స్వార్ – వ్యవసాయ రంగంలో పొదుపుగా నీటి వాడకంలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం

హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ) సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ కన్సర్న్స్ పరాయవరనహితకరమైన విధానంలో నీటి కొరత సమస్యకు సులువైన మార్గాలను గుర్తించేందుకు కృషిచేస్తోంది. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి పారుదల అభివృద్ధి పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు నిరంతరం శ్రమిస్తోంది. రైతన్నలతో కలిసి, వారిలో మహిళా రైతుల సహాయం కూడా తీసుకుంటూ ఈ సంస్థ మొక్కల వేళ్ల దగ్గరికి అవసరమైనంత మేరకే నీటి తేమను చేరవేయడానికి ఉపయోగపడే సాంకేతిక మెళకువలను తయారుచేసింది. తొలి దశలో చేపట్టిన ప్రయోగాలు రెండు ప్రయోజనాలను సాధించవచ్చునని నిర్ధారించాయి. డ్రిప్ ఇరిగేషన్ పాటించటం ద్వారా పంటల సాగుకు మామూలు విధానంలో అవసరమైన దానికన్నా అయిదో వంతు నీరు సరిపోతుంది. ఇది భూసారాన్ని కాపాడటమే కాక, పర్యావరణానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఈ విధానం ఆశించిన సత్ఫలితాలు సాధించాలంటే పొలం నిండుగా ఒకేసారి నీటిని పారించడం కన్నా, ఒక క్రమంలో మెల్లిగా నీటిని అందించడం చాలా ముఖ్యమైన విషయంగా అంచనా వేసారు. ఇలా చేయడం వల్ల నీటిని ఆదా చేయడమే కాదు, మొక్కలకు తమకు అవసరమైన స్థాయిలోనే నీటి తేమను స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతేకాక, భూమి పొరలలో అతిసూక్ష్మ క్రిముల ప్రకృతి సహజమైన రసాయనక చర్యకు తోడ్పడుతుంది.

మన దేశంలో ఉష్ణ ప్రాంతాలలో తక్కువ స్థాయిలో వర్షపాతం సర్వసాధారణం. అందువల్ల వర్షాకాలంలో కూడా నీటి జల్లు లేని రోజులే ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి వ్యవసాయ కార్యకలాపాలకు చాలా పెద్ద అడ్డంకిగా మారుతుంది. నీటి కొరత సమస్య వల్ల చాలా మంది చిన్న, సన్నకారు రైతన్నలు ఎక్కువగా వర్షాధారిత సాగు మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి, వారు అన్ని విధాలా నష్టాలపాలవుతుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం చెరువులు, ఆనకట్టలను ఆసరాగా చేసుకుని కాల్వల ద్వారా అన్నదాతలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోంది. అందులో భాగంగా నీటిని ఉపరితలానికి చేర్చడానికి ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్లి పైకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తోంది. వీటితో పాటు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని, ఇప్పుడు తాజాగా గ్రీన్ హౌస్ పరిజ్ఞానాన్ని అనుసరించేందుకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోంది. చిరుధాన్యాల ఉత్పత్తిని అధికం చేసేందుకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం కారణంగా కొన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలకు దారితీసాయి. ఫలితంగా కప్పుడు భిక్షాపాత్ర పట్టుకున్న భారత దేశం ధాన్యాగారంగా రూపుదిద్దుకుంది. ఈ రకంగా హరిత విప్లవం ఎక్కువగా చోటు చేసుకున్న ప్రాంతాలలో భూసారం దెబ్బతిన్నది. నేలల్లో క్షారగుణం (salinity) అధికంగా పేరుకుపోయింది. దిగుబడులు ఘోరంగా తగ్గిపోయాయి. అంతేకాక, విచ్చలవిడిగా చేపట్టిన సేద్యం కారణంగా భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఊహించిన ఫలితానికి భిన్నంగా ఎదురైన ఈ పరిణామాలతో అప్రమత్తమైన భారత ప్రధాని ప్రత్యామ్నాయంగా ప్రతి నీటి “బొట్టు సాయంతో మరిన్ని ఎక్కువ గింజలను పండించాలని” పిలుపునిచ్చారు. నీటి వాడకంలో పొదుపు పాటిస్తూ, వినూత్నమైన పరిజ్ఞానం ఆధారం చేసుకుని భూసారాన్ని కాపాడుకోని పక్షంలో ప్రధాని ఆశించిన ఫలితాలు సాధించడం సాధ్యం కాదు.

సాగునీటి పరిజ్ఞానం ప్రాధాన్యత ఏమిటి ?

తెలుగు గడ్డపై వ్యవసాయదారుల జీవనాధారలను పెంపొందించేందుకు ఈ సంస్థ ఇప్పటికి మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషిచేస్తున్నది. ఇంతకాలం చేసిన శ్రమను ఆధారం చేసుకుని వ్యవసాయ రంగం విజయవంతం కావాలంటే నీటి పారుదల వ్యవస్థ చాలా పటిష్టంగా, సమర్థవంతంగా ఉండాలని గుర్తించింది. దీనికి తోడుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ – MGNREGS) పథకం కింద పల్లె సీమలలోని ప్రతీ కుటుంబానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. దీనితో పాటు ఆడవాళ్లు కూడా శ్రమించేందుకు, సంపాదించేందుకు ముందుకు వస్తూ ఉండడంతో ఈ సంస్థకు మరో కోణం వైపు దృష్టి సారించవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఉపాధి హామీ పథకం కింద లభించిన అవకాశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పండ్లు కాచే తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ఉపాధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతున్నారు. ఇందుకు ఉద్దేశించిన మొక్కలను కనీసం మూడు సంవత్సరాల పాటు జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం. వేసవి కాలంలో ఎంతో దూరం వెళ్లి నీటి కడవలను నెత్తిన పెట్టుకుని మోసుకురావలసిన దుస్థితి మహిళలకు ఎదురైంది. ఇలా నెలల తరబడి శ్రమించవలసి వచ్చేది. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ, వేతనం చాలా కీలకంగా మారింది. అయినా కూడా మండు వేసవిలో నీటి వనరులు దగ్గరలోఎక్కడా ఉండేవి కావు. అదో పెద్ద సమస్యగా మహిళలను పీడించింది. అందువల్ల సాధ్యమైనంత తక్కువ మోతాదులో నీటిని ఉపయోగించడం తప్పనిసరి అయింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించవలసి వచ్చింది. అందువల్ల నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటిని పొదుపు చేయడంతో పాటు శ్రమశక్తిని కూడా కాపాడుకోవలసి వచ్చింది. అవసరమైన మేరకే నీటిని ఉపయోగించుకునేందుకు అనువైన సాగునీటి పరిజ్ఞానం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంప్రదాయక విధానాలు

సాగు నీటి అవసరాన్ని తగ్గించే విషయంలోనూ, కొద్దిపాటి నీటితో మెరుగైన ఫలితాలు సాధించడం పైనా రైతు సోదరులతో జరిపిన అనేక చర్చలు ఒక ముఖ్యమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. పవిత్రమైనవిగా ప్రజలు పరిగణించే కొన్ని రకాలైన పండ్ల జాతులు, అలంకారానికి మాత్రమే ఉపయోగపడే రకాలు, ఇంకా ఔషధ గుణాలున్న మొక్కలు చాలా తక్కువ నీటితోనే పెంచడం సాధ్యమవుతుందని తెలిసింది. అందుకు నేలలో పాతిపెట్టిన మట్టి కుండలు సాధనంగా ఉపయోగపడతాయి. సంప్రదాయంగా ఆచరణలో ఉన్న ఈ పద్ధతిలో తక్కువ నీటిని ఉపయోగించటం ద్వారానే చెట్లను కూడా పెంచవచ్చునని తెలిసింది. ఈ పద్ధతిలో మొక్కల వేళ్లకు ఉండే తేమను పీల్చే గుణం, మట్టి కుండలకు ఉండే మరో గుణం – నీటి బిందువుల రూపంలో నీటిని మెల్లిగా విడుదల చేస్తూ తేమను మాత్రమే అందించే - ఆధారంగా నీటి వాడకం చాలా తక్కువగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే ఈ పద్ధతిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రతీ చెట్టుకు కూడా విడివిడిగా నీటి సదుపాయం అందించాల్సి ఉంటుంది. అంతేకాక, మట్టి కుండల తయారీలో నాణ్యతా ప్రమాణాలేవీ ఉండవు. లేదా గడ్డకట్టిన కారణంగా పారుదలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని పరిష్కరించేందుకు శాస్త్రీయ విజ్ఞానాన్ని, రైతుల అనుభవాలను కలగలిపి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.

కొత్తగా నీటి పారుదల వ్యవస్థను తయారు చేసేందుకు కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. నీటి అవసరాలను పరిమితం చేసేందుకు చెట్లకు నీటిని అందించడంలో వేళ్లకు మాత్రమే తేమ అందడం ప్రధానమైన విషయంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా చెట్ల వేళ్లకు కావలసినంత మేరకే నీటిని, తేమను అవసరమైనంత మేరకే అందించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో విద్యుత్ అవసరం లేకుండా చూడాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో వేగవంతంగా అనుకున్న విధంగా నీటి సరఫరాను కొనసాగించేందుకు ఏదో ఒక స్థాయిలో యాంత్రికీకరణ అవసరం గుర్తించారు.

అనుకున్న పద్ధతిని తయారు చేసేందుకు రెండేళ్ల పాటు పరిశోధన కొనసాగించవలసి వచ్చింది. మొదటి నమూనాను తయారుచేసిన తరువాత ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దాని సాయంతో చెట్ల వేళ్ల వరకు మాత్రమే నీరు అందించే లక్ష్యం నెరవేరింది. కాని, నీటి సరఫరాకు ఉద్దేశించిన పైపులలో పూడిక కారణంగా నీటి ధారకు అడ్డంకులు తప్పలేదు. రెండేళ్ల కృషి ఫలితంగా 2014 ప్రారంభంలో తుది నమూనా సిద్ధమైంది. దానికే ఆంగ్లంలో స్వార్ (System of water for agriculture rejuvenation - SWAR) అన్న పేరు స్థిరపడింది. తెలుగులో మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే దానిని - వ్యవసాయ పునరుద్ధరణకు అనువైన నీటి వాడకం పద్ధతి – అని చెప్పవచ్చు. దీనిని మొదట్లో పండ్ల తోటలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. దీనికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమన్వయం చేయడమైంది.

డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అవసరమైన నీటికన్నా దాదాపు నాలుగో వంతు ఒకొక్కప్పుడు అయిదో వంతు నీరే సరిపోయింది.

స్వార్ పని చేసే విధానం

వర్షపు నీటిని నిల్వచేయడం లేదా చేరువలో ఉన్న నీటి వనరుల నుంచి నీటిని సేకరించడం తొలి దశ. ఈ రకంగా సమీకరించిన నీటిని ఓవర్ హెడ్ ట్యాంకులోనికి ఎక్కించడం మలి దశ. ఇందుకు కాలితో తొక్కడం ద్వారా పనిచేసే పంపును ఉపయోగించారు. ఇలా ట్యాంకులోకి ఎక్కించిన నీరు వెడల్పు ఎక్కువగా ఉన్న గొట్టాల సాయంతో పొలం దగ్గరకు ప్రవహించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చాలా తక్కువ వెడల్పు ఉన్న గొట్టాలను ఆధారం చేసుకుని, మొక్కల వేళ్ల దగ్గరకి నీరు చేరవేస్తారు. ప్రతీ మొక్కకు దగ్గరలోనూ ఒక డ్రిప్పర్ అమరిక ఉంటుంది. ఆ మొక్కకి అందుబాటులో భూమిలో పాతిపెట్టి ఉంచిన కుండలలోనికి నీటిని ఈ గొట్టాలు చేరవేస్తాయి. అక్కడి నుంచి నీటిని లేదా నీటి తేమ అతి నెమ్మదిగా మొక్కల వేళ్లకి అందుతుంది. వేళ్లకి చాలా దగ్గరగా భూమిలో 30 సెంటీమీటర్ల లోతులో కుండలను ఏర్పాటుచేస్తారు. ఒక్కో కుండకు కనీసం రెండు అతిసూక్ష్మ (మైక్రో ట్యూబ్స్) గొట్టాలు అమర్చ ఉంచుతారు. వాటికి చివర ఇసుక సంచులను కూడా అమరుస్తారు. ఇలా అమర్చిన ఇసుక కారణంగా నీరు ఒక్కసారిగా వేళ్లకు చుట్టూ ఉన్న మట్టిలోకి చేరకుండా నిత్యం తేమ చేరడానికి మాత్రమే తోడ్పడుతుంది. కొంత సేపటికి చెమ్మగిల్లిన కుండ నుంచి నీటి బిందువులు వెలువడతాయి. దీనిని అక్కడి మట్టికి, వేళ్లకు ఉన్న నీటిని పీల్చే గుణం ఆధారంగా మొక్కలు స్వీకరిస్తాయి. కుండలలోనికి నీటిని చేరవేసే ప్రవాహాన్ని నియంత్రించేందుకు అవసరమైన యాంత్రిక నివారణ వ్యవస్థలు (livers) అమర్చి ఉంచుతారు. ఈ కారణంగా భూమ్యాకర్షణ ఆధారంగానే నీరు మొక్కలకు చేరువగా ప్రవహిస్తుంది. మట్టిలో సహజంగా పెరగవలసిన సూక్ష్మజీవాల కోసం, మట్టిలో తేమ నిత్యం పరిమితంగా ఉండేందుకు వీలుగా వ్యవసాయ క్షేత్రంలోని పెంచి పోషిస్తున్న వానపాముల వంటి పురుగులను మట్టిలోకి చేర్చడం తప్పనిసరి.

తొలి ఫలితాలు

మొదట్లో సాధించిన ఫలితాలే చాలా ప్రోత్సాహవంతంగా కనిపించాయి. డ్రిప్ ఇరిగేషన్ కు నిర్దేశించిన నీటి పరిమాణంలో కేవలం నాలుగో వంతు నుంచి అయిదో వంతు వరకు మాత్రమే ఉపయోగించినట్టు స్పష్టమైంది. తక్కువ నీటిని ఉపయోగించుకున్నప్పటికీ, మొక్కల ఎదుగుదల పూర్తి సంతృప్తినే ఇచ్చింది. వాటి ఆకుల సంఖ్య, కాండం ధ్రుఢత్వం, వాటి ఎత్తు, మొక్క పూర్తి స్థాయి పెరుగుదల అన్నీ ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. ఒకసారి ఇలా నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత మట్టిలో తేమ వారం రోజుల పాటు నిలకడగా నిలిచింది. ఉపరితలంపై నీరు ఎక్కువగా లేకపోవడంతో చీడపీడలు, లేదా అనవసరమైన క్రిమికీటకాల జాడ కనిపించలేదు. అదే సమయంలో భూమిలో పెరిగి సస్య రక్షణకు తోడ్పడే క్రిములు సమృద్ధిగా పెరిగాయి. అందుకు ఆక్సిజన్ అందేందుకు, మట్టిలో తేమ నిలకడగా ఉండేందుకు అనుసరించిన పర్యావరణ హితమైన విధానాలే కారణం.

ఈ స్వార్ పద్ధతి ప్రకారం డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) ప్రచారం 2015లో ప్రారంభించాం. ఈ పద్ధతిలో చేపట్టిన మొక్కల పెంపకం మంచి ఫలితాలనిచ్చే దిశగానే సాగుతోంది. అయితే ఆ సమయంలో రాష్ట్రమంతటా వేడిగాలులు తీవ్రంగా ఉండడం, నీటి కొరత ఎక్కువగా ఉండడంతో వాటి ప్రభావం ఎంత వరకూ ఉన్నదో మా ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. మంచి పలితాలే వచ్చాయి. స్వార్ పద్ధతి అనుసరించడం వల్ల మళ్లీ వర్షాలు కురిసే వరకూ నీటిని పొదుపుగా వాడుకునేందుకు ఇదే సరైన మార్గంగా కనిపించింది. నిజానికి ఇలాంటి ప్రయోజనం డ్రిప్ ఇరిగేషన్ వల్ల లభిచడం అసాధ్యం. మహిళలు ఈ విషయంలో ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తంచేసారు. “స్వార్ అచ్చు కన్నతల్లిలా ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఇంటిలోని ప్రతి ఒక్కరి కడుపు నింపడం తల్లి నిర్వహించే అతి ముఖ్యమైన బాధ్యత. మాకు స్వార్ కూడా అదే విధంగా తోడ్పడుతోంది. అదే సమయంలో - డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇంట్లో లభించే మొత్తాన్ని, మిగిలిన వారికి ఏమీ మిగల్చకుండా తాను ఒక్కడే అనుభవించే పురుషుడితో పోల్చవచ్చు. ” అంటున్నారు వాళ్లు.

ఇప్పటివరకూ జరిపిన ప్రయోగాలు గమనించిన తరువాత నీటిని మరింత ఆదా చేసే మార్గాల కోసం స్వార్ పరిధిలోనే ప్రయోత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. 2015లో స్వార్ పద్ధతిలో పూలు, కూరగాయల తోటల పెంపకం కూడా చేపట్టటం జరిగింది. ఫలితంగా మట్టి సారవంతంగా మారింది. మొక్కల ఎదుగుదల సంతృప్తికరంగా కనిపించింది. రైతులకు పండ్లు, కూరగాయల అమ్మకం ద్వారా మంచి రాబడి దక్కింది. ఈ రకం మొక్కల పెంపకంలో వాటిని ఒకదినికి మరో దానికి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా డ్రిప్ ఇరిగేషన్ తో పోల్చినప్పుడు మరింత ఆదా అయిన నీటి వాడకం కారణంగా వాస్తవానికి కేవలం ఎనిమిదో వంతు నీటితోనే మంచి ఫలితాలు దక్కాయి.

భవితకు ముందడుగు

అన్ని విధాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు రావటంతో స్వార్ పద్ధతికి పారిస్ లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో నీటి వినియోగం, అడవుల సంరక్షణలో గ్లోబల్ చాంపియన్ పురస్కారాన్ని సంపాదించుకుంది. నూతన సాంకేతిక

నైపుణ్యాలను అంగీకరించేందుకు సహజంగా కొంత సమయం పడుతుంది. ప్రయోగ దశలో రైతులను కూడా భాగస్థులను చేసినప్పటికీ, క్షేత్రస్థాయి పరీక్షలు, సాంకేతిక అభివృద్ధి తీరును గమనిస్తే కరువుకాటకాలతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతాంగానికి స్వార్ విలువ కొద్దికొద్దిగా అవగాహనకు వస్తోంది. నీటి వాడకంలో మెరుగైన ఒరవడికి దారి చూపే సాంకేతిక విధానాలకు భారత దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. దేశ అవసరాలకు తగినట్లు కృషి చేయడానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యందా బడా సంస్థల అధీనంలో తయారైన సాంకేతిక పరిజ్ఞానానికే ప్రభుత్వపరంగా సబ్సిడీల ప్రయోజనాలు లభిస్తున్నయి. ఈ పరిస్థితిలో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల గురించిన రహస్యాలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సేకరణ విధానాలు కూడా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా తయారైంది. వీటన్నిటి ప్రభావం కారణంగా స్వార్ విధానంతో సంతృప్తి చెందిన రైతన్నలు, ముఖ్యంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలోని వారు, ఈ పద్ధతి సర్వత్రా వ్యాపిత చెందేందుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, నీటి వాడకంలో మెరుగైన విధానాలను అనుసరించాలన్న ప్రధాని పిలుపు వల్ల కూడా స్వార్ పద్ధతికి మంచి గిరాకీ వాతావరణం తీసుకువచ్చింది.

పూర్తిగా వర్షాధారిత సేద్య విధానానికి స్వస్తి చెప్పి వర్షపు నీటిని సేకరించి, నిల్వచేసుకుని, పొదుపుగా ఉపయోగిస్తూ మంచి ఫలితాలను సాధించేందుకు అనువైన సేద్య విధానాల వైపు రైతాంగం దృష్టి కేంద్రీకరించవలసిన సమయం ఇదే. పరిమితంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూ, ఆరోగ్యవంతమైన సేద్య విధానాలను, అందులో భాగంగా భూసారాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యవసాయ రంగం ముందుకు అడుగులు వేసినప్పుడే దేశంలో సేద్య రంగం నిలకడైన విధానాలు అనుసరించాలి. అప్పుడే రైతన్నలకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది.

కే.ఎస్. గోపాల్
సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్
హైదరాబాద్, ఇండియా
E-mail:cecgopal@yahoo.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౧౫

 

 

 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....