నీటి నిల్వ – సంప్రదాయక పద్ధతులు

కేనీలు – పవిత్ర బావులు, సొరంగాలు సంప్రదాయక నీటి నిల్వ పరిజ్ఞానానికి మచ్చు తునకలు. వైనాడ్ ప్రాంతంలోని గిరిజన ప్రజలు నీటిని భద్రపరిచేందుకు అనుసరించిన పద్ధతులు వారి ముందు చూపును, శాశ్వతంగా నీటి నిల్వలతో సమృద్ధిగా ఉండే జీవ వనరుల సద్వినియోగం చేసుకునే నైపుణ్యాన్ని మనకు తెలియచేస్తాయి. అన్ని విధాలా ఉపయోగకరమైన ఈ నైపుణ్యాన్ని మరచిపోయాం. ఇప్పుడు ఈ పరిజ్ఞానాన్ని తిరిగి అందరికీ తెలియచెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. ముందు తరాలకు ఈ రకమైన సంప్రదాయక నీటి నిల్వ పద్ధతులను తెలియచేసి, వారిని కూడా చైతన్యవంతులను చేయడం తక్షణ కర్తవ్యం.

తరతరాలుగా నీటిని సురక్షితంగా కాపాడుకోవడం, పొదుపుగా ఉపయోగించుకోవడంపై మన పూర్వీకులకు పరిపూర్ణమైన అవగాహన ఉండేది. నీటిని నిల్వ ఉంచుకునేందుకు అనేక రకాలైన నిర్మాణాలను, నీటి పారుదల సదుపాయాలను వారు గుర్తించారు. ప్రత్యేకంగా వారు తాము నివసిస్తున్న ప్రాంతాలకు, అక్కడి పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఉపయోగకరమైన విధానాలనే అనుసరిస్తూ వచ్చారు. ఆయా ప్రాంతాల సంస్కృతికి, సంప్రదాయాలకు వారు తగిన ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సందర్భంలో మనం దేశంలోని వివిధ ప్రాంతాలు – హిమాలయ సానువుల్లోని జింగ్ ప్రాంతం, పశ్చిమ కనుమల్లోని కుల్, నౌల్, ఖాత్రి ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని వెదురు ఆధారిత డ్రిప్ ఇరిగేషన్, తూర్పు కనుమల పరిసరాల్లోని కొరంబూ, మధ్య భారతంలోని తలాబ్ పీఠభూములు, తూర్పు తీరంలోని  కాటాస్, పడమటి తీరంలోని విర్దాస్, థార్ ఎడారి ప్రాంతంలోని కుంద్స్, దక్కన్ పీఠభూముల్లో చెరువులు నీటి నిల్వ సాధనాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతూ వచ్చాయి. ఇక దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో రెండు విధానాలు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. వైనాడ్ ప్రాంతంలో పానం కేని బావులు, కాసర్ గాడ్ ప్రాంతంలో సొరంగాలు అలాంటి వాటిలో ముఖ్యమైనవి.

కురుమలు వాడుకలోకి తెచ్చిన పవిత్రమైన బావులు

కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతంలో స్థానికంగా ఎక్కువ సంఖ్యలో కురుమలు, పనియాలు, అడియారుల, కురుచ్చిలు, ఊరలిలు, కట్టునాయకన్లు పేరుతో రకరకాల జాతుల వారు నివసిస్తున్నారు. వీరిలో కురమలు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. వారికి సాంస్కృతికంగాను, వృక్ష సంపదను కాపాడటంలోను విశిష్టమైన స్థానం ఉంది. ఈ కురుమ వర్గంలోనే కొందరిని ముల్లు కురుమలుగా వ్యవహరిస్తారు. ఈ ముల్లు కురుమలు వైనాడ్ లో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. వీరిని పురాతన కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్న వారిగా పరిగణిస్తారు. నూల్ పుజా, కిడన్ గాడ్, ముప్పయ్ నాడ్, ముట్టిల్, పరక్కడై, తిరునెల్లి, మనథవాడి పంచాయతీలలో ఎక్కువగా వీరు ఎక్కువగా ఉంటారు. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని గుడలూర్ తాలూకా (నీలగిరి జిల్లా) లో కూడా ముల్లు కురుమలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం వ్యవసాయం, వేట వంటి వృత్తుల్లోనే వారు జీవిస్తున్నారు.

పానం కేని అంటే ముల్లు కురమలు నివసించే కుగ్రామాల్లో వినియోగంలో కనిపించే ఒక రకమైన బావులు. ఈ తరహా బావులను వారు కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు. పంట పొలాలకు మధ్యలో అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఈ రకమైన బావులను ఏర్పాటు చేసుకుంటారు. గుండ్రంగా వలయాకారంలో ఇవి ఉంటాయి. నిజానికి వాటి వెడల్పు, లోతు కూడా గట్టిగా నాలుగు అడుగులు మించదు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే ఇవి నేలను తవ్వితే ఏర్పడేవి కావు. పెద్ద పెద్ద ఈత చెట్ల మొదళ్లను ఇందుకు ఉపయోగించుకుంటారు. విశాలంగా ఉన్న ఈత చెట్టు మొదలును లోపలికి బాగా నీరు పోసి లోపలి భాగం కుళ్లి నశించిపోయేలా చేస్తారు. ఇలా చెట్టు తొర్రగా ఏర్పాటు చేసిన గోతిలో కొంత కాలమయ్యే సరికి బయటి భాగం మరింత గట్టిపడి గోడలా తయారవుతుంది. ఈ రకంగా తయారు చేసిన తొట్టెల వంటి వాటిని నీరు సమృద్ధిగా ఉన్న భూగర్భ జల వనరుల్లోకి దింపుతారు. ఫలితంగా మండు వేసవిలో కూడా ఈ బావుల్లో నీరు సమృద్ధిగా నిలిచి ఉంటుంది. ఎప్పటికప్పుడు భూగర్భంలోని నీరు ఊటలా అందులో ఊరుతూ ఉంటుంది.

“ఈ రకమైన కేనీ బావులను సమకూర్చుకోవడం ఎప్పుడు మొదలైందో మాకు తెలియదు. కానీ కనీసం 500 సంవత్సరాలపైనే అయి ఉంటుంది. మా చిన్న తనంలో కూడా ఇలాంటి కేనీలు ఉండేవి. వీటిని మేం చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తాము. నెలసరి మూడు రోజులూ, ప్రసవం అయిన తరువాత మూడు నెలలపాటు మేము నీటిని వాటిలోంచి తీసుకోము. ఇతర సమయాల్లో మా కుగ్రామంలోని ఇరుగుపొరుగు కుటుంబాల వారు అందరూ ఆ నీటినే వాడతాం. ఈ కేనీల నుంచి తెచ్చుకున్న నీటిని వంటకూ, తాగడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఈ నీటిని ఎట్టి పరిస్థితులలోను స్నానాలు చేయడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ ఉపయోగించం. అలా చేస్తే నీరు అపవిత్రమవుతుందని భావిస్తాం. అంతేకాదు, ఆ నీరు కలుషితమైపోతుందని ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. చివరికి కేనీలకు సమీపంలో కాళ్లకు చెప్పులు వేసుకోవడం కూడా పెద్ద పాపంగా భావిస్తాం. ” అంటూ కేనీల విషయంలో తమకున్న పవిత్రమైన అభిప్రాయాలను దేవకీ అనే మహిల తెలియజేసింది. ఈమె కూడా కురుమ జాతి మహిళే. వైనాడ్ జిల్లాలోని మానథవాడీ ప్రాంతానికి చేరువలో ఉన్న పాకం గిరిజన వాడలో నివసించే ఆమె వయసు ఇప్పుడు 70 ఏండ్లు ఉంటాయి.

భూగర్భ జల వనరులు సమృద్ధిగా నిల్వ ఉన్నాయని గుర్తించేందుకు తోడ్పడే ప్రధానమైన కొన్ని అంశాలలో ముఖ్యమైనవి – వెటేరియా ఇండికా (తెల్ల గుగ్గిలం), ఫీకస్ వీరెన్స్ (లాక్షా  వృక్షం), మకరాంగా ఇండికా అని వ్యవహరించే రకపు చెట్లు, చెదల పుట్టలు వరుసగా ఉండడం ఆధారంగా అక్కడ భూగర్భంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వారు ఒక అంచనాకు వస్తారు.

పండుగలు, వివాహాల వంటి సందడి కార్యక్రమాలలో కేని నీటినే బియ్యం శుభ్రం చేయడానికి, వండడం కోసం ఉపయోగించడం అక్కడ ఆనవాయితీ. కేనీ జలాలు ఆ ఊరి వాళ్లందరిదీ. ఏ ఒక్కరికీ సొంతం కాదు. ఎక్కువ లోతు ఉండని తొట్టి లాంటి నీటివనరు కావడం వల్ల అందులోనుంచి నీటిని తీసుకోవడానికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. మట్టి కుండతో తీసుకోవచ్చు. కేనిలోని నీరు ఎప్పుడూ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ప్రతి రోజూ వెయ్యి లీటర్ల కంటే ఎక్కువ నీటినే అందులోంచి చుట్టుపక్కల వారు తమ అవసరాల కోసం తీసుకెడుతుంటారు. ఇలా ఏడాది పొడవునా వారికి తియ్యటి పరిశుభ్రమైన నీరు అందిస్తాయి ఈ కేనీలు.

“పూర్వపు రోజుల్లో కురుమలు మాత్రమే పానం కేనీలలోనుంచి నీరు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇతర కులాల వాళ్లు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వాళ్లు కూడా తీసుకెడుతున్నారు. వాళ్లంతా ఈ కేనీలను మేం చూసినంత పవిత్రంగా చూడరు. వాటి పవిత్రతను కాపాడరు. ఇప్పుడు ఉన్న కేనీలు చాలా పాతకాలపు నాటివి. వాటికి చుట్టూ గోడగా ఉంటున్న చెక్క భాగం బలహీనమైపోతోంది. అలాంటి బావులను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నైపుణ్యం ఎవరి దగ్గరా కూడా లేదు. కొన్ని చోట్ల వాటికి సిమెంటుతో కవచాల్లా రక్షణ కట్టడం ఏర్పాటు చేస్తున్నారు. ” అంటున్నారు మరో తెగకు చెందిన పాకం వాసి వేలన్.

ప్రస్తుతానికి వైనాడ్ పరిసరాలలో దాదాపు 200 వరకు కేనీలు ఉన్నాయి. ఈ బావులు వైనాడ్ ప్రాంతపు తెగల పూర్వీకుల విషయ పరిజ్ఞానం, శాస్త్ర అవగాహన  మనకు స్పష్టంగా తెలుస్తాయి. జీవనదుల్లాంటి ఈ నీటి వనరులను కాపాడుకోవడంలో వారి దూరదృష్టి, చైతన్యం అలాంటిది. నేటి తరం పూర్తిగా ఆధునిక జీవనశైలికి అలవాటు పడిపోయారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయక నీటి వనరులను కాపాడుకోవడంలో ఏ మాత్రం శ్రద్ధ, ఆసక్తి చూపించడం లేదు. భావి తరాలకు అందించేందుకు సిద్ధంగా లేరు.

సొరంగాల ద్వారా నీటి ధారలు

భవన నిర్మాణాలలో ఉపయోగించే రాయి లభించే చిన్న చిన్న కొండల్లో వర్షపు నీరు రిజర్వాయర్లుగా  ఇక్కడ కొన్ని చోట్ల ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని కాసర్ గాడ్ పరిసరాలలోని రైతాంగం చాలా కాలం క్రితమే గుర్తించారు. వీటినే సొరంగం బావులుగా వ్యవహరిస్తారు. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలోను, కేరళలోని ఉత్తర ప్రాంతంలోను పడమటి కనుమలలో ఇలాంటి సొరంగపు బావులు విస్తృతంగా కనిపిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం ఇలాంటి సొరంగపు బావులు కనీసం 5000 ఉంటాయి. వారు జరిపిన అధ్యయనం ప్రకారం క్రీస్తు శకం 1900-1940 మధ్య ఈ తరహా బావులు మొట్టమొదటి సారి ఆవిర్భవించినట్టు తెలుస్తుంది. వివిధ ప్రాంతాలలోని భాషను బట్టి అక్కడి వాడుకను బట్టి కొన్ని చోట్ల సురంగాలు, తురంగం, తోరుపు, మాల్ అని పిలుస్తారు. సాధారణంగా ఈ రకమైన సొరంగాలు గనుల్లోకి ప్రవేశించేందుకు మార్గం గా కానీ, గనుల్లోని మురికి నీరు బయటకు ప్రవహించడానికి కానీ ప్రకృతిసహజంగా ఏర్పడినవి అనుకోవచ్చు. వాటిని తవ్వడం ద్వారా భూగర్భ జలాలను వెలికి తీసేందుకు అనువుగా మార్పు చేస్తారు.

పడమటి కనుమల్లోని ఈ పరిసరాల్లోని నేలల స్వభావం అందుకు అనుగుణంగా ఉంటుంది. ఇక్కడి కొండలు నిలువుగా వాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చిన్నవిగానే ఉంటాయి. ఇక్కడి నేలల్లో భవన నిర్మాణంలో ఉపయోగించే రాతి పలకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తరహా సొరంగాలు సాధారణంగా 250 మీటర్ల మేరకు నిడివితో ఉంటాయి. మొత్తం మీద సగటు సొరంగాల పొడవు 40 నుంచి 50 మీటర్ల వరకూ ఉంటుంది. ఇక వీటి వెడల్పు సాధారణ మనిషి అతి కష్టం మీద లోపలికి వెళ్లడానికి తగినంత మాత్రమే ఉంటాయి. ఈ తరహా సొరంగాలను సాధారణంగా తమ తమ పొలాల్లోనే తవ్వుకోవడం కూడా ఇక్కడ సర్వసాధారణం. అయితే ఇలా సొరంగాల తవ్వకం పనులను ఆ పనిలో పూర్తిగా నైపుణ్యం సంపాదించుకున్న కొద్ది మంది మాత్రమే చేపట్టగలుగుతారు. ముందుగా అక్కడి నేలలను పరీక్షించి ఇలా సొరంగాలను తవ్వడానికి అవు అనుకూలమా కాదా అనే విషయాన్ని బేరీజు వేసుకుంటారు. ఈ విధంగా అనువైన నేలలను గుర్తించడంలో కొన్ని రకాలైన మొక్కల ఎదుగుదలను గుడ్డి గుర్తుగా పరిగణిస్తారు. ఇందుకు ఎంపిక చేసుకున్న రకం మొక్కలు ఆ ప్రాంతంలో పెరుగుతున్నప్పుడే వారికి అక్కడ నీటి వనరుల లభ్యత గురించిన నమ్మకం ఏర్పడుతుంది. ఇందుకు ఉపయోగపడే మొక్కల్లో – వెటేరియా ఇండికా (తెల్ల గుగ్గిలం), ఫీకస్ వీరెన్స్ (లాక్షా  వృక్షం), మకరాంగా ఇండికా అని వ్యవహరించే రకపు చెట్లు, చెదల పుట్టలు వరుసగా ఉండడం ఆధారంగా అక్కడ భూగర్భంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వారు ఒక అంచనాకు వస్తారు.

“నేను రెండు సొరంగాలు ఏర్పాటు చేసుకన్నాను. సాధారణంగా రాతి నేలల్లోనే సొరంగాల తవ్వకం చేపడతారు. అది కూడా వేసవి సమయంలోనే తవ్వుతారు. ఎందుకంటే ఇలా తవ్వకం పనులు జరుగుతున్న సమయంలో పైనున్న మట్టి కుప్పకూలిపోకుండా ఉండాలి. అంటే అందుకు వేసవి కాలమే సరైనది. ఇలా తవ్వకం పూర్తి చేసిన సొరంగాలలోనికి అన్ని వైపుల నుంచి నీరు ఊరుతుంది. అడుగునుంచి ఎలాగూ నీరు అందులోకి ఊరుతుంది. ఇలా వచ్చే నీటి ప్రవాహాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గాను, ముందుగానే మట్టి కట్ట వంటి రిజర్వాయరును సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఈ రకంగా వచ్చే నీటిని ఆ రిజర్వాయర్లలోనికి మళ్లిస్తారు. కొన్ని సందర్భాలలో భూగర్భంలోనే అమర్చుకున్న సాగునీటి వ్యవస్థకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఒకొక్కప్పుడు ఒకే రిజర్వాయర్ లోనికి నీటిని సరఫరా చేసేందుకు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో సొరంగాలతో అనుసంధానం చేస్తారు. ఇలా సొరంగాల నుంచి లేదా నీటి రిజర్వాయర్ల నుంచి లభించే నీటి వనరులను పంట పొలాలకు అందించేందుకు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. బకెట్లు, లేదా చేతులతో ఎలాగో అలాగా మోసుకెళ్లి తమ పొలాలను తడుపుకోవడం కూడా ఒక పద్ధతి. ఇది కాక, కాలువల ద్వారా మళ్ళించడం, హోస్ (గొట్టాలు), డ్రిప్, లేదా స్ప్రింక్లర్ విధానాలు కూడా అనుసరిస్తారు. అయితే పంపు సెట్లు లేదా యాంత్రికంగా నీటిని తోడుకోవడానికి అంగీకరించం ”అంటున్నారు కాసర్ గాడ్ జిల్లా ఎన్ మకజే గ్రామానికి చెందిన రైతన్న సాల్వా డిస్ యూస్. ఆయనకు 1.5 ఎకరాల భూమి ఉంది. అందులో ఆయన బీటెల్ వైన్, ఎరికా నట్, కోకో, మిరియాలు వంటివి పండిస్తారు. నీటి కొరత లేకపోవడం, పశువులు సమృద్ధిగా ఉన్న కారణంగా సేంద్రీయ ఎరువులకు లోటు లేకపోవడం వల్ల ఈ పంటల సాయంతో ఆయన మంచి ఆదాయాన్నే సంపాదించుకోగలుగుతున్నారు.

ఈ విధంగా ఈ పరిసరాల్లో ఏర్పాటు చేసుకున్న సొరంగాలన్నిటిలోనూ సమృద్ధిగా నీటి లభ్యత మండు వేసవిలో కూడా సమృద్ధిగా ఉంటుంది. వంట అవసరాలకు, స్నానాదికాలకు మాత్రమే కాక సాగు నీటి అవసరాలకు అవి సరిపోతుంటాయి. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ సొరంగాల నుంచి జాలువారే నీరు తియ్యగా, చాలా పరిశుద్ధంగా ఉంటుందని నిర్ధారణ అయింది. బోర్ నీటితో పోలిస్తే ఖచ్చితంగా సొరంగాలలోని నీరు అన్ని విధాలా చాలా మెరుగ్గా ఉంటుందని తేలింది. భూమ్యాకర్షణ ప్రభావంతో నిత్యం నీటి ఊట ఉన్న ఈ సొరంగాలనుంచి నిముషానికి 600 లీటర్ల నీరు ఊరుతూ ఉంటుంది.

అబ్దుల్ సిదికీ 15 ఎకరాల ఆసామీ. అందులో పెద్ద పెద్ద చెరువులు మూడు ఉన్నాయి. వాటిలోకి నిత్యం సొరంగాలనుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్కో సొరంగం నుంచి గంటకు 500 లీటర్ల నీరు వాటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రకంగా లభించే నీటిని ఆయన గృహావసరాలకు, సాగు అవసరాలకు కూడా సరిపోతాయి.

అబ్దుల్ సిదికీ అనుభవాలు ఇలా ఉన్నాయి. “నాకున్న కొద్ది పాటి జాగాలో కొబ్బరి, ఎరికా నట్స్, మిరియాలు, అరటి తోటలు సాగుచేస్తాను. నాకున్న డెయిరీ ఫారమ్ లో అత్యధికంగా పాల దిగుబడినిచ్చే 50 హెచ్ఎఫ్ ఆవులు (Holstein Friesian) పెంచుతున్నాను. ఈ అవసరాలన్నిటికీ సొరంగం ద్వారా లభించే నీరు సరిపోతోంది. నీరు సమృద్ధిగా ఉన్నా కూడా నేను చాలా పొదుపుగానే నీటిని వాడతాను. పొలానికి వారానికి ఒకసారి మాత్రమే నీరు పెడతాను. అలా చేయడంలో నీటి వనరులు అడుగంటిపోకుండా జాగ్రత్తపడతాను. వృథా అనేది ఎక్కడా ఉండకుండా చూసుకుంటాను. మా దగ్గర సహకార పద్ధతిలో సాగునీటి పారుదల విధానం కూడా అమలులో ఉంది. అంటే ఒకరైతు తన సేద్యం అవసరాల కోసం ఈ రకమైన సొరంగాల నుంచి లభించే నీరు ఉపయోగించుకున్నాడనుకోండి. తన అవసరాలకు మించి లభించే నీటిని ఇరుగు పొరుగు రైతులకు కూడా కొంత అందజేయడానికి వెనుకాడడు. వారి పంట పొలాలు కూడా పచ్చగా కళకళలాడాలనే కోరుకుంటాడు. ఇలా చేయడం వల్ల అందరికీ నీటి గురించి ధీమా ఉంటుంది. ”అంటూ ఇంకా మాట కూడా ఆయన చెప్పాడు. ఆయనకున్న పొలం ద్వారా మంచి ఫలసాయం వస్తుంది. పాడి పశువుల నుంచి రోజుకు 500 లీటర్ల పాలు లభిస్తున్నాయి.

చాలా తక్కువ ఖర్చుతోనే సొరంగాలు, కేని బావులను సమకూర్చుకోవచ్చు. ఇవి చాలా ఉపయోగకరమైనవి. ఇక్కడ చాలా కాలంగా  పర్యావరణ అనుకూలమైన,  విశ్వసనీయమైన, సుస్థిరమైన సేద్య విధానాలను అనుసరించడానికి చాలా కాలంగా ఇక్కడ అందుబాటులో ఉన్న ఈ తరహా సాగునీటి వనరులే కారణం. ఇక్కడ కనిపించే సేద్య పరిజ్ఞానం అంతా చాలాకాలంగా అనుభవంలోనుంచి సంపాదించుకున్నదే. ఇవి అన్ని విధాలా పర్యావరణకు చాలా సహాయకారిగా ఉంటాయి.

జి.ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్,
సైంటిఫిక్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్)
కేరళ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు
జై నగర్, ఎల్ 14, మెడికల్ కాలేజీ పోస్టు,
తిరువనంతపురం – 695 011
E-mail: vanchiyurunni@gmail.com;
unni_krishnan1@hotmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౧౫

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....