష్టమైన వృక్షాలు పడమటి కనుమలలో సమృద్ధిగా కనిపిస్తాయి. ఇక కొన్ని రకాలైన అపురూపమైన జంతు జాలం ఇక్కడ మానవుల జీవితాలతో పాటు మనుగడ సాగిస్తోంది.

ఇప్పుడు రసాయనిక వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారవుతోంది. ప్రకృతిసహజమైన జీవవైవిధ్యానికి పెను సవాలు విసురుతోంది. ఆధునిక సేద్య పద్ధతుల ఫలితంగా పంటలలోని వైరుధ్యాలను అంతరింపచేసేస్తున్నాయి. ఈ పరిస్థితికి మూల కారణం – విపరీతంగా రసాయనిక ఎరువులను, క్రిమిసంహారకాలను, సస్య రక్షణకు హాని కలిగించే కలుపు మొక్కలను ధ్వంసంచేసేందుకు వివిధ రకాలైన రసాయనాలను ఉపయోగించడం – ఒక్కటే. పర్యవసానంగా, వ్యవసాయ క్షేత్రాలలో సమతుల్యత దారుణంగా దెబ్బతింటోంది. ఒకప్పుడు వర్షాధారిత పంట పొలాల్లో చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. వాటిలో కాఫీ, కోకో, రబ్బర్, సుగంధ ద్రవ్యపు మొక్కలను రైతన్నలు సాగుచేసేవారు. పెద్ద కమతాలలోనూ, తోటలలోనూ అధిక మోతాదులో హానికరమైన (టాక్సిక్) క్రిమిసంహారకాలను ఉపయోగిస్తుండడంతో పరిసరాలలోని పర్యావరణంతో పాటు జీవసంపదకు కూడా ముప్పు ఏర్పడింది. చివరికి వ్యవసాయం ఏ మాత్రం లాభసాటి కాని జీవనాధారంగా మారిపోయింది. వాస్తవానికి పడమటి కనుమల ప్రాంతంలోని సామాన్య ప్రజానీకం అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడినవారే. వారు సాగుచేసే విస్తీర్ణం దాదాపు 40 శాతం పైమాటే. రైతన్నలు అనుసరించే వ్యవసాయ వైవిధ్యమే ఇంతకాలం అక్కడి ప్రకృతికి ఒక ప్రత్యేక రూపురేఖలను సంతరింపచేస్తూ వచ్చింది. పర్యావరణపరంగా ప్రయోజనకరమైన, సుస్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించినంత కాలం అక్కడ భూసారాన్ని తరతరాలుగా సురక్షితంగా కాపాడుతూ వచ్చింది.

మోజో సుగంధ క్షేత్రం – కుటుంబ సంపద

కర్నాటకలోని కొడుగు జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1100 మీటర్ల ఎత్తులో మా మోజో సుగంధ వ్యవసాయ క్షేత్రం ఉన్నది. కొండల అంచుల వెంబడి, లోయలను ఆనుకుని ఉన్న మైదానాలు అక్కడక్కడ ప్రకృతి సిద్ధమైన జల వనరులతో కళకళలాడుతూ ఉండేది. వాటిలో కొన్ని భూగర్భం నుంచి ఉప్పొంగి పుడమి తల్లిని పరవశింపచేసేవి. వివిధ రకాలైన మొక్కలు, వృక్షాలు, చెట్లు - చేమలు, క్రిములు, పక్షులు, సాధు జీవనులైన పశువులు, ఫంగీ వంటి అతి సూక్ష్మ జీవజాలం సమృద్ధిగా ఉండేది. వాటి సహకారంతో అక్కడ వ్యవసాయానికి అన్ని విధాలా అత్యంత అనుకూలమైన వాతావరణం అన్ని కాలాలలోనూ స్థిరంగా నిలబడి ఉండేది. వర్షాధారంగా పెరిగిన ఎత్తైన వృక్షాల నీడలోనే సాగు పనులు చేసే వాళ్లం. ఆ చెట్ల కారణంగా మా పంటలకు ఎలాంటి సమస్యా ఎదురయ్యేది కాదు. చివరికి ఏడాది మొత్తంలో 200 అంగుళాలు అంటే 5 మీటర్ల వరకూ నమోదయ్యే అధిక వర్షపాతం వల్ల కూడా పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లేది కాదు. మేం సాగు చేసే వాటిలో ఏలకులు, మిరియాలు ముఖ్యమైనవి. అవి అక్కడి సాగు విధానంలో చాలా దశాబాదలుగా పెనవేసుకుపోయిన రైతు జీవనాధారాలు. వీటితో పాటు కాఫీ, వనిల్లా పేరుతో సుప్రసిద్ధమైన సుగంధ పరిమళం కల మొక్కలు పెంచుతూ ఉంటాము. ఇవి కాక, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి లేక జాజి కాయ, అనేక రకాలైన పండ్ల చెట్లు, కాయగూరలు పండించేవాళ్లం. బహుళ పంటల సాగు వల్ల క్రిములు, ఇతర హానికర సూక్ష్మ జీవుల వ్యాప్తికి అవకాశం ఉండదు. భూమి పొరల్లోని పోషకాలు ఏ మాత్రం తరిగిపోవు. కరిగిపోవు. ఎందుకంటే పంటల మార్పిడిలో భాగంగా మేం చేపట్టే సాగు పద్ధతుల కారణంగా ఒక పంట కాలపు పోషకాలు మరో పంటలకు కూడా విలువైన పోషకాలను సమకూరుస్తూ ఉంటాయి. మా ప్రాంతంలో జీవవైవిధ్యం సుసంపన్నంగా నిలవడానికి ప్రధాన కారణం ఇదే. భారీగా కురిసే వర్షాలు కూడా మాకు మేలే చేస్తున్నాయి. వాటి ప్రవాహ వేగంలో భూమి పైపొరలలోని నిస్సారమైన మట్టి దిగువకు కొట్టుకుపోయి, నిత్యం సారవంతమైన మట్టి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కాస్త తెలివి ఉపయోగించి, మెరుగైన కంపోస్టు ఎరువులను ఉపయోగిస్తే మరింత ప్రయోజనం దక్కుతుంది. అలా చేస్తే భూమిలోని పోషకాలు స్థిరంగా ఉండడమే కాక మా నిత్య జీవితానికి ఏ అడ్డంకులు రాకుండా భూమాత రక్షణగా నిలుస్తుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. అటవీ ప్రాంతంలో సహజసిద్ధమైన సమతుల్యతను సాధించడం ద్వారానే మా వ్యవసాయ క్షేత్రాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నాం.

భూసార సంరక్షణ

భారత దేశంలో తరతరాలుగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కొన్ని సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులు వాడుకలో ఉన్నాయి. పర్యావరణ సంరక్షణ ప్రధాన లక్ష్యంగా దిగుబడులు స్వల్పమే అయినా అవి వాడుకలోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రధానమైన అంతస్సూత్రాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే సంప్రదాయక సాగు విధానాల్లో భూసారాన్ని స్థిరంగా నిలబెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఉష్ణమండల ప్రాంతాలలో వర్షాధారిత అడవుల్లో పెరిగే చెట్టూ చేమా కొద్దిగా బలహీనంగా కనిపించినా, అతిసూక్ష్మజీవకణాలతో, సుసంపన్నంగా వైవిధ్యానికి కేంద్రాలుగా ఉంటాయి. సకల ప్రాణకోటికి నీడనిస్తాయి. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగే క్రిములు, కీటకాలు, వానపాములు వంటివి మట్టిని మెత్తగా చేయటానికి తోడ్పడితే, ఫంగీ వంటి ఇతర బ్యాక్టీరియా భూమికి కావలసిన పోషకాలను అందించడంలో సహకరిస్తాయి.

కంపోస్టు ఎరువుల ఉపయోగిస్తే అతిసూక్ష్మజీవకణాల వృద్ధికి, వైవిధ్యానికి తోడ్పడినట్టవుతుంది. అంతేకాక, నీటిలో తేమ పెరగేందుకు, ఇంకా ఇతర సేంద్రీయ ప్రయోజనాలు చేకూరుస్తుంది. పంట పొలాల్లో లభించే వ్యర్థ పదార్థాలు, చెత్తా చెదారం వంటి వాటిని కంపోస్టు తయారీకే వినియోగిస్తాం. ఇది మేం అనుసరించే వ్యవసాయ విధానాల్లో చాలా కీలకమైనది. కంపోస్టు తయారీకి ఎండిపోయిన ఆకులు, అలములు, ఇతర వ్యర్థాలను సేకరించి చేతులతోనే బాగా కలియబెట్టుకుంటాం. ఈ ఆకలు, అలములే ఇంతకాలంమా పశు సంపదకు విశ్రాంతినిచ్చిన పరుపులని గుర్తించాలి. (ఆ కారణంగా అవి మా పసువులు, గొర్రెల మలమూత్రాలతో బాగా నానిపోయి ఉంటాయి.) పేడ, వేప ఆకులు, కానుగ పోట్టు (Pongamia (Hongae)), చెక్క పొట్టు మిశ్రమం అందులో కలిపేస్తాం. ఈ విధంగా మట్టిలోని బ్యాక్టీరియా సహాయంతో మరింత నాణ్యమైన సమర్థవంతమైన సూక్ష్మకణజాలం (EM (Effective Micro organisms)పెంపొందేందుకు శ్రద్ధ తీసుకుంటాం. ఈ తరహాలో మట్టిలోని బ్యాక్టీరియా, ఈస్ట్ (అనే పదార్థం. ఇది నానిన వాటిని పులియబెట్టేందుకు తోడ్పడుతుంది.) సాయంతోనే సిద్ధమైన కంపోస్టును మరింత శక్తివంతం చేసేందుకు (చెరకు పిప్పిని జతపరిచినట్లయితే సేంద్రీయ పదార్థాల విభజం మరింత చురుగ్గా సాగుతుంది) కూడా చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా అన్ని విధాలా మెరుగుపరచిన కంపోస్ట్ ను నీళ్లలో కలిపేయాలి. ఒక వంతు కంపోస్టు చేరిస్తే దానికి 200 రెట్లు నీటిని కలపాలి. రెంటీనీ బాగా కలియతిప్పాలి. తరువాత అలా వదిలేయాలి.  రెండు రోజుల తర్వాత అది పెంట కుప్పగా మారిపోతుంది. మరో అయిదు రోజులు అలాగే ఉంచేయాలి. ఆ కుప్పలో తేమ పోకుండా వాటిపై కప్పి ఉంచడం అవసరం. అలా నిల్వచేసిన కంపోస్ట్ మంచి వాసనతో మేలైన స్థాయికి చేరుతుంది.  మొత్తం మీద రెండు నెలలు గడిచేసరికి అన్ని విధాలుగా ఉపయోగకరమైన కంపోస్ట్ రెడీ అవుతుంది. అప్పుడు దానిని మొక్కల మొదళ్లకు అందించాలి. లేదా ఫోటోలో చూపినట్టు కుండల్లో ఉంచి మొక్కలకు అందించవచ్చు. వాటి సత్తువ కొత్తగా నాటే విత్తులకు చేరేలా చూసుకోవాలి. ఒక్కోసారి తయారు చేసే క్రమంలో దాదాపు 3 నుంచి 5 టనునల వరకూ ఉంటుంది. మట్టిని బాగా దున్నిన తర్వాతే దీనిని పొలాలకు అందజేస్తాం. వీలైతే ఏడాదికి రెండు సార్లు ఈ రకమైన కంపోస్టు ఎరువును అందించేందుకు ప్రయత్నిస్తాం. ఇలా ఏటా కంపోస్ట్ అందించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చు.

మా ఆవాసాలైన లోయల్లో ఎక్కడపడితే అక్కడ కొండల్లా పేరుకుపోయే చెదల వంటివి కర్బనం (బొగ్గు పులుసు) తయారీలో కీలక పాత్ర పోషిస్తాయని మాకు తెలుసు. అంతేకాదు, సేంద్రీయ పదార్థాలను మరింత పోషకవిలువలతో సంసిద్ధం చేస్తాయనీ తెలుసు. వీటి తోడ్పాటు లేకుండా ఇతర రకాలైన క్రిమికీటకాలు, మొక్కలు ఎదగలేవని మేం గుర్తించాం.

బయోచార్-మిశ్రమ కంపోస్ట్

మా పొలానికి నాలుగు వైపులా అడవులున్నాయి. అక్కడ ఎంత కావాలంటే అంత కలప ముక్కలు తెచ్చుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకుని బయోచార్ తయారుచేసుకుంటాం. వాటిని అవసరమైనంతవరకే కాల్చవలసి ఉంటుంది. అది కూడా ఆక్సిజన్ పరిమితంగా ఉండే వాతావరణంలోనే. ఈ రకంగా చేయటం వల్ల కర్బన పదార్థాన్ని వేరుచేయవచ్చు. భూమి లోపల కలపను కాల్చినట్లయితే వాతావరణంలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్ ను తగ్గించవచ్చును.  

ఉపరితలంపై బయోచార్ మెరుగ్గా ఉపయోగించేందుకు వీలుగా దానిని చూర్ణంగా చేయడంతో పాటు అందులోని పోషక విలువలు పెంపొందించేందుకు పంచగవ్య, ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం, ఆవు మూత్రం, ఇంకా ఇతర ద్రవరూప పోషకాలను జతచేస్తాం. ఇలా చేయడం వల్ల పోషకాలు సమృద్ధిగా ఒకచోట పోగవుతాయి. అవి నేరుగా బయోచార్ పొడితో కలిసి మేలైన ఎరువుగా మారుతుంది. ఈ రకంగా తయారుచేసుకున్న మొత్తం పోషక పదార్థాలను కంపోస్టు ఎరువులతో కలిపి ఉపయోగిస్తాం. దానిని పొలంలోని మట్టికి చేర్చినపుడు మంచి ఫలితం వస్తుంది. వరి చేలల్లో వరి పొట్టును ఉపయోగించి బయో చార్ తయారు చేస్తాం. దానిని కంపోస్టుకు జతచేస్తాం. కంపోస్టులోకి 5 నుంచి 10 శాతం వరకూ బయోచార్ ను కలిపితే చాలు. బయోచార్ తో మరింత మెరుగైన కంపోస్టును ఉపయోగించడం వల్ల భూసారం పెరుగుతుంది. అవసరమైన రీతిలో రసాయన ప్రక్రియకు తోడ్పడుతుంది. అంటే పోషకాలలోని మంచి గుణాలను మట్టి స్వీకరించగలుగుతుంది. గుల్లబారుతుంది. రూపు మృదువుగా మారుతుంది. పంటలకు మేలు చేకూర్చే సూక్ష్మజీవజాలం అభివృద్ధి చెందుతుంది. కంపోస్టు ఎరువులలోని ఖనిజాలను, ఇతర పోషకాలను మట్టి నెమ్మదిగా ఇంకడానికి తోడ్పడుతుంది. అదే విధంగా వాటిని సరైన సమయంలో సరైన మోతాదులో మొక్కలకు అందించగలుగుతుంది. మట్టికి కలుగుతున్న ప్రయోజనాలను గమనించిన తరువాత ఇప్పుడు తప్పనిసరిగా బయోచార్ ను ఉపయోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము.

పంచగవ్య అన్నది తరతరాలుగా మన దేశంలో అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం. మన దేశంలో రపతి రైతు ఇంటా తప్పనిసరిగా ఆవులు ఉంటాయి. గోవులను మనం చాలా కారణాల వల్ల ఆదరిస్తాం. అందులో పంచగవ్య ఒకటి. ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు మిశ్రమాన్ని పంచగవ్య అంటాం. ప్రయోగశాలల్లో నిర్ధారణ అయిన విషయం - ఈ పంచగవ్య ద్రావకాన్ని 15 రోజుల పాటు పులియడానికి వీలుగా నిల్వ ఉంచితే అందులో పోషక విలువలు సమృద్ధిగా ఉన్న సూక్ష్మజీవ కణాల అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుందని. అందులో నైట్రోజిన్ (నత్రజని) 65 శాతం కన్నా ఎక్కువ, ఫాస్ఫరస్ (భాస్వరం) 45 శాతం కన్నా అధికంగాను, పొటాషియం 75 శాతం కన్నా అధికంగాను, ఆర్గానిక్ కార్బన్ (సేంద్రీయ కర్బనం) 22 శాతం కన్నా అధికంగాను ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇంకా మొక్కల ఎదుగుదలకు తోడ్పడే గిబ్బరెల్లిన్స్, ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ వంటి హార్మోన్లు, పంటలకు మేలు చేకూర్చే ఎజోటోబ్యాక్టర్, ఎజోస్పిరిలియం, ఫాస్ఫోబ్యాక్టీరియా, సూడోమోనాస్ వంటి వివిధ రకాల బ్యాక్టీరియా వంటివి పంచగవ్యలో పెరుగుతున్నట్టు గుర్తించారు. ఇలాంటి ద్రవరూపక పదార్థాలను ఉపయోగించడం వల్ల మొక్కలను హానికరమైన ఫంగస్ నుంచి, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పించవచ్చుననేది మాకు అనుభవంలో తెలిసిన విషయం.

ఏడాది కాలంలో రెండు మూడు సార్లు పంచగవ్య ఉపయోగించడం వల్ల పంటలకు ఎలాటి చీడపీడలు సోకవు. దిగుబడి మెరుగ్గా ఉంటుంది. కేవలం 3 శాతం పంచగవ్య వాడకం ద్వారా వివిధ రకాలైన పంటలు, పండ్లు, కూరగాయలు వంటి వాటి దిగుబడి పెరిగినట్లు తేలింది.

చెదల వంటివి భూసారాన్ని పెంపొందిస్తాయి

సాధారణంగా చెదల వంటి వాటిని పంట చేలకు చీడపీడలను అనుకుంటారు. ఇవి కలపను కొరికేస్తాయనే అనుమానం ఉంటుంది. అయితే ఇలాంటి పురుగు పుట్ర వల్ల సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఉష్ణ మండల ప్రాంతాలలోని అడవుల్లో వీటి వల్ల భూసారం మరింత మెరుగవుతుంది. అంతేకాక, వీటి కారణంగా మరి కొన్ని ప్రాణులకు తలదాచుకునేందుకు నీడను కల్పిస్తాయి. మరెన్నో జీవాలకు ఆహారం అందిస్తాయి. మా పరిసరాల్లో ఇలాంటి చెద పురుగులు విస్తరించాలని మేం ఆశిస్తాం. ఎందుకంటే వాటి వల్ల కర్బన పునరుద్ధరణలో ఇవి చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తాయి. మొక్కలకు మాత్రమే కాక, ఇంకా ఇతర జీవకోటికి అవసరమైన కర్బనం సరఫరాకు అవసరమైన రీతిలో సేంద్రీయ పదార్థాలనుంచి శక్తిని వేరుచేయగల సామర్థ్యం వీటికి ఉంది. వాటి విలువ, ప్రయోజనం మాకు స్పష్టంగా తెలుసు, అందువల్లే అలాంటివి పెరుగుతున్న పరిసరాల్లో మేం సేద్యం పనులు చేయకుండా వాటిని అలాగే వాటి మనుగడ కోసం వదిలేస్తాం. చెదలు తవ్వే మట్టిలో అవి విసర్జించే వ్యర్థాల కారణంగా మట్టి మరింత మృదువుగా సారవంతంగా మారుతుంది. అందులో మరెన్నో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఫంగీ వంటివి పెరుగుతాయి. అవి వాటి వంతుగా మట్టిని మరింత మృదువుగానూ, సాగుయోగ్యంగానూ మారుస్తాయి. వీటి కారణంగా భూమిలో మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగకరమైన పోషకాలు మట్టిలో వృద్ధి చెందుతాయి. ఫంగీ సాయంతో పోషకాలలో ముఖ్యమైన పీ, కే, ఎస్, ఎఫ్ఈ, ఎంజీ, జెడ్ఎన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాక, ఈ రకమైన చెద పురుగులు మట్టి రూపాన్ని భౌతికంగా మార్చివేయడమే కాక, రసాయనకంగా వాటికి మేలు చేస్తాయి. ఫలితంగా ఆ భూముల్లో కాయగూరలు, ఇంకా పర్యావరణహితమైన హరిత హారం ఎదగేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, నత్రజని పునరుద్ధరణలో కూడా ఇవి చాలా కీలకమైన  పాత్ర పోషిస్తాయి. అవి తీసుకునే ఆహారంలో భాగంగా నత్రజని పూరిత ఇతర సూక్ష్మజీవాలు (Citrobacter, Enterobacter, Treponema and Spirochaeta) ఆవాసం ఉంటాయి.

స్వయంసమృద్ధమైన పర్యావరణానికి ఊతం

వర్షాధారిత అరణ్యాలను అలా వదిలేయగలిగితే స్వయంసృద్ధమైన పర్యావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. వాటిలో పర్యావరణ అనుకూల జీవకోటి చస్తూ, మళ్లీ పుడుతూ పునరావృత్తి సహితమైన నిరంతరం ప్రవహించే జీవశక్తికి కేంద్రంగా వర్ధిల్లుతూ ముందుకు సాగుతుంది. వివిధ రకాలైన పురుగులు, పుట్రా, క్రిములు, కీటకాలు, ఫంగీ (నాచు) బాక్టీరియా ఇలా నానా రూపాలలో అది పుష్టిగా మనుగడ సాగించగలుగుతుంది. ఈ రకంగా ఈ జీవకోటి అక్కడి వాతావరణాన్ని అన్ని విధాలా సాగుయోగ్యంగా నిలబెడతాయి. చుట్టూ ఉండే చెట్లు, చేమలు వాటికి సరైన వాతావరణాన్ని అందజేస్తాయి. మనం కేవలం అక్కడి మట్టికి కావలసిన పోషకాలను అందజేయవలసి ఉంటుంది. అందుకు కంపోస్టు ఎరువుల తయారీకి అది అవసరమైన ముడి సరుకును అందిస్తుంది కూడా. చాలా పంచలకు ఉపరితలం మీదే వాటికి అవసరమైన పోషకాల వనరులు సమృద్ధిగా లభిస్తుంటాయి. అవి చెట్ల నుంచి రాలే ఆకులు, ఇంకా రకరకాలైన వ్యర్థాలు తోడ్పడతాయి. చెట్ల వేళ్లు భూమి లోపలి పొరల వరకూ వ్యాపించి అవి రాల్చే ఆకులు వాటికే పోషకాలుగా మారుతూ అక్కడి జీవనగమనం ఒక క్రమంలో సాగేందుకు సహకరిస్తాయి. వాటిలో నుంచి ఫంగీ, బాక్టీరియా వంటివి జనిస్తుంటాయి. ఈ విధంగా పోషకాలు ఒక వలయంగా పరస్పరం ఆధారంగా నిలిచే వ్యవస్థ ఉంటుందో అక్కడ జీవన చక్రం ఆగడం అంటూ ఉండదు. కానీ, మనం అదనంగా ఉపయోగించే రసాయనాలు, క్రిమిసంహారకాలు భూసారానికి హాని చేస్తున్నాయి. నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచమంతటా ఇప్పుడు కనిపిస్తున్నదే.

సుజాతా లఖానీ గోయెల్
మోజో ప్లాంటేషన్.
పోస్టు బాక్స్ 101, మడికెరి 571201
కర్నాటక – ఇండియా
E-mail: sujatamaya@gmail.com
www.rainforestours.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 1, మార్చ్ ౨౦౧౫

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....