అందరికీ మార్గదర్శిగా …

ఆర్థికంగానూ, సామాజికంగాను మహిళలకు సాధికారికత అందిస్తే సానుకూల మార్పునకు వారే చోదక శక్తిగా నిలుస్తారు. ఇక్కడ మనం తెలుకోబోయే అల్లు నారాయణమ్మ విజయగాథ సుస్థిర వ్యవసాయంలో ఆమె చూపిన బాటను మనకు స్పష్టంగా చూపిస్తుంది.

పొడి బారిన మూడు ఎకరాలు అల్లు నారాయణమ్మకున్న పొలం. సగం భూమిలో వర్షం ఆధారంగా వరి సాగు చేస్తుంది.  మిగిలిన పొలంలో మామిడి తోట ఉంది. అందులో దిగుబడి చాలా కొద్ది మాత్రమే. మొత్తం మీద ఆ పొలం మీద వచ్చే రాబడి చాలా స్వల్పం. వారికి ఇంత కూడు పెట్టే దిక్కు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమే. కుటుంబమంతా ఆ ఉపాధి హామీ ద్వారా వచ్చే ఆదాయంతోనే బతుకుబండి సాగిస్తుంటారు. నారాయణమ్మ భర్త అవకాశం ఉన్నప్పుడల్లా గుజరాత్ కు వలసపోతుంటాడు. అక్కడ చేపట్టే తవ్వకం పనుల్లో కూలీ వెతుక్కుంటూ మరి కొందరు తోటి గ్రామస్థులతో కలిసి అతను గుజరాత్ బాట పడ్తుంటాడు.  ఆ కారణంగా ఇంటి బాధ్యతన్నిటినీ ఆమె ఒక్కతే చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం జీసీ పల్లెకు చెందిన నారాయణమ్మ వాస్తవ జీవితం.

గ్రామ రైతు సంఘం చేయూత

రిలయెన్స్ ఫౌండేషన్ – భారత్ ఇండియా జూడో (ఆర్ఎఫ్-బీఐజే) నిర్వహణలోని గ్రామీణ ప్రాంతాల సంస్కరణ కార్యక్రమం కింద గ్రామీణ రైతు సంఘం (విలేజీ ఫార్మర్స్ అసోసియేషన్ – విఎఫ్ఏ) ఏర్పాటు ద్వారా ఆ పల్లె ప్రాంతంలో మెరుగైన, స్వయంసమృద్ధమైన, సుస్థిరమైన గ్రామీణ అభివృద్ధికి కృషి చేపట్టింది. 2010లో చేపట్టిన ఈ కార్యక్రమం కింద వ్యవసాయ కుటుంబాలను పేదరికం నుంచి కాపాడేందుకు, వ్యవసాయం జీవనోపాధిగా విశ్వనీయమైనదిగా ధీమా ఇవ్వడానికి సంకల్పించింది.

గ్రామంలోని వ్యవసాయదారులను రైతు సంఘాలుగా ముందు సమైక్యం చేసేందుకు శ్రద్ధ తీసుకుంది. 2009-10 సంవత్సరంలో ఈ గ్రామంలోని రైతన్నలను యుగంధర్ రైతు సంఘంగా సంఘటితం చేసింది. ప్రతీ కుటుంబం నుంచి భార్యా, భర్తలు ఇద్దరినీ ఒకరిగా పరిగణించి సభ్యులుగా చేర్పించింది. ఇలా ఇద్దరిని ఒకరిగా పరిగణించటం ద్వారా లింగ వివక్షకు తావు లేకుండా చూసింది. అంతేకాక, మహిళలకు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించింది. వారిలో నాయకత్వ లక్షణాలను ప్రేరేపించింది. ఇతర రైతు కుటుంబాలు ఈ రైతు సంఘంలో సభ్యులుగా చేరడం తెలుసుకున్న నారాయణమ్మ కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంది. సంఘం సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. మహిళల నుంచి చురుకైన భాగస్వామ్యం పెంపొందించేందుకు వీలుగా వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు వీలుగా సాధికారికత శిక్షణ కార్యక్రమాన్ని రైతు సంఘం చేపట్టింది. ఈ శిక్షణ సమయంలో మహిళల్లో అంతర్గతంగా దాగి ఉన్న సానుకూల దృక్పథాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. ఈ విధంగా రపతీ నెలా కూడా మహిళల సమావేశాలు జరుగుతూ వచ్చాయి. ఆ సమావేశాల ద్వారా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతూ వచ్చింది.

పర్యావరణహితమైన సేద్య విధానం – ఆలోచనల నుంచి ఆచరణలోకి ...

గ్రామీణ రైతు సంఘం నుంచి లభించిన ప్రోత్సాహంతో తనకున్న మూడు ఎకరాల బంజరును సాగుయోగ్యం చేయడంలో గ్రామ రైతు సంఘం సహాయాన్ని నారాయణమ్మ కోరింది. అలా చేయడం వల్ల తన భూమిలో చేపట్టే  సేద్యం తనకు స్థిరమైన జీవనోపాధిగా మారుతుందని ఆమె ఆశించింది. ఆ లక్ష్యంతోనే నారాయణమ్మ గ్రామ సంఘం ఏర్పాటు చేసిన అన్ని శిక్షణ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొన్నది. ఆ కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించిన పూర్తి అవగాహన సంపాదించుకుంది. భూమిని సారవంతం చేయడం అన్నదే వ్యవసాయాన్ని లాభసాటిగా, నిలకడగా నిర్వహించడం సాధ్యమనే విశ్వాసం ఆమెలో ప్రబలంగా ఉండేది.

సుస్థిర వ్యవసాయ విధానాలపై ఆసక్తి కారణంగా అందులో పరిపూర్ణంగా శిక్షణ పొందిన నారాయణమ్మ భూ సారాన్ని పరీక్షించి నిర్ధారించేందుకు వీలుగా సరైన శాంపిల్స్ సేకరించడంలోను, పరిక్షల నివేదికలను అధ్యయనం చేసి విశ్లేషించడంలోను, విత్తనాలను మొలకెత్తించడంలోను, విత్తన శుద్ధి విధానాలలోను, పంచగవ్య, వేప ఆకుల నుంచి, ఇంకా జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులను తయారు చేయడంలోను నైపుణ్యం సంపాదించుకుంది.

ముఖ్యంగా, సేంద్రీయ ఎరువుల తయారీలో అనుసరించవలసిన మెళకువలను బాగా ఆకళింపు చేసుకుంది. ఫలితంగా నారాయణమ్మ పొలంలోని వరి మడిలో చేపట్టిన ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. నీటి ఎద్దడి సమయంలో కూడా ఆమె పొలం నిలదొక్కుకోగలిగింది. ఈ పద్ధతుల సహాయంతో సాగు ఖర్చులను బాగా తగ్గించుకోగలిగింది. రసాయన క్రిమి నాశకాలు, ఎరువుల వాడకం బాగా తగ్గించివేసింది. ఆ రకంగా తన పంట చేనులో సుస్థిరమైన, పర్యావరణహితమైన సాగు పద్ధతులను అనుసరించింది. ఆమె సాధించిన ఫలితాల స్ఫూర్తితో కొంత మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి సేంద్రీయ ఎరువుల తయారీకు నడుంబిగించారు. పంటల అవసరాలకు తగినట్టుగా సేంద్రీయ ఎరువుల వాడకానికి తమ వంతు చేయూత అందించారు. ఈ సమైక్య కృషికి గ్రామ సంఘంతో సత్సంబంధాలకు దారి తీసింది. ఇప్పుడు వారి గ్రామ సంఘం సుస్థిర వ్యవసాయ విధానాలకు అదర్శప్రాయంగా నిలిచింది.

కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటిని ఆకళింపు చేసుకోవాలన్న తపన నారాయణమ్మ కు చాలా ఎక్కువగా ఉండడంతో సుస్థిర వ్యవసాయ పద్ధతులపై నిర్వహించిన అన్ని శిక్షణ కార్యక్రమాలకు ఆమె తప్పని సరిగా హాజరవుతూ వచ్చింది. వరి సాగులో అనుసరించవలసిన వృక్షసంబంధ విధానాలపై నైపుణ్యం సంపాదించింది. వరుస నాట్లు, సర్టిఫై చేసిన విత్తనాల వాడకం ద్వారా వరి దిగుబడిని గణనీయంగా పెంచుకోగలిగింది. గ్రామ సంఘంలో ఇతరులందరికీ నారాయణమ్మ ఇప్పుడు ఆదర్శంగా నిలిచింది. ఇరుగు పొరుగు గ్రామ సంఘాల వారు కూడా ఆమె సలహాసూచనలు పాటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా రసాయన రహితమైన పర్యావరణ హితమైన సాగు విధానాలకు ఆమె ప్రచారకర్తగా మారింది.

పర్యావరణ అనుకూల విధానాలను అనసరించడం వల్ల తన కుటుంబానికి, గ్రామానికి మాత్రమే కాక తమ చుట్టూ ఉన్న పరిసరాలకు ప్రయోజనం కలిగిస్తుందని ఆమె గట్టిగా విశ్వసిస్తున్నది. నిర్విరామంగా నారాయణమ్మ చేసిన కృషి ఫలితంగా హెక్టారు పొలంలో ఆమెకు 24 క్వింటాళ్ల దిగుబడి లభించింది. అంతకుముందు వరకు అమెకు హెక్టారుకు 16 లేదా 18 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చేది. ఇక ఆదాయం రూపంలో ఒకప్పుడు రూ. 850 కాగా ఇప్పుడు అది రూ. 1650 కి పెరిగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఆమె బంజరు నేల ఇప్పుడు సాగుయోగ్యంగా మారిపోయింది. పప్పు ధాన్యాలు, ఇతర ఆహార ధానాలు పండుతున్నాయి. అవి ఆమె కుటుంబ అవసరాలను తీర్చడమే కాక అదనపు ఆదాయం అందించగలుగుతున్నాయి.

పంట సాగుతో పాటూ ...

మార్కెట్ పై ఆధారపడవలసిన సమస్య నుంచి గట్టెక్కడానికి గాను గ్రామ సంఘం స్వయంగా విత్తన ఉత్పత్తిని కూడా ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా విత్తనోత్పత్తి గురించిన సాంకేతిక అంశాలలో శిక్షణ పొందడానికి ఎంపిక చేసిన వారిలో నారాయణమ్మ కూడా ఒకరు. అందువల్ల ఆమె తనకున్న మూడు ఎకరాలలో ఎకరా భూమిలో విత్తనోత్పత్తికి కేటాయించింది. అందులో 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ విత్తనాలను గ్రామ సంఘంలోని మరో 68 మంది సభ్యులకు సరఫరా చేసింది. వాటి ఆధారంగా 90 ఎకరాలలో వరి (MTU-1001 variety) సాగుకు తోడ్పడింది. అంటే ఆ గ్రామంలోని విత్తన అవసరాలలో 50 శాతం నారాయణమ్మ విత్తన కేంద్రం నుంచే వచ్చాయన్న మాట.

................ఇప్పటివరకు మా గ్రామంలో లభించే వంకాయ, బీన్స్ మాత్రమే ఉపయోగించుకునే వాళ్లం. ఇప్పుడు 10 రకాలైన కాయగూరలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. అవన్నీ మా ఇంటి మిద్దెపై పండించినవే. ఆ విధంగా కాయగూరల ఖర్చు కూడా ఆదా అయింది ... అంటున్నారు నారాయణమ్మ....................

నారాయణమ్మలో కనిపించిన స్ఫూర్తి కారణంగా ఆమెను వరుసగా రెండో సంవత్సరం కూడా గ్రామ సంఘం ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది. సేంద్రీయ ఎరువుల వాడకంలో తోటి రైతన్నలను ప్రోత్సహించడంలో ఆమె పాత్ర ప్రశంసనీయం. ఇప్పుడు తాను సమకూర్చుకున్న సాగు పరిజ్ఞానాన్ని తోటి వ్యవసాయదారులందరికీ వివరించి వారికి కూడా పూర్తి శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తోంది. జిల్లా స్థాయి సదస్సులలో కూడా ఆమె పాల్గొని పర్యావరణ హితమైన అంశాలపై తాను నేర్చుకున్న మెళకువలను అందరికీ ప్రచారం చేయడంలోనూ ఆమె తన వంతు చేయూతను అందిస్తోంది. కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఆత్మ సంఘాలు, ఇతర రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహించే శిక్షణ తరగతులలో ఆమె తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటుంది.

గ్రామ రైతు సంఘంలో చురుగ్గా వ్యవహరించే నారాయణమ్మ ప్రత్యేకంగా అంశాలవారీ సమావేశాల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆహార భద్రత. ఈ అంశంలై సభ్యులందిరిని సమావేశపరిచి విస్తృతంగా చర్చలకు తోడ్పడుతూ ఉంటుంది.

మిద్దెలపై కాయగూరల పెంపకంలో కూడా ఆమె మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. ఈ విషయంలో ఆమె తీసుకున్న చొరవ కారణంగా ఆమె కుటుంబానికి అవసరమైన కాయగూరలన్నీ వారి ఇంటి మిద్దెపైనే పండించడం సాధ్యమవుతోంది. కుటుంబ సభ్యులకు పోషక విలువలున్న ఆహారం అందుతోంది. దాదాపు 7 నుంచి 12 రకాల కాయగూరలను ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ప్రతి రోజూ సంతృప్తిగా ఉపయోగించుకుంటున్నారు.

నారాయణమ్మ దీక్షాదక్షతలను గమనించిన గ్రామ సంఘం ఆమెను గ్రామ సంఘానికి వైస్ ప్రెసిడెంటును చేసింది. ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశాలను నిర్వహించి, సమస్యల గురించి సంప్రదింపులు జరిపేందుకు ఆమె నిరంతరం కృషిచేస్తుంటారు. గ్రామ సంఘం పురోగతి కోసం తపిస్తుంటారు. ఆమె తమ గ్రామంలో మద్య నిషేధాన్ని అమలు చేయడంలో ఆమె పాత్ర ప్రధానమైనది.

ఆశాదీపం

అల్లు నారాయణమ్మ అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితురాలే. గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆమెను గాఢంగా అభిమానిస్తారు. వారి గ్రామానికి మాత్రమే కాక పరిసరాలలోని మరి కొన్ని గ్రామాల వారికీ కూడా ఆమె పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె భర్త వలస బాట పట్టడం లేదు. సొంత వ్యవసాయ క్షేత్రంలోనే కష్టపడి పనిచేస్తున్నాడు.

ఒక రకంగా గ్రామ సంఘానికి నారాయణమ్మ మూల స్థంభంగా మారింది. ప్రస్తుతం వారి గ్రామ సంఘంలో 160 మంది సభ్యులున్నారు. వారిని పది బృందాలుగా ఏర్పాటుచేసుకున్నారు. ఒక్కో బృందంలో 15 మంది ఉంటారు. వాళ్లంతా ఇప్పుడు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని తమ జీవన శైలిని మెరుగు పరచుకునేందుకు సమైక్యంగా కృషి చేస్తున్నారు.

రంచిత కుమారన్ – శివ కృష్ణ బాబు
రిలయెన్స్ ఫౌండేషన్
ఆర్ సీ పీ ప్రాజెక్టు ఆఫీసు, ఫస్టు ఫ్లోర్
ఘన్సోలీ, నవీ ముంబయి – 400 701
Email: ranchitha.kumaran@reliancefoundation.org
Siva.Dhul@reliancefoundation.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౫ 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....