మహిళా రైతులకు జోహారు

వ్యవసాయ రంగంలో కేరళకు చెందిన మహిళల విజయ గాథలు మరో అపూర్వమైన దృశ్యాన్ని మన కళ్ల ముందు నిలబెడతాయి. మహిళా సంఘాలు సమష్టిగా సాధించిన పురోగతి, ప్రభుత్వపరంగా వారికి లభించే ప్రోత్సాహకాలు, పూర్తిగా వారికి కొండంత అండగా  నిలుస్తున్న రుణ పరపతి విధానాలు అక్కడి భూమి లేని మహిళా రైతులను కూడా సేంద్రీయ వ్యవసాయంలో తలెత్తుకు నిలిచేందుకు కారణమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వారికి ఒక గుర్తింపు, ప్రత్యేకత లభించాయి. వరి, కూరగాయలు, అరటి తోటలు, రకరకాల దుంపల సాగులో మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సంఘటిత శక్తిగా మారిన మహిళా బృందాలు తమ సత్తా చాటుతున్నాయి.

ఇప్పటికి మూడు దశాబ్దాలుగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే ధోరణి ఎక్కువ అయింది. ఇందుకు ప్రధానమైన కారణం – ఆర్థిక పరంగా వచ్చిన మార్పులే. కార్మిక శక్తి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం, సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడం, ఫలితంగా సేద్యం లాభసాటి కాకపోవడం, ఈ పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాల వల్ల భూయజమానుల్లో సేద్యం పట్ల అసక్తిని తగ్గించివేస్తూ వచ్చింది. దాంతో వాళ్లంతా వ్యవసాయ పనులకు దూరమైపోయారు. ఇప్పుడు కళ

కుడుంబశ్రీ పథకం కారణంగా మహిళల సమష్టి శక్తి మరింత పటిష్టంగా తయారైంది. దానికి తోడు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలు ఉండడంతో మహిళలు చురుగ్గా వ్యవసాయ పనులు చేపట్టేందుకు ప్రోత్సాహం లభిస్తోంది. ఫలితంగా భూమి లేని మహిళలు కూడా సేద్యం చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు.

తప్పిన మైదానాల్లా పొలాలు మారిపోయి కనిపిస్తున్నాయి. సాగు పనులు కొరవడడంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఈ పరిస్థితి కూలీ పనులే జీవనాధారమైన మహిళల బతుకులను చిందరవందర చేసాయి. వారి కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో పడ్డాయి. కేరళ రాష్ట్రంలో వ్యవసాయ పనుల్లో ఎప్పుడూ మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. సేద్యం పనుల్లో వారు కుటుంబానికి తోడుగా ఎలాంటి కూలీ లేకున్నా చేయూత ఇస్తుంటారు. లేదా ఇతరుల పొలాల్లో కూలీకి వెడుతుంటారు. ఇలా ఆదాయం సంపాదించి పెట్టడంలో లేదా ఖర్చు భారం తగ్గించడంలో మహిళల పాత్ర చాలా కీలకమైనది.

ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలకు ఎదురవుతున్న పెద్ద సమస్య  - సేద్యం చేయడానికి వారికి తగినంత భూ వసతి దొరకడం లేదు. తమ భూములను కౌలుకు ఇస్తే వాటిపై తమకు హక్కులు చేజారిపోతాయనే భయం ఎక్కువగా ఉండడం అందుకు ఒక కారణం. ఇక్కడ అమలులో ఉన్న భూ సంస్కరణల చట్టం ప్రకారం, వ్యవసాయ అవసరాల కోసం భూమిని కౌలుకు ఇవ్వడం నిషిద్ధం. అయినప్పటికీ వివిధ రూపాలలో భూములను కౌలుకు ఇవ్వటం, ఇతరులకు సేద్యం పనులకు అప్పగించటం జరుగుతూనే ఉంటుంది. అలాంటి భిన్న రూపాలలో కుదుర్చుకునే ఒప్పందాలలో కూడా చాలా మంది భూ యజమానులు తమ భూములను మహిళా రైతులకు అప్పగించేందుకు సిద్ధంగా లేరు. ఇది మహిళా సంఘాలకు ఎదురవుతున్న చాలా పెద్ద సమస్య. ఈ కారణంగా వాళ్లు నిలకడగా వ్యవసాయపు పనులు చేపట్టలేకపోతున్నారు.

ఈ రకంగా వ్యవసాయ కార్యకలాపాలలో మహిళలకు అవకాశం ఇవ్వడం అన్న ఆదర్శం కేరళలో ప్రభుత్వ వర్గాలకు చాలా గొప్ప అవకాశంగా కనిపించింది. సమాఖ్యలుగా ఏర్పడిన మహిళా సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వటం చాలా ప్రయోజనకరంగా కనిపించింది. అందుకు సూక్ష్మ రుణ పరపతి సదుపాయం కల్పించటంతో పాటు వారు నివసించే ప్రాంతాలకు చేరువలోనే బీడు భూములను వారికి అప్పగించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకోసమే కుడుంబశ్రీ పథకం రూపుదిద్దుకుంది.

కుడుంబశ్రీ పథకం

కేరళలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా కుడుంబశ్రీ పథకం 1998లో ప్రారంభమైంది. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన మిషన్ కింద మహిళా బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి స్థానిక ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఈ కృషిలో పేద కుటుంబాలలో పేదరికాన్ని దూరం చేయటమే కాక వారికి సామాజికంగా పురోగతి సాధించేందుకు తోడ్పడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనితోపాటు మహిళలకు సాధికారికత కల్పించాలనే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. స్థానిక పాలనా సంస్థ పరిధిలో అంటే గ్రామ పంచాయతీ లేదా పట్టణ పాలక వ్యవస్థ పర్యవేక్షణలో కుడుంబశ్రీ అమలు చేస్తారు. ఈ కుడుంబశ్రీ కింద మూడు అంచెల మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తారు. అవి – పరిసరాల పరిధి (ఎన్ఎస్జీ) బృందాలు (Neighborhood Group-NHG), ప్రాంతీయ పరిధి (ఏడీఎస్) బృందంగాను (Area Development Society-ADS),  సామాజిక పరమైన (సీడీఎస్) బృందాలు (Community Development Society-CDS) గానూ వ్యవహరిస్తారు.

ఒక నివాస ప్రాంతంలో నివసించే ఇరుగుపొరుగు వారు సభ్యులుగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారి నుంచి పది నుంచి ఇరవై మంది వరకూ సభ్యులు ఉండేలా రిసరాల పరిధిలోని మహిళలు అంతా ఏకమై ఒక బృందంగా (ఎన్ఎస్జీ) ఏర్పడవలసి ఉంటుంది. దీనిని అట్టడుగు స్థాయిలోని మహిళా బృందంగా చెప్పుకోవాలి. ఉదాహరణకు ఒక వార్డు పరిధిలోని మహిళా ఎన్ఎస్జీలు అన్నీ ఏకమై ఆ ప్రాంతీయ స్థాయి సొసైటీగా (ఏడీఎస్) ఏర్పడుతారన్నమాట. అలాంటి బృందాన్ని ప్రాంతీయ అభివృద్ధి సొసైటీ (ఏడీఎస్)అంటారు. ప్రతీ పరిసరాల పరిధి బృందాల నుంచి అయిదుగురు సభ్యులుగా ఇందులో (ఏడీఎస్) కార్యనిర్వాహక వర్గంగా వ్యవహరిస్తారు. ఇది మధ్య స్థాయిలోని సమాఖ్య కాగా అత్యున్నత స్థాయిలో ఎల్ఎస్జీలు అందులో సభ్యు బృందాలుగా పనిచేస్తాయి.

సీడీఎస్ అన్నది దాదాపుగా ఒక గ్రామం మొత్తం పరిధిలో పనిచేస్తుంది. ఇది ఆ గ్రామ స్థాయిలోని అన్ని ఎన్ఎస్జీల మధ్య కుడుంబశ్రీ పథకం అమలు, పర్యవేక్షణ విధులను నిర్వహిస్తుంది. సీడీఎస్ పర్యవేక్షణలోనే ఆ గ్రామపరిధిలోని మొత్తం మహిళలకు అవసరమైన రాతకోతల వ్యవహారాల నిర్వహణకు వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ఈ వ్యవస్థలోని సభ్యులు ఇతర మహిళా సంఘాల సభ్యుల తరఫున రుణ దరఖాస్తులను సిద్ధంచేయడం, ఇతరులకు మార్గదర్శకం చేయటం వంటి విధులు, బాధ్యతలు నిర్వహిస్తారు. అంతేకాక, గ్రామ పంచాయతీ తరఫున, వ్యవసాయ శాఖ అధికారుల తరఫున అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందజేస్తారు.  పంట రక్షణ పద్ధతులు తెలియజేస్తారు. మహిళా బృందాలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే బాధ్యతను కూడా నిర్వహిస్తారు. అవసరమైన సాంకేతిక శిక్షణ సాధారణంగా ఈ వ్యవస్థలో 250 నుంచి 300 బృందాలు ఉంటాయి.

సీడీఎస్, ఎల్ఎస్జీలు భాగస్వామ్య పాలనకు, అభివృద్ధి కార్యకలాపాలు అట్టడుగు స్థాయి నుంచి సామాజిక సాధనంగా ఉపయోగపడుతుంది. అంతేకాక, ఎల్ఎస్జీలు తమకు అందుబాటులో ఉన్న వనరులను సమష్టిగా ఉపయోగించుకుని అందరూ పురోగతి సాధించేందుకు తోడ్పడుతుంది. ఆ క్రమంలో పేదరికం నిర్మూలనలో కీలకపాత్ర పోషిస్తుంది. సంఘటిత శక్తిగా తయారైన మహిళా సంఘాలకు అవసరమైన రుణపరపతి సదుపాయాన్ని జీరో వడ్డీకే అందించడానికి ఈ పథకం అవకాశం ఇస్తుంది. కారణం ఏమిటంటే  మహిళా సంఘాలలో ప్రతి సభ్యులు తాము విడివిడిగా మాత్రమే కాక, మొత్తం వారి బృందం సమష్టిగా తీసుకున్న రుణాలకు ఉమ్మడిగానే బాధ్యులవుతారు. దీనినే ఉమ్మడి రుణ బాధ్యతగా (జాయింట్ లయబిలిటీ గ్రూప్-జెఎల్బీ) వ్యవహరిస్తారు. ఇలాంటి జేఎల్బీ గ్రూపులకు రుణసహాయాన్ని నాబార్డ్ అందిస్తుంది. దీనికి తోడు జాతీయ గ్రామీణ జీవనాధారాల కల్పన మిషన్ (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ -  ఎన్ఆర్ఎల్ఎం) కింద ఏర్పాటుచేసిన మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన నుంచి కుడుంబశ్రీ పథకానికి కొంత సబ్సిడీ లభిస్తుంది. ఈ కారణంగా కూడా మహిళా రైతులకు తకుకవ వడ్డీలకే రుణసదుపాయం అందుతుంది. ఈ రకమైన ప్రోత్సాహకాల కారణంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని తమ ఉపాధి మార్గంగా చేపట్టేందుకు సాధ్యమవుతోంది.

అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 2.8 లక్షల మంది మహిళలు సమైక్యమై 61,836 ఉమ్మడి రుణబాధ్యత గ్రూపులుగా సంఘటితమయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో వీరంతా కలిసి రాష్ట్రంలోని 38,706 హెక్టార్ల బీడు భూములను సస్యవంతం చేయగలుగుతున్నారు. మహిళా రైతుల కృషి కారణంగా దాదుప 39 వేల హెక్టార్ల క్షార భూములు పంటలతో కళకళలాడుతున్నాయి. వారు పండించే పంటల్లో చెప్పుకోవలసినవి - వరి (10,934 హెక్టార్లు), అరటి తోటలు (10,648 హెక్టార్లు), దుంపలు వంటివి (8686 హెక్టార్లు), కాయగూరలు (8476 హెక్టార్లు), ఇతర పంటలు (14,433 హెక్టార్లు).

పర్యావరణహితమైన సమష్టి సేద్యం

ఈ విధంగా వ్యవసాయం తమ ప్రధాన ఉపాధి మార్గంగా  ఎంపిక చేసుకున్న మహిళల్లో చాలా మంది పర్యావరణహితమైన సేద్య విధానాలనే అనుసరిస్తున్నారు. చాలా తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను ఉపయోగిస్తున్నారు. అత్యధికులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులనే పాటిస్తున్నారు. సేంద్రీయ ఎరువులుగా కొంతమంది సొంతంగా  ఎరువులను తయారుచేసుకుంటున్నారు. ఇందుకు ఆవు లేక పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలు, పెద్దపెద్ద చెట్ల నుంచి రాలిపడే ఆకులు, అలములు, వానపాముల ఎరువులు (వర్మీ కంపోస్టు), జనుప నార వ్యర్థాలను ముడి సరుకులుగా వాడుతున్నారు. ఇలా పర్యావరణహితమైన విధానాలు ఉపయోగించటం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గిపోతాయని, శ్రామిక శక్తి అవసరం తగ్గిపోతుందని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిగా లాభాల శాతం తగ్గినా వారు ప్రజలకు తక్కువ ధరలలోనే నాణ్యమైన ఉత్పాదనలను అందించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

కొంత మంది మహిళలు తమ ఉత్పాదనలను శుద్ధి చేసి వినియోగదారులకు అందించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. ఆ రకంగా వాటికి అదనపు ధరలను రాబట్టుకోగలుగుతున్నారు. అలంకోడ్, తెన్నెల గ్రామాలలో మహిళా రైతులు సాగుచేసిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మిల్లులలోనే ఆడించి, సొంతంగా బ్రాండ్ ఏర్పాటుచేసుకుని మార్కెట్ కు తరలిస్తున్నారు. ఆ రకంగానే తెన్నెల రైస్, పుథారి సేంద్రీయ రైస్ (అలంకోడ్) బియ్యం మార్కెట్లో లభిస్తోంది. ఇదే విధంగా వేర్వేరు పేర్లతో ఫ్లేక్స్, బియ్యపు పిండి, అటుకులు (బ్రోకెన్ రైస్) వంటివి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. ఇక్కడి మహిళల వినూత్న ఆలోచనలన్నింటికీ నాబార్డ్ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఫలితంగా మహిళా ఉత్పాదక కంపెనీల ఏర్పాటు సాధ్యమవుతోంది.

సత్ఫలితాలు

“ఇప్పుడు మేము కూలీలం కానేకాదు. సొంతంగా భూమిని సాగుచేస్తున్న సేద్యగాళ్లం”, “నా పిల్లలకి ఇప్పుడు ఉన్నత వృత్తి విద్య అందించగలుగుతున్నాను”, “నా కుమార్తె వివాహానికి బంగారం కొనుగోలు చేయగలుగుతున్నాను”, “నేనో ద్విచక్ర వాహనం కొనుక్కున్నాను”, “నా పేరు మీద పొలం, ఇల్లు సంపాదించుకున్నాను”, “నా మగనికి ద్విచక్రవాహనం కొని ఇచ్చాను, ఆయన వ్యాపారం మెరుగవడానికి సహాయపడ్డాను”, “నా కుటుంబానికి ఏడాది పొడవునా అవసరమైన బియ్యం నేను సొంతంగా పండించి నిల్వచేసుకోగలిగాను”, “నన్ను ఇప్పుడు మా ఇంట్లో వాళ్లంతా ఆదాయం తెచ్చి  పెట్టే సంపాదనపరురాలిగా గౌరవిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునేప్పుడు నా సలహాలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు”, “రుణ సహాయం కోసం నాభర్త నా సాయం కోరాడు, నా ఇరుగుపొరుగు వాళ్లు పంచాయతీ నుంచి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నన్నాశ్రయిస్తున్నారు.”  ఇవి అక్కడ ఒక్కో మహిల నోటి నుంచి వినిపించిన మాటలు. వాటిలో వారిలో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, వారికి లభిస్తున్న గౌరవమన్ననలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కుడుంబశ్రీ సాధించిన విజయ గాథలకు ఇవి సాక్షీరూపాలు.

ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామ పంచాయతీలు ... అన్నమనడా (త్రిసూర్), అలత్తూరు (పాలక్కడ్), అలంకోడ్, తెన్నెల (మలప్పురం) – కుడుంబశ్రీ కుటుంబాల విజయానికి కేంద్రాలుగా నిలిచాయి. వారికి స్థానిక పంచాయతీలు, వ్యవసాయ కార్యాలయాలు రుణ దరఖాస్తులు, అవసరమైన భూమిని లీజుపై మహిళా బృందాలకు అందించేందుకు తగిన వసతులు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన భూములను సొంతంగా సేద్యం చేసుకునేందుకు సిద్ధంగా లేని భూ యజమానుల నుంచి సేకరిస్తున్నారు. భూ యజమానుల దగ్గర ఉన్న భూములు నిరుపయోగంగా పడి ఉండటం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఇలాంటి మహిళా సంఘాలకు అందించి వాటిని సస్యశ్యామలం చేయటంవల్ల కలిగే

ప్రయోజనాలను వారికి వివరించేందుకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా సేకరించిన భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేయటం వల్ల కలిగే లాభాలను మహిళా సంఘాలకు వివరిస్తున్నారు. అందుకు అనుసరించవలసిన విధివిధానాలను ఇరు వర్గాలకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నిర్విరామంగా కృషి జరుగుతోంది. మహిళలు కౌలుకు తీసుకునేందుకు మూడేండ్ల వ్యవధిని నిర్ణయిస్తున్నారు. ఇది ఇరు పక్షాలకు ధీమా ఇస్తున్నది. ఆసక్తి కలిగించే మరో విషయం ఏమిటంటే – ఆలంకోడ్, తెన్నెల పంచాయతీల పరిధిలో మహిళా నేతలు స్థానిక వరి పండించే రైతుల సంఘాలకు - వాటిని పాదశేఖర కమిటీలుగా వ్యవహరిస్తారు – కన్వీనర్లుగా విధులు, బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ కమిటీలను వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుంది.

ఇదివరలో మహిళా సంఘాల వారికి రుణ సదుపాయం ఇవ్వటానికి బ్యాంకు అధికారులు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ మహిళా బృందాల పని తీరును పరిశీలించి వాటికిచ్చిన రేటింగ్ ప్రకారం విశ్వసనీయతకు మారు పేరుగా గుర్తించారు. జేఎల్జీ పథకం కారణంగానూ, మహిళా బృందాలను నిర్వహించడంలో వారు చూపిస్తున్న సామర్థ్యాన్ని గుర్తించడమే బ్యాంకులు, వాటి అధికారులు ఇప్పుడు రుణసదుపాయం అందించేందుకు అవసరమైన నమ్మకాన్ని కలిగిస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నిటి ఫలితంగానే నేడు కేరళలోని మహిళలు వ్యాపారదక్షతకు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగలిగారు.

పర్యావరణహిత సేద్య విధానాలకు వాళ్లే రక్షకులు

నీటి సదుపాయం పుష్కలంగా ఉన్న తడి నేలల్లో వ్యవసాయాన్ని చేపట్టడంలో వారు చూపిస్తున్న నైపుణ్యం, నేర్పు నేపథ్యంలో వారికి అవసరమైన ముడిసరుకులు, వనరులు అందించినప్పుడే వారు వారి కుటుంబాలకు లాభదాయకమైన సంపాదనపరులుగాను, గౌరవనీయమైన సభ్యులుగానూ నిలదిక్కుకోగలుగుతారు. సమాజం గుర్తింపును పొందగలుగుతారు. కుడుంబ్రశీ పథకం కారణంగా వారిలో నెలకొన్న సంఘటిత శక్తి, తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తున్న రుణసహాయం ఆధారంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలు రైతులుగా నిలదొక్కుకోగలుగుతున్నారు.

కేరళలో పర్యావరణహితమైన వ్యవసాయం అభివృద్ధికి మహిళా బృందాలు ప్రధాన కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. వరి సేద్యంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వారి చేతిలో పడిన తరువాత అంతకాలం నిరుపయోగంగా పడి ఉన్న భూములు వరి చేలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఈ పేద మహిళలే సగర్వంగా సురక్షితమైన, నాణ్యమైన బియ్యాన్ని స్థానిక ప్రజలకు అందజేయగలుగుతున్నారు. అదే సమయంలో తమ కుటుంబాలకు తగినంత ఆదాయం సంపాదించిపెట్టి మెరుగైన జీవిత ప్రమాణాలు చేకూర్చగలుగుతున్నారు.

గీతాకుట్టి పి.ఎస్.
ప్రొఫెసర్ మరియు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్
సెంటరం ఫర్ జెండర్ స్టడీస్ ఇన్ అగ్రికల్చర్
కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం
వెల్లన్నిక్కర, త్రిచూర్, కేరళ
E-mail : geethakutty@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౫

 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....