సేద్యపు పనులలో ఉత్తమ విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలే. కానీ, మన దేశంలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన కుగ్రామం రాజవర్ వాసులు కమ్యూనిటీ రేడియోను ఆసరాగా చేసుకుని అందరి సమష్టి అభివృద్ధికి అవసరమైన మార్పునకు బీజం వేశారు. సామాజిక రేడియో మాధ్యమం సహాయంతో నిర్వహించిన రూరల్ రియాల్టీ షో క వినూత్న కార్యక్రమం. దీని సాయంతో విడివిడిగానే కాకుండా సమష్టిగా ఇక్కడి అందరి రైతన్నల భూసారాన్ని, తమ చుట్టూ ఉన్న భూముల సారాన్ని కూడా పెంపొందించేందుకు చేసిన కృషి, సాధించిన ఫలితాలు అపూర్వం. అద్భుతం.
మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం కిందకు ఆరు జిల్లాలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వస్తాయి. సువిశాలమైన ఈ ప్రాంతం నీటి వనరులు అంతగా లేని పాక్షిక ఎడారి ప్రదేశం. ఎప్పుడూ అతి తక్కువ వర్షపాతమే. నిత్యం కరువు, కాటకాలే. పైగా ఇక్కడ నేలల్లో రాతి ప్రాంతం ఎక్కువగా ఉంటున్న కారణంగా అప్పుడప్పుడు కురిసే కొద్దిపాటి చినుకులు కూడా మట్టిలో నిలబడవు. అందువల్ల ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం మాత్రమే కాదు, అంతంత మాత్రపు సేద్యపు పనులకు కూడా నీటి కోసం అల్లాడిపోతుంటారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా అస్థిరమైన నిలకడ లేని వానల కారణంగా రైతన్నల బాధలు మరింత తీవ్రమయ్యాయి.
ఏండ్ల తరబడి కరువుకాటకాలు ఏర్పడటంతో బుందేల్ ఖండ్ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు క్షీణించిపోయాయి. ఫలితంగా ఇక్కడి ప్రజల జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయాధారిత ఉపాధి అవకాశాలు 58 శాతం తగ్గిపోయాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న బుందేల్ ఖండ్ ఇప్పుడు పర్యావరణ క్షీణత సమస్యను, అదీ, తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటోంది.
వాతావరణంలో ఎదురవుతున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బుందేవ్ ఖండ్ ప్రాంతంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్న డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాలను ప్రజలకు చేరువ చేస్తోంది. వాటిలో ఒకటి – రూరల్ రియాల్టీ షో. ఇది పరిసరాలలోని కమ్యూనిటీలలో ఎదురయ్యే వాతావరణ మార్పులను పటిష్టంగా ఎదుర్కొని వాటి ప్రభావాన్ని నియంత్రించేందుకు మార్గాలను సూచించేందుకు అత్యుత్తమ సాధనంగా తోడ్పడుతుంది. ఇందుకు రూరల్ రియాల్టీ షో నిర్వహణకు కమ్యూనిటీ రేడియోను ప్రధానమైన సాధనంగా చేసుకున్నారు. అందులో స్థానికులే ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు, లబ్ధిదారులు. విద్య-వినోదం కలయికతో తేలికైన, సరళమైన, ఉత్తమ విధానాలను వివరించేందుకు ఈ రేడియో ప్రధాన మాధ్యమంగా నిలిచింది.
రియాల్టీ షో
దేశంలోనే మొట్టమొదటి కౌన్ బనేగా శుభకాల్ నేత శీర్షికతో రూరల్ రియాల్టీ షో ప్రసారమైంది. దీనిని రేడియో బుందేల్ ఖండ్ ప్రసారం చేసింది. రేడియో బుందేల్ ఖండ్ ఓర్చా కేంద్రంగా పనిచేస్తుంది. డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్ సారధ్యంలో స్థానిక కమ్యూనిటీ సహకారంతో సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ రేడియో కార్యక్రమాల నిర్వహణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. ఈ కార్యక్రమం కారణంగా వాతావరణ మార్పుల గురించి, కరువు కాటకాలు నెలకొన్న మధ్య భారత ప్రాంతాలలో అనుసరించవలసిన ప్రత్యామ్నాయ మార్గాలను గురించి ప్రజలలో పూర్తి అవగాహన కలిగించడం సాధ్యమైంది.
నిపుణులతో సలహాలు, సూచనలు, నిపుణుల ఇంటర్వ్యూలు, చర్చా వేదికలు, కార్యకలాపాల సమాచారం, జానపద గేయాలు, రేడియో డ్రామాలు, పోటీలు కలగాపులగం చేసి మొత్తం మీద ప్రజల ఆసక్తిని నిలకడగా కాపాడుతూ వస్తున్నారు. స్థానిక జన చైతన్యానికి కృషి చేస్తున్నారు. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడంలో భాగస్వాముల సామర్థ్యం పెంపు లక్ష్యంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. ఇక ఎలిమినేషన్ పద్ధతిలో పోటీలో విజేతలను ఎంపిక చేసే పోటీలలో ప్రతిభావంతులను గుర్తించేందుకు, సుస్థిర అభివృద్ధి సాధనలో సహాయపడగలిగిన వారిని నిర్ధారించేందుకు శ్రద్ధ తీసుకుంటారు. రూరల్ రియాల్టీ షో కార్యక్రమాలలో వాతావరణ మార్పులను తట్టుకోవడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వారిని ముందుగా స్థానికంగా ఆయా ప్రాంతాలల నుంచే ఎంపిక చేసుకుంటారు. తరువాత వారికి ఆచరణయోగ్యమైన ఉత్తమ విధానాలపై సమగ్రమైన శిక్షణ ఇస్తారు. ఇలా తర్ఫీదు పొందిన వారి నుంచి మెరికల్లాంటి వారిని ఎంపికచేస్తారు. వారు ఎంతమందిపై తమ ప్రభావం చూపించగలిగారు, ఎంతమందికి తాము నేర్చుకున్న నైపుణ్యాలను అందజేయగలిగారనే అంశం ప్రాతిపదికగా తీసుకుని దశలవారీగా సాగే ఎంపిక ప్రక్రియ అనుసరిస్తారు. ఈ విధానం కారణంగా మరింత వేగంగా, మరింత సమర్థవంతంగా కమ్యూనిటీలోని అత్యధికులకు ఈ కార్యక్రమం చేర్చడం సాధ్యమైంది.
తోటలలో వర్మీ కంపోస్టు (వానపాముల ఎరువులు) వాడకం, తయారీ చేపట్టడం జరుగుతుంది. ఈ తోటలలో వ్యర్థంగా పేరుకుపోయే ఆకులు, అలమలు మళ్లీ వానపాముల ఎరువు తయారు చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ రకమైన రూరల్ రియాల్టీ షో రూపంలో ప్రచారం చేసిన 25 రకాల వాతావరణ పరిరక్షణ ప్రత్యామ్నాయాలలో అమృత మట్టి వాడకం ఒకటి. ఇది భూ సారం పెంపొందించేందుకు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. అమృత మట్టి అంటే సేద్యంలో పేరుకుపోయే చెత్త, చెదారం సహాయంతో, పశువుల వ్యర్థాలతో, బెల్లం కలిపిన నీటిని ఉపయోగించి తయారుచేస్తారు. ఈ రకమైన ఎరువులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. భూసారాన్ని గణనీయంగా పెంచుతాయి. నేలలో తేమ నిలిచేందుకు తోడ్పడతాయి. ఆ విధంగా, బుందేల్ ఖండ్ వంటి మెట్ట భూములకు అన్ని విధాలా ఉపయోగకరమైన ఉత్తమ విధానాలలో అమృత మట్టి ముఖ్యమైనది.
తికోమ్ గఢ్ జిల్లా రాజావర్ గ్రామానికి చెందిన 25 ఏండ్ల ప్రకాశ్ కుష్వాహ రూరల్ రియాల్టీ షో ద్వారా అమృత మట్టి తయారీ, వినియోగం విషయంలో పూర్తి శిక్షణ పొందాడు. అప్పటి నుంచి ఆయన తాను తన వ్యవసాయ క్షేత్రంలో అమృత మట్టిని ఉపయోగించడమే కాకుండా గ్రామంలోని మరెందరికో ఆ సమాచారాన్ని తెలియజేసి వారిలో కూడా చైతన్యం కలిగించాడు. ఆయనకు పర్యావరణానికి సంబంధించి, తలెత్తే సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. అంతేకాదు, కత్త సాంకేతిక విధానాలను తెలుసుకునేందుకు ఆసక్తి ఉంది. అలా తెలుసుకున్న సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఒక స్పష్టత ఉంది. వాటి వల్ల తన వంటి వ్యవసాయదారులకు వాటి వల్ల లాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఊహించగల నేర్పు ఉంది. చివరికి పరాయవరణ పరంగా కానీ, వాతావరణ పరంగా కానీ కలిగే ఉపయోగాల గురించిన పూర్తి విశ్వాసం ఉంది. ఫలితంగా ప్రకాశ్ విజయ గాథ ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వగల తార్కాణంగా మారింది. రూరల్ రియాల్టీ షో తుది విజేతగా నిలబెట్టింది.
ప్రభావాన్ని ప్రచారం చేసే కర్తవ్యం
రూరల్ రియాల్టీ షో లో పాల్గొన్న తరువాత ప్రకాశ్ ఆ ప్రాంతంలో అందరి నోట్లో ప్రాచుర్యం సంపాదించాడు. పర్యావరణ సంబంధమైన అంశాలపై ఆయనకు ఉన్న అపారమైన విజ్ఞానం కారణంగా అందరూ గౌరవించేవారు. ఇప్పుడు అన్ని వయస్సుల వారూ కూడా సేద్య సంబంధమైన సలహా సూచనల కోసం ఆయనను సంప్రదిస్తుంటారు.
“నాకు స్ఫూర్తి నిచ్చింది ప్రకాశ్ జీయే. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మేము అంటే నేను మా చెల్లెళ్లు మా ఇంటి ఆవరణలో మొక్కలు నాటాం. ” అంటున్నారు అదే గ్రామానికి చెందిన యువతి 20 ఏండ్ల బబ్లీ. ఆమె తండ్రి ఇంకా ఇలా చెప్పారు. “ప్రకాశ్ మా అందరికీ ఆదర్శం. మాకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్న అందించే విజ్ఞాన ఖని. సలహాదారుడు. రాజువార్ గ్రామంలో అందరి మంచి చెడులను బేరీజు వేసే గణికుడు కూడా. గ్రామంలోని ప్రతి ఒక్కరిలో మార్పునకు అతడే సూత్రధారి.”
రాజావార్ గ్రామంలోకి అడుగు పెట్టగానే పచ్చటి పంట పొలాలు స్వాగతం పలుకుతాయి. వాటికి వెనకాల ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. ఎటు వైపు చూసినా పొలాల్లో మహా ఉత్సాహంతో సేద్యపు పనులలో నిమగ్నమైన స్త్రీపురుషులు కనిపిస్తారు.
“ఒకప్పుడు మా పంట పొలం ఇంత సారవంతంగా ఉండేది కాదు. వర్షాలు చాలా తక్కువగా కురుస్తూ ఉండేవి. అందువల్ల అసలు ఏ రకమైన పంట పండించడమన్నా చాలా కష్టంగా ఉండేది. ఆ రకంగా చూస్తే ఇక్కడ మాకు వ్యవసాయం సరైన జీవనాధారంగా కనిపించేది కాదు ” అంటారు సంతోశ్ కుష్వాహా. ఆయన చిన్నతనం నుంచీ వ్యవసాయం మీదే జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ముఖంలో ఆనందం కనిపిస్తున్నది. పచ్చగా కనులకు పండుగ చేస్తున్న తన పొలాన్ని చూపించినప్పుడు ఆయన కళ్లలో కనిపించే సంతోషం అంతా ఇంతా కాదు. చేనులో అమృత మట్టి ఉపయోగించిన తరువాతనే సారవంతమైందంటున్నారు. అమృత మట్టిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఇప్పుడు సంతోశ్ మాత్రమే కాదు ఆ పరిసరాల్లోని చాలా మంది తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక పంట కాలంలో అమృత మట్టి ఉపయోగించిన ఫలితంగా వారికి గణనీయమైన దిగుబడి లభించింది. ఇలా అమృత మట్టిని ఉపయోగించిన ప్రాంతంలో ఎక్కువ నీరు వాడవలసిన అవసరఁ లేకుండా పోయిందని వాళ్లంతా గుర్తించారు. అలాంటి నేలల్లో పఁడిన ధాన్యం గింజ మరింత పుష్టిగా, ఆరోగ్యవంతంగా ఉందని గమనించారు.
ఈ రోజున రాజువార్ గ్రామంలో 90 శాతం మంది రైతన్నలు అమృత మట్టినే ఉపయోగిస్తున్నారు. అమృత మట్టిని ఉపయోగించిన తరువాత నేలకు ఎక్కువ మొత్తంలో నీటి అవసరం లేకుండా పోయింది. పండిన పంటలు దిగుబడి నాణ్యత చాలా అధికంగా మారిపోయింది. రసాయనిక ఎరువులను ఉపయోగించే సమయంలో చాలా పెద్ద మొత్తాలను ఖర్చు చేయడం తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు వారికి ఆ ఖర్చుల భారం బాగా తగ్గిపోయింది. అంతేకాదు, నీటి వాడకం ఆదా చేసే పఁటల సాగును అంటే కూరగాయల పెంపకం వంటి వాటిని ఇప్పుడు రైతులు చేపడుతున్నారు. ఒకప్పుడు ఇలాటి ఆలోచనే ఆ గ్రామంలో వచ్చేది కాదు.
రాజువార్ గ్రామంలోని వాళ్లందరికీ ఇప్పుడు మరో విషయం కూడా స్పష్టంగా తెలిసింది. తమ చుట్టూ ఉన్న వృక్ష సంపదకు, తమ వ్యక్తిగత జీవితం సుసంపన్నం కావడానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటో కూడా వారికి బోధపడింది. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే పచ్చటి చెట్ల అవసరం చాలా ఉందని వారు గుర్తించారు. అదే విధంగా, అమృత మట్టి వాడకం, పంటల మార్పిడి ప్రయోజనాలు వారికి తెలియవచ్చాయి. ప్రకృతి మాతతో లాభదాయకమైన సాన్నిహిత్యం నెలకొల్పుకోవడం కోసం వాళ్లు అనేక రకాలైన పద్ధతులను ఇప్పుడు వారు అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో సుస్థిరంగా నెలకొన్ని అభివృద్ధి అక్కడి రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇదీ రాజూవార్ గ్రామ ప్రజలు అభివృద్ధి దిశగా సమష్టి అడుగులు వేసిన అద్భుతమైన విజయగాథ. ఇక్కడ గ్రామస్తులకు సమాచారం అందించడంలో కమ్యూనిటీ రేడియో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు, వారిలో పర్యావరణ, వాతావరణ పరమైన వివిధ అంశాలపై చర్చించుకునేందుకు ప్రేరణనిచ్చింది. ఈ మారుమూల కుగ్రామం ఆచరణలో చూపించిన మౌలిక సూత్రం – మార్పు కోసం సాగించే కృషి వ్యక్తి నుంచే ప్రారంభం కావాలనే పరమ సత్యం ఇతర గ్రామాలకు కూడా విస్తరించింది. ఇందుకు రూరల్ రియాల్టీ షో వేదికగా నిలిచింది.
శ్వేతా ప్రజాపతి
డిప్యూటీ మేనేజర్,
డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్
గజలా షేక్
అసిస్టెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్ ,
బి – 32, తారా క్రెసెంట్, కుతుబ్ ఇనిస్టిట్యూషనల్ ఏరియా,
న్యూఢిల్లీ – 110 016ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 1, మార్చ్ ౨౦౧౫



