సంకల్ప బలం, శ్రమ జీవనం కలబోసిన మహిళా రైతు శివక్క తన బంజరు నేలలను చేవగలిగేలా మార్చుకోవడమే కాక చేతుల నిండుగా రొక్కం సంపాదించుకోగలుగుతోంది. పచ్చటి సేద్యం, విభిన్నమైన కోణాలలో చేసిన కృషి, స్థిరమైన సాగు విధానాలు అనుసరించడమే ఆమె పెట్టబడులు. వాటితో అపూర్వమైన ఈ మార్పునకు ఆమె కారణమైంది. ఇవాళ్టి రోజున శివక్క అనుసరించి చూపిన వడి సేద్యపు నమూనా మరెందరికో మార్గదర్శకంగా నిలిచింది.
మహిళా సాధికారికత సాధిస్తున్న పురోగతికి అత్యుత్తమమైన ఉదాహరణ మన శివక్క కుంబర్. ఆమె బొగెనగరకొప్ప అనే కుగ్రామం నివాసి. 90వ దశకం చివర్లో శివక్క కుటుంబం తీవ్రమైన పేదరికంలో చిక్కుకుంది. శివక్క, బసప్ప దంపతులకు నలుగురు సంతానం. వారి బాగోగులు చూడడానికి, ఆ కుటుంబం ఒక ముద్ద అన్నం తినాలన్నా వారికి ఉన్న ఏకైక ఆధారం కేవలం 7.16 ఎకరాల నేల తల్లి మాత్రమే. అది కూడా కొండ అంచున ఉంటుంది. అక్కడ అనేక రకాలైన సమస్యలున్నాయి. భూసారం చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అంతా గులకరాళ్లతో నిండి ఉంటుంది. బసప్ప హుబ్లీలో కూలీగా పనిచేస్తుంటాడు. ఆ పని కోసం రోజూ ఉదయాన్నే 7 గంటలకు ఇల్లు వదిలితే రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. రోజంతా కష్టపడితే బసప్ప రాబడి కేవలం రూ. 200 నుంచి రూ. 400 ఉంటుంది. రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే. ఆ కారణంగా ప్రతీ రోజూ 5 కిమీ నడవక తప్పని స్థితి.
కుటుంబం తమ కున్న కొద్ది జాగా మీద ఆశ వదిలేసుకుంది. అలాంటి పరిస్థితిలో శివక్కకు ఒక ఆశాకిరణం కనిపించింది. ఒక సమయంలో దాన్ని అమ్మివేయాలని కూడా బసప్ప ఆలోచించాడు. ఆ సమయంలో ఒకప్పుడు భారతీయ అగ్రో ఇండస్ట్రీస్ (బెయిఫ్) గా రిజిస్టరయిన బెయిఫ్ డెవలప్ మెంట్, రీసెర్చి ఫౌండేషన్ వారికి మార్గం చూపించింది. వారి సహకారంతో సాగు చేయాలని శివక్క నిర్ణయించింది. ఆ రకంగాఉన్న జాగా మరెవరికో దక్కకుండా అడ్డుకుంది. అనంతరం స్వయంసహాయక సంఘంలో సభ్యత్వం తీసుకుంది. సహజంగా చురుకైన మహిళ కావటంతో అన్ని సమావేశాలకు హాజరవుతూ, అక్కడ లభించే శిక్షణ అవగాహన చేసుకుంటూ నైపుణ్యం పెంచుకుంటూ కొద్ది కాలంలోనే తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తిసామర్థ్యాలను సంపాదించుకుంది. ప్రారంభంలో సభ్యులంతా కూడా వేలిముద్రలు వేయడమే తప్ప సంతకం చేయటం చేతకాని నిరక్షరాస్యులే. సంతకం చేయగలిగితేనే వారికి రుణ సదుపాయం లభిస్తుందని క్షేత్రస్థాయి అధికారులు వారిని ప్రోత్సహించారు. దాంతో వారంతా సంతకాలు చేయడం నేర్చుకున్నారు. అది వారి జీవితాలలో మార్పునకు నాంది అయింది. వారితో పాటే అక్షర జ్ఞానం సంపాదించిన శివక్క త్వరలోనే తమ సంఘం తరఫున అకౌంట్స్ పుస్తకాలు నిర్వహించగలిగే స్థాయికి ఎదిగింది. ఈ విషయంలో ఆమెకు స్నేహితురాలు హాలవ్వ చేయూతనిచ్చింది.
క్షేత్రం పచ్చగా మారింది
శివక్క దంపతులు ముందుగా తమ నేలలో మైక్రో ప్లానింగ్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇరవై అల్ఫోన్సో మామిడి మొక్కలను, 20 సపోటా మొక్కలను, టేకు, యూకలిప్టస్, తుమ్మ (ఎకాసియా), గ్లైసిరిడియా వంటి 1200 రకాలైన అడవుల్లో పెరిగే మొక్కలను నాటి వాటి పురోగతిని పరిశీలించారు. వాటిని ఎక్కువగా పొలం గట్ల వెంబడి మాత్రమే నాటారు. సుమారుగా ఎకరన్నర భాగంలో ఈ రకంగా మొక్కల పెంపకం చేపట్టారు. స్టైలోహమ్మట అనే రకం పశువుల మేత పెంపకం చేపట్టారు. మట్టి కోత నివారించేందుకు గట్లు నిర్మించారు. చిన్న నీటి చెరువును తవ్వి నీటి వనరును సమకూర్చుకున్నారు. సాగు పనులకు తోడ్పడేందుకు వీలుగా బోరు బావిని కూడా తవ్వుకున్నారు.
రుణ సదుపాయం కోసం సంతకం చేయడం నేర్చుకున్నారు. అలా అక్షరాస్యత దిశగా వారు తమ తొలి అడుగులు వేశారు. .....
బెయిఫ్ ఫౌండేషన్ చేయూత కారణంగా, 1997 నుంచి 2004 వారికి అందుబాటులో నిలిచింది, రైతు కుటుంబాలను ప్రగతి పథంలోకి సాగుతూ వచ్చింది. ప్రారంభంలో ధార్వాడ్ సమీపంలోని పది గ్రామాల పరిధిలో ప్రాజెక్టు అమలయింది. తర్వాత వాటి సంఖ్య 22కు చేరింది. తొలి దశలో ప్ఱాథమిక స్థాయి సర్వేలు, పీఆర్ఏలను చేపట్టారు. తర్వాత ఒక్కో కుటుంబం గురించిన సమాచారాన్ని సేకరించి ఫ్యామిలీ ఇన్ ఫర్మేషన్ రిజిస్టర్ లో భ్రదపరిచారు. ఈ వివరాలను పరిశీలించడం ద్వారా, పేదరికం స్థాయిని అంచనా వేసి, వారి అంగీకారం ప్రాతిపదికగా, (చెట్ల పెంపకానికి అనువుగా ఉన్నట్లయితే) వారి వ్యవసాయ క్షేత్రాలకు అనుకూలమైన ప్రాధాన్యతల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయడం తేలిక అవుతుంది. బెయిఫ్ క్షేత్ర స్థాయి సిబ్బంది సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ఆయా కుటుంబాల వారితో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. కుటుంబానికి అనువైన మైక్రో ప్లానింగ్ తయారుచేస్తారు. ఈ ప్రణాళిక రూపల్పనలో ప్రతీ కుటుంబంలోని భార్యభర్తలు ఇద్దరు ప్రధాన భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రణాళికలలో ఎక్కడ చెరువు లేదా బావి వంటివి తవ్వాలి, పెంచవలసిన మొక్కలు ఏయే రకాలు ఉండాలి అన్న అంశాలు కూడా పరిశీలనకు వస్తాయి. వ్యవసాయదారులను స్వయంసహాయక బృందాలుగా ముందుగానే సమీకృతం చేస్తారు. వారానికి ఒకసారి సమావేశం అవ్వాల్సి ఉంటుంది. అందుకు గానూ వారానికి అయిదు నుంచి పది రూపాయల వరకూ వారు నిధులు సమకూర్చవలసి ఉంటుంది. అకౌంట్స్ పుస్తకాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు రుణాలుగా అందిన మొత్తాలను సభ్యలకు పంపిణీ చేయడం, అవసరమైన ముడి సరుకును సమకూర్చడం ఈ సంఘాలు నిర్వహించవలసిన ముఖ్యమైన విధులు. క్షేత్ర స్థాయిలో మార్గదర్శకం అందించే సిబ్బంది సలహా సూచనలు పాటిస్తూ ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిధిని సిద్ధం చేసుకోవడం, పటిష్టమైన వ్యవస్థ లేక విధానం అమలు చేయడానికి కృషి చేయవలసి ఉంటుంది. పొదుపు మొత్తాలను, రుణ పరపతి ప్రయత్నాలను, వ్యవసాయ సంబంధమైన కార్యకలాపాలను సమష్టి ప్రయోజనాలు లక్ష్యంగా కృషి చేయవలసి ఉంటుంది. అదే సమయంలో వారి జీవనశైలిని ప్రభావితం చేసేందుకు వీలుగా బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు, వాటి వినియోగం, ఆరోగ్య సంబంధమైన సదుపాయాలు, పోషకాహార ప్రాధాన్యతలు, స్త్రీల ప్రయోజనాలు వంటి వాటిలో కలిసి కట్టుగా పనిచేయవలసి ఉంటుంది. |
చెట్ల పెంపకం
శివక్క దంపతులు తోటల పెంపకంపై ఆసక్తి చూపించారు. బసప్ప మట్టిని తవ్వడం, అవసరమైన పాదులు ఏర్పాటు చేసే పనులు విర్వహించేవాడు. దానిని సరిచేసి, కంపోస్టు ఎరువులను అందించి, కలుపు తీయడం, నీళ్లు పట్టడం వంటి పనులు చేసేది. కుండల సాయంతో మొక్కలకు అవసరమైన నీటిని అందించే సదుపాయం ఏర్పాటుచేసుకున్నారు. 15 వర్షాకాలంలో కిలోల కంపోస్టును, కిలో ఉప్పును మొక్కల మొదట్లో వేశేవారు. పెరుగుతున్న పని ఒత్తిడిని కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా పంచుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రారంభంలో అప్పుడప్పుడు సెలవు పెట్టి సాయం చేస్తూ వచ్చిన బసప్ప తర్వాత పూర్తిగా తన పొలం పనులకే పూర్తి సమయం కేటాయించాడు. మూడేళ్ల కాలంలో మామిడి పూత వచ్చింది. మరో ఏడాదికి పండ్లు, కాయలు సమృద్ధిగా లభించాయి. ఇరుగు పొరుగు వారికి వాటిని అందించి ఆ కుటుంబం అమితమైన సంతోషాన్ని అనుభవించింది. క్రమంగా వాటిని మార్కెట్కు చేర్చి విక్రయించుకున్నారు. 20 మొక్కల మీద ఏడాదికి రూ. 8 వేల ఆదాయం లభించింది. సపోటా పండే కాలంలో స్థానికంగా చేరువగా ఉన్న హుబ్లీ మార్కెట్ లో గిట్టుబాటు కాకపోతే, తమ ఫలసాయాన్ని కుందాపూర్ తీసుకువెళ్లి సొమ్ము చేసుకంటూ వచ్చారు. ఏడాదికి రెండు సార్లు సపోటా కాసేది. మూడు నెలల పాటు అవి ఫలాలను అందిస్తూనే ఉంటాయి. ప్రతీ రోజు రెండు బుట్టలను (ఒకొక్కటి 15 కిలోలు) బస్సులో తీసుకెళ్లేవారు. వాటికి రూ. 500 నుంచి రూ. 800 వరకు వచ్చేది. సపోటా మీద మొత్తం మీద ఏడాదికి రూ. 10000 వరకూ ఆదాయం సమకూరుతూ వచ్చింది. ఇక మామిడి కాయల ద్వారా ఏటా రూ. 8000 ఆదాయం వచ్చేది.
అంతర పంటల పెంపకం
చెట్లు పెరగే లోపున వారు కొన్ని కూరగాయలను, అంతర పంటలను కూడా సాగు చేశారు. నల్ల చిక్కుడు, జొన్న, టమోటా, మిర్చి, వంగ వంటివి అంతర పంటలుగా సాగుచేసేవారు. కుటుంబ అవసరాలు పోను మిగులు దిగుబడిని మార్కెట్ కు చేర్చేవారు. అయితే గోరు చిక్కుడు, బీర, కాకర కాయలను పూర్తిగా కుటుంబ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునేవారు. దగ్గరలో ఉండే మార్కెట్లలో హుబ్లీ, మిశ్రికోటి, కాలాఘటిగై వంటి చోటికి శివక్క కూరగాయలను, పండ్లను తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేది.
కొండ ప్రాంతానికి దిగువన ఉన్న ఎకరం పొలంలో స్థానికంగా ఉపయోగంలో ఉన్న వరి పండించేవారు. ఆరు నుంచి ఎనిమిది బ్యాగుల ధాన్యం అందులో పండేది. దాని విలువ సుమారుగా బ్యాగుకు రూ. 800 చొప్పున రూ. 5600 వరకూ వచ్చేది. ఇటీవల మూడు సంవత్సరాలుగా అందులో మొక్కజొన్న సాగు ప్రారంభించారు. నాట్ల దగ్గర నుంచి కలుపు ఏరడం, పంట కోయడం వరకూ అన్ని పనులనూ శివక్క స్వయంగా చేసుకుంటుంది. వాటి దిగుబడులు, రాబడి వివరాలను టేబుల్ 1 లో చూడవచ్చు.
పశుపోషణ కూడా
శివక్క కుటుంబానికి స్థానిక జాతికి చెందిన ఆవు ఒకటి ఉండేది. అది రోజుకు 2 లీటర్ల వరకూ పాలు ఇచ్చేది. అందులోంచి 250 మిల్లీ లీటర్లను కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుని, మిగిలిన దానిని విక్రయించేవారు. 2010లో రూ. 15 వేలతో రెండు ఎడ్లను కూడా కొనుగోలు చేశారు. మరో రూ. 11 వేలు పెట్టి గేదెను కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం రోజుకు 3 లీటర్ల పాలు అమ్ముకోగలుగుతోంది. లీటరుకు రూ. 30 వస్తాయి. అంటే ఏడాదికి రూ. 11,250 వరకూ వస్తోందన్నమాట. సాగు పనుల్లో వచ్చే వ్యర్థాలను అంటే వరి గడ్డి, పత్తి గింజలు, సోయాబీన్, మిల్లు నుంచి వచ్చిన పొట్టు వంటి వాటిని కంపోస్టు తయారు చేయడానికి ఉపయోగించుకుంటారు.
టేబుల్ 1 – అంతర పంటల దిగుబడి – రాబడి వివరాలు
| క్రమ సంఖ్య | పంట పేరు | దిగుబడి(కిలోల్లో) | రాబడి(రూలలో) |
| 1 | నల్ల చిక్కుడు | 50 | 1250 |
| 2 | మొక్క జొన్న | 300-400 | 4200 |
| 3 | వంకాయలు | 300 | 3000 |
| 4 | టమోటా | 400 | 3000 |
| 5 | ఇతర కూరగాయలు | - | 3000 |
| 6 | జొన్న | 2000 | 50000 |
| 7 | సోయాబీన్ | 7000 | 15400 |
| మొత్తం | 79650 |
టేబుల్ 2 – వివిధ రూపాలలో వస్తున్న రాబడి
| ఆదాయ మార్గం | ఏడాదికి ఆదాయం (రూ.లలో) |
| అంతర పంటల ద్వారా | 79650 |
| తోటల ద్వారా | 18000 |
| అడవి చెట్లు | 3000 |
| పశుపోషణ ద్వారా | 11500 |
| మొత్తం | 100650 |
ఆఖరి మాట
శివక్క అనుసరించిన వడి నమూనా వందలాది ఇతర రైతులకు ప్రోత్సాహం ఇస్తోంది. ప్రస్తుతం ఆమెకు సరాసరిని లక్ష రూపాయల కన్నా ఎక్కువగానే ఆదాయం వస్తోంది. అదే సమయంలో బెయిఫ్ ఆద్వర్యంలో నడుస్తున్న గ్రామ చేతన శిక్షణ కేంద్రంలో సామాజిక రిసోర్స్ పర్సన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తోంది. ఈ విధుల నిర్వహణకు అవసరమైన పూర్తి ఓర్పును, సామర్థ్యాన్ని ఆమె ప్రదర్శించగలుగుతోంది. మెప్పులు అందుకుంటోంది. శివక్క కొత్తగా నిర్మించుకున్న ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ స్వయంసహాయక సంఘాల సమావేశాలకు హాజరవుతూనే ఉంటుంది. పొదుపు చేసిన సొమ్ముతో ఇద్దరు కుమార్తెలకు పెళ్ళి చేసింది. ఇల్లు కట్టుకోగలిగింది. ఇప్పుడు ఇదివరకటి చేదు జీవితం జ్ఞాపకాలలో తప్ప మిగలలేదు. తాను సాధించిన ఈ అద్భుతమైన ఫలితాలకు బెయిఫ్ క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఒకరైన దీపక్ క్షీరసాగర్ కు రుణపడి ఉంటానని ఆమె అంటుంది.
గంగా అంకడ్
రీసెర్చి ఆఫీసర్,
నెం. 2 బెయిఫ్ ఆఫీస్,
కుసుంనగర్, 11వ క్రాస్
కేల్గిరి రోడ్డు, ధార్వాడ్ – 580 008
కర్నాటక. E-mail: gangaankad@birdk.org.in; ganges2010@gmail.comఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౫



